
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ తన ఉద్యోగుల్లో దాదాపు ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ప్రణాళికలను ప్రకటించింది. ఉద్యోగులందరికీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ పంపిన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. పనితీరు నిర్వహణపై పరిమితిని పెంచాలని, తక్కువ పనితీరు కనబరిచేవారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు జూకర్ బర్గ్ మెమోలో పేర్కొన్నారు.
‘కంపెనీ సాధారణంగా ఏడాది కాలంలో తక్కువ పనితీరు కనబరిచేవారిని ట్రాక్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. ఇప్పటికే 2024లో పనితీరు సరిగాలేని దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. ఈసారి మరో 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది భవిష్యత్తులో 10 శాతానికి చేరుతుంది’ అని మెమోలో పేర్కొన్నారు.
ప్యాకేజీ ఇస్తామని హామీ
సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఈ కోతల వల్ల దాదాపు 3,600 ఉద్యోగులు ప్రభావితం చెందుతారని అంచనా వేసింది. పనితీరు సరిగాలేని వారిని తొలగించే స్థానంలో ఈ ఏడాది చివర్లో ఆయా ఖాళీలను భర్తీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. బాధిత ఉద్యోగులకు ఉదారంగా సెవెరెన్స్ ప్యాకేజీ(లేఆఫ్స్ కారణంగా ఇచ్చే ప్యాకేజీ)లు అందిస్తామని జూకర్ బర్గ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: సులభంగా రూ.కోటి సంపాదన!
మిశ్రమ స్పందన
కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సంస్థ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై కృత్రిమ మేధ, స్మార్ట్ గ్లాసెస్, సోషల్ మీడియా వంటి కీలక విభాగాలపై దృష్టి పెట్టడానికి మెటా చురుకుగా పని చేస్తోంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటనపై ఉద్యోగులు, పరిశ్రమ పరిశీలకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కంపెనీ సమర్థతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం అవసరమని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఉద్యోగుల నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment