సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారంతో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసిందని ఆయన తెలిపారు. అయితే, స్పెషల్ ఆఫీసర్లతో పంచాయతీల్లో పాలన కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని మండిపడ్డారు.
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామసభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సర్పంచులే లేకపోతే గ్రామసభలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
సర్పంచుల ఎన్నికలను నిర్వహించకపోవడం వెనక.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కనపెట్టే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దొడ్డిదారిన దారిమళ్లించిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
నేను ఎక్కడ పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది
తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని, ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ అంశాలపై చర్చించి 3న వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎంపీ అభ్యర్థుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడంలేదన్నారు.
బీజేపీలో చేరిక..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో వివిధ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు బీజేపీలో చేరారు. హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఎండీ సుధాకర్, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపార వేత్త వినోద్‌రావు, కామారెడ్డి జిల్లాకు చెందిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డిలకు కిషన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలన చూసి తెలంగాణలోని మేధావులు, వివిధ రంగాలకు చెందిన వారు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment