సాక్షి, హైదరాబాద్: త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో గ్రేటర్ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులిచి్చనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు.
పదవి ఖాయమే.. కానీ..
నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజపేయీ, మోదీ హయాంల్లోనూ మంత్రి పదవులు లభించాయి. కేంద్ర సహాయమంత్రి, కేబినెట్ మంత్రి పదవుల్ని ఆయన నిర్వర్తించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి రెండో పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి సైతం గత మోదీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధిశాఖ, కారి్మకశాఖల మంత్రిగానూ పనిచేశారు. కిషన్‌రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారీ రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని ఆ పదవి వరించనుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
ఓసీకైతే కిషన్‌రెడ్డి.. బీసీకైతే ఈటల..
కిషన్‌రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కలి్పస్తారని భావిస్తున్న వారితోపాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌కు అవకాశం లభించవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. టీఆర్‌ఎస్ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర వహించడం, అన్నివర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. వివిధ సమీకరణాలు, రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే.. నగరం నుంచి ఓసీకి ఇవ్వాలనుకుంటే కిషన్‌రెడ్డికి, బీసీకి ఇవ్వాలనుకుంటే రాజేందర్‌కు మంత్రి పదవి లభించగలదని భావిసున్నవారు ఉన్నారు.
క్యూలో ‘కొండా’ సైతం..
కాగా.. చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈటల రాజేందర్‌కు మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి పదవి ఎవరిని వరించనుందన్నది తేలాలంటే ప్రకటించేంతవరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment