
ఈ నెలాఖరులోగా 10,812 యూనిట్ల అందజేసేందుకు ఆదేశాలు
14 రకాల వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు రూ.24.90 కోట్ల నిధులు విడుదల
క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయ అధికారుల ఉరుకులు..పరుగులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వ్యవసాయ యాంత్రీకరణ’లో తొలిసారిగా మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్టవ్యాప్తంగా 10,812 యూనిట్లు అందజేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. రూ.24.90 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంటే...ఈనెల 31వ తేదీలోగా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. మొత్తంగా 14 రకాల పరికరాలను వ్యవసాయ యాంత్రీకరణ కింద అందజేయాలని నిర్ణయించింది. దీంతో క్షేత్రస్థాయిలో జిల్లాల్లో వ్యవసాయశాఖ లబ్ధిదారులను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించింది.
ఏడేళ్ల తర్వాత పునరుద్ధరణ
రాష్ట్రంలో రైతుబంధు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ యాంత్రీకరణతోపాటు విత్తనాలపై సబ్సిడీలు ఆగిపోయాయి. 2018 నుంచి రైతులకు యాంత్రీకరణ పనిముట్లను అందజేసే కార్యక్రమాన్ని నిలిపివేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీ ఉండేది. ప్రస్తుతం అందరికీ 50 శాతం సబ్సిడీతో ఈ యాంత్రీకరణ పరికరాలను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అంతేకాదు వాటిని విక్రయించే సంస్థలను కూడా ఖరారు చేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించిన రైతులు 50 శాతం సబ్సిడీతో ఆయా పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. అయితే ప్రస్తుతం సమయం తక్కువగా ఉండటంతో లబ్దిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది.
14 రకాల యాంత్రీకరణ పరికరాలు
వ్యవసాయ పనుల్లో రైతులకు దోహదపడే 14 రకాల యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు అందజేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేతిపంపులు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్‌లు, రోటోవేటర్లు, విత్తనాలు/ఎరువులు వేసే పరికరాలు, ట్రాక్టర్‌తో దమ్ము చేసే పరికరాలు, పవర్‌టిల్లర్లు, ఎద్దులతో బోదలు పోసే పరికరాలు, ట్రాక్టర్లతో బోదలుపోసే పరికరాలు, పవర్‌వీడర్స్, బ్రష్‌కట్టర్స్, ట్రాక్టర్లు, మొక్కజొన్న కోత పరికరాలు, గడ్డిచుట్టే పరికరాలను సబ్సిడీతో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
