రాజన్న రాజ్యంలో రైతే రారాజు | rajanna rajyamlo raithe raraju | Sakshi
Sakshi News home page

రాజన్న రాజ్యంలో రైతే రారాజు

Published Sat, Sep 2 2023 5:33 AM | Last Updated on Sat, Sep 2 2023 7:30 AM

rajanna rajyamlo raithe raraju - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ వేసిన ప్రతీ అడుగు, చేసిన ప్రతీ ఆలోచన రైతుల కోసమే. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో అమలుచేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలలో చెరగని ముద్రవేశాయి. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకంతో మొదలైన తన పాలనలో అడుగడుగునా రైతులకు తోడుగా నిలిచారు.

రుణమాఫీతో రైతుకు వెన్నుదన్ను..
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణమాఫీని అమలుచేయగా, దేశంలోనే అత్యధికంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 64లక్షల మంది రూ.11,100 కోట్ల లబ్ధిపొందారు. రుణమాఫీ దక్కని 36 లక్షల మంది రైతులకు “ప్రోత్సాహం కింద’ ఒకొక్కరికి రూ.5వేల చొప్పున రూ.1,800 కోట్లు అందించారు. పునరావాస ప్యాకేజీ కింద.. వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన భూ యజమా­నులు, కౌలుదారుల కుటుంబాలకు సైతం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. అలాగే, ఉమ్మడి ఏపీలోని 23 డీసీసీబీల్లో 18 డీసీసీబీలు దివాళ తీసే స్థాయికి చేరుకోగా, వైద్యనాథన్‌ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800 కోట్ల సాయం అందించి సహకార రంగం పునరుజ్జీవానికి బాటలు వేశారు. ప్రపంచంలోనే తొలిసారి పావలా (3 శాతం) వడ్డీకే రుణాలకు శ్రీకారం చుట్టారు.

కనీస మద్దతు కనీవినీ రీతిలో పెంపు..
1999లో క్వింటాల్‌కు రూ.490 ఉన్న ధాన్యం కనీస మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550కు చేరింది. ఐదేళ్లలో పెరిగిన ఎమ్మెస్పీ కేవలం రూ.60 (12.5%) మాత్రమే. అలాంటిది 2004–09 మధ్య రూ.550 నుంచి రూ.1,000కు అంటే అక్షరాల రూ.450 (78.5%) పెరిగిందంటే అది ఆ మహానేత కృషి ఫలితమే. ధాన్యంతో పాటు ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచగలిగారు.

తండ్రి బాటలో తనయుడు
రైతుల కోసం ఆ మహానేత ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానంటూ అధికారంలోకి వచ్చింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమం కోసమే సీఎం జగన్‌ అహరహం శ్రమిస్తున్నారు. మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవంగా రైతుల మధ్యలో జరుపుకుంటున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించేలా ఆర్బీకేలు తీసుకొచ్చారు. సహకార రంగ బలోపేతానికి రూ.295 కోట్ల మూలధనంగా సమకూర్చారు.

ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇక సంక్షేమ పరంగా చూస్తే.. వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా రైతు సంక్షేమం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం అక్షరాల రూ.1,70,769.23 కోట్ల లబ్ధిని చేకూర్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement