ప్రకాశం బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కుల రాక
సాగర్ వద్ద ఉధృతంగా వరద ప్రవాహం
శ్రీశైలం నుంచి 4,74,205 క్యూసెక్కులు దిగువకు.. పులిచింతల నుంచి 6.75 లక్షల క్యూసెక్కుల విడుదల
విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద దిగువకు ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సాగర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం 10 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,06,242 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,063 క్యూసెక్కులు కలిపి 4,74,205 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 4,20,280 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,97,524 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 12,261 క్యూసెక్కులు కలిపి దిగువ కృష్ణాలోకి 5,09,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
లాంచీలు నిలిపివేత
ఎగువ నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నాగార్జున కొండకు వెళ్లే లాంచీలను శని, ఆదివారాలు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వరద ఉధృతి తగ్గి, గాలులు తగ్గితే లాంచీలను నడుపుతామని, పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీలను నిలిపి వేసినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.
పులిచింతలకు భారీగా వరద నీరు
ఎగువ నుంచి 6,36,945 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 6.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 24 క్రస్ట్ గేట్లు ఉండగా 21 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 5,69,744 క్యూసెక్కులను దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏడీఈ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెయిల్ పాండ్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా ఆదివారం విడుదల చేసిన 5,69,744 క్యూసెక్కుల వరద నీరే అత్యధికం. నీటిమట్టం 73.55 మీటర్లకు చేరుకోవడంతో టెయిల్ పాండ్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేత
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
తాడేపల్లి రూరల్/అమరావతి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి 11 గంటలకు 10,25,776 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మొత్తం గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.
ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎక్స్‌క్లూయిస్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో మత్స్యకారులు తమ పడవలను రేవుపై వరద నీటిలోనే భద్రపర్చుకున్నారు. దిగువ ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతి పెరగడంతో మత్స్యకారులు తమ పడవలను పుష్కరఘాట్లపైనే వదిలేశారు. మహానాడు మసీదు రోడ్డులో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఇన్‌చార్జి తహశీల్దార్ సతీష్‌కుమార్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ.. గుండిమెడ నుంచి కృష్ణా నది కరకట్టవైపు ప్రయాణించడంతో పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది.
వరద ఉధృతి పెరిగితే ప్రాతూరు, గుండిమెడ పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది లంక పొలాల్లో పశువుల కాపరులు తమ పశువులను బయటకు తీసుకువచ్చారు. మంగళగిరి మండలం రామచంద్రాపురం, దుగ్గిరాల మండల పరిధిలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు తదితర ప్రాంతాల్లో కృష్ణా నది పొంగిపొర్లడంతో కరకట్ట లోపల వున్న పంట పొలాలు మునిగిపోయాయి. పుట్టలమ్మ తల్లి ఆలయం చుట్టూ వరద నీరు చేరడంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment