raitu bandu
-
రాజన్న రాజ్యంలో రైతే రారాజు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వేసిన ప్రతీ అడుగు, చేసిన ప్రతీ ఆలోచన రైతుల కోసమే. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో అమలుచేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలలో చెరగని ముద్రవేశాయి. ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకంతో మొదలైన తన పాలనలో అడుగడుగునా రైతులకు తోడుగా నిలిచారు. రుణమాఫీతో రైతుకు వెన్నుదన్ను.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణమాఫీని అమలుచేయగా, దేశంలోనే అత్యధికంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 64లక్షల మంది రూ.11,100 కోట్ల లబ్ధిపొందారు. రుణమాఫీ దక్కని 36 లక్షల మంది రైతులకు “ప్రోత్సాహం కింద’ ఒకొక్కరికి రూ.5వేల చొప్పున రూ.1,800 కోట్లు అందించారు. పునరావాస ప్యాకేజీ కింద.. వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన భూ యజమానులు, కౌలుదారుల కుటుంబాలకు సైతం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. అలాగే, ఉమ్మడి ఏపీలోని 23 డీసీసీబీల్లో 18 డీసీసీబీలు దివాళ తీసే స్థాయికి చేరుకోగా, వైద్యనాథన్ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800 కోట్ల సాయం అందించి సహకార రంగం పునరుజ్జీవానికి బాటలు వేశారు. ప్రపంచంలోనే తొలిసారి పావలా (3 శాతం) వడ్డీకే రుణాలకు శ్రీకారం చుట్టారు. కనీస మద్దతు కనీవినీ రీతిలో పెంపు.. 1999లో క్వింటాల్‌కు రూ.490 ఉన్న ధాన్యం కనీస మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550కు చేరింది. ఐదేళ్లలో పెరిగిన ఎమ్మెస్పీ కేవలం రూ.60 (12.5%) మాత్రమే. అలాంటిది 2004–09 మధ్య రూ.550 నుంచి రూ.1,000కు అంటే అక్షరాల రూ.450 (78.5%) పెరిగిందంటే అది ఆ మహానేత కృషి ఫలితమే. ధాన్యంతో పాటు ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచగలిగారు. తండ్రి బాటలో తనయుడు రైతుల కోసం ఆ మహానేత ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానంటూ అధికారంలోకి వచ్చింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమం కోసమే సీఎం జగన్ అహరహం శ్రమిస్తున్నారు. మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవంగా రైతుల మధ్యలో జరుపుకుంటున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించేలా ఆర్బీకేలు తీసుకొచ్చారు. సహకార రంగ బలోపేతానికి రూ.295 కోట్ల మూలధనంగా సమకూర్చారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇక సంక్షేమ పరంగా చూస్తే.. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా రైతు సంక్షేమం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాల రూ.1,70,769.23 కోట్ల లబ్ధిని చేకూర్చింది. -
రోడ్డెక్కిన రైతులు
-
ఏం సేస్తిరి..ఏం సేస్తిరి..చావు తెలివితేటలంటే ఇదేనేమో
సాక్షి, కుల్కచర్ల(వికారాబాద్): బతికున్న మనిషి చనిపోయినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించి రైతుబీమా సొమ్మును స్వాహా చేశారు. రైతుబంధు కోఆర్డినేటర్ ఇందులో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుల్కచర్ల మండలం పుట్టపహడ్‌కు చెందిన రాఘవేందర్ రెడ్డి రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ (57) 2020 సెప్టెంబర్ 14న చనిపోయిందని అదే నెల 30న నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. వ్యవసాయశాఖ అధికారులను మభ్యపెట్టి రైతుబీమా ప్రక్రియను పూర్తి చేశాడు. రైతుబీమా డబ్బులొచ్చాక.. తమకు సంబంధించిన ధాన్యం డబ్బులు పొరపాటున మీ ఖాతాలో పడ్డాయని బాధిత కుటుంబ సభ్యులకు నమ్మబలికి వారి దగ్గర నుంచి తీసుకున్నాడు. రైతుబంధు కోఆర్డినేటర్ మాయాజాలం రైతుబంధు కోఆర్డినేటర్ రాఘవేందర్‌రెడ్డి అధికార పార్టీ నాయకుడు. పుట్టపహడ్‌కు చెందిన చంద్రమ్మకు 1.30 ఎకరాల భూమి ఉండగా.. సహకార సంఘంలో ఉన్న దీర్ఘకాలిక రుణమాఫీ చేయించడంతో పాటు పంట నష్టం డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి పట్టా పాసుపుస్తకం, పాలసీ సర్టిఫికెట్ తీసుకున్నాడు. 2020 సెప్టెంబర్ 14న చంద్రమ్మ మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. డిసెంబర్ 14న రూ.2 లక్షలు, 2021 జనవరిలో రూ.3 లక్షలు చొప్పున బాధిత కుటుంబం నుంచి డబ్బులను డ్రా చేయించి తీసుకున్నాడు. విషయం బయటికి వచ్చింది ఇలా.. పుట్టపహడ్‌కు చెందిన ఎనుగొండ చంద్రమ్మకు సర్వే నంబరు 129/15/అ, 207/రులో ఎకరా 30 గుంటల భూమి ఉంది. ఈమె వ్యవసాయం, దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మేలో ప్రభుత్వం అందించిన రైతుబంధు డబ్బులు చంద్రమ్మకు రాకపోవడంతో ఆమె కుమారుడు బాలయ్య వ్యవసాయ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన అధికారులు.. మీ అమ్మ చనిపోయింది కదా.. రైతుబీమా డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పడంతో అవాక్కయ్యాడు. వెంటనే గ్రామ పెద్దలకు తెలపడంతో అసలు విషయం బయటపడింది. ఇది విన్న స్థానికులు విస్తుపోయారు. నిందితుడిపై ఫిర్యాదు చేశాం పుట్టపహడ్ గ్రామ కోఆర్డినేటర్ రాఘవేందర్ తమను నమ్మించి మోసం చేశాడని మండల వ్యవసాయశాఖ అధికారి వీరస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రమ్మ చనిపోయిందని తమకు సమాచారం అందించి.. తర్వాత బాధితురాలి కుమారుడు బాలయ్యను తీసుకొచ్చి రైతుబీమాకు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేశాడని తెలిపారు. డిసెంబర్ 9న రైతుబీమా డబ్బులు చంద్రమ్మ నామిని బాలయ్య ఖాతాలో జమ అయినట్లు పేర్కొన్నారు. రైతుబంధు కోఆర్డినేటర్ రాఘవేందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మమ్మల్ని మోసం చేశాడు బ్యాంకులో ఉన్న రుణం తగ్గిస్తామని, పంట నష్టం వేయిస్తానని మా దగ్గర పట్టా పాసుపుస్తకాలు తీసుకున్నాడు. డబ్బులు పడ్డాక మా వడ్ల పైసలు మీ ఖాతాలో పడ్డాయని నా కుమారుడు బాలయ్యను తీసుకుని వెళ్లి పైసలన్నీ తీసుకున్నాడు. రైతుబంధు రాకపోవడంతో వ్యవసాయ అధికారుల వద్ద ఆరా తీయగా.. మాకు అసలు విషయం తెలిసింది. నేను బతికుండగానే చనిపోయానని పత్రాలు సృష్టించడం చాలా దుర్మార్గం. ఇందుకు కారణమైన ప్రతీఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. రైతుబంధు డబ్బులు ఇప్పించాలి. – చంద్రమ్మ, బాధితురాలు -
కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు
సాక్షి, హైదరరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారిందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన ‘నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. పల్లెలకు ఇంటర్నెట్.. విప్లవాత్మక మార్పులు పల్లెలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని కేటీర్ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారిని నైపుణ్య శిక్షణలో భాగస్వాములు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్’గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్ సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణం అయ్యిందన్నారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. (చదవండి: ప్రపంచం చూపు మన వైపు) వ్యాపారానికే కాక వ్యవసాయానికి ప్రాధాన్యత భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోల్చిచూస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమణాలు నెలకొల్పామన్నారు. దేశంలోని 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు బంధు, రైతు బీమా రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపారు కేటీఆర్. (చదవండి: ఇంటింటికీ ఇంటర్నెట్ ) తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలనే దేశంలోనే అత్యధికంగా సాగు నమోదు అయిందన్నారు కేటీఆర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రైతాంగానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
40 శాతం మందికి రైతు బంధు అందలేదు
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకంలో తీవ్ర జాప్యం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మంది రైతులకు రైతు బంధు నిధులు అందలేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆ రైతులకు రావాల్సిన నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కొరత వల్ల రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు యూరియాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
రైతన్నల కోసం రూ.1.5 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం రైతులకు ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్డీయే ప్రభుత్వం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.50 లక్షల కోట్ల మేర వ్యవసాయ ప్యాకేజీని ప్రకటించే అవకాశమున్నట్లు వెల్లడించాయి. అన్నదాతల ఆదాయం పెంపు, చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే విషయాన్ని కేంద్ర కేబినెట్ అజెండాలో చేర్చినట్లు పేర్కొన్నాయి. సోమవారం జరగాల్సిన ఈ భేటీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. పరిశీలనలో ‘రైతు బంధు’.. పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు వడ్డీని మాఫీ చేయడం ఈ సిఫార్సుల్లో మొదటిది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.15వేల కోట్ల భారం పడనుంది. అలాగే ఆహార పంటలను సాగుచేసే రైతన్నలు చెల్లించే బీమా ప్రీమియంను పూర్తిగా మినహాయించాలని వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ‘రైతు బంధు’ ఒడిశా సర్కారు తెచ్చిన ‘కాలియా’ పథకాల తరహాలో రైతుల బ్యాంకు ఖాతాలకే నగదును నేరుగా బదిలీ చేసే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతులను ఆదుకునేందుకు కేంద్రం తీసుకురానున్న ప్యాకేజీ రూ.1.50 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయి తే ఈ సిఫార్సులపై ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైన తర్వాతే స్పష్టత రానుందని భావిస్తున్నారు. 2019–20 బడ్జెట్ çసమర్పణకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన అమలు చేసేలా, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేలా ఎన్డీయే ప్రభుత్వం ఈ కొత్త పథకానికి తుదిరూపు ఇవ్వనుంది. -
రైతుబంధు నగదు జమపై తకరారు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద చెక్కులు పంపిణీ చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బును ఎలా జమ చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. శనివారం ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసార«థి, కమిషనర్ రాహుల్ బొజ్జా పలు బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 50 లక్షల మంది రైతులు యాసంగి పెట్టుబడికి అర్హులు కానున్నారు. అయితే వీరందరి బ్యాంకు ఖాతాలు వ్యవసాయ శాఖ దగ్గర లేవు. కాకపోతే రైతు సమగ్ర సర్వేలో, ధరణి వెబ్సైట్ ఆధారంగా 50 శాతానికిపైగా రైతుల బ్యాంకు ఖాతాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇవి సరైనవేనా అనేది తెలియదు. ప్రతి గ్రామ రైతు బంధు లబ్ధిదారుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెవెన్యూ సిబ్బంది అందించనున్నారు. ధరణికి అందుబాటులో ఉన్న రైతుల అకౌంట్ నం బర్లు కూడా అందులో ఉంచనున్నారు. ఏఈవోలు ప్రతి రైతును సంప్రదించి అకౌంట్ నంబర్ సరైందో కాదో నిర్ధారించుకొని, లబ్ధిదారుడైన రైతు బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోని వాటిని రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులతో పాటు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రైతు ఖాతాకు నగదు చేరకుండా మళ్లీ వెనక్కి వస్తే ఏ రైతుకు రైతుబంధు అందలేదో గుర్తించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. -
నేటినుంచి రైతుబంధు చెక్కులు
సాక్షి, హైదరాబాద్: యాసంగి రైతుబంధు చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచే వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయాధికారులు గ్రామ సభల్లో చెక్కులను అందించనున్నా రు. ఇప్పటికే 11 లక్షల చెక్కులను బ్యాంకులు ము ద్రించగా వ్యవసాయశాఖ వాటిని పరిశీలించుకుని పంపింది. ఈనెల 5 నుంచే చెక్కులు పంపిణీ చేయా లని నిర్ణయించామన్నారు. శుక్రవారం కనీసం పది జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభమయ్యేలా సన్నాహా లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ధరణి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 52.15 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. మొత్తంగా రూ.5, 511 కోట్లు యాసంగి పెట్టుబడి కింద ఇవ్వనున్నారు. చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో చెక్కుల పంపిణీపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. రైతుబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, అక్టోబర్‌లో చెక్కులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈవో రజత్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. -
చెక్కులు పంపిణీ చేసేదెవరో?
సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుబంధు పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతు సమన్వయ సమితులను దూరం పెట్టాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం రద్దు కావడం, త్వరలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్నందున రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆపద్ధర్మ మంత్రులు, రైతు సమితి సభ్యులు ఎవరూ చెక్కుల పంపిణీలో పాల్గొనడం సాధ్యంకాదని అధికారులు అంటున్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, సమన్వయకర్తలను మంత్రులు నామినేట్ చేసినం దున వారు చెక్కుల పంపిణీలో పాల్గొనడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరాలని వ్యవసాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం పెట్టుబడి చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామసభల్లో హల్చల్ చేశారు. 1.60 లక్షల మంది ఉన్న రైతు సమితి సభ్యుల పాత్ర కీలకంగా ఉండింది. ఈసారి వారి భాగస్వామ్యం ఉండదు. అధికారులే అంతా... రబీలో పెట్టుబడి సొమ్ము పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైతులకు అందజేసేందుకు రూ.5,925 కోట్లకు జూలైలోనే పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది. నవంబర్‌లో పెట్టుబడి చెక్కులను అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులతో సమావేశమై చెక్కుల ముద్రణకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెలలోనే చెక్కుల ముద్రణ ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు పాల్గొనే అవకాశం లేకపోవడంతో కేవలం వ్యవసాయ, రెవెన్యూ అధికారులే ఈ తంతు పూర్తి చేస్తారు. గ్రామసభలోనే అందజేస్తారు. అయితే ఎన్నికల సమయంలో కీలకమైన ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న ఆందోళన అధికారులను పట్టిపీడిస్తుంది. అసలు ఈసీ అంగీకరిస్తుందా? నవంబర్ నెల అంటే ప్రస్తుత అంచనా ప్రకారం ఎన్నికలకు సంబంధించిన హడావుడి నడుస్తుంటుంది. పైగా ఒకేసారి వేలాది కోట్లు రైతులకు చెక్కుల రూపేణా చెల్లించడంపై ఎన్నికల కమిషన్ ఏమంటుందోనన్న ఆందోళన ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తుంది. చెక్కుల పంపిణీ ఓటర్లపై ప్రభావం చూపిస్తుందన్న అభ్యంత రాలు వచ్చే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. 58 లక్షల చెక్కుల పంపిణీ అంటే దాదాపు అదే సంఖ్యలో కుటుంబాలను ప్రభావితం చేసినట్లే. ఖరీఫ్‌లో 50 లక్షల మంది చెక్కులు తీసుకున్నారు. అంటే దాదాపు కోటి మందికి పైగా ఓటర్లను ప్రభావితం చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇది ఖరీఫ్ లో ప్రారంభమైన పథకం. బడ్జెట్లోనూ నిధులు కేటాయించారు. కాబట్టి దీనికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయదన్న భరోసాలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ‘మీ పని మీరు చేసుకోండి. చెక్కుల ముద్ర ణ, పంపిణీకి ఏర్పాట్లు వంటివన్నీ ఎక్కడా నిలిచిపోకూడదు’ అని రద్దు కాకముందు ప్రభుత్వం వ్యవ సాయశాఖను ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారు లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. -
రైతుబంధుతో ప్రతిపక్షాలకు బొంద: సోలిపేట
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 8 వేలు ఇస్తున్న రైతుబంధు పథకంతో ప్రతిపక్షాలను రైతులే బొంద పెట్టడం తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రైతులను గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీరు, సాగుకు పెట్టుబడి, గిట్టుబాటు ధర వరకూ అన్ని సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా, రైతు బాంధవునిగా పనిచేస్తున్నారని అన్నారు. రైతుబంధు వద్దని ప్రతిపక్షనేతలు అనగలరా అని ప్రశ్నించారు. -
తొలి రోజు 3.79 లక్షల చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద గురువారం తొలి రోజు రాష్ట్రంలో 3.79 లక్షల చెక్కులు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ తెలిపింది. అందులో 51,236 చెక్కులను రైతులు నగదుగా మార్చుకుని బ్యాంకుల నుంచి రూ.52 కోట్లు పొందారని వెల్లడించింది. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం ఉదయం 11.15 గంటలకు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 568 మండాలాల్లో 509 మండలాల పరిధిలోని 1,629 గ్రామాల్లో చెక్కుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు కరీంనగర్ జిల్లాలో జరిగిన సీఎం కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా ఆ జిల్లాలో శుక్ర వారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సజావుగా పంపిణీ.. తొలి రోజు కావడంతో చెక్కుల పంపిణీ శాతం తక్కువగా నమోదైందని పార్థసారిథి తెలిపారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చెక్కుల పంపిణీ సజావుగా సాగిం దన్నారు. కౌంటర్ల వద్ద తాగు నీరు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేశామన్నారు. కొంతమంది రైతులకు చెక్కులు మాత్రమే ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించ లేదని, తహసీల్దారులు ధ్రువీకరించిన పట్టాదారు పాస్‌పుస్తకాల జాబితాలను బ్యాంకు అధికారులకు అందించడం ద్వారా ఇలాంటి రైతుల చెక్కులను నగదుగా మార్చాలని కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీని సంప్రదించిన అనంతరం ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. పాస్ పుస్తకాలు పొందని రైతులు అధికారిక ధ్రువీకరణ పత్రాలను బ్యాంకు అధికారులకు చూపించి చెక్కుల మార్పిడి చేసుకోవాలని సూచించారు. -
‘రైతు బంధు’ పేరిట 100 కోట్ల ప్రచారమా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తక్కువ సాయం చేస్తూ ప్రచారం మాత్రం భారీగా చేసుకుంటోందని టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఎవడబ్బ సొమ్మని చెప్పి దేశంలోని అన్ని పత్రికలకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి పథకం ప్రారంభ ప్రకటనలిచ్చిందని ఆయన నిలదీశారు. గురువారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాలుగేళ్లలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి పరిహారం ఇవ్వడానికి పైసల్లేవు. పరామర్శించేందుకు సమయం లేదు. మద్దతు ధరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టవు. రుణమాఫీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మాట తప్పావు. ఇంతటి అమానవీయ వైఖరిని రైతులపట్ల అవలంబిస్తున్న నువ్వు రైతు బంధు అంటూ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటావా?’’అని సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్ విరుచుకుపడ్డారు. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తి కేసీఆర్ అని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ అనేక విధాలుగా మోసం చేశారని ఆరోపించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకున్న కేసీఆర్...గద్దెనెక్కాక రుణమాఫీ నాలుగుసార్లు చేస్తానని మాట మార్చారని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా రైతులకు మేలు చేయకపోగా అణచివేత ధోరణితో వ్యవహరించారని, మద్దతు ధర కోసం ఖమ్మంలో ధర్నా చేసిన గిరిజన రైతులకు సంకెళ్లు వేసి దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారు. సీఎంవి మోసపూరిత మాటలు.. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో సీఎం మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. గిట్టుబాటు ధరకు 25 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతానని మళ్లీ రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన రూ.6.75 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి భావితరాలను తాకట్టు పెట్టి తెచ్చిన రూ.2 లక్షల కోట్ల అప్పుల నుంచి ఈ 25% ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ నిలదీశారు. వరికి మద్దతు ధర రూ.1,500 ఉంటే రాష్ట్రంలో ఎక్కడా రూ.1,200 మించి కొనలేదని చెప్పారు. ఎకరానికి 30 క్వింటాళ్లు లెక్కవేసుకున్నా మద్దతు ధరకన్నా రూ.300 తక్కువ వచ్చింది కనుక రైతుకు రూ.9 వేల మేర నష్టం జరిగిందని ఉత్తమ్ వివరించారు. ఆ రూ.9 వేలను దళారులకు దోచిపెట్టి రైతులకు ఇప్పు డు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తానని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. మేమొస్తే ఏకకాలంలో రుణమాఫీ...తాము అధికారంలోకి వస్తే పంటలవారీగా మద్దతు ధరలను ప్రకటిస్తామని, కేంద్రం ఎంత ఇచ్చినా దానికి అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. వరి, మొక్కజొన్న, సజ్జలకు రూ. 2 వేలు, పత్తికి రూ. 6 వేలు, కందులు, పప్పుధాన్యాలకు రూ. 7 వేలు, పసుపు, మిర్చికి రూ. 10 వేలు, ఎర్రజొన్నకు రూ. 3 వేలకు తగ్గకుండా మద్దతు ధర అందిస్తామన్నారు. ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు బంధు పథకం అమల్లో రైతులకు ఏదైనా సమస్య వస్తే వారికి అండగా ఉండి ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఎం.కోదండరెడ్డి, ఆరేపల్లి మోహన్, దాసోజు శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘రైతు బంధు’కు ‘ఫ్రంట్’ నేతలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్ దాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా రు. అందుకు మే 10న ‘రైతు బంధు’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. కర్ణాటక, జార్ఖండ్ మాజీ ముఖ్యమం త్రులు కుమారస్వామి, హేమంత్ సోరెన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాలకు నాలుగైదు రాష్ట్రాల నేతలను ఒకే వేదికపైకి తెచ్చి అంతర్గత చర్చలకు అవకాశం కల్పి స్తే ఫ్రంట్‌కు బలమైన పునాదులు పడతాయని, దాంతోపాటు రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కుమారస్వామి హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. -
58.33 లక్షల మందికి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద 58.33 లక్షల మంది అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందనుంది. వ్యవసాయశాఖ దీనిపై తుది నిర్ధారణ చేసి, ఆ వివరాలను సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది. ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో అటవీ హక్కు యాజమాన్య పత్రాలున్న గిరిజన భూములతో పాటు మొత్తంగా 1.43 కోట్ల ఎకరాల వివాద రహిత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూములున్న రైతులందరికీ ఖరీఫ్ పెట్టుబడి సొమ్ము అందనుంది. ఆ రైతులందరికీ ఖరీఫ్‌లో రూ. 5,720 కోట్ల పెట్టుబడి సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పరిపాలన అనుమతి ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా మొదటి దశ కింద రూ.1,602 కోట్ల సొమ్మును బ్యాంకులకు పంపింది. రెండో దశ కింద రూ. 2,455 కోట్లు బ్యాంకులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని కూడా త్వరలో అందజేయనున్నారు. పదో తేదీ నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ చెక్కుల పంపిణీ జరుగనుంది. తొమ్మిది వేల చెక్కుల్లో తప్పులు... ఇప్పటివరకు 54.15 లక్షల చెక్కుల ముద్రణ పూర్తయింది. వాటిని ఆయా జిల్లాలు, మండ లాలకు పంపారు. మిగిలిన చెక్కుల ముద్రణ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ముద్రించిన వాటిల్లో 9 వేల చెక్కుల్లో తప్పులు దొర్లినట్లు వ్యవసాయశాఖ అధికా రులు పేర్కొన్నారు. కొన్ని చెక్కుల్లో రైతుల పేరు తప్పుగా ముద్రణ కావడం, కొన్నింటిలో గ్రామం పేరు, మండలం పేరు తప్పులు వచ్చినట్లు చెప్పారు. తప్పులు దొర్లిన చెక్కులను బ్యాంకులకు పంపామని, తిరిగి ముద్రిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 10,823 గ్రామాలకుగాను 160 గ్రామాల్లో అసలు రైతు ఖాతాలే లేవని నిర్ధారించారు. ఆ గ్రామాల్లో రైతులు లేరని సర్కారుకు నివేదించారు. కొన్నిచోట్ల రైతులు వివిధ కారణాలతో గ్రామాలను ఖాళీ చేయడం, మరికొన్నిచోట్ల ఆయా గ్రామాలు ముంపునకు గురికావడం జరిగిందన్నారు. సగానికి పైగా పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ ఇంకా పది రోజుల్లో చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ మొదలు కానుంది. ఇప్పటికే చెక్కుల ముద్రణ పూర్తి దశలో ఉంది. అలాగే 32 లక్షల పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని రైతులకు గ్రామ సభల్లో పంపిణీ చేస్తారు. పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ జరుగుతున్నందున గ్రామ సభలను ఎలా నిర్వహించాలన్న దానిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గొడవలు జరిగే అవకాశమున్న గ్రామాలు, ప్రతిపక్షాలకు బలమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పోలీసు కాపలా భారీగా ఏర్పాటు చేసే అవకాశముంది. -
‘పెట్టుబడి’కి పోలీస్స్టేషన్లలో భద్రత
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేసే పెట్టుబడి చెక్కులను పోలీస్స్టేషన్లలో భద్రపరచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పోలీసుస్టేషన్లతోపాటు ట్రెజరీ కార్యాలయాలు, బ్యాంకుల్లోనూ భద్రపరచాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. రెండు, మూడు రోజుల్లో కొన్ని బ్యాంకుల నుంచి చెక్కులు ముద్రితమై బయటకు వస్తాయి. వాటిని హైదరాబాద్‌లో ఆయా బ్యాంకు ప్రధాన కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా వ్యవసాయశాఖకు అందజేస్తారు. వాటిని ఆ శాఖ కమిషనర్ జగన్మోహన్ స్వీకరిస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల(డీఏవో)కు కమిషనర్ వాటిని అందజేస్తారు. వాటిని డీఏవోలు అత్యంత భద్రత నడుమ జిల్లాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల వారీగా బండిళ్లు ఈ నెల 20 నుంచి రైతుబంధు చెక్కులను పంపిణీ చే సేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చెక్కులను ముద్రించే బాధ్యత ఎనిమిది బ్యాంకులకు ఇచ్చిన సంగతి తెలిసిందే. చెక్కుల బండిళ్లను జిల్లాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాలవారీగా సిద్ధం చేస్తారు. వాటిని వ్యవసాయశాఖ పంపిణీ చేస్తుంది. 60 లక్షలకు పైగా చెక్కులు ముద్రించే అవకాశముంది. వాటిని తరలించేందుకు వ్యవసాయశాఖ ట్రంక్ పెట్టెలను కొనుగోలు చేసింది. అయితే, చెక్కులు చోరీకి గురికాకుండా, దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల ముందే జిల్లాలకు పంపిణీ చేసే అవకాశమున్నందున వాటిని పోలీసు స్టేషన్లలో ఉంచాలని, అవిలేని చోట్ల ట్రెజరీలు, బ్యాంకుల్లోనూ దాచిపెట్టాలని నిర్ణయించారు. వాటి భద్రత బాధ్యత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కొందరు అధికారుల బృందానికి అప్పగించాలని నిర్ణయించారు. కాలాతీతమైన చెక్కులు ఏంచేయాలి? పెట్టుబడి చెక్కుల గడవు మూడు నెలలు. ఒకవేళ గ్రామసభలో పంపిణీ చేసిన చెక్కుల సొమ్మును మూడు నెలల్లోగా (గడువులోగా) రైతులు బ్యాంకుల నుంచి తీసుకోకపోయినా, రైతులు తీసుకోని చెక్కులు మూడు నెలల తర్వాత కూడా అలాగే ఉండిపోయినా వాటిని ఏం చేయాలన్న దానిపై వ్యవసాయశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే బాధ్యత ఆ శాఖ కమిషనర్‌కు అప్పగించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. -
అన్నదాతకు అండగా కొత్త మార్గదర్శకాలు
మార్కెటింగ్ శాఖ ప్రచారమే ముఖ్యం సాక్షి, మంచిర్యాల : అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించినపుడే పంట అమ్ముకునేలా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. తాజా మార్గదర్శకాలు అమలు చేస్తూ అవగాహన కల్పిస్తే అన్నదాతలకు న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు మార్కెటింగ్ శాఖ ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది. పథకం అమలు ఇలా.. మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న రైతులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాస్‌బుక్ నకలు, రెండు ఫొటోలు ఇస్తే అధికారులు సదరు రైతుకు రైతుబంధు కార్డును అందజేస్తారు. ఈ కార్డుదారులకు దక్కే సౌలభ్యాలను ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆశాజనకంగా రూపొందించింది. పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కనపుడు మార్కెట్ యార్డులో ధాన్యం నిలువచేసుకొని దాని మొత్తం విలువలో 75 శాతం లేదా రూ.లక్ష రూపాయల లోపు రుణంగా గతంలో పొందేవారు. యార్డుల్లో ధాన్యాన్ని మూడునెలల వరకు నిలువ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ నిబంధనను తాజాగా మార్చి ధాన్యం విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా ఇవ్వడం యథావిధిగా ఉంచుతూ రుణమొత్తాన్ని ప్రభుత్వం రూ.2 లక్షలకు పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో నంబర్ 5ను జారీ చేసింది. మరోవైపు నిలువ ఉంచే సమయాన్ని 3 నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. దీంతోపాటు గతంలో ఉన్న వడ్డీ చెల్లించే అవసరం లేకపోవడాన్ని యథావిధిగా కొనసాగిస్తూ రైతుబంధు కార్డు కాలపరిమితిని ఐదేళ్లకు పెంచారు. ప్రచారం ముఖ్యం జిల్లాలో వరి, పత్తి, సోయా, కంది వంటి పంట లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ పంటల లో ఎక్కువ వాటికి గిట్టుబాటు ధర దక్కడం లే దు. పంట చేతికి వచ్చిన సమయంలోనే అమ్ముకుంటే తక్కువ ధర వచ్చే నేపథ్యంలో యార్డుల్లో నిలువ చేసుకుంటే గిట్టుబాట ధర వచ్చినపుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో 17 మార్కెట్‌యార్డులు, 82 గోడౌన్లు అందుబాటు లో ఉన్నాయి. ఇందులో 66,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం నిలువ చేసే సదుపాయం ఉంది. అ యితే ప్రస్తుతం అందులో కొన్ని పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. అందులోనుంచి డీలర్ల కు పీడీఎస్ సరుకులు పంపిణీ చేసేలా ఎంఎల్ఎస్ పాయింట్లుగా పౌరసరఫరాల శాఖ ఉపయోగించుకుంటోంది. దీంతోపాటు ఇటీవల కొనుగోలు చేసిన ధాన్యం నిలువ ఉంచేందుకు ఐకేపీకి గోడౌన్లు అందజేశారు. అయితే ఐకేపీ నిలువ చేసిన ధాన్యం తరలిన తర్వాత రైతుబంధు అమలుకు ప్రచారం చేస్తామని మార్కెటింగ్ శాఖ పేర్కొంటోంది. ఇప్పటివరకు లబ్ధిదారులు జిల్లాలో 45,799 రైతుబంధు కార్డులు అందజేశారు. అయితే రైతుబంధు పథకాన్ని ఉపయోగించుకుంటున్న అన్నదాతలు ఏటా తగ్గుము ఖం పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం రైతుల కోసం కల్పించిన సౌలభ్యానికి తోడుగా మార్కెటింగ్‌శాఖ రైతుల్లో అవగాహన కల్పిస్తే మేలు.