sarpanchs
-
పెండింగ్ బిల్లులు చెల్లించామనడం అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో గతంలో సర్పంచ్‌లు చేసిన అభి వృద్ధి పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయనప్పటికీ రూ.750 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించేశామని ప్రభు త్వం పేర్కొనడం అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. పెండింగ్ బిల్లులు చెల్లించామని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి తగదని సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డిలు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు ఇవ్వలేదు. జనరల్ నిధులపైనా ఫ్రీజింగ్ ఇంకా ఎత్తివేయలేదు. ఇప్పటికీ గత సర్పంచుల చెక్కులు ట్రెజరీలోనే ఉన్నాయి’అని వారు పేర్కొన్నారు. ఆందోళనకు దిగుతాం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా.. సర్పంచ్‌లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. డిసెంబర్ 1వ తేదీ వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తెలంగాణ మొత్తం 12,769 సర్పంచ్ల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలను కూడగట్టుకొని ఆందోళనకు దిగుతామని స్పష్టం చేసింది. -
సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారంతో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసిందని ఆయన తెలిపారు. అయితే, స్పెషల్ ఆఫీసర్లతో పంచాయతీల్లో పాలన కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామసభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సర్పంచులే లేకపోతే గ్రామసభలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సర్పంచుల ఎన్నికలను నిర్వహించకపోవడం వెనక.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కనపెట్టే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దొడ్డిదారిన దారిమళ్లించిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నేను ఎక్కడ పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని, ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ అంశాలపై చర్చించి 3న వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎంపీ అభ్యర్థుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడంలేదన్నారు. బీజేపీలో చేరిక.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో వివిధ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు బీజేపీలో చేరారు. హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఎండీ సుధాకర్, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపార వేత్త వినోద్‌రావు, కామారెడ్డి జిల్లాకు చెందిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డిలకు కిషన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలన చూసి తెలంగాణలోని మేధావులు, వివిధ రంగాలకు చెందిన వారు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. -
పథకాలను సీఎం ప్రతినిధులుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ఆయన ప్రతినిధులుగా గ్రామీణ ప్రజలకు వివరించి.. వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత మీదేనని వైఎస్సార్సీపీ సర్పంచులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 175 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సర్పంచులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడుతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని సమస్యలను, ఇతర అంశాలను సజ్జల రామకృష్ణారెడ్డి, బూడి ముత్యాలనాయుడుల దృష్టికి సర్పంచులు తీసుకొచ్చారు. వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచులకు వారు హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచులను ఉద్దేశించి సజ్జల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా సీఎం వైఎస్ జగన్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన, కోవిడ్, ఆర్థిక సమస్యలు.. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో పేదరికాన్ని పోగొట్టడం, విద్య, వైద్యం వంటి విషయాల్లో ప్రయోజనం కలిగేలా సీఎం వైఎస్ జగన్ దార్శనికతతో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సంపన్నులతో సమానంగా పేదలకు అవకాశాలు కల్పించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా పేదలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. పథకాల ఫలాలు ప్రజలకు చేరడం వల్లే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం ఆ పథకాల ఫలితాలు మరింతగా ప్రతి కుటుంబానికి చేరడంతో ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ మరింతగా పెరిగిందని చెప్పారు. ప్రజా స్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవకులమేగానీ దొరలం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలతో సర్పంచుల అధికారాలను హరించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆయన ప్రతినిధులుగా ప్రజలే మిమ్మల్ని గుర్తిస్తారు. పథకాలు అందుతున్న తీరు తెన్నులను మీరే పరిశీలించాలి. తద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుందంటే.. మీకు, మనందరికి ఆదరణ పెరిగినట్లే’ అని సజ్జల చెప్పారు. ప్రతిపక్షాలకు సర్పంచులు కనీస సంఖ్య లేకున్నా.. పాత సంఘాల పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్ద సంఖ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సర్పంచులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లతో రాష్ట్రస్థాయి కార్యవర్గం: మంత్రి బూడి ముత్యాలనాయుడు మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి సంబంధించిన సర్పంచులతో రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దాని ద్వారా వారి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. సర్పంచులకు నిధులివ్వడం లేదంటూ ప్రతిపక్షాల విమర్శలు అర్థంలేనివన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రాం వైస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు. -
సర్పంచ్ల సమస్యలపై కమలం పోరు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసి రాజకీయంగా బలపడేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అనేకమంది సర్పంచ్‌లు విధులు, నిధులు, అధికారాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడటం పార్టీకి బాగా కలిసొస్తుందనే అంచనాకు వచ్చింది. కొంతకాలంగా బిల్లులు రాకపోవడం వల్ల సర్పంచ్‌లు మొదలు వివిధస్థాయిల ప్రజాప్రతినిధులు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో ఈ దిశలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపథ్యంలో గ్రామస్థాయిలో అధికార టీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు ఇదే సరైన సమయమని నిర్థారణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా స్థానికసంస్థల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది. స్థానిక సంస్థలపై వివిధ రూపాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణిని ఎండగట్టి గ్రామస్థాయి నుంచి పట్టు సాధించాలని నిర్ణయించింది. త్వరలో గవర్నర్‌కు వినతిపత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సర్పంచ్ల సమస్యలను త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ నేతలు, పలువురు సర్పంచ్‌లతో కలసి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్రపార్టీ నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో గవర్నర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతోపాటు దీనికి కొనసాగింపుగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు సర్పంచ్‌లతో కలసి బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇతరముఖ్యనేతలు మెమోరాండం సమర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల రెండోవారంలోగా సర్పంచ్ల సమస్యలపై లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద సర్పంచ్‌లతో కలసి సంజయ్ రెండుగంటల మౌనదీక్ష చేపట్టేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహణ కోసం సర్పంచ్‌లు, పార్టీనేతలతో కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
సర్పంచ్‌లపై రసమయి బాలకిషన్ ఆగ్రహం
సాక్షి, కరీంనగర్: సర్పంచ్‌లు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గ్రామాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేశంలో పాల్గొన్న రసమయి.. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడడం లేదంటూనే సర్పంచ్‌లను సుతిమెత్తగా మందలించారు. సర్పంచ్‌లు ఇంట్లో ఉంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రలో గొప్పగా నిలిచిపోయే అవకాశం ఈసారి సర్పంచ్‌లకు ఉందన్నారు. కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో భూముల విలువ పెరిగిపోవడంతో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తన నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం అగ్రస్థానంలో ఉండగా మానకొండూరు మండలం చివరి స్థానంలో ఉందని.. కరీంనగర్‌కు సమీపంలో ఉండటంతో స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి సమస్యలపై దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రసమయి కోరారు. -
తెలంగాణలో భారీగా జీతాల పెంపు
ఫుల్‌టైమ్ కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్ల జీతం రూ.8 వేల నుంచి రూ.10,400కు.. ఇందులో పార్ట్‌టైమ్ వారి వేతనం రూ.4 వేల నుంచి రూ.5,200కు పెంపు. సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500కు.. జడ్పీటీసీలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలకు చేరనుంది. దినసరి వర్కర్లకు రూ.300 నుంచి రూ.390కు పెంపు.. వేతనాల పెంపు ఈ ఏడాది జూన్ నుంచే అమల్లోకి.. అంటే పెరిగిన జీతాలు జూలై ఒకటిన ఉద్యోగుల చేతికి అందుతాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గౌరవ వేతనం/ ప్రోత్సాహకం రూపంలో వేతనం పొందుతున్న ఉద్యోగులు, పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులకు కూడా వేతనాల పెంపును వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ జాబితాలో హోంగార్డులు, అంగన్వాడి వర్కర్లు, అంగన్వాడి అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఏలు), విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీఏవోలు), ఆశ వర్కర్లు, సెర్ప్ సిబ్బందితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంచాలని నిర్ణయించినందున.. ఉద్యోగుల వివరాలన్నీ వెంటనే పంపాలని కోరుతూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ నోట్ పంపింది. ఆయా శాఖల నుంచి వివరాలు అందగానే జీతాల పెంపు ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు తెలిపారు. సర్కారుపై మరింత భారం: ఏయే వర్గాలకు వేతనాలు పెంచితే ఎంత మేర భారం పడుతుందన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు లెక్కలు వేశాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు ద్వారా ఖజానాపై రూ.35 కోట్ల మేర భారం పడనుంది. హోంగార్డులకు పెంపు వల్ల రూ.130 కోట్లకు పైగా, వీఆర్ఏలకు రూ.83 కోట్లు, అంగన్వాడీ వర్కర్లకు రూ.135 కోట్లు, అసిస్టెంట్లకు పెంపుతో రూ.85 కోట్ల మేర అదనపు భారం పడనుంది. వీరితోపాటు సెర్ప్ సిబ్బంది, ఆశావర్కర్ల గౌరవ వేతనాలు కలిపితే.. ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.550 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేశారు. ఆ కేటగిరీల్లోకి రాని తాత్కాలిక ఉద్యోగులకూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 1, 2, 3 కేటగిరీల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైనా.. ఈ మూడు కేటగిరీల్లోకి రాకుండా నిర్ధారిత వేతనం మీద పనిచేస్తున్న సిబ్బందిని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజాగా వారికి కూడా పెంపు అమలవుతుందని, అయితే 2020 రివైజ్డ్ పేస్కేల్ నిబంధనల ప్రకారం ఈ పెంపు ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కేటగిరీలకు పెంచుతూ ఉత్తర్వులు దినసరి వేతనంపై పనిచేస్తున్నవారు, కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్లు, పార్ట్‌టైమ్ వర్కర్లకు వేతనాలు 30 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు జీవో నం.64ను విడుదల చేశారు. జూన్ నుంచే పెంపు అమల్లోకి వస్తుందని, జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని తెలిపారు. గౌరవ వేతనం పెరిగే కేటగిరీలు, లబ్ధిదారుల సంఖ్య కేటగిరీ సంఖ్య హోంగార్డులు 17,850 అంగన్వాడీ వర్కర్లు 35,700 అంగన్వాడీ హెల్పర్లు 31,711 వీఆర్ఏలు 20,292 ఆశా వర్కర్లు 26,341 సెర్ప్ 4,200 జెడ్పీటీసీలు 538 ఎంపీటీసీలు 5,817 సర్పంచ్‌లు 12,759 -
వారంలోగా సర్పంచ్‌లకు చెక్ పవర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్‌లుగా గెలిచిన వారందరికీ చెక్ పవర్‌ను బదలాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్ల వివరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)లో నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుందని.. వారంలోగా సర్పంచ్‌లందరికీ చెక్ పవర్ కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. సీఎఫ్ఎంఎస్లో వివరాల నమోదుకు ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్ల గెలుపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్ సిగ్నేచర్‌ను అన్ని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ వివరాల నమోదు పూర్తయ్యాక జిల్లా ట్రెజరీ అధికారులు ఆమోదముద్ర వేయాలి. కాగా, గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా 2018 ఆగస్టు నుంచి ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన విషయం తెలిసిందే. ఏ గ్రామ పంచాయతీకి ఏ అధికారి ప్రత్యేకాధికారిగా కొనసాగారో వారికే చెక్ పవర్ అధికారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్ 3న పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్ పవర్‌ను బదలాయించే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ వేగవంతం చేసింది. -
ఓటర్ల దీవెన.. సర్పంచ్‌లుగా ముగ్గురు వలంటీర్లు
మునగపాక/బుచ్చెయ్యపేట/కశింకోట (విశాఖ జిల్లా) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వారి మనసులు గెలుచుకున్న గ్రామ వలంటీర్లు చివరికి ఆ గ్రామాల పాలనా పగ్గాలే చేపట్టారు. వారు చేస్తున్న కృషికి మెచ్చిన ఆయా గ్రామాల ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ విధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు వలంటీర్లు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చెయ్యపేట మండలం మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి పోటీచేసి గెలుపొందారు. వలంటీర్లుగా ప్రజాభిమానం పొందడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని వారంటున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం) 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు! -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వీరికి లక్కుంది..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వీరికి లక్కుంది.. వారికి అదే దక్కింది.. అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. గెలిచిన అభ్యర్థులు తమ అదృష్టమంటూ ఆనందపడుతుంటే ఓడిన అభ్యర్థులు తమ ఖర్మంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనేక గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు పిలిపించి ఓట్లు వేయించినప్పటికీ ఉత్కంఠ పోరులో సింగిల్ డిజిట్ తేడాతో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ మెజారిటీతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ►చీమకుర్తి మండలం నిప్పట్లపాడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు నీదా నాదా అన్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపు ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఇరువురు అభ్యర్థుల ఆమోదంతో టాస్ వేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన రావులపల్లి కోటేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ►ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో బరిలో ఉన్న చెన్నుపాటి రాజ్యలక్ష్మి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ►పర్చూరు మండలం తూర్పుపెద్దివారిపాలెం పంచాయతీలో సైతం చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన రావి సంధ్యారాణి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ►ఒంగోలు మండలంలోని యర్రజర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న తమ్మిశెట్టి రాములమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరి 5 వార్డులు సమానంగా గెలుపొందడం విశేషం. ►చీమకుర్తి మండలం జీఎల్ పురం గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న మన్నం వెంకటరావు చివరకు 4 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ►ఇంకొల్లు మండలం, సూదివారిపాలెం గ్రామంలో సైతం ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈ పోటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన గోరంట్ల జయలక్ష్మి 4 ఓట్ల స్వల్ప తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ►ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీలో నిలిచిన కాట్రగడ్డ కవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయంఢంకా మోగించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మొట్టమొదటి సారి వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. ►ఒంగోలు మండలంలో టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న దేవరంపాడులో సైతం పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 9 ఓట్ల లోపు మెజారిటీలతో గెలుపొంది అదృష్టవంతులు అనిపించుకోగా, వీరిపై పోటీ చేసి ఓడిపోయిన 9 మందికి దురదృష్టవశాత్తు ఓటమే దక్కిందని అంతా సానుభూతి చూపుతున్నారు. ఇంకొంచెం కష్టపడి ఒక్క ఓటు తెచ్చుకున్నా గెలిచేవాళ్లమంటూ వీరిలో కొందరు తమ దురదృష్టానికి తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికి తొలిదశ ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతో గెలుపొందిన సర్పంచ్‌లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. -
కదం తొక్కిన పాలమూరు సర్పంచ్‌లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా సర్పంచ్‌లు నిరసనబాట పట్టారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు, రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఉపాధిహామీ పథకం పనుల బిల్లులు, జనాభా ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు, గ్రామ పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ తదితర డిమాండ్లు ఆమోదించాలని నినదించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని వైట్‌హౌస్‌లో అధికారులు ఏర్పాటు చేసిన సర్పంచ్ల అవగాహనాసదస్సును బహిష్కరించారు. ఉదయం జిల్లా నలుమూలల నుంచి భారీర్యాలీలుగా వైట్‌హౌస్‌కు చేరుకున్న సర్పంచ్‌లు లోపలికి వెళ్లకుండా అరగంటపాటు బయట ఆందోళనకు దిగారు. అప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సభాప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బయటికి వచ్చి సర్పంచ్‌లను సముదాయించే ప్రయత్నం చేశారు. సర్పంచ్‌లు చివరికి లోపలికి వచ్చి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల తీరుపై మంత్రులు దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు నా మాట వినకపోతే వెళ్లిపోతా. పరిస్థితి ఇలా ఉంటుం దనుకుంటే అధికారులతోనే సమీక్ష పెట్టుకునేవాళ్లం. పాలమూరు నుంచే సదస్సులు ప్రారంభించాలనుకున్నాం. మీరిలా చేయడం నన్ను బాధించింది’అని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ నడుమ సర్పంచ్ల సదస్సు పూర్తయింది. ఇప్పటికిప్పుడే మార్పు అసాధ్యం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు ఇప్పటికిప్పుడే అసాధ్యమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘మీ గౌరవవేతనం మంజూరుకు ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి. కొంతమంది ఉపసర్పంచ్లు సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో చర్చించి నేరుగా అవి మీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఉపసర్పంచులు వారంరోజుల్లో సంతకం చేయకుంటే వారి చెక్‌పవర్‌ను రద్దు చేసి ఆ అధికారం మీకు నమ్మకస్తుడైన వార్డ్‌మెంబర్‌కు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. అందుకూ ఓ పద్ధతి ఉంది. మీరు ముందుగా అధికారులకు పిటిషన్ ఇవ్వాలి. ఒకవేళ అధికారులూ స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. సర్పంచ్‌లను సముదాయిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
ఉప సర్పంచ్‌లకు నిరాశే..
సాక్షి, భూపాలపల్లి: నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చే వరకు కార్యదర్శి, సర్పంచ్‌కు ఉమ్మడి చెక్ పవర్ కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు దాటినా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చెక్‌పవర్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. నిధులు ఉన్నా ఖర్చుపెట్టలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికైతే పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను కల్పించనుంది. అయితే ఇన్నాళ్లుగా చెక్‌పవర్‌పై ఆశలు పెట్టుకున్న ఉపసర్పంచ్లు నిరాశలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రాకున్నా ఉపసర్పంచ్ పదవి కొసం కొంత మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. తాత్కాలికమేనా.. జీపీల్లో చెక్ పవర్ సర్పంచ్, కార్యదర్శులకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది తాత్కాలికమా, లేక ఇలాగే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని 415 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లకు పవర్ లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఉమ్మడి చెక్‌పవర్‌పై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలికంగా చెక్‌పవర్ ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గ్రామాల్లో నిలిచిన బకాయిలు, బిల్లులు చెల్లించేందుకు మాత్రమే తాత్కాలికంగా సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఉపసర్పంచ్లు అనుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని చాలా మంది డీపీఓలు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికే ఉమ్మడి చెక్ పవర్ ఉంటే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. నిరాశలోనే.. ఇన్నాళ్లు చెక్ పవర్‌తో పవర్ వస్తుందనుకున్న ఉపసర్పంచ్‌లకు నిరాశే ఎదురుకానుంది. రెండు జిల్లాల్లో ఉన్న 415 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు కూడా అదే స్థాయిలో తీసుకున్నారు. చెక్‌పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉంటుందని ఈసారి చాలా మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కొన్ని చోట్ల సర్పంచ్ల కంటే ఉపసర్పంచ్ పదవి కోసం ఎక్కువ ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. కొంత మంది రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రస్తుతం చెక్‌పవర్ పై స్పష్టత లేకపోవడం ఉపసర్పంచ్లు ఆందోళనలో ఉన్నారు. సమర్థ నిర్వహణకే.. ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించే ఆంశంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయితీరాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌కు సమష్టిగా చెక్ పవర్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన పంచాయితీరాజ్ చట్టానికి గతేడాది ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయం అములు విషయంలో సర్కారు ఆచితూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అధికారాలు ఇరువురు ప్రజాప్రతినిధులకు కట్టబెట్టడం వల్ల విధుల దుర్వినియోగం జరుగుతుందని, రికార్డుల నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోందని పంచాయితీరాజ్ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా లావాదేవీల్లో అధికారులను బాధ్యులను చేయడం కూడా కుదరదని తేల్చింది. మరోవైపు పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషించే కార్యదర్శుల కస్టడీలో రికార్డులు ఉంటాయని, ఈ తరుణంలో నిధుల వినియోగంలో వారికి బాధ్యతలు అప్పగిస్తే నియంత్రణ కష్టమని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. చెక్‌పవర్‌ను వారికి కల్పించి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామనే నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. ఈ వాదనతో ఏకీభవించిన పంచాయితీరాజ్ శాఖ, గతంలో ఉన్న మాదిరే సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ కల్పించే దిశగా ఆలోచన చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎటువంటి సమాచారం రాలేదు – చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయంట్ చెక్ పవర్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. -
రిజర్వేషన్లపై మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : రిజర్వేషన్లపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే అని రిజర్వేషన్లను కించపరిచే విధంగా మాట్లాడారు. గడువు ముగిసిన సర్పంచ్‌లతో బుధవారం విశాఖపట్నంలో ఆయన సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో రిజర్వేషన్ల అమలు మామూలు విషయమే అని అన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడడం టీడీపీ ప్రభుత్వానికి ఇదేం తొలిసారి కాదు. గతంలో సీఎం చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నేటితో గ్రామపంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రధాని సదస్సుకు నలుగురు మహిళా సర్పంచులు
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న సదస్సుకు జిల్లాకు చెందిన నలుగురు సర్పంచులు పాల్గొంటున్నారు. తమ గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో వీరు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న సదస్సుకు ఎంపికయ్యారు. జిల్లాలో మొత్తం 83 గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఐదుగురు సర్పంచులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు హాజరయ్యేందుకు అవకాశం కలిగింది. అయితే ఒకరు వ్యక్తిగత కారణాలతో హాజరయ్యేందుకు విముఖత చూపగా, నలుగురు సర్పంచులను అధికారికంగా గుజరాత్‌కు పంపుతున్నారు. గాంధీనగర్‌కు వెళ్తున్నది వీరే నందికొట్కూరు మండలం బొల్లవరం, బిజినెవేముల గ్రామాల సర్పంచులు అనురాధ, తెలుగు లక్ష్మమ్మ, మద్దికెర మండలం ఎడవలి గ్రామ సర్పంచు నెట్టెకంఠమ్మ, దేవనకొండ మండలం నల్లచెలిమిల గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో జరుగుతున్న సదస్సుకు బయలుదేరుతున్నారు. వీరిని విజయవాడకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఏసీ రైల్లో గాంధీనగర్‌కు పంపుతున్నారు. ఆ సదస్సులో వీరు ప్రధాని చేతుల మీదుగా సన్మానం, ప్రశంసాపత్రాలను అందుకోనున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని జిల్లాలోని 50 మంది మహిళా సర్పంచులు వినే విధంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మహిళా సర్పంచులకు సమాచారాన్ని చేరవేశారు. వీరందరిని ఒకచోటికి చేర్చి ప్రధాని ప్రసంగాన్ని వినిపించనున్నారు. -
సర్పంచులతోనే పంచాయతీల అభివృద్ధి
అనంతపురం సిటీ : పంచాయతీల అభివృద్ధిపై జరుగుతున్న రెండో విడత అవగాహన సదస్సు బుధవారం ముగిసింది. ఇంకా పలు గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని డీసీఆర్పీ ప్రిన్సిపల్ రామచంద్ర తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సర్పంచులను ఉద్దేశించి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనులకు పాటు పడాలన్నారు. శిక్షణా తరగతుల్లో అధికారులు చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకుని మీ గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు మార్గాలు అన్వేషించాలన్నారు. సీజనల్ వ్యాధులు మీ గ్రామ పంచాయతీల్లోకి రాకుండా నియంత్రణా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా గ్రామల్లో ఆదర్శ సర్పంచులుగా గుర్తింపు బడతారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్పీ బృందం సభ్యులు, పలు గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు. -
జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లకు సన్మానం రాజమహేంద్రవరం సిటీ : గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే జిల్లా ఆదర్శంగా తయారవుతుందని, గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు సమష్టిగా కృషి చేయాలని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. రెండేళ్ల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం పూర్తకావడంతో రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఆదివారం ‘ ఒక అడుగు స్వచ్ఛత వైపు’ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని బహిరంగ మలమూత విసర్జన రహిత గ్రామాల సర్పంచ్‌లను సన్మానించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛత వైపు అడుగులు చినరాజప్ప మాట్లాడుతూ ప్ర«ధాన మంత్రి మోదీ పిలుపు మేరకు స్వచ్ఛగ్రామాల వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం మెరుగుకు సహకరించాలన్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ మలమూత్ర విసర్జన గ్రామాల్లో దుళ్ల గ్రామ సర్పంచ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలోని 1069 పంచాయతీల్లో కేవలం 139 మాత్రమే మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా గుర్తించబడ్డాయన్నారు. వచ్చే ఏడాది 250 గ్రామాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 139 గ్రామాల సర్పంచ్‌లను ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పులవర్తి నారాయణరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ కే.పద్మ, డ్వామా పీడీ ఏ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. సెంట్రల్ జైలులో రూ.ఆరుకోట్లతో ఆసుపత్రి రాజమహేంద్రవరం క్రైం : ఖైదీలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు రూ.ఆరుకోట్లతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో హాస్పటల్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. సెంట్రల్ జైల్లో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవం, గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, మంజూరైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఎంపీ మాగంటి మురళీ మోహన్, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్, డిఫ్యూటీ సూపరింటెండెంట్ ర ఘు, ఎస్.రాజారావు, సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్ పాల్గొన్నారు. -
‘సర్పంచులది ఆత్మగౌరవ పోరాటం’
హైదరాబాద్: సర్పంచులది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్, ఆర్.కృష్ణయ్యలు అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ర్ట పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రభాకర్, కృష్ణయ్యలు మాట్లాడుతూ సర్పంచులకు కనీస గౌరవ వేతనం రూ. 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలని, ఆదాయంలో 42 శాతం పంచాయతీలకు కేటాయించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జాయింట్ చెక్‌పవ ర్ను తీసివేసి, నిధుల వినియోగంలో సర్పంచులకు స్వేచ్చ కల్పించాలని వారు కోరారు. -
ఎన్నికై ఏం లాభం?
యాచారం, న్యూస్‌లైన్: బాధ్యతలు చేపట్టిన సంతోషం సర్పంచ్‌లకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని ఉత్సాహంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైతే... పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఎన్నికై నెలరోజులు దాటినా పంచాయతీ రికార్డులు అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకూ జాయింట్ చెక్‌పవర్ కల్పించింది. దీంతో కార్యదర్శులు తమను చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ఇవ్వడంలో కార్యదర్శులు జాప్యం చేస్తున్నారని, మరీ పట్టుబడితే అవసరమైన సమాచారం ఇస్తామని చెబుతున్నారని సర్పంచ్‌లు అంటున్నారు. పంచాయతీల వ్యయం, ఆదాయం, మిగులు నిధుల గురించి తెలియక.. ఏ పనీ చేపట్టలేక ఉత్సవ విగ్రహాల్లా మారాల్సి వస్తోందని వాపోతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల సర్పంచ్‌లు ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. వీరికి బాధ్యతలు, అధికారాలు, హక్కుల గురించి తెలియజేసిన అధికారులు... రికార్డులు అందజేయించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించారు. నిధులు ఎన్ని ఉన్నాయో తెలియక, ఉన్నా జాయింట్ చెక్‌పవర్‌తో వాటిని డ్రా చేసుకునే సొంత అధికారం లేక సర్పంచ్‌లు గింజుకుంటున్నారు. గ్రామాల్లో జోరుగా జరుగుతున్న బోనాల ఉత్సవాల కోసం పలువురు సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్మికులకు జీతాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు కూడా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా మండలంలోని 20 గ్రామాల్లో సర్పంచ్‌లు రూ.20 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తాం.... రికార్డులు అప్పజెప్పడం లేదని సర్పంచ్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే... పంచాయతీ కార్యదర్శులు మాత్రం పాలనా వ్యవహారాలు చూసేది తామేనని, పైగా జాయింట్ చెక్‌పవర్ కూడా ఉందనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పంచాయతీ వ్యవహారాలకు సంబంధించి ఖర్చుల వివరాలను ఆడిట్ చేయించలేదని, రికార్డులను ఇస్తే తమకు ఇబ్బందులవుతాయని... ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు తిప్పుకుంటున్నారని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు తీసుకొని నెలరోజులు దాటినా రికార్డులు ఇవ్వకపోవడమంటే మమ్మల్ని అవమానపర్చడమే. నాకు రికార్డులు కాదు కదా కనీసం కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు. పంచాయతీలో ఎన్ని నిధులున్నాయో తెలియడం లేదు. సొంత ఖర్చులతో వీధి లైట్లు బిగిస్తున్నా. - రామానుజమ్మ, సర్పంచ్. తమ్మలోనిగూడ రికార్డులు వెంటనే అందజేసేలా చూస్తా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీల రికార్డులు సర్పంచ్‌లకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటా. సర్పంచ్ల ఆదేశాల మేరకే కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది. వెంటనే బదిలీపై వెళ్లిన కార్యదర్శులను పిలిపించి మాట్లాడుతా. రికార్డులను సర్పంచ్‌లకు అందజేయాలని ఆదేశిస్తా. - శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం -
వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించండి
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం, అభినందన సభలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, నల్లాని సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీజిసి సభ్యుడు చందా లింగయ్య, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనేక సూచనలు చేశారు. పార్టీ గుర్తు లేకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం, అభివృద్ది జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీల్లో ఉన్న నిధులు మేరకు మంచి స్వపరిపాలన అందించాలని కోరారు. ఈసందర్భంగా గెలుపొందిన సర్పంచ్‌లను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించండి
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం, అభినందన సభలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, నల్లాని సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీజిసి సభ్యుడు చందా లింగయ్య, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనేక సూచనలు చేశారు. పార్టీ గుర్తు లేకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం, అభివృద్ది జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీల్లో ఉన్న నిధులు మేరకు మంచి స్వపరిపాలన అందించాలని కోరారు. ఈసందర్భంగా గెలుపొందిన సర్పంచ్‌లను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.