వైఎస్సార్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి
జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
నెల్లూరు(అర్బన్) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి నెరవేర్చేందుకు కృషి చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు సూచించారు. సోమవారం మేయర్ అబ్దుల్ అజీజ్, ఆయన సోదరుడు 42వ డివిజన్ కార్పొరేటర్ జలీల్ హైదరాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 52 ఏళ్ల తర్వాత నెల్లూరు పట్టణాన్ని పాలించే అవకాశం మైనార్టీలకు దక్కిందని, ఇది జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమైందని అజీజ్ పేర్కొన్నారు.
రాజకీయంగా తమకు వైఎస్సార్‌సీపీ జన్మనిచ్చిందని పార్టీ అధినేతకు అజీజ్, జలీల్ తెలిపారు. పార్టీ తమమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు సేవ చేస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేయాలని అజీజ్, జలీల్‌కు జగన్ సూచించారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మేయర్ అజీజ్ తాము ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలనుకున్నామో జగన్‌కు వివరించారు.
ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు ఒక ప్రణాళిక ప్రకారం సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కుల,మతాలకు అతీతంగా ప్రజలందరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని, నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నగరాభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం కూడా తాము హైదరాబాద్‌లోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మేయర్ అజీజ్ వెల్లడించారు. జగన్‌ను నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ కూడా కలిశారు.