అన్నదాతకు..భరోసా కేంద్రాలు | Establishment of 10641 Rythu bharosa centers across the state | Sakshi
Sakshi News home page

అన్నదాతకు..భరోసా కేంద్రాలు

Published Thu, May 21 2020 4:21 AM | Last Updated on Thu, May 21 2020 5:22 AM

Establishment of 10641 Rythu bharosa centers across the state - Sakshi

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా ఉంటాయి. గ్రామ సచివాలయాల సమీపంలోనే ఇవి ఉంటాయి. 

ఆర్‌బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు.

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ఓ వినూత్న వ్యవస్థ ఏపీలో పురుడు పోసుకోనుంది. సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించే ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు కావడం 73 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇదే ప్రథమం అని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ ఏం ఆలోచించారో.. దానిని దేశం ఎల్లుండి అనుసరిస్తుందనే దానికి నిదర్శనంగా రైతు భరోసా వ్యవస్థ ఉండబోతుంది. ఈ వ్యవస్థ ఇప్పటికే జాతీయ స్థాయి వ్యవసాయ విధాన నిర్ణేతలను ఆకర్షించిన తరుణంలో ప్రస్తుతం దీనిపై పలు రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ తాను సైతం అన్నట్టుగా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ మొదలు పేరుగాంచిన వ్యవసాయ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ వరకు ఎందరెందరో ఈ వ్యవస్థ విధివిధానాలను చర్చిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఖ్యాతిగాంచిన 11 సంస్థలు సేవలందించనున్నాయి. అన్నదాత ఇంటి ముంగిటకే సాగుకు సంబంధించిన అన్ని రకాల సేవలు అందించడానికి గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను (ఆర్‌బీకే) ఈ నెల 30న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాల పనితీరు, అందించే సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

అన్ని సేవలూ అందుబాటులో..
► నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా ఉంటాయి. గ్రామ సచివాలయాల సమీపంలోనే ఇవి ఉంటాయి. అక్కడ స్థలం దొరక్కపోతే మరోచోట అద్దెకు తీసుకుంటారు.
► నియోజకవర్గంలో ఏర్పాటయ్యే అగ్రీ ల్యాబ్స్‌లో పరీక్షించి, ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందిస్తుంది. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు ఉత్తమ సాగు విధానాలు, ఇతరత్రా సూచనలు, సలహాలు ఇస్తారు.
► షాపులో అందుబాటులో ఉండే ఎరువులు, విత్తనాలు.. తదితరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు. సరసమైన ధరకు ఇక్కడ అందజేస్తారు.
► కియోస్క్‌ ద్వారా రైతు తనకు కావాల్సిన వాటిని ఆర్డర్‌ చేస్తే 48 నుంచి 72 గంటల్లో సరఫరా చేస్తారు. భూసార పరీక్ష చేయించుకునే సౌకర్యం ఉంటుంది.
► ఆర్‌బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఆడియో, వీడియోల సాయంతో మెళకువలు నేర్పుతారు. సేంద్రీయ ఎరువులైన జీవామృతం, ఘనామృతం, వేపాకు కషాయం వంటి వాటి తయారీలో శిక్షణ ఇస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు.

నాలుగైదు ఊళ్లకు ఒక అగ్రీ హబ్‌ 
► రైతు భరోసా కేంద్రాల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇతరత్రాలు అగ్రీ హబ్‌ల నుంచి సరఫరా అవుతాయి. వీటి నుంచి సరుకు రైతు భరోసా కేంద్రాలకు.. అక్కడి నుంచి రైతులకు వెళుతుంది. నాలుగైదు గ్రామాలకు ఒక హబ్‌ ఉంటుంది.
► ఆర్‌బీకేలలో అమ్మే ఉత్పాదకాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం. ఈ కేంద్రాలలో కొన్న విత్తనం మొలకెత్తకపోయినా, పురుగు మందు పని చేయకపోయినా, రైతులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ల్యాబ్‌లు, ఇన్‌పుట్‌ షాపులు, నాలెడ్జ్‌ సెంటర్లపై బాధ్యత మరింత పెరుగుతుంది.  
► ఈ షాపులు వస్తే రైతు బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా, మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్లుగా కూడా పని చేస్తాయి. ఈ షాపుల్లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది.

డిజిటల్‌ కియోస్క్‌ నుంచే ఆర్డర్ల నమోదు 
► రైతు భరోసా కేంద్రాలు రెండు ప్రధాన విభాగాలుగా ఉంటాయి. ఒకటి డిజిటల్‌ కియోస్క్, రెండవది వర్క్‌షాప్, శిక్షణ విభాగం. ఎవరైనా రైతు ఈ కేంద్రంలోని డిజిటల్‌ కియోస్క్‌ను ఆన్‌ చేస్తే వ్యవసాయ ఉత్పాదకాలకు సంబంధించి ఆయా కంపెనీల ఉత్పత్తులు, వాటి ధరలు టెలివిజన్‌ తెరపైన కనిపిస్తాయి.
► రైతులు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తదితరాలను క్లిక్‌ చేస్తే ఆర్డర్‌ తయారవుతుంది. అది సమీపంలోని ఆగ్రోస్‌ కేంద్రానికి  వెళుతుంది. జిల్లాకు 5 చొప్పున 65 ఆగ్రోస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో కేంద్రానికి కొన్ని పంచాయితీలలోని రైతుల వివరాలను అనుసంధానం చేస్తారు.
► వర్క్‌షాపుల ద్వారా భూసార పరీక్షలు, వివిధ అంశాలపై వీడియోల ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో రూ.2 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను (ట్రాక్టర్‌తో ఉపయోగించేవి) అందుబాటులో ఉంచి నామమాత్రపు అద్దెకు ఇస్తారు.
► పంటల బీమా, ఇ–కర్షక్‌లో పంట నమోదు వంటి సేవలు లభిస్తాయి. పశు సంవర్థక శాఖ సేవలు సైతం లభిస్తాయి. పశు ఆరోగ్య సంరక్షణ కార్డు, ప్రాథమిక చికిత్స, ఉచిత పశువుల బీమా వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. 

రైతులకు వివిధ సేవలందించే జాతీయ సంస్థలు ఇవే..
ఎం ఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్, చెన్నై – ఐసీఏఆర్, వ్యవసాయ విస్తరణ విభాగం, న్యూఢిల్లీ – భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ – జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ, వారణాశి – సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్, హైదరాబాద్‌ – జాతీయ పాడి పరిశోధన సంస్థ, కర్నాల్‌ – ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, పూణే – సదరన్ రీజియన్ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్, బెంగుళూరు – సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఆక్వాకల్చర్, భువనేశ్వర్‌ –  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement