
స్టాక్ మార్కెట్ అంటే తీవ్ర ఒడిదొడుకులు సహజం. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ(NIFTY) సూచీలు భారీగా నష్టపోతాయి. మరో రోజు అవి అంతే వేగంతో పైకి దూసుకుపోతాయి. ఇది సహజమే. దీర్ఘకాలిక లక్ష్యాలతో మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఇలా సూచీల్లోని ఒడిదొడుకుల ప్రయోజనమే కలిగిస్తాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) చేసేవారికి ఇదో మంచి అవకాశంగా భావించాలి. మార్కెట్ ఎటు వైపు పయనిస్తున్నా మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి లాభాలు పెరిగేలా చేస్తుంది. అసలు సిప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మార్కెట్ భారీగా పెరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం మదుపు చేయడం సరికాదు. అలాగని అలా పెరుగుతూ ఎక్కడి వరకు వెళ్తుందో స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ తగ్గితే నష్టపోతామనే భయాలుంటాయి. కానీ సిప్ చేసేవారికి అలాంటి భయాలు ఉండకూడదు. ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి లాభాలు అందుకోవచ్చు. ఇదే సిప్ ఉద్దేశం. కొద్ది మొత్తంతో ప్రారంభించి, ఏటా కొంత శాతం పెంచుకుంటూ వెళ్తే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.
లక్ష్యంపై స్పష్టత
అసలు ఏ ఇన్వెస్ట్ చేసినా అది మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా ఉండాలి. ఏ సమయంలో మనకు ఆ డబ్బు అవసరమో స్పష్టత ఉండాలి. దాన్ని సాధించేందుకు ఏం చేయాలి? అనే స్పష్టమైన ప్రణాళికతోనే సిప్‌ను ప్రారంభించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు కాలక్రమంలో మారిపోవచ్చు. మరింత అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు తమ అవసరానికి సరిపడా డబ్బు అందుకోకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలపై స్పష్టమైన వైఖరి ఉండాలి. నష్టభయం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన పథకాన్ని ఎంచుకోవాలి. ఏ సమయంలో మదుపు చేస్తున్నాం అనేదానికంటే.. ఎంత కాలం కొనసాగుతున్నాం అనేది ముఖ్యం.
కోటి సులభంగానే..
మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds)లో సిప్ ద్వారా రూ.కోటిని జమ చేయడం కష్టమేమీ కాదు. కానీ, అందుకు దీర్ఘకాలం మదుపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.2,000తో సిప్ చేసిన ఫండ్ కనీసం 15 శాతం సగటు వార్షిక రాబడి వస్తుందని భావిస్తే రూ.కోటికి మించి జమ అయ్యేందుకు వ్యవధి 28 ఏళ్లు. అదే స్టెప్‌అప్(ఏటా సెప్ పెంచుకుంటూ వెళ్లే పద్ధతి) ద్వారా మరింత త్వరగానే ఈ లక్ష్యాన్ని చేరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment