17 నుంచి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు | Establishment of Rythu Bharosa Centre | Sakshi
Sakshi News home page

17 నుంచి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు

Published Thu, Dec 19 2019 5:54 AM | Last Updated on Thu, Dec 19 2019 5:55 AM

మంత్రి కన్నబాబు, అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌  - Sakshi

ప్రభుత్వం అంటే అవినీతి ఉంటుందని, తక్కువ నాణ్యత ఉన్న వాటిని ఇస్తారనే ఒక అభిప్రాయం ఉంది. మేము ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చబోతున్నాం. అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించి.. రైతులకు ఇచ్చే విత్తనాలు, పురుగు మందుల్లో నాణ్యత ఉండేలా చూస్తాం. దీనివల్ల రైతుల్లో పూర్తి భరోసా ఉంటుంది.

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్‌ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు విక్రయించాలని ఆదేశించారు. రైతులకు సలహాలు, శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు. రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పని చేయాలన్నారు. దశల వారీగా విత్తన పంపిణీ, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లుగా కూడా రైతు భరోసా కేంద్రాలు అవతరించాలని సీఎం పేర్కొన్నారు. 

రైతు భరోసా కేంద్రంలో డిజిటల్‌ కియోస్క్‌
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోఫెర్టిలైజర్స్, అగ్రి కెమికల్స్, పశుదాణా.. ఇతరత్రా ఉత్పత్తుల ఆర్డర్‌ ఇవ్వడానికి డిజిటల్‌ కియోస్క్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విత్తనాల తయారీదారులు నాణ్యత పరీక్షలు చేసిన తర్వాతే వాటిని రైతు భరోసా కేంద్రాలకు పంపించాలని స్పష్టం చేశారు. విత్తనాలు నిల్వ చేసే గోడౌన్లలో కూడా నాణ్యత పరీక్షలు చేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆక్వాఫీడ్‌ నాణ్యతపై ఎలాంటి నియంత్రణ లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఆక్వాఫీడ్‌ నాణ్యతపై ప్రమాణాలు నిర్దేశిస్తూ త్వరలోనే ఒక చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు మాత్రమే తమ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను విక్రయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల కల్తీకి చెక్‌ పడుతుందన్నారు. ప్రస్తుతమున్న ల్యాబ్‌లను ప్రభుత్వం పెంచుతున్నందున కల్తీని అడ్డుకునే పనులు ముమ్మరంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. సమావేశానికి ముందు డిజిటల్‌ కియోస్క్‌ను, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే భూసార పరీక్ష పరికరాలను సీఎం వైఎస్‌ జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పరిశీలించారు. 

సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా..
- గోడౌన్లలో ఉన్నప్పుడు విత్తనాలు కల్తీ జరక్కుండా సరైన నిల్వ పద్ధతులు పాటించాలి. ఆ మేరకు సంచుల నాణ్యత ఉండాలి.
- గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, వెటర్నరీ ఉద్యోగులు రైతు భరోసా కేంద్రాల నుంచే విధులు నిర్వహించాలి. 
- పంటలకు బీమా సదుపాయం కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే అందించాలి.
- వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాల జాబితా ప్రదర్శించాలి. 
- పంటలు, సాగు విధానాలపై డిజిటల్‌ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. 
- వెదర్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేసి, వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలి. 
- నిరంతరాయంగా ఇంటర్నెట్‌ ఉండేలా చూసుకోవాలి. 
- ఇ–క్రాపింగ్‌ నమోదు, పశువులకు బీమా సదుపాయం, కౌలు రైతుల సాగు ఒప్పందాల ప్రక్రియ కూడా రైతు భరోసా కేంద్రంలో జరగాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement