కృష్ణా బోర్డు 19వ సమావేశం ఎజెండాలో తెలంగాణ డిమాండ్
చట్టం ప్రకారం సాగర్ భద్రత, నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ పరిధిలోకే వస్తుంది
ఇందులో ఏపీ జోక్యానికి, మా విధుల కబ్జాకు తావు లేదని స్పష్టీకరణ
డిసెంబర్ 3న జలసౌధలో జరగనున్న కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు.
తెలంగాణ డిమాండ్లు
‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు.
కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది.
కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది.
నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు.
2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది.
50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది.
ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ..
» కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు.
» గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి.
» ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి.
» రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు.
తెలంగాణ ఇతర డిమాండ్లు
» తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి.
» సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్‌కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి.
» ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు.
» ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి.
» రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్‌లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి.
» శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగు గంగ, హెచ్‌ఎన్‌ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు.
» శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment