తాజా లోక్‌సభ ఎన్నికల్లో నిజమైన బీజేపీ సెంటిమెంట్ తెలంగాణలోని సికింద్రాబాద్, కరీంనగర్,ఏపీలో నరసాపురంలో గెలిచిన ఎంపీలకు మంత్రి పదవులు
ఈసారి మోదీ కేబినెట్‌లో కిషన్‌రెడ్డికి మళ్లీ చోటు
ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకున్న బండి సంజయ్, శ్రీనివాస వర్మకు అవకాశం
గతంలోనూ ఈ స్థానాల్లో గెలిచి మంత్రులైన దత్తాత్రేయ, విద్యాసాగరరావు, కృష్ణంరాజు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ నిజమైంది. గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, నరసాపురం నుంచి గెలిచిన రెబెల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు గతంలో వాజ్‌పేయి కేబినెట్‌లో సహాయమంత్రులుగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్‌గా నియమితులయ్యారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి.కిషన్‌రెడ్డి తొలుత మోదీ కేబినెట్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే గెలిచి తిరిగి మోదీ కేబినెట్‌లో ఈ దఫా బొగ్గు, గనులశాఖ మంత్రి అయ్యారు. ఇక గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగరరావు వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇప్పుడు కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తాజాగా మోదీ మంత్రివర్గంలో అదే పదవిని పొందారు. ఉమ్మడి ఏపీలోని నరసాపురం నుంచి గెలిచిన సినీ హీరో కృష్ణంరాజుకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కగా, 2024 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచిన శ్రీనివాసవర్మకు మోదీ కేబినెట్‌లో గ్రామీణ సహాయమంత్రి శాఖ లభించింది.
ఎప్పుడూ అవే స్థానాలకు పదవులా?
గతంలో మాదిరిగానే సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారైనా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్‌లో చాన్స్ లభిస్తుందేమోననే ఆశాభావం వ్యక్తమైంది. కానీ మళ్లీ సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment