పల్లెల్లో పడకేసిన పాలన | Villages Governance Sanitation works too Bad Lack of availability of central and state funds | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పడకేసిన పాలన

Published Mon, Mar 24 2025 4:31 AM | Last Updated on Mon, Mar 24 2025 4:31 AM

Villages Governance Sanitation works too Bad Lack of availability of central and state funds

చెత్తాచెదారంతో నిండిన ఈ ప్రదేశం ఓ వ్యవసాయ బావి. యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరయపల్లి గ్రామంలోనిది ఈ దృశ్యం. సర్పంచులు ఉన్నప్పుడు గ్రామంలోని చెత్తా చెదారాన్ని డంపింగ్‌ యార్డుకు తరలించేవారు, కంపోస్ట్‌ ఎరువులు తయారుచేసేవారు. కానీ ప్రత్యేకాధికారుల పాలనలో పర్యవేక్షణ కొరవడటం, నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యాన్ని పట్టించుకునేవారే లేకుండా పోయారు. దానికి నిదర్శనం ఈ చిత్రం.

14 నెలలుగా సర్పంచులు లేక.. కేంద్ర, రాష్ట్ర నిధులు రాక అవస్థలు

డ్రైనేజీలు పూడుకుపోయి, రోడ్లపైనే చెత్త పేరుకుపోయి.. పారిశుధ్యం  అస్తవ్యస్తం.. గ్రామాలన్నీ దుర్గంధ భరితం 

ట్రాక్టర్ల లోన్‌ వాయిదాలు కట్టలేక ఇబ్బంది.. డీజిల్, డ్రైవర్‌ జీతానికీ సమస్యే.. 

వెలగని వీధి దీపాలు.. ఎండిపోతున్న మొక్కలు... పర్యవేక్షణను పట్టించుకోని ప్రత్యేకాధికారులు 

పంచాయతీల నిర్వహణ కోసం కిందా మీదా పడుతున్న కార్యదర్శులు 

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ఆందోళనకర అంశాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ పాలక  మండళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో పంచాయతీలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర, రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీనితో మెజారిటీ పల్లెల్లో పాలన పడకేసింది. మొత్తం 12,754 గ్రామ పంచాయతీల్లో 30శాతం వరకు జనాభాపరంగా పెద్ద పంచాయతీలు. 

వాటిలో పన్నుల వసూలు, ఇతర రూపాల్లో కొంత ఆదాయ వనరులు ఉండటంతో.. నెలవారీ ఖర్చులు కొంతవరకు వెళ్లదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ వంటివి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70శాతం పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రెటరీలు, ఇతర అధికారులు అప్పోసప్పో చేసి బండి లాగాల్సి వస్తోంది. అదీ రోజువా రీ నిర్వహణ కోసమే ఇబ్బంది ఎదురవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. 

అప్పులు చేసి నడిపించిన సర్పంచులు.. 
గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ ఉండాలనే నిబంధన అమలుచేశారు. దానితో బ్యాంకు రుణాలతో ట్రాక్టర్లు కొన్నారు. ఇప్పుడు వాటి వాయిదాలు చెల్లించలేక, డీజిల్, డ్రైవర్‌ జీతం, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది ఎదురవుతోంది. సర్పంచులు ఉన్నప్పుడు తమ సొంత నిధులు ఉపయోగించి, తమ పరప తితో అప్పులు తీసుకుని వచ్చి పారిశుధ్యం, ఇతర పనులు నిర్వహించారు. 

15వ ఆర్థిక సంఘం నుంచి క్రమం తప్పకుండా నిధులు అందేవి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వచి్చనా, రాకపోయినా గ్రామాల్లో నెలవారీ ఖర్చులతోపాటు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేవి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సుమారు రూ.1,600 కోట్లు ఆగిపోయాయి. దీనితో సొంత ఆదాయ వనరులు లేని గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. 

రాష్ట్ర ప్రభుత్వ నిధులూ అందక.. 
గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి కొన్ని నెలలతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సరిగా విడుదల కావడం లేదు. పంచాయతీలకు ప్రతినెలా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రతినెలా కేంద్రం ఇచ్చే రూ.220 కోట్లకు మ్యాచింగ్‌గా రూ.220 కోట్లను కొన్నినెలల పాటు ఇచి్చంది. క్రమంగా రాష్ట్ర సర్కారు ఇచ్చే మొత్తం రూ.150 కోట్లకు తగ్గించింది. 

ఆ తర్వాత మొత్తంగా నిలిచిపోయింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన మొత్తం సుమారు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్ల దాకా విడుదల అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనితోపాటు పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్‌చానెల్‌లో చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో పంచాయతీలపై కొంతమేర అయినా ఆర్థిక భారం తగ్గొచ్చునని భావిస్తున్నారు. 

పంచాయతీ కార్యదర్శుల పాట్లు 
గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుండటంతో.. పూర్తి బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. దాదాపు 14 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులేమీ రాకపోవడంతో.. పంచాయతీ పరిధిలో సమకూరే అరకొర ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. 

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సిబ్బందికి జీతాలు, గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మొక్కలకు నీళ్లు పోయడం, తాగునీటి పైపులైన్ల లీకేజీ మరమ్మతులకు, మోటార్లు పాడైతే మరమ్మతులు చేయించడం, ఫాగింగ్, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి పనులు చేయించడానికి కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి. గ్రామాల్లోని వీధుల్లో చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి ఊరవతల ఇష్టమొచి్చనట్టుగా పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 

అప్పులు తెచ్చి నడిపిస్తున్నా.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా కూడా అందక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. రోజువారీ నిర్వహణ కోసం కూడా ఇబ్బంది ఎదురవుతుండటంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల ఆధ్వర్యంలో సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పులు తెచ్చి గ్రామాలను నడుపుతున్నామని, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కార్యదర్శులు కోరగా.. పరిశీలిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. 

అభివృద్ధి పనులు జరగడం లేదు 
ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదు. సర్పంచులు ఉన్నప్పుడే పనులు ఎంతో కొంత జరిగేవి. ఇప్పుడు ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారు. 
– పాలకూరి దుర్గేష్, రెగట్టే గ్రామస్తుడు, కనగల్‌ మండలం, నల్లగొండ జిల్లా 

రూ.7లక్షలు అప్పు తెచ్చి పెట్టిన.. 
ప్రస్తుతం గ్రామాల్లో పాలకవర్గాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఏడాదిన్నరగా ప్రజల సమస్యలను తీర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి వివిధ పనులకు ఖర్చు చేశాను. 
– సోమయ్య, అనంతారం గ్రామ కార్యదర్శి 

జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో 1,500 జనాభా ఉన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్‌ కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, చెత్త తరలింపు, ట్రాక్టర్‌ కిస్తీ, డీజిల్‌ ఖర్చులకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటివరకు లక్షకుపైగా అప్పులు తెచి్చ, రోజువారీ నిర్వహణను నెట్టుకొస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. 

వీధి లైట్లు వెలగక.. ఇబ్బందిగా.. 
హనుమకొండ జిల్లా కమలాపూర్‌ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్సీ హాస్టల్‌ మీదుగా కాసీంపల్లికి వెళ్లే మార్గంలో సుమారు 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. లైట్లు పెట్టించాలని పంచాయతీ అధికారులకు చెబితే.. నిధుల కొరతతో ఇబ్బంది ఉందంటూ జాప్యం చేస్తున్నారు. చీకటి పడిందంటే చాలు ఆ మార్గంలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని స్థానికుడు శనిగరపు రంజిత్‌ పేర్కొన్నారు. 

రోడ్ల నిండా మురుగు పారుతూ.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పారిశుధ్యం దుస్థితి ఇది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు నిండిపోయి, మోరీల పైపులు పగిలిపోయి రోడ్లపైన మురుగు పారుతోందని ప్రజలు ఫిర్యాదు చేసినా.. నిధులు లేక ఏమీ చేయలేకపోతున్నామంటూ పంచాయతీ అధికారులు చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో సుమారు 50 వీధి దీపాలు పని చేయడం లేదని, రాత్రయితే వీధులన్నీ చీకటేనని స్థానికులు చెబుతున్నారు. 

‘‘సర్పంచులు పోయినప్పటి నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై మురుగు పారుతున్నా, వీధి దీపాలు వెలగకున్నా.. నిధులు వచ్చాక పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలి’’ అని గ్రామానికి చెందిన నానచర్ల రమేష్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

ఊరంతా కంపు కొడుతోంది 
మేజర్‌ గ్రామపంచాయతీ అయిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. మురుగు కాల్వలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పాలక వర్గాలు లేక, నిధులు లేక అధికారులు పనులేవీ చేయించడం లేదు. ఇక నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లి గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. డ్రైనేజీలకు మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది. 

గ్రామస్తులు ఇదేమిటని నిలదీస్తే.. రోజువారీ నిర్వహణ కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని గ్రామ కార్యదర్శి తలపట్టుకుంటున్నారు. పంచాయతీ కోసం నియమించిన స్పెషలాఫీసర్‌ ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెత్త చెదారం నిండి, డ్రెయినేజీలు పూడుకుపోయి గ్రామంతా కంపు కొడుతోందని వాపోతున్నారు. 

నాలుగైదు లక్షల చొప్పున అప్పులు తెచ్చి పెట్టాం 
‘‘గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో ఒక్కో పంచాయతీ నిర్వహణ కోసం ఇప్పటివరకు రూ. నాలుగైదు లక్షలు అప్పులు తెచ్చి పెట్టాం. ట్రాక్టర్‌ డీజిల్, తాగునీటి ఎద్దడి నివారణకు మోటార్లు, పైపులైన్ల రిపేర్లకు అప్పులు తెచ్చి పెడుతున్నాం. నిధులు లేక సక్రమంగా నిర్వహణ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వమైనా గ్రాంటు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలి. 
– బానోత్‌ రమేశ్‌నాయక్, పంచాయతీ కార్యదర్శుల సంఘం గార్ల మండల అధ్యక్షుడు, మహబూబాబాద్‌ జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement