మనసు మాట మెటాకు తెలుసు! | Meta is bringing AI edited video ads to Facebook and Instagram | Sakshi

మనసు మాట మెటాకు తెలుసు!

Published Mon, Apr 14 2025 1:56 AM | Last Updated on Mon, Apr 14 2025 1:56 AM

Meta is bringing AI edited video ads to Facebook and Instagram

ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ‘ప్రకటన’ల విప్లవం తెస్తున్న మెటా

ఆండ్రోమెడా అనే  ఏఐ టెక్నాలజీతో మీ మనసు చదివే ప్రయత్నం

మీ అభిరుచిని ముందే ఎరిగి యాడ్స్‌ ప్రమోట్‌

దీని వల్ల పర్సనల్‌ యాడ్స్‌తో 14% లాభాల పెరుగుదల

రిటైల్‌ స్టోర్స్‌లోనూ 12% పెరిగిన అమ్మకాలు

మీ గురించి ఎవరికి బాగా తెలుసు అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? అమ్మకో, నాన్నకో, జీవిత భాగస్వామికో, ఆప్త మిత్రుడికో అని చెబితే.. అది కచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే.. ఇప్పుడు మీ గురించి అందరికన్నా మీరు వాడే ఫోన్‌కు లేదంటే ల్యాప్‌టాప్‌కే బాగా తెలుసు. మీరు కాదన్నా అదే నిజం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా మీకు ఇష్టమైన రంగు.. ఇష్టమైన చిరుతిళ్లు.. ఇష్టమైన బట్టలు.. ఇలా అన్నింటిని గురించి ముందే తెలుసుకుంటున్నాయి సోషల్‌మీడియా సంస్థలు. ఇది గతంలోనూ ఉన్నప్పటికీ ఏఐ వచ్చాక వాణిజ్య ప్రకటనల స్వరూపమే మారిపోతోంది. ఈ రంగంలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ‘ఆండ్రోమెడా’ఇప్పుడు సరికొత్త సంచలనం.

అంతా మార్చేసిన ఏఐ
ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే మీకు కావాల్సిన ప్రొడక్టులే ముందుగా కనిపిస్తున్నాయా? ఇన్‌స్ట్రాగామ్‌లో స్క్రోల్‌ చేస్తుంటే.. మీకు నచ్చే డ్రెస్‌ యాడ్‌ టెంప్ట్‌ చేస్తుందా? ఇదేమీ యాదృచ్ఛికం కాదు. మీకు ఎలాంటి ప్రకటనలు చూపించాలో ముందే మెటా సంస్థ నిర్ణయిస్తోంది. మన ‘సోషల్‌’లైఫ్‌లో యాడ్స్‌ తీరును పూర్తిగా మార్చేస్తోంది. మనల్ని ఏఐ పూర్తిగా చదివేస్తోంది. దీంతో మనకు నచ్చే ఉత్పత్తులే మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి.

మెటా అభివృద్ధి చేసిన ఆండ్రోమెడా అనే కొత్త ఏఐ టెక్నాలజీనే ఇందుకు కారణం. ఈ సిస్టమ్‌ రోజుకు కోట్ల యాడ్స్‌ను విశ్లేషిస్తుంది. యూజర్‌కు ఏ ప్రకటన చూపించాలో నిర్ణయిస్తుంది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. గతంలోనూ మనం ఫోన్‌ ద్వారా నెట్‌లో ఏదైనా వెదికితే.. దానికి సంబంధించిన అంశాలు మన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై వరుసగా వచ్చేవి. ఇప్పుడు ఆ విధానం మరింత కొత్తరూపు సంతరించుకుంది.

ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి యాడ్స్‌
కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రమోట్‌ చేయడం చూస్తున్నాం. వీడియో మొత్తం చూశాక.. వీడియోల డిస్‌క్రిప్షన్‌లోని లింకులను ఓపెన్‌చేసి నచ్చితే ఆర్డర్‌ పెట్టేస్తున్నాం. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ఓ ప్రొడక్ట్‌ గురించి చెప్తే.. వెంటనే దానికి సంబంధించిన యాడ్‌ మీకు కనిపిస్తుంది. పాపులర్‌ క్రియేటర్లతో కలసి బ్రాండ్లు తమ ఉత్పత్తులను కొత్తగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఇదో చక్కని అవకాశమని కంపెనీలు చెబుతున్నాయి.

ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీడియోను చూస్తూనే.. కింద కనిపించే సంబంధిత పాపప్స్‌ను సెలక్ట్‌ చేసుకుని ఆర్డర్‌ పెట్టేయొచ్చన్నమాట. ఒకే ప్రకటనలో యూజర్‌కు నచ్చే మరొక ఉత్పత్తిని కూడా చూపించే అవకాశం ఇవ్వనుంది మెటా. అంటే.. ఒక కంపెనీ సమ్మర్‌ స్పెషల్‌ కలెక్షన్స్‌ను చూపిస్తూనే.. వచ్చే వర్షాకాలం సీజన్‌కు సరిపడే జాకెట్లను కూడా ప్రమోట్‌ చేస్తుంది. ఇలా యాడ్స్‌ ప్రదర్శించినప్పుడు విక్రయాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని మెటా చెబుతోంది.

మీరే మోడల్‌
ఆన్‌లైన్‌లో డ్రెస్సులు కొనడం మామూలే. కానీ, మీరే మోడల్‌గా మారి ఆయా డ్రస్సులను ధరించి చూస­ుకుని కొనుగోలు చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్‌. ఏఐ ఆధారంగా వర్చువల్‌ మోడల్స్‌ను చూపించే ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది. యూజర్‌ శరీరాకృతికి తగిన డ్రెస్సులను ఎలా ధరించాలో చూపించే ప్రయత్నమిది. ఈ విధానం ఇప్పటికే ఆస్ట్రేలియా, తైవాన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉంది. అంతా బాగానే ఉందిగానీ.. నాకు ఆఫ్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం ఇష్టం అంటారా? అలాంటి వారి కోసం చుట్టు పక్కల మాల్స్‌లోని షాపింగ్‌ అనుభ­వాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది మెటా.

అందుకు తగిన యాడ్స్‌ను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. అవే ‘ఓమ్నీ చానల్‌’యాడ్స్‌. మీరు ఆన్‌లైన్‌లో చూసిన వస్తువు.. మీ సమీపంలోని షాపుల్లో ఉందా? ఎంత ధర? ఎక్కడ కొనాలి? ఇలా అన్నీ చూపించే విధంగా ప్రాంతీయ యాడ్స్‌ వస్తున్నాయి. దుకాణాల లొకేషన్, డిస్కౌంట్‌ కోడ్స్‌ వంటి వివరాలను ఆ యాడ్స్‌లో కనిపిస్తాయి. ఈ యాడ్స్‌ వాడిన బ్రాండ్లకు 12 శాతం విక్రయాలు పెరిగినట్లు మెటా తెలిపింది.

నోటిఫికేషన్‌లోనూ యాడ్స్‌  
ఇదో సరికొత్త ప్రయోగం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాను ఓపెన్‌ చేయగానే నోటిఫికేషన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటివరకు ఏ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లేదంటే కామెంట్స్, లైక్‌లు కనిపిస్తున్నాయి. ఇకపై ఆ నోటిఫికేషన్స్‌లో యాడ్స్‌ కూడా ఉండొచ్చు. ఆ యాడ్స్‌ గతంలో మీరు వెతికిన ఉత్పత్తులవే అయి ఉంటాయి. మీరు మళ్లీమళ్లీ వెతికే పని లేకుండా మీ నోటిఫికేషన్‌కు తీసుకొచ్చేస్తోంది మెటా.

కొన్ని డిస్కౌంట్‌ యాడ్స్‌ను కొత్తగా మార్చేస్తోంది. ‘డిస్కౌంట్‌ పొందాలంటే మీ ఈమెయిల్‌ ఇవ్వండి’అని నేరుగా అడుగుతుంది. మీరు మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చి డిస్కౌంట్‌ ఆఫర్‌ పొందొచ్చు. దీంతో బ్రాండ్లు తమ కస్టమర్ల లిస్టును పెంచుకోగలుగుతాయి. ఈ మార్పుల ద్వారా మెటా వాణిజ్య ప్రకటనలకు సరికొత్త నిర్వచనం ఇస్తోంది. యాడ్స్‌ను చూడడం టైమ్‌పాస్‌ కాదు.. టైమ్‌ను సేవ్‌ చేయడం అని చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement