![Meta Project Waterworth to Connect India with World Longest Undersea Cable](/styles/webp/s3/article_images/2025/02/16/META233.jpg.webp?itok=yx7Z7y5T)
సముద్ర కేబుల్స్ ద్వారా యావత్ ప్రపంచం అనుసంధానం
50,000 కిలోమీటర్ల మేర కేబుల్ లైన్స్
డిజిటల్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యం
అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా(Meta) నడుం బిగించింది. ప్రపంచంలోనే అతిపొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్‌వర్త్’(Waterworth)కు శ్రీకారం చుట్టింది. ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కి.మీ. దూరం సముద్రగర్భంలో కేబుల్స్ వేయనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనుంది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా సాహసోపేత కార్యక్రమానికి నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్‌వర్త్’కు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనున్నట్టు మెటా శనివారం ప్రకటించింది. కంపెనీకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను ఈ సందర్భంగా అభివర్ణించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ ప్రపంచ డిజిటల్ హబ్‌గా అవతరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత మొత్తం వ్యయం కానుందనేది కంపెనీ వెల్లడించలేదు.
భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ
ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌లో భాగంగా ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో కేబుల్స్ వేస్తారు. ఇది భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ. సముద్రంలో 7,000 మీటర్ల లోతు వరకు ఈ కేబుల్స్ వేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 13న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేర్చారు. నమ్మకమైన సంస్థల సహకారంతో హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్స్ నిర్వహణ, మరమ్మతు, రుణం సమకూర్చాలని భారత్ భావిస్తోంది.
అధునాతన సాంకేతికతతో..
‘మెటా తన అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది. భారత్, అమెరికా ఇతర ప్రదేశాలను అనుసంధానించడానికి ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం, సాంకేతికంగా అధునాతనమైన సముద్ర కేబుల్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది’అని మెటా ప్రతినిధి శనివారం తెలిపారు. ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్రగర్భ కేబుల్స్ ముఖ్యమైనవి. ఈ కేబుల్స్ వివిధ దేశాలను అనుసంధానిస్తాయి. స్థానిక టెలికం కంపెనీలు తమ వినియోగదారులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి సముద్రగర్భ కేబుల్స్‌తో కనెక్ట్ అవుతాయి. ‘భారత్‌లో డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ పెట్టుబడి ఆర్థిక వృద్ధి, స్థిర మౌలిక సదుపాయాలు, అందరికీ డిజిటల్ సేవలు అందాలన్న మెటా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’అని మెటా ప్రతినిధి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment