
తెలంగాణ బాధ్యతల నుంచి దీపాదాస్ మున్షీ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మారుస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీని తప్పించి, ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజుకు జార్ఖండ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వీరితోపాటే మరో ఏడుగురు సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసమే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన కొద్దిరోజులకే ఇన్ చార్జ్‌గా ఉన్న మాణిక్‌రావ్ థాక్రేను గోవాకు పంపిన ఏఐసీసీ, కేరళ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అదనంగా కట్టబెట్టింది. అప్పటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే పారీ్టనేతలకు ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తట్టిలేపింది. ఆమె సారథ్యంలో సీఎల్పీ భేటీ నిర్వహించి సరిదిద్దే ప్రయత్నం చేసినా,.. ఈ అంశం ఏఐసీసీకి చేరింది. ఆమెస్థానంలో పూర్తిస్థాయి నేతకు బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించారు.
రాహుల్ టీమ్ నుంచే..
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 1999లో ఎన్‌ఎస్‌యూఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2002–2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమెను, 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్‌గాంధీ ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాహుల్ టీమ్‌లో ఉన్న ఆమె 2009లో మంద్‌సౌర్ నుంచి ఎంపీగా పోటీ చేసి.. 1971 నుంచి అక్కడ గెలుస్తున్న లక్ష్మీనారాయణ్ పాండేను ఓడించారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.
అయినా రాహుల్ టీమ్‌లో కొనసాగిన ఆమె భారత్ జోడోయాత్ర, న్యాయ్‌యాత్రలో క్రియాశీల పాత్ర పోషించారు. 2023 ఆగస్టు 6న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమెను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించారు. భూదా న్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తాజాగా ఆమెకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అంశంపై చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఢిల్లీ వచ్చారనే ప్రచారం జరిగింది. ఆయన ఢిల్లీ చేరే సమయానికే ఏఐసీసీ నుంచి కొత్త ఇన్‌చార్జ్‌పై ప్రకటన వెలువడింది.

జార్ఖండ్‌కు కొప్పుల రాజు
రాహుల్ టీమ్‌కే చెందిన కొప్పుల రాజును జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఏఐసీసీ నియమించింది. 15 ఏళ్లుగా పార్టీ మేనిఫెస్టో, విధాన రూపకల్పన, పార్టీపరంగా కేంద్రంపై లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయనకు జార్ఖండ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆయన ఓడిపోయారు.