
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

తెలంగాణ అధికారుల చర్యతో.. పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది వారధిపై భారీ స్థాయిలో ధాన్యం లారీలు ఆగిపోయాయి. తమను అనుమతించాలంటూ బ్రిడ్జిపై అడ్డంగా లారీలు పెట్టి ఆంధ్రా లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రతిగా తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో నాలుగు గంటలుకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం, అందుకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఈ మొత్తం పర్యవసనానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది.