తెలుగు రాష్ట్రాల గుండెకోతకు కారణం చంద్రబాబే | Gadikota Srikanth Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల గుండెకోతకు కారణం చంద్రబాబే

Published Thu, Jul 22 2021 3:39 AM | Last Updated on Thu, Jul 22 2021 4:39 AM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చిత్రంలో కడప మేయర్‌ సురేష్‌బాబు

కడప కార్పొరేషన్‌: తెలుగు రాష్ట్రాల గుండెకోతకు ప్రధాన కారణం ప్రతిపక్షనేత చంద్రబాబేనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. 1994–2004 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులను ఫైనల్‌ చేసేముందు అనేక సార్లు అవకాశం కల్పించినా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. కడపలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం దండగ అని తన పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు ఒక్క చిన్న ప్రాజెక్టును కూడా చేపట్టకపోవడం వల్లే ప్రాజెక్టులకు ట్రిబ్యునల్‌ నీరు కేటాయించలేదని తెలిపారు. ఇందుకు చంద్రబాబు జీవితాంతం ప్రజలకు క్షమాపణలు చెప్పినా ఆయన పాపం పోదన్నారు. హంద్రీనీవాను 5 టీఎంసీలకు, గండికోటను 3 టీఎంసీలకు తగ్గిస్తూ ఆయన జీవోలు ఇస్తే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొత్త జీవోలు తెచ్చి వాటి సామర్థ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. వరద నీటినైనా ఉపయోగించుకుందామని వైఎస్సార్‌ జలయజ్ఞం చేపట్టారన్నారు. వీటిపైన కూడా చంద్రబాబు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో స్టే కోసం ప్రయత్నించడం అత్యంత దారుణమని చెప్పారు. కేంద్రం ఇచ్చిన గెజిట్‌ను తెలంగాణ వ్యతిరేకిస్తుంటే, చంద్రబాబు కూడా అదే వైఖరి చూపడం ద్రోహమన్నారు. రాయలసీమ రైతులకు న్యాయం చేయాలని దివంగత వైఎస్సార్‌ పరితపించారని, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.  

తెలంగాణ నీరు తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరా ఎక్కడున్నారు? 
తెలంగాణ ఇష్టానుసారంగా నీటిని తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఎక్కడున్నారని నిలదీశారు. హైదరాబాద్‌లో సంసారం ఉన్నందున వీరు కేసీఆర్‌కు భయపడ్డారా.. అని ప్రశ్నించారు. మైసూరారెడ్డికి రహస్య అజెండా ఉందని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడంతోపాటు, ప్రకాశం జిల్లాలో ఆయకట్టును స్థిరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ మేరకు రాయలసీమ డ్రాట్‌ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అప్పుడు మైసూరాలాంటి వారు సలహాలు, సూచనలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే కుట్రతోనే వీరంతా తెలంగాణకు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలతో తాము విభేదాలు కోరుకోవడం లేదని, ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడేందుకు భేషజాలు కూడా లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్‌తో కలిసి భోజనం చేసినప్పుడు ఏ స్టాండ్‌తో ఉన్నారో.. నేటికీ సీఎం వైఎస్‌ జగన్‌ అదే స్టాండ్‌తో ఉన్నారని స్పష్టం చేశారు. గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్‌ కుటుంబానికి మాత్రమే చిత్తశుద్ధి ఉందని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. కడప మేయర్‌ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ రాయలసీమ రైతులు కూడా 3 పంటలు పండించుకోవాలన్న వైఎస్సార్‌ కలల్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకెళుతున్నారన్నారు. బావిలో కప్పలు కూడా ఇప్పుడు బయటికి వచ్చి విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. మైసూరారెడ్డి మేధావినని చెప్పుకొంటూ కుళ్లు, కుతంత్రాలతోవిమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత రాజకీయాలు పక్కనబెట్టి రాయలసీమ రైతులకు మేలు చేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో పొందుపరిచేవరకు వదలం 
చంద్రబాబు రాయలసీమ ప్రజలు తనకు ఓట్లు వేయలేదనే కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటివరకు ఆయన స్టాండ్‌ చెప్పలేదన్నారు. ఆయన వల్లే రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం కనీసస్థాయికి చేరకముందే 796 అడుగుల నుంచే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే లేఖలు రాయడంతో కేంద్రం స్పందించిందని చెప్పారు. శ్రీశైలం విద్యుదుత్పత్తి ప్రాజెక్టు అంటూ కొత్త వాదన తేవడం దురదృష్టకరమన్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడతారుగానీ, విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎక్కడైనా ప్రాజెక్టులు కడతారా.. అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా హక్కుగా ఉన్న నీటినే వాడుకుంటామని, చుక్క కూడా అదనంగా తీసుకోబోమని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం వినడం లేదన్నారు. గ్రేటర్‌ రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను, వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో పొందుపరిచేవరకు ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావడం చూశామని, మన రాష్ట్రంలో మాత్రమే పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టులు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement