బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈసీ నోటీసులు
వివిధ పార్టీల అధ్యక్షులకు మొత్తం 13 నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, రోడ్‌షోల్లో చేసిన ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే, ప్రధాని మోదీకి బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గడువు పొడిగించాలని బీజేపీ కోరగా, ఈసీ మరింత సమయం ఇచ్చిది.
మోదీ ఏమన్నారంటే..: నారాయణపేట, ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా, చిన్నపిల్లలతో ప్లకార్డులు ప్రదర్శింపజేశారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, ఆ పార్టీ భారత దేశ ఎన్నికల్లో గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ‘సాక్షి’కి తెలిపారు.
కాగా, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన, విద్వేషకర ప్రసంగాల విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వివరణ కోరుతూ మొత్తం 13 నోటీసులను జారీచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలైతే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నోటీసులు జారీచేయగా, ప్రాంతీయ పార్టీలైతే వాటి అధ్యక్షులకు నేరుగా నోటీసులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment