సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుబంధు పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతు సమన్వయ సమితులను దూరం పెట్టాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం రద్దు కావడం, త్వరలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్నందున రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆపద్ధర్మ మంత్రులు, రైతు సమితి సభ్యులు ఎవరూ చెక్కుల పంపిణీలో పాల్గొనడం సాధ్యంకాదని అధికారులు అంటున్నారు.
రైతు సమన్వయ సమితి సభ్యులు, సమన్వయకర్తలను మంత్రులు నామినేట్ చేసినం దున వారు చెక్కుల పంపిణీలో పాల్గొనడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరాలని వ్యవసాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం పెట్టుబడి చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామసభల్లో హల్‌చల్ చేశారు. 1.60 లక్షల మంది ఉన్న రైతు సమితి సభ్యుల పాత్ర కీలకంగా ఉండింది. ఈసారి వారి భాగస్వామ్యం ఉండదు.
అధికారులే అంతా...
రబీలో పెట్టుబడి సొమ్ము పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైతులకు అందజేసేందుకు రూ.5,925 కోట్లకు జూలైలోనే పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది. నవంబర్‌లో పెట్టుబడి చెక్కులను అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులతో సమావేశమై చెక్కుల ముద్రణకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెలలోనే చెక్కుల ముద్రణ ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈసారి పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు పాల్గొనే అవకాశం లేకపోవడంతో కేవలం వ్యవసాయ, రెవెన్యూ అధికారులే ఈ తంతు పూర్తి చేస్తారు. గ్రామసభలోనే అందజేస్తారు. అయితే ఎన్నికల సమయంలో కీలకమైన ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న ఆందోళన అధికారులను పట్టిపీడిస్తుంది.
అసలు ఈసీ అంగీకరిస్తుందా?
నవంబర్ నెల అంటే ప్రస్తుత అంచనా ప్రకారం ఎన్నికలకు సంబంధించిన హడావుడి నడుస్తుంటుంది. పైగా ఒకేసారి వేలాది కోట్లు రైతులకు చెక్కుల రూపేణా చెల్లించడంపై ఎన్నికల కమిషన్ ఏమంటుందోనన్న ఆందోళన ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తుంది. చెక్కుల పంపిణీ ఓటర్లపై ప్రభావం చూపిస్తుందన్న అభ్యంత రాలు వచ్చే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. 58 లక్షల చెక్కుల పంపిణీ అంటే దాదాపు అదే సంఖ్యలో కుటుంబాలను ప్రభావితం చేసినట్లే. ఖరీఫ్‌లో 50 లక్షల మంది చెక్కులు తీసుకున్నారు.
అంటే దాదాపు కోటి మందికి పైగా ఓటర్లను ప్రభావితం చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇది ఖరీఫ్ లో ప్రారంభమైన పథకం. బడ్జెట్లోనూ నిధులు కేటాయించారు. కాబట్టి దీనికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయదన్న భరోసాలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ‘మీ పని మీరు చేసుకోండి. చెక్కుల ముద్ర ణ, పంపిణీకి ఏర్పాట్లు వంటివన్నీ ఎక్కడా నిలిచిపోకూడదు’ అని రద్దు కాకముందు ప్రభుత్వం వ్యవ సాయశాఖను ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారు లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment