చెక్కులు అందుకున్న కర్నూలు జిల్లా రైతు కుటుంబాలు
సాక్షి, అమరావతి: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 మే వరకు ఆత్మహత్యలు చేసుకున్న 417 మంది రైతు కుటుంబాలకు రూ.5.లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
వ్యవసాయ శాఖ అందించిన జాబితా ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారం 210 మంది కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున సాయం అందిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వంద కోట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల రూ.35.55 కోట్లను విడుదల చేసింది.
సంక్షేమ పథకాలతో తగ్గనున్న ఆత్మహత్యలు
వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా, పంటల ఉచిత బీమా, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఆత్మహత్యలు తగ్గవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అభిప్రాయపడ్డారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ఇప్పటికే దాని ఫలితాలు కనిపిస్తున్నాయని ‘సాక్షి’కి వివరించారు. రైతుభరోసా పథకం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. ఇంకా అర్హత ఉన్న బాధిత కేసులు ఏమైనా ఉంటే వారికీ సాయం అందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment