Krishna Water Board
-
తెలంగాణకు 131 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 27 టీఎంసీలు..
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలు మిగిలి ఉన్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తేల్చింది. వచ్చే జూన్, జూలై నాటికి ఏర్పడే తాగు, సాగునీటి అవసరాలను వాటా జలాలతో తీర్చుకోవడంపై ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.వరలక్ష్మీ ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాశారు.ఏపీ 639.652 టీఎంసీలు వాడుకుంది..ప్రస్తుత ఏడాది సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు జరపాలని గత జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించిన విషయాన్ని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1010.134 టీఎంసీల జలా లు లభ్యతలోకి రాగా.. తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటాలుంటాయని పేర్కొంది. ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది.పోతిరెడ్డిపాడు నుంచి 207 టీఎంసీలు తరలించిన ఏపీగతేడాది నవంబర్ 25న 15.86 టీఎంసీలు, గత జనవరి 31న మరో 18 టీఎంసీలు కలిపి మొత్తం 33.86 టీఎంసీలను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేయాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది. దీనికి తోడు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, హంద్రీ నీవా, ముచ్చుమరి ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలించిందని పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ ఏడాది ఏపీ రికార్డు స్థాయిలో 207.88 టీఎంసీ జలాలను తరలించుకుంది. హంద్రీ నీవా, ముచ్చుమర్రి, తదితర ప్రాజెక్టులు కలిపి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ మొత్తం 236.63 టీఎంసీలను తరలించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు కేవలం 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోగలిగింది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు కలిపి మరో 324.2 టీఎంసీలను ఏపీ వాడుకుంది. 116 టీఎంసీల కోసం తెలంగాణ ఇండెంట్2025 ఫిబ్రవరి –జూలై మధ్యకాలంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీలకు 116 టీఎంసీల విడుదల కోసం తెలంగాణ ఇండెంట్ పెట్టిందని కృష్ణా బోర్డు తెలిపింది.మిగిలింది 97.47 టీఎంసీలే నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 510 అడుగులకి పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకి పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాడుకున్న జలాలతో పాటు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని జలాల వినియోగంపై ప్రణాళికలు సమర్పించాలని కోరింది.ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న కృష్ణా జలాల వివరాలను కృష్ణా బోర్డు లేఖలో పొందుపరిచింది. పాత పంపకాలే కొనసాగుతాయికృష్ణా జలాల్లో ఏపీకి 66% తెలంగాణకు 34% కేటాయింపులో మార్పు ఉండదుగత నెలలో తీసుకున్న నిర్ణయానికి ఉభయ రాష్ట్రాల అంగీకారంతాజాగా సమావేశం మినిట్స్ పంపిన కృష్ణా బోర్డుసాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో అను మతులున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగ ణనలోకి తీసుకుని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్ప త్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు కొన సాగుతాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేదా అపెక్స్ కౌన్సిల్ ఎలాంటి అనుమతులివ్వనందున ఈ తాత్కాలిక సర్దుబాటులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు గతంలో అంగీకరించిన 66:34 నిష్పత్తిలోనే ప్రస్తుత సంవత్సరంలో సైతం కృష్ణా జలాల కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే 66:34 నిష్ప త్తికి విరుద్ధంగా రాష్ట్రాలకు ఏమైనా అవసరా లు ఏర్పడి నిర్దిష్ట కేటాయింపులు కోరితే ఆ మేరకు నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. గత నెల 21న జరిగిన కృష్ణా బోర్డు సమా వేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. తాజాగా రెండు రాష్ట్రాలకు పంపిన సమావేశం మిని ట్స్‌లో వీటిని బోర్డు పొందుపరిచింది. మూడో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు ఏపీ నోఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించేందుకు మొత్తం 27 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, తొలి విడత కింద 18 స్టేషన్లను ఏర్పాటు చేశారు. రెండో దశ కింద 9 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడో దశ కింద మరో 11 టెలిమెట్రీ కేంద్రాలను తెలంగాణ ప్రతిపాదించింది. తెలు గుగంగ, గాలేరీ–నగరి, బనకచర్ల హెడ్‌రెగ్యు లేటరీ, క్రాస్ డిస్ట్రిబ్యూటరీ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి నీళ్లను తరలించుకుంటున్నందున అక్కడ ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును ఉపసంహరించాలని రెండు రాష్ట్రాలు కోరగా, శాంతియుత పరిస్థితులు నెలకొనే వరకు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. -
కృష్ణా జలాల్లో పాత వాటాలే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా పాత వాటాల ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు వెల్లడించింది. తెలంగాణలో కృష్ణా బేసిన్ 71 శాతం ఉందని, ఆ లెక్కన 71 శాతం వాటా తమకు రావాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ 50 శాతం వాటాను కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని.. ఆ ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తుచేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ 66 : 34 వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని పునరుద్ఘాటించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ పాత వాటాల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. నీటి అవసరాలు ఏవైనా ఉంటే త్రిసభ్య కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు 19వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ సర్కారు తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలీమీటర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు..ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి 76 శాతం నీటిని వాడుకుందని.. పెన్నా బేసిన్‌కు నీటిని తరలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌తోపాటు పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించే 11 చోట్ల టెలీమీటర్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 833 టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. వరద సమయంలో ఏ రాష్ట్రం మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని ఆది నుంచి తాము కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే టెలీమీటరు ఏర్పాటుచేశారని.. దాని దిగువన టెలీమీటర్లు ఏర్పాటుచేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం చెబుతామని బోర్డు ఛైర్మన్‌కు చెప్పారు.శ్రీశైలం ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు..ఇక కృష్ణా నదికి 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ దెబ్బతిందని.. తక్షణమే మరమ్మతు చేయకపోతే ఆ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదమని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్‌పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించామని.. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫ్లంజ్పూల్కు మరమ్మతులు చేస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు. ఆలోగా శ్రీశైలం ప్రాజెక్టులో అత్యవసర మరమ్మతులను వచ్చే సీజన్‌లోగా పూర్తిచేస్తామన్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని, నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు.రెండునెలలు చూస్తామని.. సాగర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కాకపోతే అప్పుడు సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనకు జైన్ సానుకూలంగా స్పందించారు. 50 శాతం వాటా అసంబద్ధం..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తెలంగాణ అధికారులు కోరడం అసంబద్ధం. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలను 2015లో కేంద్రం కేటాయించింది.ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు చెబుతారు? ఇదే అంశాన్ని కృష్ణా బోర్డుకు చెప్పాం. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ 66 : 34 నిష్పత్తిలోనే నీటిని పంపిణీ చేయాలని కోరగా బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. – ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ -
పాత వాటాలా? కొత్త వాటాలా?
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాల్లో వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తమకు సగ భాగం కేటాయించాలని తెలంగాణ సర్కార్ పట్టుబడుతుండగా.. బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల (ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు) ప్రకారమే పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చి పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్‌జైన్ నివేదించారు. అయితే నీటి వాటాలు తేల్చే అంశంపై అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోబోదని.. రెండు రాష్ట్రాలతో మీరే సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించింది. దీంతో నీటి వాటాలే ప్రధాన అజెండాగా మంగళవారం హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయంలో నిర్వహిస్తున్న బోర్డు 19వ సర్వ సభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్‌కుమార్, బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తదితరులు పాల్గొననున్నారు. ఇరు ప్రభుత్వాలు సూచించిన అంశాలతోపాటు మొత్తం 30 అంశాలతో కృష్ణా బోర్డు సమావేశం అజెండాను రూపొందించింది.అజెండాలో కృష్ణా బోర్డు ప్రతిపాదించిన అంశాలు.. ⇒ కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌కు తరలింపు ⇒బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ⇒ రెండు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టులకు అనుమతులపై గెజిట్‌లో కేంద్రం విధించిన గడువు ముగియడంతో వాటికి నీటి విడుదలపై చర్చ ⇒ రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపుఏపీ ప్రతిపాదించిన ప్రధానాంశాలు..⇒ శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం అప్పగించే వరకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలి. ⇒ నీటి కేటాయింపులు లేకుండా తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇన్‌టెక్ వెల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి. ⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఏపీకి ఇవ్వాలి. ⇒ పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి మళ్లించడానికి బదులుగా సాగర్ ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కలి్పంచింది. ఆ 45 టీఎంసీలను తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డికి కేటాయించడానికి ఎలాంటి హక్కులు లేవు. ⇒ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా అదనంగా 15 టీఎంసీల తరలింపు పనులకు గెజిట్ నోటిఫికేషన్లో అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదు. ⇒ నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తగినంత నీటి సరఫరా జరగడం లేదు. ⇒ అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిన అచ్చంపేట, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులను అడ్డుకోవాలి.తెలంగాణ ప్రతిపాదించిన ప్రధానాంశాలు..:⇒ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యాన్ని తెలంగాణకే అప్పగించాలి. డ్యామ్‌ల భద్రత చట్టం 2021 ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ స్పిల్ వే, కుడి, ఎడమ కాలువ రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా.. 2023 నవంబర్ 28న ఏపీ తన ఆ«దీనంలోకి సగం స్పిల్ వేను తీసుకోవడం సరికాదు. ⇒ తెలంగాణ వాడుకోకపోవడంతో నాగార్జునసాగర్‌లో మిగిలిపోయిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. ⇒ సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణను తెలంగాణకే అప్పగించాలి. ⇒ ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణకు ఏపీ అడ్డుకోకుండా సహకరించాలి. ⇒ ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి. ⇒ ఏపీ నీటి వినియోగాన్ని కచి్చతంగా లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బ్యారేజ్ వద్ద టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం హైదరాబాద్ తాగునీటికి తీసుకున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించాలి. ⇒ రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాలువ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. ⇒ శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, తెలుగు గంగ, హంద్రీ–నీవా, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా నిలువరించాలి. ⇒ ఏపీ పరిధిలో శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి. ఏ నిర్ణయం తీసుకుంటుందో? కృష్ణా నదిలో 75% లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించింది. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా 2014 మే 28న కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా 2015–16 నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 512.06, తెలంగాణకు 298.94 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర జల్ శక్తి తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యతగా ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్ 66%, తెలంగాణ 34% వాడుకునేలా 2017–18 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.2018–19, 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో బోర్డు సర్వ సభ్య సమావేశాల్లో రెండు రాష్ట్రాలతో చర్చించి అదే పద్ధతి ప్రకారం కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. కానీ 2023–24కి సంబంధించి నీటి పంపకాలపై 2023 మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు సభ్య సమావేశంలో తమకు 50% వాటా కావాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తోసిపుచ్చారు. దీంతో కృష్ణా జలాల లభ్యత, అవసరాలపై ఎప్పటికప్పుడు చర్చించి కేటాయింపులు చేసే బాధ్యతను కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీకి అప్పగించింది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాత పద్ధతి ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66% ఏపీకి, తెలంగాణకు 34% పంపిణీ చేస్తూ కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. -
సాగుకే కాదు.. తాగు నీరూ ఉండదు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో, ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సర్కారు తీరు ఇలాగే ఉంటే కృష్ణా బేసిన్లో సాగు నీటికే కాదు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై విచారిస్తున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించేలా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు న్యాయవాదులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని, జలాలను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుందంటూ 2013లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను ఇప్పటి విచారణలో చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. దీనినీ వాదనల్లో వినిపించి ఉంటే ట్రిబ్యునల్ నిర్ణయం మరోలా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఆ ట్రిబ్యునలే ఉల్లంఘించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పలేకపోయిందని ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనల వల్లే సెక్షన్–3 కింద కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన అదనపు విధి విధానాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై ముందుగా వాదనలు వింటామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేస్తున్నారు. నాడే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై ముందుగా అధ్యయనం చేసిన ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తీర్పు ఇచ్చింది. ‘ఫస్ట్ ఇన్ టైమ్ ఫస్ట్ ఇన్ రైట్ (మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్న వారికే మొదటి హక్కు)’ న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రక ఒప్పందాలు, వినియోగాల ప్రాతిపదికగా 1951 నాటికే పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెపెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు, 1960 సెప్టెంబరు తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా వర్గీకరించి నీటిని కేటాయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్కకట్టింది. ఆ ప్రాతిపదికన మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో అప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. వాటిని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.పునఃపంపిణీ చట్టవిరుద్ధంబచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. దానిప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం ఆ ట్రిబ్యునల్ విచారణ చేయాలి. అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది. వీటిని మినహాయిస్తే మిగతా 165 టీఎంసీల కేటాయింపులో విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. ఇందుకు భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు.అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) – 1956 సెక్షన్ 6(2) ప్రకారం.. నదీ జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపుల జోలికి వెళ్లడంలేదు. ఆ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుంది.– కేంద్ర ప్రభుత్వానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టీకరణ -
విభజన చట్టం ప్రకారమే వాదనలు వినాలి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారమే వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సెక్షన్–89 ప్రకారం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)–1956లో సెక్షన్–3 ప్రకారం 2023 అక్టోబరు 6న కేంద్రం జారీ చేసిన అదనపు నిబంధనల ప్రకారం వాదనలు వినాలన్న తెలంగాణ వాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.కేంద్ర అదనపు నియమ, నిబంధనలు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టులో 2023 అక్టోబర్ 31న రిట్ పిటిషన్ దాఖలు చేశామని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) –2కు ఏపీ తెలిపింది. ఆ పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు.. కేడబ్ల్యూడీటీ –2 ఎదుట వాదనలు విన్పించాలని 2023 నవంబర్ 7న చెప్పిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ–1956 సెక్షన్–3 ప్రకారం వాదనలు వినడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కృష్ణా జలాల పంపిణీపై విభజన చట్టంలో సెక్షన్–89, ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం ఒకేసారి వాదనలు వినాలని ఈనెల 2న కేడబ్ల్యూడీటీ–2లో తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.తెలంగాణ తప్పుగా అర్ధం చేసుకుందివిభజన చట్టంలో సెక్షన్–89, కేంద్రం ఆ తర్వాత జారీ చేసిన అదనపు నియమ, నిబంధనలు రెండు భిన్నమైవని, తెలంగాణ సర్కారు వాటిని తప్పుగా అర్థం చేసుకుందని ఏపీ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఐఎస్డబ్ల్యూఆర్డీఏ–1956లో సెక్షన్ 5(23), 12లోని అధికారాలను వినియోగించుకుని పునర్విభజన చట్టంలో సెక్షన్–89లోని ఏ, బీ నిబంధనల కింద తదుపరి నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2ను 2014 మే 15న కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించిందని గుర్తు చేసింది. సెక్షన్–89 ఏ నిబంధన ప్రకారం ప్రాజెక్టులవారీగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకపోతే, త్వరగా చేయాలని పేర్కొంది. ఆ సెక్షన్లో బి నిబంధన ప్రకారం నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా నీటి విడుదలకు ఆపరేషన్ ప్రొటోకాల్ (నిర్వహణ నియమావళి)ని రూపొందించాలని నిర్దేశించిందని గుర్తు చేసింది.రాష్ట్ర విభజనకు ముందు ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ అవార్డులు ఉంటే.. వాటికి రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని సెక్షన్–89లో కేంద్రం స్పష్టం చేసిందని తెలిపింది. దీనికి సంబంధించి సాక్ష్యాల సేకరణ, వాదనలు ప్రారంభమయ్యాయని గుర్తు చేసింది. సెక్షన్–89 ప్రకారమే..కేంద్రం జారీ చేసిన అదనపు నియమ, నిబంధనల ప్రకారం విచారణకు 2024 ఆగస్టు 28న ట్రిబ్యునల్ రూపొందించిన జాబితాలో పేర్కొన్న అంశాలు సెక్షన్–89లో విభజన చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నమైనవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సెక్షన్–3పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున, తొలుత సెక్షన్–89 ప్రకారమే వాదనలు వినాలని కేడబ్ల్యూడీటీ–2ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. -
‘కృష్ణా’పై మళ్లీ కొట్లాట!
సాక్షి, హైదరాబాద్: నీటి పంపకాల జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పడంతో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు అంశం మళ్లీ కృష్ణా బోర్డు ముందుకొచ్చిoది. దీంతో తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించడానికి జనవరి 21న కృష్ణా బోర్డు భేటీ కానుంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో జరిపిన కేటాయింపులు 2021–22 వరకు కొనసాగాయి. ఆ తర్వాతి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆ కేటాయింపులను వ్యతిరేకిస్తోంది. 50:50 నిష్పత్తిలో తాత్కాలికంగా నీటి పంపిణీ జరపాలని కోరుతోంది. అయితే ఏపీ మాత్రం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.ఎజెండాలో తెలంగాణ ప్రతిపాదనలివీ..» నాగార్జునసాగర్ నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యాన్ని అప్పగించాలి. ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యూలేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా 2023 నవంబర్ 28న ఏపీ అదీనంలోకి సగం డ్యామ్‌ను తీసుకోవడం సరికాదు. » తెలంగాణ వాడుకోకపోవడంతో సాగర్‌లో మిగిలిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణను తెలంగాణకే అప్పగించాలి. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుకోకుండా సహకరించాలి. » ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఏపీ చేపట్టరాదు. » ఏపీ నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. » కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం తాగునీటికి తీసుకున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించాలి. » రాయలసీమ ఎత్తిపోతలు సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా నిలువరించాలి. » ఏపీ పరిధిలో శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కు అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి. ఏపీ ప్రతిపాదించిన అంశాలు..» శ్రీశైలం, సాగర్, ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే వరకు సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలి. » నీటి కేటాయింపుల్లేకుండా తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి. » పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను మాకు అందించాలి. » పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించడానికి బదులుగా సాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకొనే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. వాటిలో మిగిలిన ఉన్న 45 టీఎంసీలను తెలంగాణ పాలమూరు–రంగారెడ్డికి కేటాయించింది. ఆ జలాలపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు. » కల్వకుర్తి లిఫ్టు ద్వారా అదనంగా 15 టీఎంసీల తరలింపు పనులకు గెజిట్ నోటిఫికేషన్లో అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదు.» అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిన అచ్చంపేట, నారాయణపేట – కొడంగల్ లిఫ్టు పనులను అడ్డుకోవాలి. -
కృష్ణాలో తెలంగాణకు 70% వాటా దక్కాలి
సాక్షి, హైదరాబాద్: నది పరీవాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు జరపాలని అంతర్జాతీయ నీటి సూత్రాలు స్పష్టం చేస్తున్నాయని.. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉంటే.. ఏపీలో 30 శాతమే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీని ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,005 టీఎంసీల వాటాలో 70 శాతం వాటా తెలంగాణకు దక్కేలా జస్టిస్ బ్రజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ శనివారం నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే.. బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాలు వినియోగించుకోవచ్చంటూ గతంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలను వాడుకుంటుండగా.. మిగతా 45 టీఎంసీలపై సంపూర్ణ హక్కు తెలంగాణకే ఉందని చెప్పారు. సాగర్ ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల ద్వారా ఈ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగొద్దు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాలను సాధించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ వాదనలను బలపరిచే సాక్ష్యాలు, రికార్డులు, ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ట్రిబ్యునల్‌లో వాదనలు.. కృష్ణా ట్రిబ్యునల్–2 ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలు, ఆధారాలను సేకరించిందని... త్వరలోనే ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అయితే కేంద్ర జలశక్తి శాఖకు ఇచి్చన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. కృష్ణా బోర్డును ఎందుకు పట్టించుకోవాలి? తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీని కృష్ణా ట్రిబ్యునల్–2 పూర్తి చేయలేదని.. ఇక కృష్ణా బోర్డు నిర్ణయాలను తెలంగాణ ఎందుకు పట్టించుకోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు కృష్ణా బోర్డు జోక్యం ఉండకూడదంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.ఇక ఏపీ కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందన్న అంశం ప్రస్తావనకురాగా.. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో దీనికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బానకచర్ల క్రాస్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కాల్వ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగోడు ప్రాజెక్టుల ద్వారా ఏపీ తరలిస్తున్న నీటి వివరాలను సేకరించి రికార్డు చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం. నీటి వాటాల్లో అన్యాయంపై నివేదిక తయారు చేయాలిసీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులను సాధించాలని.. మొత్తం ఆయకట్టుకు నీరందేలా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న జీవోలు, తీర్పులతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు, మెమోలు, డీపీఆర్‌లు, నాటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్‌రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, అధికారులు పాల్గొన్నారు. -
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
నీళ్లున్నా కన్నీరే
తలాపున కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతున్నప్పటికీ ఇక గ్రేటర్ రాయలసీమకు కన్నీళ్లు తప్పవా? కళ్లెదుటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయి ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణా వరద జలాలు కడలిలో కలుస్తున్నా సరే గ్రేటర్ రాయలసీమకు చుక్క నీటిని విడుదల చేయరా? విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పదో పేరా ద్వారా కేంద్రం అనుమతి ఇచ్చిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. నీటి పారుదల రంగ నిపుణులు. సాక్షి, అమరావతి : దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ(ఆపరేషన్ రూల్స్)పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాక్షి ఏకే గోయల్ అక్టోబర్ 18న దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక.. 2013 నవంబర్ 29న తుది నివేదిక ఇచ్చాయి. వాటిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను కేంద్రం అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి కేటాయింపు చేసే బాధ్యతను విభజన చట్టం ద్వారా కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కే అప్పగించింది. విభజన చట్టంలోని మార్గదర్శకాలు, కేంద్రం గతేడాది అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనల మేరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి తెలుగు గంగ (29 టీఎంసీలు కృష్ణా జలాలు + 30 టీఎంసీలు పెన్నా జలాలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ ప్రాజెక్టు (43.5 టీఎంసీలు)ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)కు మూడు దశాబ్దాలుగా, 11 ఏళ్లుగా గాలేరు–నగరి, .. 12 ఏళ్లుగా హంద్రీ–నీవాకు నీరు విడుదల చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచడమే తరువాయి. శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించవచ్చు. కానీ.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణపై కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తన తరఫు సాక్షి అయిన ఏకే గోయల్ ద్వారా దాఖలు చేయించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరిలతోపాటు వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారిందని నీటి పారుదల రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. సముద్రంలో కలిసినా సరే.. ⇒ గత ఆరేళ్ల తరహాలోనే కృష్ణాకు ముందుగా అంటే జూలై, ఆగస్టులో వరదలు ప్రారంభమై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండి.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా వరద జలాలు సముద్రంలో కలుస్తున్నా సరే తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన ప్రాజెక్టుల కింద 811 టీఎంసీల నికర జలాలు (75 శాతం లభ్యత) వాడుకుని, శ్రీశైలం, సాగర్‌లలో 150 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద నిల్వ చేశాకే ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2130 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లు దక్కే అవకాశాలు కనిష్టంగా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాలే ⇒ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలు కలుపుకుంటే 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. అంతకంటే అదనంగా ఉన్న జలాలు అంటే.. మిగులు నీటిని వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచి్చంది. ⇒ కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీల నికర జలాలను యథాతథంగా కొనసాగిస్తూనే.. 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాలు ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసింది. దాంతో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 907, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టీఎంసీలు దక్కాయి. తద్వారా కేడబ్ల్యూడీటీ–2 మొత్తం 2,578 టీఎంసీలను కేటాయించింది. అంతకంటే ఎక్కువ లభ్యత ఉన్న నీటిని అంటే మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి కేటాయించింది. ఈ నీటి కేటాయింపులు రాష్ట్రాలకు దక్కేలా చేయడం కోసం బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని సూచించింది. ⇒ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించిన 194 టీఎంసీల్లో.. 76–65 శాతం మధ్య లభ్యతగా ఉన్న 49 టీఎంసీలు (జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, క్యారీ ఓవర్ కింద 30, పర్యావరణ ప్రవాహాలు 6 టీఎంసీలు), 65 శాతం సగటు ప్రవాహాల మధ్య లభ్యతగా ఉన్న 145 టీఎంసీలు (తెలుగు గంగకు 25, క్యారీ ఓవర్ కింద 120 టీఎంసీలు) కేటాయించింది. ⇒ కేడబ్ల్యూడీటీ–2 తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలన్నీ 2,578 టీఎంసీలను వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో కలిపి కృష్ణా బోర్డును ఏర్పాటు చేసి.. అన్ని రాష్ట్రాలకు వాటా జలాలు అందేలా చూడాలని చేసిన సూచనను కేంద్రం అమలు చేయలేదు. ఇప్పుడు కూడా కృష్ణా బోర్డును అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకపోతే.. 2,578 టీఎంసీలను వినియోగించుకున్నట్లు తేల్చేదెవరని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 2,578 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ⇒ ఇక కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన నీటిని గంపగుత్తగా వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ప్రతిపాదించలేదు. దాంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించినా సరే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయని తేల్చి చెబుతున్నారు.తుంగభద్రలో పూడికతో ‘సీమ’కు నష్టం తుంగభద్ర డ్యాంను 133.5 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచారు. ఆ డ్యాం ఒకటిన్నరసార్లు నిండుతుందని.. దాని వల్ల ప్రాజెక్టులో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. రాయలసీమకు 66.5 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 24, కేసీ కెనాల్ 10), తెలంగాణ(ఆర్డీఎస్)కు 6.51 టీఎంసీలు కేటాయించింది. కానీ.. తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకు పోవడంతో నీటి నిల్వ 105 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 25 టీఎంసీల నిల్వ తగ్గినట్లు స్పష్టమవుతోంది. డ్యాం ఒకటిన్నర సార్లు నిండుతుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నేపథ్యంలో పూడిక వల్లే.. 37 టీఎంసీలు, నీటి ఆవిరి రూపంలో 5.. వెరసి 42 టీఎంసీలను రాయలసీమ కోల్పోవాల్సి వచి్చంది.ఆ నీళ్లన్నీ తుంగభద్ర నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. నీటి లభ్యత తక్కువగా ఉందని చూపుతూ దామాషా పద్ధతిలో తుంగభద్ర నీటి కేటాయింపులు చేస్తోంది. దాంతో తుంగభద్ర డ్యాం నుంచి రాయలసీమకు గరిష్టంగా 40 టీఎంసీలు కూడా దక్కడం లేదు. దాంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల రాయలసీమ కోల్పోతున్న వాటా జలాలను వినియోగించుకునే ప్రాజెక్టులు నిరి్మంచడంపైనా రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హక్కులు ‘కృష్ణా’ర్పణమే!
కృష్ణా నీటిపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2లో రాష్ట్ర ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)–4 ప్రకారం కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్లు ఆయా ప్రాజెక్టులకు లేదా ప్రాంతాలకు కేటాయించిన నికర జలాలు యథాతథంగా కొనసాగుతాయి. అంటే.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీలు యథాతథంగా కొనసాగుతాయని, వాటిని పంపిణీ చేయకూడదన్నది స్పష్టమవుతోంది. కానీ.. రెండు రాష్ట్రాలు అంగీకరించిన 36 అంశాల్లో నికర జలాల పునఃపంపిణీ కూడా ఉండటం గమనార్హం. విభజన చట్టం ప్రకారం నికర జలాల పంపిణీ విచారణ పరిధిలోకి రాదని కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించి ఉంటే ఆ అంశంపై విచారణ చేయబోమని ఆదిలోనే చెప్పేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నికర జలాల పంపిణీపై విచారణ చేపట్టాలంటే విభజన చట్టాన్ని సవరించాలి. ఆ అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని, అంతేగానీ ట్రిబ్యునల్‌కు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాదించలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ట్రిబ్యునల్‌లో వాదనలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర హక్కులు ‘కృష్ణార్పణం’ కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. విభజన చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలతోపాటు కేంద్రం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేడబ్యూడీటీ–2 విచారణ చేస్తోంది.పంపిణీకి బేసిన్ ప్రాతిపదిక కాదుఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేడబ్ల్యూడీటీ–1ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తీర్పును ఇవ్వగా.. మే 31న దాన్ని అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా జలాల పంపిణీకి బేసిన్ (పరీవాహక ప్రాంతం)ను కేడబ్ల్యూడీటీ–1 ప్రాతిపదికగా తీసుకోలేదు. ఒకవేళ బేసిన్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే కృష్ణా బేసిన్ 2,58,948 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాని విస్తీర్ణం 76,252 చదరపు కిలోమీటర్లు (29.45 శాతం) ఉంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 (పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలతో కలిపి) టీఎంసీల లభ్యత ఉందని కేడబ్ల్యూడీటీ–1 తేల్చింది. బేసిన్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2,130 టీఎంసీల్లో 29.45 శాతం అంటే 627.29 టీఎంసీలు మాత్రమే దక్కేవి.‘‘ఫస్ట్ ఇన్ టైమ్ ఫస్ట్ ఇన్ రైట్..’’ఇదే న్యాయసూత్రం..కృష్ణా జలాల పంపిణీపై విచారణ ప్రారంభించడానికి ముందు కేడబ్ల్యూడీటీ–1 అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా ‘ఫస్ట్ ఇన్ టైమ్.. ఫస్ట్ ఇన్ రైట్’ (ఎవరైతే మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్నారో వారికే వాటిపై మొదటి హక్కు) న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రకఒప్పందాలు, వినియోగాలను ప్రాతిపదికగా చేసుకుంది. కృష్ణా బేసిన్ చరిత్రలో మొట్టమొదట 1885–1928 మధ్య కేసీ (కర్నూలు, కడప) కెనాల్, కృష్ణా ఆనకట్ట ద్వారా కృష్ణా డెల్టాకు జలాలను వినియోగించుకున్నారు. ఈ ప్రాతిపాదికన 1951 నాటికే పూర్తయిన ప్రాజెక్టులు.. 1951 నుంచి 1960 సెప్టెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు.. ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను మూడు విభాగాలుగా వర్గీకరించి కేడబ్ల్యూడీటీ–1 నీటి కేటాయింపులు చేసింది. ఈ ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు కలిపి మొత్తం 800 టీఎంసీలు కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది.ఏపీకి 512.04.. తెలంగాణకు 298.96.. కేంద్రం తాత్కాలిక సర్దుబాటుకేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టులకు రక్షణ కల్పించిన, కేటాయించిన నికర జలాలను పరిగణలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కుతాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.రాష్ట్ర హక్కుల పరిరక్షణ ఇలాగేనా?కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నికర జలాలు (75 శాతం లభ్యత)ను కేడబ్ల్యూడీటీ–2 యథాతథంగా కొనసాగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను కొనసాగిస్తూనే 75 –65 శాతం మధ్య, సగటు ప్రవాహాల ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను అదనంగా కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. విభజన చట్టం ప్రకారం చూస్తే 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధం. అదనంగా కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 ఇప్పుడు విచారణ చేయాలి. అందులో విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. కేడబ్ల్యూడీటీ–2 నికర జలాల పునఃపంపిణీపై విచారణ చేస్తున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం.. కృష్ణా డెల్టాలో వినియోగిస్తున్న జలాల్లో బేసిన్ బయట 95 శాతం వాడుకుంటున్నామని అంగీకరించడం తదితరాలను చూస్తుంటే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడం లేదని స్పష్టమవుతోందని నీటిపారుదలరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు.ఆనాడే హక్కులు తాకట్టు..విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే నాగార్జునసాగర్‌తోపాటు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని, పులిచింతల విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తమ అధీనంలోకి తీసుకున్నా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నోరు మెదపలేదు. దీనివల్లే శ్రీశైలం, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ ఆ జలాలను ఖాళీ చేస్తూ.. నీటిని సముద్రం పాలు చేస్తూ ఏపీ హక్కులను తెలంగాణ హరిస్తోందని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు దాని నుంచి తప్పించుకోవడానికి అక్రమ ప్రాజెక్టులపై ఉదాసీనంగా వ్యవహరించారు. తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి 120 టీఎంసీలు తరలించేలా అక్రమంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా.. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచినా.. సుంకేశుల బ్యారేజ్ గర్భంలో తుమ్మళ్ల ఎత్తిపోతల చేపట్టినా నాడు ఏమాత్రం అడ్డుకోలేదు. తెలంగాణ చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో చంద్రబాబు బలంగా వాదించలేకపోయారని.. అప్పుడే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేశారని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. -
‘బ్రిజేష్’కు 5 డీపీఆర్‌లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా 555 టీఎంసీలను కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్– 2కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందులో 238 టీఎంసీల నీటి అవసరాలు కలి గిన ఐదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను మంగళ వారం ట్రిబ్యునల్‌కు సమర్పించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అదనపు విధి విధానాలు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)ను గతంలో జారీ చేసింది. దీని ఆధారంగా కృష్ణా జలాల పంపిణీ విధానంపై ట్రిబ్యునల్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమ వాదన లతో స్టేట్మెంట్ ఆఫ్ కేస్‌లను ఇప్పటికే దాఖలు చేశాయి. నవంబర్ 6 నుంచి 8 వరకు ట్రిబ్యునల్‌లో తదుపరి విచారణ జర గాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 53 టీఎంసీలు, నెట్టెంపాడు ప్రాజెక్టుకు 25.4 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కలుపు కొని మొత్తం 238 టీఎంసీలను ఆయా ప్రాజెక్టులకు కేటాయించాలని కోరుతూ వాటి డీపీఆర్‌లను తాజాగా ట్రిబ్యునల్‌కు అందజేసింది. వీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బీసీ ప్రాజె క్టుకు మరో20 టీఎంసీలు, కొడంగల్– నారా యణపేట ఎత్తిపోతలకు 7టీఎంసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల అవ సరాలకు 299 టీఎంసీలు అవసరమని ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఇక భవిష్య త్లో నిర్మించనున్న జూరాల వరద కాల్వ, కోయి ల్కొండ ప్రాజెక్టు, జూరాల–శ్రీశైలం మధ్య లో కొత్త బరాజ్, భీమాపై మరో బరాజ్ అవసరాలు కలుపుకొని మొత్తం 555 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది. పాత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు చిన్న నీటిపారుదలకు 89.15, నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 105.7, భీమా ఎత్తి పోతలకు 20, జూరాలకు 17.8, తాగునీటి సరఫరాకు 5.7, పాకాల చెరువుకు 2.6, వైరా చెరువుకు 3.7, పాలేరు ప్రాజెక్టుకు 4 , డిండి ప్రాజెక్టుకు 3.5, కోయిల్‌సాగర్‌కు 3.9, ఆర్డీఎస్కు 15.9, మూసీకి 9.4, లంకసాగర్‌కు 1, కోటిపల్లివాగుకు 2, ఓకచెట్టి వాగుకు 1.9 టీఎంసీలు కలిపి మొత్తం 299 టీఎంసీలను ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు తెలంగాణ కోరింది. -
శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.తుంగభద్రలో...కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.మూసీ ప్రాజెక్టుకు జలకళకేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
కృష్ణానది జలాలు చెరి సగం పంచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను చెరిసగం పంచడంతో పాటు షరతులకు అంగీకరిస్తే ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా బుధవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిందని, ఆ జలాలను రాష్ట్రాలకు పంచడానికి వీలుగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–2)కు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసింది. 811 టీఎంసీలను చెరిసగం అంటే 405.5 టీఎంసీల చొప్పున రెండు రాష్ట్రాలకు కేటాయించాలని స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌లో కనీస నీటిమట్టాన్ని 830 అడుగులుగా పరిగణనలోకి తీసుకోవాలని, పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్బీసీ ద్వా రా మొత్తం 34 (ఎస్ఆర్బీసీ కాల్వకు 19 టీఎంసీలు, మద్రాస్ తాగునీటికి 15 టీఎంసీలు) టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని, కృష్ణా జలాలను బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు మాత్రమే కేటాయించాలని, బేసిన్ వెలుపలికి తరలించకుండా నియంత్రించాలని కోరింది. ఒక నీటి సంవత్సరంలో వాడుకోని మిగులు కోటాను వచ్చే సంవత్సరానికి బదిలీ (క్యారీ ఓవర్) చేసేందుకు అనుమతించాలని, వాడుకోని నీటిని ఖాతాలో లెక్కించకుండా చూడాలని, తాగునీటి వినియోగాన్ని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 20 శాతంగా మాత్రమే లెక్కించాలని స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే అభ్యంతరం లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చేలోగా పై షరతులకు కట్టుబడి ఉంటామని, అమలు చేస్తామని ప్రకటిస్తే... శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరాలేవీ లేవని ప్రభుత్వం పేర్కొంది. జనవరి 17వ తేదీన నాగార్జునసాగర్‌పై జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను అప్పగించడానికి తెలంగాణ అంగీకారం తెలిపినట్టుగా సమావేశపు మినట్స్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఆ సమావేశంలో నాగార్జునసాగర్ వద్ద నవంబర్ 28కి ముందు పరిస్థితిని పునరుద్ధరించాలని మాత్రమే కోరడం జరిగిందని తెలిపింది. తక్షణమే మినట్స్‌ను సవరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈనెల 27వ తేదీన లేఖ రాశారు. కాగా కేంద్రానికి ఇదివరకే తమ అభిప్రాయాన్ని నివేదించడం జరిగిందని బుధవారం కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. 1న భేటీలో తేల్చి చెప్పండి శ్రీశైలం, నాగార్జునసాగర్ అప్పగింత లాంఛనాలపై చర్చించడానికి వీలుగా ఫిబ్రవరి 1వ తేదీన కేఆర్ఎంబీ నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని, లేఖ ద్వారా నివేదించిన అంశాలన్నీ సమావేశంలో తేల్చేసి, తదుపరి చర్చకు ఆస్కారం లేకుండా బయటికి రావాలంటూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకానున్నారు. -
కృష్ణా జలాల వివాదంపై నేటి భేటీ రద్దు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వివాదం పరి ష్కారమే అజెండాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని కేంద్రం రద్దు చేసింది. మళ్లీ భేటీ ఎప్పుడన్నది తర్వాత తెలియజేస్తామని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం సమాచారం ఇచ్చారు. హక్కులను కాపాడుకోవడం కోసం రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గత నెల 30న ఏపీ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రా ష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైంది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల సీఎస్‌లతో ఈనెల 6న సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఈనెల 8కి వాయిదా వేశారు. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ఈక్రమంలో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. -
కేంద్ర గెజిట్ ఆధారంగానే విచారించాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగానే ఇకపై కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ కొనసాగించాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89లోని మార్గదర్శకాల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలు జరిపేందుకు 2016 అక్టోబర్ నుంచి కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఇటీవల అదనపు మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇకపై పాత మార్గదర్శకాల (సెక్షన్ 89) ఆధారంగా విచారణను కొనసాగించడం సమంజసం కాదని తెలంగాణ పేర్కొంది. కాగా బుధవారం ఢిల్లీలో సమావేశమైన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఇరు పక్షాల వాదనలకు అవకాశం ఇచ్చింది. కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తక్షణమే విచారణను ప్రారంభించాలని తెలంగాణ తరçఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సూచించారు. కొత్త గెజిట్‌పై ఏపీ తమ స్టేట్మెంట్ను ట్రిబ్యునల్‌కు సమర్పించవచ్చని, విచారణను మాత్రం వాయిదా వేయరాదని కోరారు. అధ్యయనానంతరమే వాదనలు: ఏపీ గెజిట్ నోటిఫికేషన్‌కు ఉన్న చట్టబద్ధత, దాని ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు కొంత సమయం కేటాయించాలని, అధ్యయనం జరిపిన తర్వాతే తమ వాదనలు వినిపించగలమని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా చెప్పారు. అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని కూడా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీలను తరలిస్తే, ప్రతిగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చని గోదావరి ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఆ నీళ్లను సైతం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం మినిట్స్‌ను ఉటంకిస్తూ ఈ నీళ్ల కేటాయింపులను గోదావరి ట్రిబ్యునల్ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తదుపరి విచారణను నవంబర్ 22, 23వ తేదీలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌కు ఉన్న చట్టబద్ధత, దాని ప్రభావాలపై తెలంగాణకు నవంబర్ 15లోగా, ట్రిబ్యునల్‌కు నవంబర్ 20లోగా తమ స్పందనను సమర్పించాలని ఏపీని ఆదేశించింది. -
ఆ 811 టీఎంసీలు.. ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా ట్రిబ్యునల్–1 (బచావత్ ట్రిబ్యునల్) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలను.. తిరిగి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట నదీ వివాదాల చట్టం (ఐఎస్ఆర్డీఏ)–1956లోని సెక్షన్ 3, సెక్షన్ 5(1), 12ల కింద జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కు మరిన్ని విధి విధానాలను జారీ చేస్తూ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ నీటిని సైతం రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని కేంద్రం తాజా విధివిధానాల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్–2 కొత్తగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. దీంతో మొత్తంగా 856 టీఎంసీల కృష్ణా జలాలు ఉభయ రాష్ట్రాల మధ్య పంపిణీ కానున్నాయి. రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలపై తుది నివేదిక సమర్పించడానికి గతంలో కృష్ణా ట్రిబ్యునల్–2కు ఉన్న గడువును 2024 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. ఇప్పుడు అదనపు విధివిధానాలను ప్రకటించినా.. గడువు పొడిగింపు ఏదీ వెల్లడించలేదు. దీనితో వచ్చే ఏడాది మార్చి 31లోగా ట్రిబ్యునల్ తుది నివేదిక ఇవ్వాల్సి ఉండనుంది. ఇక ప్రాజెక్టులన్నింటికీ కేటాయింపులు తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తాజాగా కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ తాజా గెజిట్ నోటిఫికేషన్లో నిబంధన చేర్చింది. దీంతో తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు సైతం ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. -
ఏపీకి 45, తెలంగాణకు 35
సాక్షి, అమరావతి : ప్రస్తుత నీటి సంవత్సరంలో మే వరకూ తాగునీటి అవసరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఏపీకి కేటాయించే నీటిలో శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 15 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. అలాగే, తెలంగాణకు రెండు ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పింది. జూన్–జూలైలలో తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి ప్రాజెక్టుల్లో 2.788 టీఎంసీలను నిల్వచేయాలని తీర్మానిస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలను శుక్రవారం రాత్రి పంపింది. వీటి ఆధారంగా నీటి కేటాయింపులు, విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు చైర్మన్ జారీచేయనున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా నదిలో లభ్యత, ఇప్పటిదాకా వినియోగం, మే వరకూ తాగునీటి అవసరాలపై చర్చించడమే అజెండాగా హైదరాబాద్‌లో కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌లు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. రెండు దఫాలుగా సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం వాడివేడిగా సాగింది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ 144 టీఎంసీల వినియోగం.. ప్రస్తుత నీటి సంవత్సరంలో సెప్టెంబరు 30 వరకూ ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ నుంచి 4.210, శ్రీశైలం నుంచి 25.865, ఇతర ప్రాజెక్టుల నుంచి 65.649 మొత్తం 95.724 టీఎంసీలను వాడుకుందని తేల్చింది. అదే తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ నుంచి 11.88, శ్రీశైలం నుంచి 12.626, ఇతర ప్రాజెక్టుల నుంచి 24.037 మొత్తం 48.543 టీఎంసీలు వాడుకుంది. రెండు రాష్ట్రాలు కలిసి ఇప్పటిదాకా 144.267 టీఎంసీలు వినియోగించుకున్నాయి. దీంతో సెప్టెంబరు 30 నాటికి సాగర్ కనీస నీటిమట్టానికి ఎగువన 27.532, శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి ఎగువన 55.256 టీఎంసీలు వెరసి 82.788 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్లు తేల్చింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసమే నీటిని వాడుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే చేసిన సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. అలా అయితేనే చెన్నైకి నీరు.. కానీ, నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వాటా నీటిని విడుదల చేస్తేనే.. చెన్నైకి నీటిని సరఫరా చేయగలమని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి స్పష్టంచేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో తమ వాటా ఇవ్వలేమని తెలంగాణ ఈఎన్సీ తేల్చిచెప్పారు. ఇలాగైతే చెన్నైకి నీటిని విడుదల చేయలేమని ఏపీ ఈఎన్సీ కూడా తెగేసిచెప్పారు. దీనిపై సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే స్పందిస్తూ.. కేంద్ర జల్‌శక్తి శాఖతో సంప్రదింపులు జరిపి ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాటా నీటిని విడుదల చేసేలా చూస్తామన్నారు. ఎగువ రాష్ట్రాలు వాటా నీటిని విడుదల చేస్తే చెన్నైకి నీటిని సరఫరా చేయడానికి తమకెలాంటి అభ్యంతరంలేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పారు. నేడు సాగర్ కుడి కాలువకు నీళ్లు నీటి కేటాయింపులపై బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో నాగార్జునసాగర్ కుడి కాలువ కింద తాగునీటి అవసరాల కోసం శనివారం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేయనున్నారు. -
ట్రిబ్యునల్ తీర్పు అమలయ్యే వరకూ పాత వాటాలే
సాక్షి, అమరావతి : కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల ప్రకారమే రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. దీంతో ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో గతంలో మాదిరిగానే 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు కృష్ణా బోర్డు పంపిణీ చేయనుంది. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకం చేశాయి. దీని ప్రకారం 2015–16, 2016–17లో కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేసింది. ఆ తర్వాత కృష్ణాబోర్డు సమావేశాల్లో.. చిన్న నీటిపారుదలలో వినియోగం, కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలను మినహాయించి, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణ వాడుకునేలా రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో 2017–18 నుంచి అదే విధానం ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. అడ్డం తిరిగిన తెలంగాణ.. ప్రస్తుత నీటి సంవత్సరం ఆరంభంలో జరిగిన కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానం ప్రకారం నీటిని పంపిణీ చేసుకోవడానికి తొలుత అంగీకరించిన తెలంగాణ.. ఆ తర్వాత అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని పట్టుబట్టడంతో ఈ అంశాన్ని కృష్ణాబోర్డు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను.. 2రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ఆ ట్రిబ్యునల్ విచారిస్తుండటాన్ని గుర్తుచేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. ఆ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని తేల్చిచెప్పింది. -
కృష్ణాపై తెలంగాణ మరో అక్రమ ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం మరో అక్రమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, పర్యావరణ అనుమతి తీసుకోకుండా అచ్చంపేట ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధమైంది. శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలను తరలించి అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా రూ.1,061.39 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. బుధవారం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు.. ఈ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విఫలమయ్యారు. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనంగా 5 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించి, వాటిని ఎదుల రిజర్వాయర్‌లో నిల్వ చేసి, అక్కడి నుంచి ఉమామహేశ్వర రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఎత్తిపోతల కింద కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలోకి తరలించేలా తెలంగాణ నూతన ప్రాజెక్టు చేపట్టింది. దీనికి పర్యావరణ అనుమతి, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోలేదు. ఈ ఎత్తిపోతలను తక్షణమే నిలిపివేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలో పిటిషన్ వేయనుంది. -
‘పాలమూరు’పై 31న భేటీ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును అడ్డుకోవాలంటూ ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 31న ఆ రెండు రాష్ట్రాలతో సమావేశం కానుంది. పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లించనున్న 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక వాటాలు పోను మిగిలిన 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు కలిసి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గతంలో తెలంగాణ జీవో జారీ చేసింది. ఈ జీవోపై ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల వాదనలు విని విచారణ ముగించింది. తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకల వాటాలు పోగా మిగిలిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి హక్కు ఉందని, తెలంగాణ ఆ నీళ్లను వినియోగించుకోవాలంటే విధిగా ఏపీతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు లేఖ రాసింది. అయితే సాగర్ ఎగువన తెలంగాణలోనే కృష్ణా బేసిన్ ఉందని, అందువల్ల 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీలో ఉందని, దాని ద్వారా తరలించనున్న 80 టీఎంసీలతో ఏపీలోని కృష్ణా డెల్టాకు ప్రయోజనం కలగనుందని, ఇందుకు బదులుగా కేటాయించిన కృష్ణా జలాల్లో తెలంగాణకు మాత్రమే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి సమావేశాన్ని తలపెట్టడం ఆసక్తికరంగా మారింది. -
‘కృష్ణా’లో తాత్కాలిక కోటాకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు కొనసాగింపునకు బ్రేక్ పడింది. 2015 నుంచి కొనసాగుతున్న తాత్కాలిక బటా్వడాను 2023–24 నీటి సంవత్సరంలోనూ కొనసాగించాలని ఏపీ పట్టుబట్టగా తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం కోసం కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈలోగా 2023–24లో ఇరు రాష్ట్రాల నీటి అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు నీటి కేటాయింపులపై బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాలకు పంపిన సమావేశం మినట్స్‌లో ఈ అంశాన్ని బోర్డు వెల్లడించింది. 9 ఏళ్ల తర్వాత తాత్కాలిక కోటాకు బ్రేక్ బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీల(34 శాతం)ను తాత్కాలిక కోటాగా 2015లో కేంద్ర జలశక్తి శాఖ కేటాయించింది. ఆ తర్వాత నుంచి ఏటా ఈ కేటాయింపులను కృష్ణా బోర్డు గతేడాది వరకు కొనసాగించింది. తమ సమ్మతి లేకుండా 66:34 నిష్పత్తిలోని కోటాను కొనసాగించే అధికారం బోర్డుకు లేదని, ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం కోసం కేంద్రానికి రిఫర్ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బోర్డు సమావేశంలో పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల ఆధారంగా 66:34 నిష్పత్తిలో తాత్కాలిక కోటాను ఖరారు చేశారని, దీన్నే కొనసాగించాలని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ డిమాండ్ చేశారు. తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని కేంద్రానికి రిఫర్ చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేసే అధికారం బోర్డుకు లేదా కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన తెలంగాణలోని ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు వరుసగా 40, 40, 25 టీఎంసీలు కలిపి మొత్తం 105 టీఎంసీలు అవసరం కాగా, కేటాయింపులు లేవని తెలంగాణ తరఫున రజత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో వాటిని అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చినందున నీటి కేటాయింపులకు అడ్డంకిగా మారిందన్నారు. 66:34 ని ష్పత్తిలో జరిపిన తాత్కాలిక కేటాయింపు లకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులతో సంబంధం లేదని ఏపీ వాదనను కొట్టిపారేశారు. ఇరుపక్షాల మధ్య సమ్మతి కుదరకపోవడంతో ఈ అంశాన్ని కేంద్రానికి నివేదిస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వద్దకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ మరోసారి తెగేసి చెప్పింది. ఈ అంశాన్ని కేంద్రం ద్వారా అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని, గెజిట్ నోటిఫికేషన్‌పై పునఃసమీక్ష కోరాలని డిమాండ్ చేసింది. తెలంగాణ సూచన మేరకు ఈ అంశాన్ని కేంద్ర జలశక్తిశాఖకు రిఫర్ చేయాలని బోర్డు నిర్ణయించింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టుల విభాగాలను బోర్డుకు అప్పగిస్తే తమ భూభాగంలోని విభాగాలను సైతం అప్పగిస్తామని ఏపీ స్పష్టం చేసింది. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ సర్కారు పదే పదే తొండాట ఆడుతోంది. పరిష్కారమైన అంశాన్ని, అవాస్తవాలను వల్లె వేస్తూ వివాదాన్ని రాజేస్తోందని నీటి పారదుల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం చేసింది. ఆనాటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను మళ్లీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో సర్వ సభ్య సమావేశంలో చర్చించి తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం చెప్పింది. అయితే, తాత్కాలిక సర్దుబాటు ఒప్పందానికి అంగీకరించిన తెలంగాణ ఆ తర్వాత ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో కృష్ణా జలాల్లో సగ భాగం కావాలంటూ వివాదాన్ని రాజేస్తోంది. బుధవారం జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశంలోనూ అదే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీవి విచారిస్తున్న క్రమంలో మార్చి 24న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీలో తమ పరిధి పరిమితమని చెప్పింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. ఇప్పటికే నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించింది. తద్వారా నీటి లభ్యత 75 శాతం ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను మినహాయించి, 65 శాతం లభ్యత ఆధారంగా తాము అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపైనే విచారిస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
మళ్లీ 66:34 నిష్పత్తిలోనే.. కృష్ణా జలాల పంపిణీపై బోర్డు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాత్కాలిక సర్దుబాటు ప్రకారం, 2023–24 నీటి సంవత్సరంలోనూ 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు బట్వాడా చేస్తామని స్పష్టం చేసింది. గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న 66:34 నిష్పత్తిని ఇకపై అంగీకరించబోమని, రెండు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే దీనిపై తుది నిర్ణయం కోసం కేంద్ర జలశక్తి శాఖకు సిఫారసు చేయాలని నిర్ణయించింది. ‘ఏపీ, తెలంగాణలకు కృష్ణా జలాల పంపకాలు జరగలేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా 2015, జూన్ 19న కేంద్ర జల్‌శక్తి శాఖ రెండు రాష్ట్రాలకు 66:34 నిష్పత్తిలో తాత్కాలిక సర్దుబాటు మాత్రమే చేసింది. దీనినే 2023–24లో సైతం కొనసాగించాలి..’అంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది. కేఆర్ఎంబీ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ అధ్యక్షతన బోర్డు 17వ సర్వ సభ్య సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వాడీవేడిగా జరిగింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పాలమూరుపై మళ్లీ ఏపీ అభ్యంతరం నీటి కేటాయింపులు లేకున్నా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీచేసిన జీవోను రద్దు చేయాలని బోర్డును ఏపీ అధికారులు డిమాండ్ చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టు, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున సమావేశంలో చర్చించడం సరికాదని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. సాగర్ జలవిస్తరణ ప్రాంతంలో సుంకిశాల ఇన్‌టేక్‌వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సాగర్‌లో నీటిమట్టం తగ్గిపోవడంతో హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని.. దానికి కేటాయించిన 16.5 టీఎంసీలను మాత్రమే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ద్వారా వాడుకుంటామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. 16.5 టీఎంసీలే వాడుకునే పక్షంలో ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. ఆ ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని ఏపీ అధికారులు డిమాండ్ చేశారు. ఆర్డీఎస్‌పై సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం రాజోలిబండ డైవర్షన్‌స్కీం (ఆర్డీఎస్) చివరి ఆయకట్టు భూములకు నీళ్లందించడానికి వీలుగా దాన్ని ఆధునీకరించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. కాగా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో అధ్యయనం చేయించి.. ఆ నివేదిక ఆధారంగా ఆధునికీకరణపై నిర్ణయం తీసుకుందామని గత సమావేశంలో బోర్డు తీర్మానించిన అంశాన్ని ఏపీ అధికారులు గుర్తుచేయగా, అందుకు బోర్డు చైర్మన్ అంగీకరించారు. ఆర్డీఎస్ కుడి కాలువను ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిందని తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆర్ఎంసీ పునరుద్ధరణ.. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగుల వద్ద నీటి నిల్వ లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శ్రీశైలం జలాశయంలో ఏపీకి 34 టీఎంసీల వాటా మాత్రమే ఉందని, దీనికి కట్టుబడితేనే జల విద్యుదుత్పత్తిపై చర్చకు అంగీకరిస్తామని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. జలవిద్యుదుత్పత్తి కోసమే శ్రీశైలం జలాశయం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదాల పరిష్కారానికి గతంలో ఏర్పాటుచేసిన రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ)ని మళ్లీ పునరుద్ధరించాలని బోర్డు చైర్మన్ నిర్ణయించారు. బోర్డు సభ్యులు అజయ్కుమార్గుప్తా అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్ సీలు, జెన్కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని పునరుద్ధరించారు. నెలలోగా రూల్ కర్వ్స్, జల విద్యుదుత్పత్తి నిబంధనలు, వరద జలాల మళ్లింపుపై నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. 50 శాతం వాటా ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి. 2015లో కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు 2015–16 నీటి సంవత్సరానికి మాత్రమే. పాత పద్ధతిలో పంపిణీ చేస్తే అంగీకరించం. తదుపరి నిర్ణయం కోసం మా అభ్యంతరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని కృష్ణా బోర్డు హామీనిచి్చంది. తద్వారా ఈ విషయంలో ఒక అడుగు ముందుకుపడింది. – రజత్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ట్రిబ్యునలే నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునే అధికారం కృష్ణా బోర్డుకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. కేవలం ట్రిబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీచేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ 2015లో తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు తాత్కాలిక సర్దుబాటు కొనసాగించక తప్పదు. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ -
వివాదాల ముగింపునకు సిద్ధం.. నేడు కృష్ణాబోర్డు సర్వసభ్య సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ అధ్యక్షతన 17వ సర్వ సభ్య సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో జలాల పంపిణీతో సహా 21 అంశాలతో అజెండాను ఖరారు చేసింది. కృష్ణా తాగు నీటి సరఫరా పథకం ఒకటి, రెండు, మూడు దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. ఇందుకోసం నాగార్జున సాగర్ జల విస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అభ్యంతరం తెలిపింది. సుంకిశాల ఇన్‌టేక్ వెల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలిపివేయాలని బోర్డును కోరింది. నీటి కేటాయింపులు లేనందున పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతిని కూడా సీడబ్ల్యూసీ తిరస్కరించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్డీఎస్ను మరోసారి ప్రస్తావించేందకు తెలంగాణ సిద్ధమైంది. గెజిట్ నోటిఫికేషన్ అమలయ్యేనా? బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్నెళ్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు పొడిగించినా నోటిఫికేషన్ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దీనిపై రెండు రాష్ట్రాలను ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో 66 శాతం (512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015 జూన్ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేయడంతో నీటి పంపిణీపై కూడా బోర్డు చర్చించనుంది. హిందీలో కార్యకలాపాలా? కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్ శక్తి శాఖ కోరుతోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకు హిందీ భాషలో ప్రావీణ్యం లేదు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్ శక్తిశాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులు రికవరీ చేయాలన్న కేంద్రం ఆదేశాలపైనా చర్చించనున్నారు. -
శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావే..
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో అంగీకరించిన వాటా కంటే తెలంగాణ సర్కార్ అధికంగా 90.36 టీఎంసీలు వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాగునీటి అవసరాలు, ఉద్యాన పంటలు, సాగు చేసిన పంటలను రక్షించుకోవడం కోసం సాగర్ కుడి కాలువకు 6, ఎడమ కాలువకు 1 టీఎంసీని విడుదల చేస్తూ తక్షణమే ఉత్తర్వులివ్వాలని కోరింది. ఈ మేరకు గురువారం కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలివీ.. ♦ దిగువ కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో లభ్యతగా ఉన్న జలాలు 961.07 టీఎంసీలు. ఇందులో అంగీకరించిన మేరకు ఏపీ వాటా 634.30 టీఎంసీలు(66 శాతం) తెలంగాణ వాటా 326.77 టీఎంసీలు(34 శాతం). ♦ ఈ నెల 12 వరకూ ఏపీ 470.63 టీఎంసీలు, తెలంగాణ 417.13 టీఎంసీలు వాడుకున్నాయి. వీటిని పరిశీలిస్తే.. ఏపీ కోటా కింద ఇంకా 163.67 టీఎంసీలు మిగిలాయి. తెలంగాణ సర్కార్ కోటా కంటే ఎక్కువగా 90.36 టీఎంసీలు అధికంగా వాడుకుంది. ♦ ఈ నెల 12 నాటికి శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న 126.01 టీఎంసీలన్నీ ఏపీవే. ఆ రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేసి, దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించండి. -
కృష్ణా జలాల వినియోగం.. ఎక్కువ వాడేశారు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. తాత్కాలిక కోటా ప్రకారం కృష్ణా జలాల్లో ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం వాటాలున్నాయి. అయితే ఈ వాటాలకు మించి కృష్ణా జలాలను వాడుకున్నట్టు రెండు రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి. ఇకపై కృష్ణా జలాలను తరలించుకోకుండా ఏపీని నిలువరించాలని తెలంగాణ, తెలంగాణను నిలువరించాలని ఏపీ డిమాండ్ చేశాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే అధ్యక్షతన సమావేశమయ్యింది. ఏపీ ఈ భేటీకి గైర్హాజరైనప్పటికీ తెలంగాణపై ఆరోపణలు చేస్తూ లేఖను పంపింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ సమావేశానికి హాజరై ఏపీ కోటాకి మించి జలాలను వాడుకున్నట్టు ఆరోపించారు. మా మిగిలిన నీళ్లను పరిరక్షించండి: తెలంగాణ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 నాటికి 971.29 టీఎంసీల కృష్ణా జలాలు రాగా, ఏపీ 619.047 టీఎంసీలు (74.45 శాతం), తెలంగాణ 212.885 టీఎంసీలు (25.55) వాడినట్టు మురళీధర్ చెప్పారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఏపీ ఇప్పటికే 38.723 టీఎంసీలను అదనంగా వినియోగించిందంటూ.. తెలంగాణకు మిగిలిన ఉన్న 108.901 టీఎంసీల వాటాను పరిరక్షించాలని కోరారు. ఇకపై శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించుకోకుండా ఏపీని అడ్డుకోవాలని చెప్పారు. నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా కృష్ణా డెల్టాకు రోజుకు టీఎంసీ నీటిని ఏపీ తరలిస్తోందని, దీనిని తక్షణమే నిలుపుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. వరద జలాల వినియోగాన్ని విస్మరించినా, ఏపీ కోటాకు మించి నీళ్లను వాడిందని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి నాగార్జునసాగర్ అవసరాలను తీర్చడానికి మాత్రమే తాము జలవిద్యుత్ ఉత్పత్తి చేశామని, ఆ నీరంతా సాగర్‌లోకి చేరిందని వాదించారు. ఈ మేరకు ఆయన ఇటీవల కృష్ణాబోర్డుకు లేఖ కూడా రాశారు. ఆ నీటిని మా కోటాలో లెక్కించొద్దు: ఏపీ ఏపీ లేఖలో లేవనెత్తిన అంశాలను రాయిపురే సమావేశంలో వివరించారు. ‘జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ నీటిని వృథా చేసింది. వరదల సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిన తర్వాత సముద్రంలోకి నీరు వెళ్తున్నప్పుడు తరలించే నీటిని మా కోటాలో లెక్కించరాదు. ఈ సమావేశాన్ని వాయిదా వేసి మళ్లీ ఏప్రిల్ తొలివారంలో నిర్వహించండి..’అని ఏపీ కోరినట్లు తెలిపారు. అయితే సమావేశం జరిగినట్టు పరిగణించి తాము లేవనెత్తిన అంశాలను రికార్డు చేయాలని మురళీధర్ కోరారు. 201 టీఎంసీలు సముద్రం పాలు గత ఫిబ్రవరి 28 నాటికి 972.46 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, తాత్కాలిక కోటాల ప్రకారం అందులో తమకు 641.82 టీఎంసీలు, తెలంగాణకు 330.64 టీఎంసీల వాటా ఉందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. అందులో ఏపీ 442.52 టీఎంసీలు (52.2శాతం), తెలంగాణ 404.2 టీఎంసీలు (47.8 శాతం) వాడినట్టు పేర్కొన్నారు. వాటా ప్రకారం ఏపీకి 199.31 టీఎంసీలు మిగిలి ఉండాల్సి ఉండగా, 125.75 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. తెలంగాణ కోటాకు మించి 82.08 టీఎంసీలను వాడినట్టు ఆరోపించారు. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఆయన తాజాగా లేఖ రాశారు. ఉమ్మడి జలాశయాల్లో ఏపీకి ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉన్నాయన్నారు. వరదలు లేని సమయంలో ఇండెంట్ లేకుండా విద్యుదుత్పత్తి ద్వారా 201 టీఎంసీలను తెలంగాణ సముద్రంలో వృథాగా కలిపిందని, ఈ నీళ్లను సైతం ఆ రాష్ట్రం కోటాలో లెక్కించాలని డిమాండ్ చేశారు. -
కృష్ణా నీటికి తెలంగాణ కాకి లెక్కలు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో లేని వాటాను ఉన్నట్లు చూపించి, వాటినే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించి, ఆ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి కోరుతూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి తెలంగాణ దరఖాస్తు చేసింది. తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. నీళ్లే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని సీడబ్ల్యూసీని డిమాండ్ చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించి.. 12.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం 2015లో చేపట్టింది. అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్లో ఆమోదం పొందకపోతే ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోనివ్వబోమని తెలంగాణకు కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. మరోపక్క ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఏపీ ప్రభుత్వం, రైతుల వాదనతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏకీభవించి, తక్షణమే ఆ ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసిన తెలంగాణ సర్కార్‌కు గత డిసెంబర్ 12న రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకున్నాకే పనులు చేపట్టాలని నిర్దేశించింది. నీళ్లే లేవు.. కేటాయింపులెలా..? సీడబ్ల్యూసీకి చేసిన దరఖాస్తులో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులపై తెలంగాణ అధికారులు కాకిలెక్కలు వేశారు.– పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను.. సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నీటిలో రెండు రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ 45 టీఎంసీలూ తెలంగాణకే దక్కుతాయని వాదిస్తోంది. చిన్న నీటి పారదుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉండగా.. ఆ రాష్ట్రం 175.54 టీఎంసీలను వాడుకుంటోంది. అయినా చిన్న నీటి పారుదల విభాగంలో తమ వాటాలో ఇంకా 45.6 టీఎంసీల మిగులు ఉందంటోంది. ఈ రెండూ కలిపి 90.6 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయిస్తూ గత ఆగస్టు 18న తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ట్రిబ్యునల్‌ను అపహాస్యం చేయడమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. తీవ్ర అభ్యంతరం తెలిపిన ఏపీ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు తెలంగాణ సర్కారు లేని నీటిని కేటాయించిందంటూ సీడ బ్ల్యూసీకి ఏపీ జల వనరుల శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాగర్‌కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునే అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని వివరించారు. చిన్న నీటిపారుదల విభాగంలో కేటాయింపులకంటే ఇప్పటికే 86.39 టీఎంసీలను అధికంగా వాడుకుంటున్న తెలంగాణ.. వారికి కేటాయించిన నీటిలో 45 టీఎంసీల మిగులు ఉందని ఎలా వాదిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీకి వివరిస్తూ.. నీళ్లే లేని ఆ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితు ల్లోనూ అనుమతి ఇవ్వొద్దని గట్టిగా కోరారు. హక్కులు తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నీరే లేకుండా 2015లో తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవడంలో నాటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన చంద్రబాబు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రజల హక్కులను ఆ రాష్ట్రానికి తాకట్టు పెట్టారు. దీన్ని నిరసిస్తూ.. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో జలదీక్ష చేశారు. అయినా టీడీపీ సర్కారు స్పందించకపోవడంతో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేయాలని కనీసం డిమాండ్ చేసే సాహసం కూడా చంద్రబాబు చేయలేకపోయారు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ పోరాటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించారు. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలోనూ ఇదే వాణిని విన్పించారు. దాంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), నెట్టెంపాడు (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథను నిలిపివేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు తెలంగాణ సర్కారును ఆదేశించాయి. అనుమతి తీసుకున్నాకే ఈ ప్రాజెక్టుల పనులు చేపట్టాలని తెలంగాణ సర్కారుకు నిర్దేశించాయి. -
70 లేఖలు రాసినా స్పందన లేదు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని పలు అంశాల అమలు కోరుతూ 70కి పైగా లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ లేఖలపై ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో రాసిన 70 లేఖల జాబితాతో పాటు ఆ లేఖల్లోని ముఖ్యాంశాలను తాజాగా రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు నిర్వహించనున్న రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో బోర్డు అధికారులను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ ఈ లేఖను రాయడం విశేషం. వివరాలివీ... ► రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8ఏ) ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతో పాటు అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు తప్పనిసరి అని గుర్తు చేశారు. 20% జలాలను తాగునీటికి వినియోగించాలని కృష్ణా ట్రిబ్యునల్–1 పేర్కొనగా, నీటి లెక్కల్లో దీన్ని కృష్ణా బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలంగాణ తప్పుబట్టింది. ► వాడుకోని వాటా జలాలను తెలంగాణ మరుసటి జల సంవత్సరానికి బదలాయింపు(క్యారీ ఓవర్) చేస్తుండగా, ఈ జలాలను మరుసటి ఏడాది తెలంగాణ వాటా జలాల కింద లెక్కించవద్దని చేస్తున్న విజ్ఞప్తులను కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని స్కీం–ఏ కేటాయింపుల కింద ‘క్యారీ ఓవర్’జలాలను మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు. ► ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపులను తెలంగాణ రాష్ట్రం ఇకపై ఏ మాత్రం అంగీకరించ దు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం హ క్కులున్నప్పటికీ 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కే టాయింపులు జరపాలని ఎన్నో లేఖలు రాశాం. ► శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు విధివిధానాల(రూల్‌కర్వ్)రూపకల్పనలో సీడబ్ల్యూసీ వినియోగించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేఆర్ఎంబీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. శ్రీశైలం జలాశయంలో వాటాదారుడిగా రూల్‌కర్వ్ పరిశీలనల కోసం ఈ సమాచారం మాకు అవసరం. చెన్నై వాటర్ సప్లై ఒప్పందాల ప్రకారం..కేవలం 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో గల కాల్వ ద్వారా 15 టీఎంసీలను మాత్రమే తరలించడానికి హెడ్‌వర్క్స్ నిర్మించాలి, ఈ నిబంధన అమలుకు కేంద్రం తనిఖీలు జరపాల్సి ఉంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారం కూడా కావాలి. ఈ నిబంధన మేరకు రూల్‌కర్వ్‌ను సవరించాలి. ► గోదావరి ట్రిబ్యునల్ ఒప్పందంతో పాటు పోల వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతు లప్రకారం.. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా సిస్టం వాటాలో 80 టీఎంసీలను తగ్గించాలి. దీనికి విరుద్ధంగా సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్‌లో నాగార్జునసాగర్నుంచి కృష్ణా డెల్టా సిస్టంకు జరిపిన కేటాయింపులను తొలగించాలి. ► బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా శ్రీశైలంలో 76:24 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు విద్యుదుత్పత్తి చేసుకునేందుకు వీలుకల్పించేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. తెలంగాణ పరిధిలోని బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు 160 టీఎంసీలను కేటాయించడంతో పాటు శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలి అవసరాలకు ఏపీ చేస్తున్న తరలింపులను 34 టీఎంసీలకు పరిమితం చేసేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తో అనుసంధానమై ఉన్న అన్ని కాల్వలకు రియల్ టైం డేటా అక్విసైషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి నీటి తరలింపులను కచ్చితంగా లెక్కించాలి. శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ జరపాలి. ఇదీ చదవండి: అదేమో గానీ.. పార్టీని మాత్రం ఎవరూ కాపాడలేరు -
17న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధివిధానాలను రూపొందించేందుకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) అక్టోబర్ 17న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే అంశంపై నియమావళి (రూల్ కర్వ్), విద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ముసాయిదా నివేదికను ఖరారు చేసేందుకు ఆగస్టు 23న సమావేశం కావాలని ఆర్ఎంసీ చైర్మన్ ఆర్కే పిళ్లై తొలుత నిర్ణయించారు. కానీ, ఆ సమావేశం వాయిదా వేయాలని రెండు రాష్ట్రాలు కోరడంతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కార్ మళ్లీ వాయిదా వేయాలని కోరింది. దీంతో అక్టోబర్ 17వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు నిర్వహించనుంది. -
కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపూరంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా జలాల ఆధారంగా పంప్డ్ స్టోరేజీ కాన్సెప్‌్టతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని సెక్షన్ 84, 85లకు విరుద్ధమని స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాకే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కేఆర్ఎంబీ/అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన అన్ని కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలంటూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఇటీవల లేఖ రాశారు. నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి నీళ్లను వెలుపల ప్రాంతానికి తరలించి జల విద్యుదుత్పత్తికి వినియోగించడం తీవ్ర అభ్యంతకరమని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనులను నిలుపుదల చేయించాలని కోరుతూ గతంలో రెండుసార్లు లేఖ రాశామని గుర్తు చేశారు. ఈ నెల 17న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. గతంలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. గాలేరు–నగరికి అనుమతి ఉంది: ఏపీ అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాల్వ ద్వారా గోరకల్లు రిజర్వాయర్‌కు వచ్చే నీళ్లను మిగులు విద్యుత్ ఉండే సమయాల్లో మరో రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఇందుకోసం కొత్త రిజర్వాయర్‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. విద్యుత్ కొరత ఉండే వేళల్లో ఈ కొత్త జలాశయం నుంచి నీళ్లను జలవిద్యుదుత్పత్తి ద్వారా దిగువన ఉండే గోరకల్లు రిజర్వాయర్‌కు మళ్లీ విడుదల చేస్తారు. కొత్త రిజర్వాయర్‌పై జలవిద్యుత్ కేంద్రం సైతం నిర్మిస్తున్నారు. పంప్డ్ స్టోరేజీ పద్ధతిలో విద్యుత్‌ను నిల్వ చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. వరద జలాల ఆధారంగా హంద్రీ నీవా సు జల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులున్న నేపథ్యం లో ఈ పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్రి్టక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తావు లేదని ఏపీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్‌కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
కృష్ణా బోర్డు తీరు సరికాదు!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలను కృష్ణా బోర్డు ఏపీ కోటాలో కలపడంపై సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. ఈ నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. రెండేళ్లయినా నివేదిక ఇవ్వని సీడబ్ల్యూసీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. దాంతో.. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. కానీ, 2020 మేలో రెండు రాష్ట్రాల జలనవరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత దీనిపై సీడబ్ల్యూసీ దృష్టిసారించకపోవడమేకాక.. నివేదిక కూడా ఇవ్వలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులు వరద ప్రవాహం వృథాగా సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ నివేదిక వచ్చే వరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2020–21లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. మళ్లించకపోతే వరద ముప్పే నిజానికి.. శ్రీశైలం నుంచి కృష్ణా వరదను మళ్లించకపోతే దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర ముప్పు తప్పదు. అందుకే విభజన చట్టంలో సెక్షన్–85 (7) ప్రకారం విపత్తు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అప్పగించింది. ఆ చట్టం ప్రకారం వరద ముప్పును తప్పించడానికి ఏపీ సర్కార్ మళ్లించిన వరద జలాలను నికర జలాల కోటాలో కలపడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీ నివేదిక ఇవ్వలేదనే సాకుచూపి.. ఏపీ ప్రయోజనాలను పరిరక్షించకపోవడం సరికాదంటున్నారు. -
ఏపీకి 21, తెలంగాణకు 92 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన కోటా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 21, తెలంగాణకు 92 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నీటి మట్టం అడుగంటినందున, నాగార్జున సాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసిన జలాలను తాగు నీటి అవసరాలకు వాడుకోవాలని తెలంగాణకు సూచించింది. రబీలో సాగు నీరు, వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగు నీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఏపీ ఈఎన్సీ ప్రతినిధిగా కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌లు పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో ఉన్న 953 టీఎంసీల్లో 629 టీఎంసీలు (66 శాతం) ఏపీకి, 324 టీఎంసీలు (34 శాతం) తెలంగాణకు దక్కుతాయని రాయ్‌పురే తేల్చారు. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదంటూ ఏపీ సీఈ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం తెలిపారు. మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించాల్సిందేనని ఆయన చేసిన డిమాండ్‌కు రాయ్‌పురే అంగీకరించారు. మళ్లించిన వరద జలాలతో కలుపుకొని ఏపీ ఇప్పటిదాకా 608, తెలంగాణ 232 టీఎంసీలు వాడుకున్నట్లు బోర్డు తేల్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 113 టీఎంసీల్లో ఏపీకి 21, తెలంగాణకు 92 టీఎంసీలను కేటాయించింది. అనుమతి లేని ప్రాజెక్టులు ఆపేయాలా? కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయి ఆర్నెల్లు పూర్తయినందున, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని వచ్చే నీటి సంవత్సరం నుంచి ఆపేయాలని రాయ్‌పురే కోరారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూల్ ద్వారా ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు (సామర్థ్యం పెంచనివి) ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించిందని, వాటికి మళ్లీ అనుమతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా గెజిట్ నోటిఫికేషన్‌ను అబయన్స్‌లో పెట్టాలని కేంద్ర జల్ శక్తి శాఖను కోరినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. దీంతో ఈ అంశంపై బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చిద్దామని రాయ్‌పురే చెప్పారు. మిగిలిన పది టీఎంసీలు ఏపీకి ఇవ్వండి నీటి సంవత్సరం ముగిసే మే 31 లోగా కోటా నీటిని వాడుకోవాలని, లేదంటే మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగు, తాగు నీటి అవసరాలకు 82 టీఎంసీలకు తెలంగాణ ప్రతిపాదన పంపినందున, ఆ రాష్ట్ర కోటాలో మిగిలిన 10 టీఎంసీలను తమకు కేటాయించాలని ఏపీ సీఈ కోరారు. దీనిపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. -
‘పాలమూరు’ వ్యయం రూ.52,056 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశలో కేవలం తాగునీటి అవసరాల పేరిట ప్రధాన పనుల వరకే ప్రాథమిక అంచనా రూపొందించారు. ఆ మేరకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా..ప్రస్తుతం సాగు నీటికి సంబంధించిన కాల్వల పనులు జత చేశారు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.52,056 కోట్లకు చేరనుంది. అంటే అదనంగా రూ.16,856 కోట్ల మేర వ్యయం పెరగ నుందన్నమాట. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) లో ఈ వివరాలను పొందుపరిచిన నీటి పారుదల శాఖ.. ప్రభుత్వ అనుమతి అనంతరం వీటిని కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డుకు సమర్పించనుంది. 60 రోజులు .. రోజుకు 1.5 టీఎంసీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 60 రోజుల్లో రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీటిని తీసుకుంటూ మొత్తంగా 90 టీఎంసీల వరద జలాలతో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగం గా నార్లాపూర్ రిజర్వాయర్ 8.51 టీఎంసీలు, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 17.34, ఉద్దండాపూర్ 15.91, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను 2.80 టీఎంసీల తో ప్రతిపాదించారు. ఈ మొత్తం ప్రతిపాదనలకు 2015లో రూ.35,200 కోట్లతో పరిపాలనా అనుమ తులు ఇచ్చారు. అందుకనుగుణంగా డిజైన్లు ఖరారు చేసి నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకే జీలతో రూ.29,333 కోట్లకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలకు సంబంధించి ఇంతవరకు రూ.15,810 కోట్ల పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాన కాల్వ నుంచి వ్యవసాయ అవసరాలకు నీటిని మళ్లించే ఇతర కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం మాత్రం చేపట్టలేదు. అయితే కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసుల సందర్భంగా తాము ప్రస్తుతం చేపట్టిన పనులన్నీ తాగునీటి అవసరాల మేరకేనని, తొలి దశలో తామిచ్చిన పరిపాలనా అనుమతులు కానీ, చేస్తున్న పనులన్నీ తాగునీటి అవసరాలు తీర్చేందుకేనని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తుది అంచనాల్లో ఇలా.. ప్రస్తుతం కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయాలను కలుపుకొని తుది అంచనాలు సిద్ధం చేసింది. అందులో ప్రధాన పనులు (హెడ్ వర్క్స్), ఐదు లిఫ్టులు కలుపుకొని వీటికి రూ.40,515.98కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపింది. రెండో దశలో కాల్వల వ్యవస్థ, వాటికింద డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి రూ.8,069.03 కోట్లు, వీటికి అదనంగా పంపింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.3,471.31 కోట్లు కలిపి మొత్తంగా రూ.52,056.32 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ఇప్పటికే ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసినప్పటికీ అనుమతుల కోసం ఇంకా కేంద్రానికి పంపలేదు. అలాగే డీపీఆర్ కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పినప్పుడు మాత్రమే సమర్పించి అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టాలని సాగునీటి శాఖ భావిస్తోంది. -
సెప్టెంబర్ 1నే ‘గెజిట్’పై చర్చ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పూర్తి స్థాయి భేటీ జరగనున్న సెప్టెంబర్ ఒకటినే కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌పై మరోమారు తెలుగు రాష్ట్రాలతో చర్చించాలని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్ణయించాయి. ఈ మేరకు రెండు బోర్డులు విడివిడిగా తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. కృష్ణా బోర్డు భేటీ 1వ తేదీ ఉదయం 11 గంటలకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తూ గోదావరి బోర్డు గురువారం ఉదయం తెలంగాణ, ఏపీలకు లేఖలు రాసింది. గెజిట్‌లోని బోర్డులకు నిధుల విడుదల, ప్రాజెక్టుల వివరాల సమర్పణ, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేలా ఎజెండా ఖరారు చేసింది. మరోవైపు గురువారం సాయంత్రం కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. గెజిట్‌పై చర్చించేందుకు గోదావరి బోర్డు భేటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, అదే భేటీలో కృష్ణా బేసిన్‌కు నంబంధించిన అంశాలపైనా చర్చిద్దామని ప్రతిపాదించింది. -
సన్నాహకాలు మాత్రమే చేశాం
సాక్షి, అమరావతి/పగిడ్యాల/జూపాడు బంగ్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సన్నాహకాలను మాత్రమే తాము చేస్తున్నట్టు కృష్ణా బోర్డు కమిటీకి బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల స్థాయి నుంచే సాగునీటి ప్రాజెక్టులు, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 6.9 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని తెలిపారు. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. తెలంగాణ చర్యలతో శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువకు పడిపోవడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ద్వారా నీటిని అందించలేని దుస్థితి నెలకొందన్నారు. అలాగే చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో తమ వాటా నీటిని వినియోగించుకుని ఆయా ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం తలపెట్టామన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్–చెన్నై ఆదేశాల మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన.. ఎల్బీ మూయన్తంగ్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ దర్పన్ తల్వార్ సభ్యులుగా కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం కర్నూలు జిల్లాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన అలైన్‌మెంట్‌ను రద్దు చేశామని బోర్డు కమిటీకి తెలిపారు. పర్యావరణపరంగా సమస్యలు రాని కొత్త అలైన్మెంట్ ప్రకారం సీమ ఎత్తిపోతల పథకానికి సన్నాహకాలు చేపట్టామన్నారు. ఈ ఏడాది శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పుడే తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిరంతరాయంగా కొనసాగించిందన్నారు. ఒకానొక దశలో శ్రీశైలం ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసిందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ల దృష్టికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారని వివరించారు. ఏపీ హక్కులను తెలంగాణ సర్కార్ కాలరాస్తుండటంతో.. తమ హక్కులను పరిరక్షించుకోవడానికే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించిన అంశాలు.. క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ నెల 16న ఎన్జీటీకి నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ డీఎం రాయ్‌పురే చెప్పారు. పర్యావరణ సమస్యలకు ఆస్కారం లేదు.. పర్యావరణ సమస్యలకు ఆస్కారం లేకుండా సంగమేశ్వరం నుంచి భవనాశి నది ప్రవాహమార్గంలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వరకూ 8 కి.మీల పొడవునా అప్రోచ్ చానల్ తవ్వి... అక్కడ పంప్ హౌస్ నిర్మించి.. నీటిని ఎత్తిపోసి.. 500 మీటర్ల దూరంలోని ఎస్సార్ఎంసీలోకి తరలించేలా అలైన్‌మెంట్‌ను మార్చామని అధికారులు కమిటీకి తెలిపారు. ఈ అలైన్మెంట్ ప్రకారం పనులు చేస్తే పర్యావరణపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఇదే అంశాన్ని ఎన్జీటీకి వివరించామని చెప్పారు. ముచ్చుమర్రి నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదిత ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు కమిటీని జలవనరుల అధికారులు తీసుకెళ్లారు. అక్కడ పంప్ హౌస్ పునాది కోసం చేసిన ఏర్పాట్లను కమిటీ పరిశీలించింది. జియాలజిస్టుల సూచనల మేరకు నేల స్వభావాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇవన్నీ ఎత్తిపోతల పథకం చేపట్టడానికి సన్నాహకాలు మాత్రమేనని తేల్చిచెప్పారు. ఎన్జీటీ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం విషయమై డీపీఆర్, పర్యావరణ అనుమతులకోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు మంజూరయ్యాకే నిర్మాణ పనులు చేపడతామన్నారు. కాగా, రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని మీడియా అడిగిన ప్రశ్నకు కమిటీ సభ్యులు సమాధానం దాటవేశారు. ఆ అలైన్మెంట్ రద్దు.. కృష్ణా బోర్డు కమిటీని జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డిలు తొలుత ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్దకు తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేందుకు తొలుత ముచ్చుమర్రి వద్దే పంప్ హౌస్ నిర్మించి.. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తామన్నారు. వాటిని 22 కి.మీల పొడవునా తవ్వే కాలువ ద్వారా తరలించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్సార్‌ఎంసీ)లో 4 కి.మీ వద్ద పోసేలా రాయలసీమ ఎత్తిపోతలను తలపెట్టామని కమిటీకి వివరించారు. కానీ ఈ అలైన్మెంట్ ప్రకారమైతే పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించారని చెప్పారు. ఎన్జీటీ అభిప్రాయం మేరకు ఆ అలైన్‌మెంట్‌ను రద్దు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే నీటి వినియోగంపై ఆరా తీశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు, మల్యాల లిఫ్ట్‌ల నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారని ప్రశ్నించగా చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్‌రెడ్డి కోర్టు ఉత్తర్వుల మేరకే నీటిని వాడుకుంటున్నామని వివరించారు. -
‘కృష్ణా’లో వరద హోరు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం.. పి.గన్నవరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ దిగువకు వదులుతున్న 25,427 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని కూడా తెలంగాణ సర్కార్ దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 37,712 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాలువలకు 4,322 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 33,390 క్యూసెక్కులను 45 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 35 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. మరోవైపు వరద ఉధృతితో తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దీంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. గోదా‘వడి’ తగ్గింది.. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 5,76,833 క్యూసెక్కుల వరద చేరింది. స్పిల్ వే వద్ద వరద నీటిమట్టం 31.88 మీటర్లకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్ వే 42 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 7,93,468 క్యూసెక్కులకు తగ్గడంతో నీటిమట్టం 10.85 మీటర్లకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 10,200 క్యూసెక్కులు వదిలి.. మిగులుగా ఉన్న 7,83,268 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద మంగళవారం మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న అనగర్లంక, పెదమల్లంక, సిర్రావారిలంక, అయోధ్యలంక, కనకాయలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
చెరిసగం పంచాలి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ప్రస్తుత వాటర్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. 2021–22 వాటర్ ఇయర్లో తాత్కాలిక పద్ధతిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు 50ః50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని విన్నవించింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేయలేదని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకున్నాయని గుర్తుచేసిన ఆయన.. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేసేవరకు తాత్కాలిక పద్ధతిలోనే నీటి పంపకాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న విషయాలు..: కృష్ణా బోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీల మధ్య 34ః66 నిష్పత్తిలో ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయించాం. ►పరీవాహకం, సాగు యోగ్యమైన భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.9ః 29.2 శాతంగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తన అవసరాలను 771 టీఎంసీలుగా పేర్కొంటూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు డిమాండ్ పెట్టాం. 1976లోని బచావత్, 2013 బ్రిజేశ్ ట్రిబ్యునల్స్ బేసిన్ అవతలి ప్రాంతాలకు అనుమతించడానికి ముందు బేసిన్ లోపలి ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. ►బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డులోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యతగా ఉండే నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి. ►ఆమోదం, గుర్తింపు లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి ఏపీ రోజుకు 4.7 టీఎంసీల మేర నీటిని మళ్లించుకుంటోంది. మళ్లించిన కృష్ణా నీటిని నిల్వ చేసుకునేందుకు పెన్నా, ఇతర బేసిన్లలో 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ఉన్నాయి. తెలంగాణకు మాత్రం రోజుకు 0.28 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోతల ద్వారా తీసుకునే సామర్థ్యం ఉంది. ►బేసిన్ అవతలికి కృష్ణా నీటి తరలింపును రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. మొదట బేసిన్‌లోని బీడు భూములకు నీళ్లిచ్చాకే బేసిన్ బయటకు తరలించాలని డిమాండ్ చేశారు. ►తెలంగాణ ఆవిర్భవించిన ఏడేళ్లు గడిచినా కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ భూములకు నీరు రాలేదు. కృష్ణా నీళ్లను ఏపీ వేరే బేసిన్‌కు తరలిస్తోంది. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/అచ్చంపేట/కర్నూలు సిటీ: ఎగువన గల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువ నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా.. అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలాశయంలోని నీటిమట్టం 41.11 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతుండగా.. నాగార్జున సాగర్‌లోకి 9వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సాగర్ నీటిమట్టం 169.71 టీఎంసీలకు చేరింది. 44.18 టీఎంసీలకు చేరిన పులిచింతల పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నాగార్జున సాగర్, కృష్ణా పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నీటి నిల్వ 44.1813 టీఎంసీలకు చేరింది. జెన్కో పవర్ జనరేషన్‌కు 13,800 క్యూసెక్కులు వదలడం అనివార్యమైందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ తెలిపారు. ఒక రేడియల్ గేటును మూడు అడుగుల మేర ఎత్తి 11వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నామన్నారు. మరో 600 క్యూసెక్కులు రేడియల్ లీకేజీ వల్ల దిగువకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 175 అడుగుల సామర్థ్యానికి గాను 173 అడుగుల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ఇది 44.18 టీఎంసీలకు సమానమని చెప్పారు. తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో తుంగభద్ర డ్యామ్‌లోకి నీటి ప్రవాహం పెరిగింది. శనివారం 40 వేల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం ఆదివారం నాటికి 58 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం డ్యామ్‌లో 50 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో సాగు నీటి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు జిల్లాలకు ఉపకరించే తుంగభద్ర ఎడమ కాలువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. -
కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేయడం శుభపరిణామం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: నీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయటం శుభపరిణామమం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జీవీఎల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం శుభపరిణామమని జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే దిశగా తమ వాణి వినిపిస్తామని పేర్కొన్నారు. -
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
సాక్షి, అమరావతి: తెలంగాణ సర్కార్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తుండటం వల్ల కృష్ణా జలాలు కడలి పాలవుతున్నాయని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేక సార్లు ఫిర్యాదు చేసింది. ఈ వివా దంపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు 2న రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన విషయం విదితమే. -
పూర్తిస్థాయి భేటీలోనే చర్చిద్దాం..
చర్చకు కోరిన అంశాలు ఇలా.. ►ఇప్పటివరకు కృష్ణా జలాలకు సంబంధించి ఉన్న నీటి వాటాల నిష్పత్తిని ఈ ఏడాది నుంచి మార్చాలి. ►ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఆపేలా చర్యలు తీసుకోవాలి ►పోతిరెడ్డిపాడు ద్వారా ఇతర బేసిన్, ఇతర ప్రాజెక్టులకు అదనంగా నీటి తరలింపుపై చర్యలు తీసుకోవాలి ►బచావత్ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన వెంటనే, కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటాను తెలంగాణకు కేటాయించాలి. ►తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిలో 20 శాతం వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ►బోర్డు ఇచ్చిన నీటి విడుదల ఆదేశాల్లో తెలంగాణ పొదుపు చేసిన జలాలను పక్కాగా లెక్కించాలి. సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలకు సంబంధించి నెలకొన్న వివిధ వివాదాల తీవ్రత దృష్ట్యా వాటిపై చర్చించేందుకు పూర్తిస్థాయి భేటీ నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వివాదాస్పదమైన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, జూలై 20 తర్వాత తెలంగాణ, ఏపీలకు ఆమోదయోగ్యమైన తేదీల్లో సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులను ఆరంభించే పనుల్లో తెలంగాణ సాంకేతిక బృందాలు తీరిక లేకుండా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, త్రిసభ్య కమిటీ భేటీని కాకుండా పూర్తిస్థాయి సమావేశం జరపాలని ఆయన బోర్డును కోరారు. బోర్డుకు ఏపీ రాసిన లేఖలను ఆధారంగా చేసుకొని సభ్య కార్యదర్శి ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేశారని పేర్కొంటూ, ఈ మేరకు రాసిన లేఖలో సభ్య కార్యదర్శి కేవలం ఏపీ లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించడంపై విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలనుఇందులో చేర్చలేదని తెలిపారు. బోర్డు పూర్తిస్థాయి భేటీలో చర్చించాల్సిన ఆరు అంశాలను రజత్‌కుమార్ తన లేఖలో పొందుపరిచారు. విద్యుత్ అవసరాలకే శ్రీశైలం ఇలావుండగా కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ అవసరాల కోసం నిర్మించినదేనని రజత్‌కుమార్ మరోమారు పునరుద్ఘాటించారు. తెలంగాణ పూర్తిగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉందని, ఖరీఫ్‌లో సాగుకు నీరందిం చాలంటే భారీగా విద్యుత్ అవసరాలున్నాయని తెలిపారు. ఈ దృష్ట్యానే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు నీటిని తరలించి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నామని వివరించారు. -
కృష్ణా జలాల వివాదంపై విచారణ రేపటికి వాయిదా
-
Krishna Water Dispute: కృష్ణా జలాలు.. చెరిసగం
కీలక తీర్మానాలు ఇవీ.. ♦కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఏపీ అక్రమంగా పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్టు పథకాలను చేపడుతోంది. మేం వాటిని గుర్తించం. ♦ పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్టు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ బోర్డు సమావేశంలో వాదనలను వినిపించాలి. ♦ జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలి.. చెరువులను, కుంటలను నింపాలి. ♦కృష్ణాజలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్‌బ్లాక్ (గుండుగుత్త) కేటాయింపులు చేసిన, నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఏపీ నీటిని వాడుకోవాలి. ♦9న కృష్ణా బోర్డు త్రిసభ్య భేటీని రద్దు చేయాలి. 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి. ♦ సమ్మక్క బ్యారేజీ, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలవాలి. ♦శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం డ్యామ్ వద్ద తెలంగాణ భూభాగంలోకి విద్యుత్ ఉద్యోగులను తప్ప వేరెవరినీ అనుమతించొద్దు. సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టాలని.. ఇకపై తెలంగాణ, ఏపీ చెరో సగం నీటిని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశం నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీని సరికాదని.. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాలని తీర్మానించింది. ట్రిబ్యునల్ తుది కేటాయింపులు జరిపేదాకా కూడా.. మొత్తం 811 టీఎంసీల నికర జలాల్లోంచి 405.5 టీఎంసీల (50%) నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని తీర్మానించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుత్, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పథకం తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. చట్టబద్ధంగానే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణాబోర్డుకు లేదని.. జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందాలు లేవని ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయపడింది. ఈ అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కారు పులిచింతలలో విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలను వృథా చేస్తోందంటూ ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా జిల్లా అవసరాలను వాడుకోవాలని.. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసే ఖర్చును మిగుల్చుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో సాగునీటిని ఎత్తిపోసేందుకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉందని సమావేశం పేర్కొంది. అందువల్ల ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని చట్టబద్ధంగా జల విద్యుదుత్పత్తి చేసుకుంటామని స్పష్టం చేసింది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులతో కాలుష్యం పెరిగిపోతోందని, ‘క్లీన్ ఎనర్జీ’ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చిందని.. తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా వాటిని అమలు చేస్తోందని పేర్కొంది. విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాటా నీటిని వాడుకుంటుంటే.. ఆపాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. రాయలసీమ లిఫ్టుపై ఇచ్చిన స్టేని ఉల్లంఘించినందుకు ఏపీ ప్రభుత్వ సీఎస్‌ను జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించిందని, అయినా సర్వే ముసుగులో నిర్మాణాలు చేపట్టడం దారుణమని అభిప్రాయ పడింది. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, జెన్కో డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వొకేట్ జనరల్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ‘‘తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు. నీటిని ఎత్తి పోసుకోవాలె. తెలంగాణలో 30 లక్షలకుపైగా బోర్లున్నాయి. మొత్తం విద్యుత్‌లో 40 శాతం దాకా సాగునీటి అవసరాలకే వినియోగమవుతోంది. తెలంగాణకున్న పరిస్థితుల దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుదుత్పత్తి కోసం కూడా నీరు అవసరం.’’ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా.. ‘‘కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా, ఎంతదూరమైనా కొట్లాడుతం. వలస పాలకులు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణలో వ్యవసాయాన్ని దండుగలా మార్చి రైతులకు అన్యాయం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రథమ ప్రాధాన్యతగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి.. సాగునీటి గోస తీర్చుకున్నం. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో కేటాయింపులున్న నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటం. ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేటాయించిన నదీ జలాలను వాడుకుంటం. పొరుగు రాష్ట్రాలు వారి వాటాను వినియోగించుకోవడానికి సంపూర్ణంగా సహకరిస్తం. కానీ కేటాయింపులు లేని నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరు..’’ అవసరమైతే కేంద్రంతో పోరు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్ అవసరాలు పూర్తిగా తీరాకనే.. అదీ మిగులు జలాలు ఉంటేనే ఇతర నదీ బేసిన్లకు నీటిని తీసుకెళ్లాలని.. ఈ నిబంధనను ఏపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం విద్యుత్ అవసరం పెరిగిందని.. ఈ మేరకు జల విద్యుదుత్పత్తి చేసి, లిఫ్టులను నడిపి సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని వివరించారు. తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జల విద్యుదుత్పత్తి చేస్తుందని, ఎవరూ అభ్యంతరం తెలపడానికి లేదన్నారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్లు, బోర్డులు, కోర్టుల్లో వివరిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, బయటా అనేకసార్లు ప్రకటించారని, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కూడా అదే విషయం చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరని కేసీఆర్ హెచ్చరించారు. ఎగువన ఉన్న మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేనివిధంగా, సహకరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని.. ఏపీ విషయంలోనూ ఇదే తీరులో స్నేహహస్తం సాచామని, అయినా ఏపీ పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. -
కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ సలహా కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 ప్రకారం విచారించేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర జల శక్తి శాఖ న్యాయ శాఖ సలహా కోరినట్లు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలో తెలపాలని న్యాయ శాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ ఇచ్చే సూచనల మేరకు జలశక్తి శాఖ ఈ విషయంలో ముందుకు వెళ్లనుంది. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను.. విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేసేలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గత నెల 16న రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ నిపుణుల సలహాతో ట్రిబ్యునల్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన హామీని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. -
రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు : పేర్ని నాని
-
మీరే తేల్చండి: కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: ఒక వాటర్ ఇయర్లో వినియోగించుకోలేని సాగునీటిని మరో ఏడాదిలో వినియోగానికి బదలాయించే (క్యారీ ఓవర్) అంశంపై కృష్ణా బోర్డు మరోమారు కేంద్రం తలుపు తట్టింది. గతేడాది కేటాయింపులున్నా, వినియోగించలేకపోయిన 51.21 టీఎంసీల నీటిని ఈ ఏడాది క్యారీ ఓవర్ చేయాలని కోరినా, ఈ విషయాన్ని బోర్డు పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆక్షేపిస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించాల ని కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట కృష్ణా బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. (చదవండి: నీటి వివాదాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కసరత్తు) బోర్డు తీరుపై అభ్యంతరం.. ఇప్పటికే క్యారీ ఓవర్ నీళ్లపై తెలంగాణ పలుమార్లు లేఖ రాయగా, దీనిపై బోర్డు చేతులెత్తేసింది. తెలంగాణ 2019–20 వాటర్ ఇయర్లో వాడుకోలేకపోయిన 51 టీఎంసీల నీళ్లను ప్రస్తుత సంవత్సరానికి బదలాయించడం సాధ్యం కాదంది. దీంతో బోర్డు తీరుపై తెలం గాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్–3 కింద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణపై ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంబించనుంది. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా మినిట్స్ రూపంలో వెలువడ్డాక... దానిలో కేంద్రం ఇచ్చే హామీల ఆధారంగానే పిటిషన్ ఉపసంహరించుకోవాలనే యోచనలో ఉంది. సెక్షన్–3 కింద దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రాష్ట్రం ఉపసంహరించుకుంటే తెలంగాణ వినతిని కొత్త ట్రిబ్యునల్‌కు లేక ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌కు రిఫర్ చేస్తామని స్పష్టమైన హామీ పొందాకే ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అవసరాలపై వాదనలు వినిపించే అవకాశం రాలేదు. పరవాహకం, ఆయకట్టు ఆధారంగా చూసినా రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాల్సి ఉంది. ఈ దృష్ట్యా కృష్ణా జలాల్లో న్యాయం జరిగేలా కొత్త ట్రిబ్యునల్‌తో పునః విచారణ చేయించండని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే సెక్షన్–3ను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని కోరింది. దీనిపై ఏడాదిలోగా నిర్ణయం చేయాల్సి ఉన్నా కేంద్రం ఇంతవరకూ స్పందించలేదు. ఏడాది వేచిచూశాక ఈ అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదే విషయాన్ని అపెక్స్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్ సెక్షన్–3పై సుప్రీంలో పిటిషన్ ఉన్నందున... ట్రిబ్యునల్‌కు రిఫర్ చేసే అంశం న్యాయ పరిధిలోకి వస్తుందని, తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకుంటే న్యాయ సలహా మేరకు కొత్త ట్రిబ్యునల్ లేదా ప్రస్తుత ట్రిబ్యునల్‌తో విచారణ చేయించేలా నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు. అపెక్స్ భేటీ అనంతరం మీడియా సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. బుధవారమే కేసు విత్‌డ్రా చేసుకుంటానని తెలంగాణ సీఎం చెప్పారంటూ షెకావత్ ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంటుందా? అన్న దానిపై అందరి దృష్టి పడింది. అయితే దీనిపై అధికారవర్గాలను కదిలించగా అపెక్స్‌లో కేంద్రం ఇచ్చిన హామీ అధికారికంగా మినిట్స్ రూపంలో రాష్ట్రానికి అందాల్సి ఉందని, అందులో విస్పష్టమైన హామీ ఉంటే పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరమేమీ లేదని తేల్చిచెప్పారు. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గోదావరి ట్రిబ్యునల్‌పై మౌనమే? ఇక, గోదావరి నదీ జల వివాదాల పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇరురాష్ట్రాల నుంచి వినతులు వస్తే ఏడాదిలోపు నిర్ణయం చేస్తామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. అయితే గోదావరిలో నీటి వినియోగం, వాటాలకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ అంటోంది. నికర జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందని, ఆ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెబుతోంది. నికర జలాల వాటా 65 శాతం ఉండగా అదే నిష్పత్తిలో వరద జలాలను వినియోగించుకుంటామని అంటోంది. ఈ లెక్కన ఏడాదిలో గోదావరిలో సగటున 3 వేల టీఎంసీల వరద ఉన్నా తెలంగాణకు 1900 టీఎంసీల మేర వరద జలాలపై హక్కు ఉంటుందని చెబుతోంది. గోదావరిలో నీటి వాటాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా చెప్పినందున కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ ఎలాంటి లేఖలు రాయబోమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డుల పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కృష్ణా (కేఆర్ఎంబీ), గోదావరి (జీఆర్ఎంబీ) నదీ జలాల యాజమాన్య బోర్డులు బుధవారం సమావేశమై వర్కింగ్ మాన్యువల్‌పై చర్చించాయి. -
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థంలేని వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆం«ద్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఏపీ అభిప్రాయాలపై చర్చించారు. కేంద్రానిది కూడా తప్పే.. ‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’అని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు.. ‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుబట్టడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’అని కేసీఆర్ వివరించారు. అవన్నీ రీ డిజైన్ చేసిన ప్రాజెక్టులు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్‌సాగర్–ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మసాగర్ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’అని సీఎం పేర్కొన్నారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని, దాని ప్రకారం తెలంగాణ మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని స్పష్టంచేశారు. సాగునీటిలో తెలంగాణకు అంతులేని అన్యాయం... ‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటివాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ. రాష్ట్రానికి అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలలో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. -
వారంలో శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/హొసపేటె: ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి కృష్ణా వరద జలాలు జూరాల, శ్రీశైలానికి మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉందని అధికాలు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 73,791 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 92.45 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి నిండాలంటే ఇంకా 37 టీఎంసీలు అవసరం. శనివారం నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఆల్మట్టిలోకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలే అవకాశంఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శనివారం నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం ► ఆల్మట్టికి దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 27,756 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 29.86 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే మరో 8 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి నుంచి భారీ వరదను విడుదల చేయనున్న నేపథ్యంలో ఒకే రోజులో నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ గేట్లను బుధవారంలోగా ఎత్తే అవకాశం ఉంది. ► కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం పెరిగింది. తుంగభద్ర జలాశయంలోకి 34,374 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.25 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ► తుంగభద్ర జలాశయానికి దిగువన కురిసిన వర్షాలకు సుంకేశుల బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయగా మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు. ► నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7,900 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 1,15,222 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. జూన్ 1 నుంచి శనివారం వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 52.885 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 5,474 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 5,180 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి శనివారం వరకు గొట్టా బ్యారేజీ నుంచి 7.477 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,808 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 980 క్యూసెక్కులను వదలి మిగిలిన 1828 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఐదు గేట్లు ఎత్తివేత సముద్రంలోకి 3,625 క్యూసెక్కుల నీరు విడుదల కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండటంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మున్నేరు, కట్టలేరు, వైరా నుంచి కృష్ణా నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంచి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయించగా.. సాయంత్రం 4 గంటలకు కీసర నుంచి 11,725 క్యూసెక్కుల నీరు వచ్చిందని డ్యామ్ కన్జర్వేషన్ ఈఈ రాజా స్వరూప్‌కుమార్ తెలిపారు. దీంతో 3,625 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్టు చెప్పారు. -
తెలంగాణతో వివాదాలు కోరుకోవట్లేదు
-
తెలంగాణతో వివాదాలు కోరుకోవట్లేదు
సాక్షి, అమరావతి : పొరుగు రాష్ట్రం తెలంగాణతో తాము ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గోదావరి నీటిపై ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవని, దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో వివాదం ఏర్పడిన నేపథ్యంలో శుక్రవారం గోదావరి బోర్డు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ శనివారం మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని అన్నారు. (ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు) గోదావరితో పాటు కృష్ణా నదీ జలాల్లో తమకు రావాల్సిన నీటినే తాము వినియోగించుకుంటున్నామని మంత్రి అనిల్ కుమార్ వివరించారు. దానిలో భాగంగానే పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచుతున్నామని తెలిపారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండి పోలవరం గురించి కనీసం ఆలోచన చేయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు దానిపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘పోలవరం నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని అసమర్ధుడు చంద్రబాబు. వైఎస్ జగన్ పాలనకు మార్కులు వేసే సీన్ చంద్రబాబుకు లేదు. ఏడాది కాలంలోనే దేశంలో 4వ బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ నిలిచారు. చంద్రబాబు ఏనాడైనా టాప్ 5లో నిలిచారా?. లోకేష్ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్ సినిమా లాంటోడు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. సీఎం జగన్ బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు ఇన్ని పథకాలు చరిత్రలో ఏ సీఎం ప్రవేశపెట్టలేదు’ అని అన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశం
-
డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే
కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగాం. అనుమతులు లేని ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని చెప్పాం. ప్రభుత్వాల అనుమతితో డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు చెప్పారు. బోర్డు విజయవాడకు తరలింపుపై కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాల కోసం చూస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఎజెండా అడిగాం. రాష్ట్రాలు పంపే ఎజెండా కోసం ఎదురుచూస్తున్నాం. – పరమేశం, బోర్డు చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కృష్ణాబోర్డు, కేంద్ర జల సంఘానికి ఇవ్వాల్సిం దేనని తెలుగు రాష్ట్రాలను బోర్డు ఆదేశించింది. అలాగే అపెక్స్ కౌన్సిల్ అనుమతి కోసం పంపాలని సూచించింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని ప్రాజెక్టులపై ముందు కెళ్లొద్దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకొని డీపీఆర్‌లను అందిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలోగా డీపీఆర్‌లు ఇవ్వాలన్న దానిపై మాత్రం నిర్ణీత సమయాన్ని ప్రకటించలేదు. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో ప్రాజెక్టుల కింద ఈ ఏడాది కూడా గతేడాదిలాగే 34:66 నిష్పత్తిన నీటిని పంచుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగం, మళ్లింపు జలాల అంశంపై తేల్చేవరకు పాత వాటాల ప్రకారమే నీటిని పంచుకోవాలన్న బోర్డు సూచనకు ఇరు రాష్ట్రాలు సమ్మతిం చాయి. కృష్ణా నది బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, డీపీఆర్‌లు, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు కృష్ణాబోర్డు గురు వారం జలసౌధలో భేటీ అయింది. బోర్డు చైర్మన్ పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్య దర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాధ్ దాస్లతో పాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, తెలంగాణ ఇంజనీర్లు నరసింహారావు, నర్సింహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు అజెండా అంశాలతో పాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై 6 గంటల పాటు చర్చించారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి వాటాల అంశంపై వాడీవేడీగా వాదనలు జరిగాయి. అప్పటిదాకా చెరిసగం.. ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడిన అనంతరం డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు భేటీ అనంతరం కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం వెల్లడించారు. మైనర్ ఇరిగేషన్ కింద నీటి వినియోగం, మళ్లింపు జలాలపై తుది నిర్ణయం చేసే వరకు గతేడాదిలో ఉన్న మేర ఇరు రాష్ట్రాలు 34ః 66 నిష్పత్తిన నీటిని వాడుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిపారు. టెలీమెట్రీ రెండో విడత ఏర్పాటుకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద విద్యుదుత్పత్తిని 50ః 50 నిష్పత్తిన చేసుకునేందుకు ఓకే చెప్పాయి. వరద జలాల వినియోగం సైతం ఏ విధమైన పంపిణీ ఉండాలన్న దానిపై సీడబ్ల్యూసీ సీఈ నేతత్వంలోని కమిటీ తేల్చే వరకు ఇరు రాష్ట్రాలు 50ః 50 నిష్పత్తిన పంచుకునేందుకు అంగీకారం తెలిపాయి. గృహావసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే వినియోగం కింద చూపాలన్న అంశంపై సీడబ్ల్యూసీ తేలుస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది వినియోగించుకోలేని నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలన్న తెలంగాణ వినతిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపాక నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఇక, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి మళ్లింపుతో దక్కే నీటి వాటాల పంపిణీ అంశంపై కేంద్ర జల శక్తి పరిశీలనకు పంపినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఇక బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే అంశం జలశక్తి సూచన మేరకు ఉంటుందని తెలిపింది. జలసౌధలో గురువారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న రజత్‌కుమార్ తెలంగాణ వాదనలు ఇలా.. ► పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తిగా పాతవే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయాలని 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం జీవో–72 ఇచ్చింది. 2014 ఏప్రిల్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బోర్డు సమావేశంలో మోదీ మాట్లాడిన వీడియోను రజత్‌కుమార్ ప్రదర్శించారు. ► డిండి ప్రాజెక్టును 2007 జూలైలోనే జీవో–159 ఇచ్చారు. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టు. ► తెలంగాణ ఏర్పాటు అనంతరం వీటిని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకున్నాం. రీ–ఇంజనీరింగ్ చేశాం.. తప్పితే కొత్తగా చేపట్టినవి కావు. ► 2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రాజెక్టులు పాతవేనని స్పష్టం చేశాం. అనంతరం పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు ఇచ్చింది. డిండి ప్రాజెక్టుకు సైతం వివిధ కేంద్ర అనుమతులు పొందేందుకు టీవోఆర్ ఇచ్చింది. ► ఏపీ జీవో 203లో పేర్కొన్న శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకుంటూ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు కాల్వల సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపు ప్రతిపాదనలు పూర్తిగా కొత్తవి. వీటికి అటు బోర్డు కాని, ఇటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ లేదు. కావున ఇవి పూర్తిగా కొత్తవే. వీటిని అపెక్స్ ముందు పెట్టాలి. అప్పటివరకు వీటిని ఆపాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 101 టీఎంసీల మేర మాత్రమే నీటిని తీసుకునే వెసులుబాటు ఉన్నా గడిచిన రెండేళ్లుగా ఏపీ వినియోగం వరుసగా 115 టీఎంసీ, 175 టీఎంసీలుగా ఉంది. ► శ్రీశైలం ఆధారంగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ 60 వరద దినాలను పరిగణనలోకి తీసుకుంది. కానీ ఏపీ మాత్రం ప్రస్తుతం 30 వరద దినాలనే పరిగణనలోకి తీసుకొని నీటిని తరలించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇది అసంబద్ధం. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా తాగునీటికి తమకు 3.5 టీఎంసీలు సరిపోతాయని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వేసిన అఫిడవిట్లో తెలంగాణ పేర్కొంది కావున ఇప్పుడు దాని సామర్థ్యాన్ని ఇంతలా పెంచాల్సిన అవసరం లేదు. ► పోతిరెపడ్డిపాడు ద్వారా శ్రీశైలంలో 880 అడుగులున్నప్పుడు మాత్రమే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లే వీలుంది. తగ్గిన పక్షంలో అంత నీటిని తీసుకెళ్లలేమనే ఏపీ వాదన తప్పు. 870 అడుగుల మట్టంలోనే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లొచ్చు. 865 మట్టంలో 33 వేలు, 859 అడుగుల మట్టంలో 20 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు. ► శ్రీశైలం వరద జలాలపై ఆధారపడి కల్వకుర్తి (40 టీఎంసీ), ఎస్ల్బీసీ(30), పాలమూరు–రంగారెడ్డి (90), డిండి (30 టీఎంసీ)ల ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోంది. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. కనీసంగా 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేవి. శ్రీశైలం నీళ్లు ఏపీ తరలించుకుపోతే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారుతుంది. ► శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీరు రావాలంటేనే సెప్టెంబర్ పడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడు తీసుకుంటే అక్టోబర్, నవంబర్ వరకు నీరు రావడం గగనమే. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టు 6.4 లక్షల ఎకరాలతో పాటు ఏఎంఆర్పీ తాగు, సాగు నీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే. ► 1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు చేపట్టిన వెంటనే నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఆ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలి. పోలవరం కాకుండా వేరే ఇతర ప్రాజెక్టులు చేపట్టినా అంతే నీటి వాటా దక్కుతుంది. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా నీటి మళ్లింపు జరుగుతున్నందున కనీసంగా 45 టీఎంసీల వాటా తెలంగాణకు ఇవ్వాలి. ఈ ఏడాదే 299 టీఎంసీల వాటాకు కలపాలి. ► ఈ ఏడాదిలో సాగర్ కింద కేటాయింపులు ఉండి, వినియోగించుకోలేకపోయిన నీళ్లు 50 టీఎంసీల వరకు ఉన్నాయి. వాటిని ఈ ఏడాది వాటర్ ఇయర్లో తెలంగాణకు క్యారీ ఓవర్ చేయాలి. ► వరద భారీగా ఉన్న రోజుల్లో చేసే వినియోగాన్ని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదన్న ఏపీ వాదన తప్పు. వరద ఉండే రోజుల్లో ఏపీ రోజుకు 48 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించి 300 టీఎంసీల మేర నీటిని నింపుకునేలా రిజర్వాయర్లు ఉన్నాయి. కానీ తెలంగాణకు రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే మళ్లించే సామర్థ్యం ఉంది. కావున వరద జలాలను వినియోగ లెక్కల్లో చూపాల్సిందే. బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న ఆదిత్యనాథ్ దాస్, మురళీధర్ తదితరులు ఏపీ వాదనలు ఇవి.. ► పాలమూరు ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో వాటినే చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు తేల్చేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి నీటిని తరలించేలా సాధ్యాసాధ్యాల నివేదికకు అనుమతిస్తే, తెలంగాణ దాన్ని శ్రీశైలం నుంచి 90 టీఎంసీలు తరలించేలా చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలపై నివేదికలు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాతే తెలంగాణ దాన్ని చేపట్టింది. కావున అది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి. ► డిండి ప్రాజెక్టుకు సర్వేకు మాత్రమే అనుమతిచ్చారు. తప్పితే అది చేపట్టేందుకు కాదు. దీన్ని తెలంగాణ కొత్తగా చేపడుతోంది. ఇక తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతులు లేవు. భక్త రామదాస సైతం కొత్తదే. మా రాష్ట్ర ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టులు విఘాతం. ► కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల సామర్థ్యాలను సైతం పెంచారు. ఈ అన్ని ప్రాజెక్టులకు బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. వీటన్నింటినీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి. ► అనుమతి లేని ప్రాజెక్టులు, నిర్మాణంలోని ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో తెలంగాణ అదనంగా 178 టీఎంసీల మిగులు జలాలు తరలిస్తోంది. వీటి ప్రభావం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుంది. ► బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్లను కచ్చితంగా బోర్డు నియంత్రణలోకి తేవాలి. నీటి విడుదల అజమాయిషీ బోర్డు చేతుల్లో ఉంటేనే సజావుగా ఉంటుంది. వివాదాలకు ఆస్కారం ఉండదు. ► రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డును విజయవాడకు తరలించాలి. ► పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై కేంద్ర జల శక్తి శాఖ మాత్రమే నిర్ణయం చేయాలి. తెలంగాణ సైతం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారు. దీనిపైనా తేల్చాల్సి ఉంది. ► శ్రీశైలంలో 800 అడుగుల్లో నుంచి నీటిని తీసుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను చేపట్టాం. రాష్ట్రానికి ఉన్న 511 టీఎంసీల వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటాం. -
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గ్రీన్ సిగ్నల్
-
సాగర్ కుడి కాల్వకు రెండు టీఎంసీలు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అనుమతించింది. కరోనా నేపథ్యంలో కుడి కాల్వ కింద గృహావసరాలకు నీటి వినియోగం పెరిగినందున తమకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్న ఏపీ వినతికి తెలంగాణ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నీటి విడుదలకు ఓకే చెబుతూ శుక్రవారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ కుడి కాల్వ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు పరమేశం అధ్యక్షతన జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్‌లు హాజరయ్యారు. సాగర్‌కుడి కాల్వ కింద ఇప్పటికే ఏపీ వినియోగం పూర్తయిందని, దీనిపై ఇదివరకే బోర్డు ఏపీకి లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేశారు. అయితే ఈ లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని, తమ వినియోగ లెక్కలు, బోర్డు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఏపీ ఈఎన్సీ తెలిపారు. వినియోగ లెక్కలపై మరో భేటీలో చర్చిద్దామని, ప్రస్తుత అవసరాల దృష్ట్యా నీటిని విడుదల చేయాలని కోరగా...బోర్డు అందుకు అంగీకరించింది. కనీస నీటి మట్టం దిగువకు వెళ్లే అంశంపైనా చర్చ జరిగినా, ఆ అవసరం లేదని బోర్డు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఈ నీటిని ఈ నెల 31 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. బోర్డు లేఖలో పరిపక్వత లేదు: నారాయణరెడ్డి, ఏపీ ఈఎన్సీ బోర్డు భేటీ అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ..రెండు టీఎంసీల నీటి విడుదలకు తెలంగాణ అంగీకరించిందన్నారు. ఇప్పటికే తమ వాటా వినియోగం పూర్తయిందన్న బోర్డు లెక్కల్లో పరిపక్వత లేదని చెప్పారు. సాగర్ కింద గతంలో చాలా మార్లు 502 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్న సందర్భాలున్నాయని, అయితే ప్రస్తుతం ఆ అవసరం రాదని స్పష్టం చేశారు. -
‘కృష్ణా’ జలాల వాడకం 920.4 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది వాటర్ ఇయర్లో రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 647.559 టీఎంసీలు వినియోగించుకోగా, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తి కాగా, తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఏపీ వాటా పూర్తయిన నేపథ్యంలో సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, హంద్రీనీవా కింద నీటి వినియోగం ఆపాలని ఏపీకి సూచించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. వాటర్ ఇయర్ మే 31తో ముగుస్తుండటంతో రెండు రాష్ట్రాలకు చేసిన నీటి కేటాయింపులు, వినియోగం, నీటి లభ్యత లెక్కలను కృష్ణా బోర్డు తేల్చింది. బోర్డు తేల్చిన లెక్కలివే.. ► శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది. ► నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. ► ఇక తెలంగాణ.. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాల్వ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎం సీలను తెలంగాణ ఉపయోగించుకుంది. ► తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్ఎల్సీ ద్వారా 30.192, ఎల్ఎల్ఎల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియో గించుకుంది. ఆర్డీఎస్ ద్వారా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. ► జూరాల ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. ► మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. ► ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. ఇందులో ఏపీ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు, తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. ► ఏపీ ఇప్పటికే 647.559 టీఎంసీలు వినియోగించుకుందని, వాటా కంటే 0.272 టీఎంసీలు అదనంగా వాడుకున్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. తెలంగాణ తన వాటా కంటే 60.605 టీఎంసీలు తక్కువగా 272.846 టీఎంసీలు వినియోగించు కున్నట్లు బోర్డు తేల్చింది. అంటే తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులు, తెలంగాణలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు లెక్క కట్టింది. -
తదుపరి చర్యలు చేపట్టకుండా ఏపీని ఆగమనండి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపున కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పం దించారు. సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పే ర్కొంటూ శనివారం బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి లేఖ రాశారు. వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్ పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలాగే, కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఇది తెలంగాణ విజయం: బండి సంజయ్ కేంద్రమంత్రి ఆదేశాలపై సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తన లేఖకు స్పందించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఇది శుభపరిణామమని, తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. -
30 ఏళ్ల వరద లెక్కలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో వరద జలాల లెక్కలను పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే మిగులు జలాల సంగతి తేల్చాలని కేంద్ర జల సంఘం (సీబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాలు 30 ఏళ్ల వరద లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగానే ఓ నిర్ణయానికి రావచ్చనే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ నెలాఖరులోగా ఇరు రాష్ట్రాలు వరద జలాల డేటా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించాయి. మిగులు జలాలపై బుధవారం సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అధికారులు తెలంగాణ, ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్, కృష్ణా బోర్డు తరఫున సాంకేతిక కమిటీ సభ్యకార్యదర్శి హరికేశ్‌మీనా, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు నరసింహారావు, నాగేశ్వరరావు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సాగిన కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున సీఈ నరసింహారావు మాట్లాడుతూ, ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించిన అంశాన్ని దృష్టికి తెచ్చారు. వరద జలాలను సైతం ఎక్కువగా వినియోగించిందని, పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని వినియోగించారని వెల్లడించారు. (చదవండి: తెలంగాణకు తీరని నష్టం) ఈ దృష్ట్యా వరద జలాలను ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వినియోగించుకోవాలో వాటాలు నిర్ణయించాలని కోరారు. ఏపీ తరఫున సీఈ మాట్లాడుతూ, ఈ నెలాఖరుతో వాటర్ ఇయర్ ముగుస్తున్నందున ఈ ఏడాది మిగులు జలాల వాటా ఎంత దక్కుతుందో చెప్పాలని కోరారు. అయితే దీనికి సీడబ్ల్యూసీ అభ్యంతరం చెబుతూ, ఇప్పటికిప్పుడు మిగులు జలాల వాటాలు తేల్చడం సాధ్యం కాదని తెలిపింది. మిగులు జలాలపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించింది. జూన్ మొదటి వారంలో మరోమారు కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని తెలిపింది. -
‘మిగులు’ పంపకాలపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీచేసే అంశంపై కృష్ణా బోర్డు దృష్టి పెట్టింది. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉన్నా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ఒప్పందాన్ని కుదిర్చే చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే జూన్‌లో వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే బోర్డు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి, ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి కేంద్ర జల వనరుల శాఖ ఆమోదం మేరకు వచ్చే వాటర్ ఇయర్లో దాన్ని అమలు చేయనుంది. (చదవండి: అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) ఇప్పుడన్నా బోర్డు తేల్చేనా..? బజావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీ, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా ఇంత అని నిర్ణయించకపోవడంతో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దుల్లోని ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారమే 34:66 నిష్పత్తిన తెలంగాణ, ఏపీ నీటిని వాడుకుంటున్నాయి. అయితే 2019–20 వాటర్ ఇయర్లో మొత్తం ఇరు రాష్ట్రాల నికర జలాల వాటా 811 టీఎంసీలకు మించి నీరొచ్చింది. మొత్తం గా 910 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు (ఏపీ–637 టీఎంసీలు, తెలంగాణ–273 టీఎంసీలు) వినియోగించుకోగా, మరో 797 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ప్రాజెక్టులు నిండి, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదని, వరద నీటిని వాడుకుంటే దాన్ని రాష్ట్రాల వినియోగ లెక్కల్లో చూపరాదని ఏపీ గతంలో బోర్డు భేటీల్లో కోరింది. వరద ఉన్న 32 రోజుల్లో తాము 132 టీఎంసీల మేర నీటిని వినియోగించుకోగా, తెలంగాణ సైతం 39 టీఎంసీల మేర వాడుకుందని సైతం ప్రస్తావించింది. అయితే ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించలేదు. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చడం ఆలస్యమవుతున్నందున బోర్డు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని కోరింది. (చదవండి: దుమ్ముగూడెం టెండర్లలో భారీ కుంభకోణం) చేసేది లేక బోర్డు దీనిపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో కమిటీని నియమించింది. ఇందులో బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను చెప్పనుంది. ఆయా రాష్ట్రాల ఈఎన్సీలు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కాన్ఫరెన్స్ అనంతరం బోర్డు తన నివేదికను కేంద్రానికి సమర్పించి, వారి ఆమోదం ప్రకారమే నడుచుకోనుంది. గోదావరి జలాల అంశమూ తెరపైకి.. కొత్తగా తెలంగాణ గోదావరి మిగులు జలాల అంశాన్నీ తెరపైకి తెచ్చింది. గోదా వరిలో తెలంగాణకు 954, ఏపీకి 500 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఏటా గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నా, మిగులు జలాలపై మాత్రం గతంలో ట్రిబ్యునల్ కానీ, కేంద్రం కానీ తేల్చలేదు. ఈ వాటర్ ఇయర్‌లోనూ గోదావరిలో 3,788 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. ప్రస్తుతం తెలంగాణ వాటా 954 టీఎంసీల మేరకు నీటి వినియోగం చేసేలా ప్రాజెక్టులు పూర్తయినందున, అంతకుమించి నీటిని తీసుకునేలా మిగులు జలాల వాటాను తెరపైకి తెచ్చింది. కనీసంగా 600 టీఎంసీల వాటా దక్కించుకునేలా ప్రణాళిక రచిస్తోంది. దీనిపైనా గోదావరి బోర్డుకు లేఖ రాయాలని, అటు నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు కేంద్రం వద్ద పోరాడాలని భావిస్తోంది. -
మన నీళ్లను తీసుకుంటే తప్పేంటి?: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 'మనకు కేటాయించిన నీటిని తీసుకోవడానికి మనం ప్రాజెక్టు కట్టుకుంటున్నామ'ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తన నివాసంలో ఇరిగేషన్ అధికారుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల అంశంపై ఆయన స్పందించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించిందన్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేశారు. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాకే నీటి కేటాయింపులు చేస్తుందని తెలిపారు. ఆ కేటాయింపుల పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదన్నారు. సంవత్సరంలో పది రోజులే.. "మన హక్కుగా మనకు కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహా కష్టం. ఆ పది రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే వేయి క్యూసెక్కులు మాత్రమే నీరు వెళ్తుంది. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్ నుంచి వెళ్లేది గరిష్టంగా 9వేల క్యూసెక్కుల నీరు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి" అంటూ ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని సీఎం జగన్ వివరించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయానికొస్తే.. ► తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో కూడా రోజుకు 2 టీఎంసీల మేర ( 23,148 క్యూసెక్కుల నీరు) నీటిని తరలించవచ్చు. ఇలా 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ► ఇక కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిని రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరు. ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ► ఇదే 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలను (5,787 క్యూసెక్కులు) తెలంగాణ తీసుకెళ్లగలదు. ఇలా 30 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ► ఎస్ఎల్బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు కూడా రోజుకు సుమారు 0.51 టీఎంసీ నీళ్లని (6,000 క్యూసెక్కులు) తెలంగాణ తరలించగలదు. అలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ► పైన చెప్పిన ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దీనికి తోడు జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయల్సాగర్ల నుంచి కూడా శ్రీశైలంలోకి నీళ్ళు రాకముందే తెలంగాణ నీళ్లు తీసుకోగలుగుతుందన్నారు. (న్యాయ పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్) మానవత్వంతో ఆలోచించాలి: సీఎం జగన్ ► శ్రీశైలంలో ఒకవైపు 800 అడుగులు, ఇతర తక్కువ నీటిమట్టాల స్థాయినుంచి నీటిని ఇన్ని ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ► డబ్ల్యూడీటీ ప్రకారమే ఎవరు ఎన్నినీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయించి, కృష్ణా రివర్ వాటర్ బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందన్నారు. అలాంటప్పుడు ఎవరైనా దీన్ని రాజకీయం చేయడం కరెక్టు కాదని హితవు పలికారు. ► ఎవరైనా మానవత్వంతో ఆలోచించాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోజు మానవత్వంతో ఆలోచించడం వల్లే... తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం నుంచి పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత కాని, కల్వకుర్తి, ఎల్‌ఎస్‌బీసీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గాని తక్కువ నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. ► 800 అడుగుల నుంచి తెలంగాణ నీటిని తీసుకోగా లేనిది మన కేటాయింపుల ప్రకారం మనం నీటిని తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని సీఎం జగన్ ప్రశ్నించారు. మా నీళ్లను మేం తీసుకుంటామని తేల్చి చెప్పారు. -
న్యాయ పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, జీఓ కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా చెబుతోందని, కానీ ఏపీ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదని పేర్కొన్నారు. (చదవండి: ప్రగతి భవన్‌కు రండి) ‘‘శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణను సంప్రదించకుండా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేస్తాం’’అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడం గతంలో ఉన్న వివాదాలు, విభేదాలు పక్కనపెట్టి రెండు రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని ఏపీకి స్నేహహస్తం అందించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవ చూపించానని, కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి కొత్త పథకం ప్రకటించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తేలేదని, ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటిపారుదల సలహాదారు ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏజీ బీఎస్ ప్రసాద్, అడిషనల్ ఏజీ రామచందర్‌రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. (చదవండి: హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్) -
తెలంగాణకు79..ఏపీకి 69.34 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్:ప్రస్తుత వాటర్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణ ప్రభుత్వాలు ఈ నెల 4 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలను కృష్ణా బోర్డు తేల్చింది. రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపులకు పంపిన ప్రతిపాదనలు.. ఇప్పటివరకు చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని, తక్షణ సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 69.34 టీఎంసీలు ఇస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ వరకు సాగు, తాగునీటి అవసరాలకు 150 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ సర్కార్, 79 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డు కు ప్రతిపాదనలు పంపాయి. వీటిని పరిశీలించిన కృష్ణా బోర్డు.. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలను తేల్చింది. ఈ నెల 4 వరకు శ్రీశైలం జలాశయం లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 112.970 టీఎంసీలు, హంద్రీ–నీవా నుంచి 10.257, నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 51, ఎడమ కాలువ నుంచి 10, కృష్ణా డెల్టాలో 59.510 వెరసి 232.654 టీఎంసీలు ఏపీ వినియోగించుకున్నట్లు లెక్క కట్టింది. తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వ కుర్తి ఎత్తిపోతల ద్వారా 12.727 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడ మ కాలువ ద్వారా 18.22, ఏఎ మ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 16.141, మిషన్ భగీరథకు 1.358 మొత్తం 48.436 టీఎంసీలను వాడుకున్న ట్లు లెక్కకట్టింది. రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపులకు పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని, వినియోగించుకున్న జలాలపై ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 335.840 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. ఏపీకి శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 3.03, హంద్రీ–నీవాకు 9.743, నాగార్జునసాగర్ కుడి కాలువకు 42.554, ఎడమ కాలువకు 5.529, కృష్ణా డెల్టాకు 8.49 వెరసి 69.348 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 15 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువకు 45, ఏఎమ్మార్పీకి 17, మిషన్ భగీరథకు 2 కలపి 79 టీఎంసీలను కేటాయించింది. -
కృష్ణా వరదను ఒడిసిపట్టి..!
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ముంపు ముప్పు తగ్గడంతోపాటు ప్రాణ నష్టం తప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను నింపుతూనే అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తరలించి తెలుగుగంగలో భాగమైన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, గాలేరు–నగరిలో భాగమైన గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లకు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువన కృష్ణా వరద ఉధృతిని నియంత్రించడం వల్లే ప్రకాశం బ్యారేజీపై పెద్దగా ప్రభావం పడలేదని విశ్లేషిస్తున్నారు. బ్యారేజీలోకి వచ్చిన వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేశారు. ఈనెల 17న బ్యారేజీకి గరిష్టంగా 7.49 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల నది సహజ ప్రవాహానికి అడ్డంకులు తలెత్తాయి. ఫలితంగా బ్యారేజీ ఎగువన వరద నీటి మట్టం పెరిగి కొండవీటి వాగులోకి వరద ఎగదన్ని పెనుమాక, ఎర్రబాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అక్రమ కట్టడాలను తొలగిస్తే వరద ప్రవాహం ఎగదన్నేదే కాదని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సమర్థంగా వరదను నియంత్రించకుంటే 2009 కంటే అధికంగా నష్టం వాటిల్లేదని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. గోదావరి వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు సాధారణంగా అందించే సహాయ ప్యాకేజికి అదనంగా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం తెలిసిందే. బాధితులకు తక్షణమే నిత్యావసరాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్వాసితులను పునరావాస ప్రాంతాలకు తరలించడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంది. హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటి తరలింపు కృష్ణా వరద ఈనెల 1న శ్రీశైలానికి చేరింది. భారీ ప్రవాహం వస్తుండటంతో ఈనెల 6 నుంచే హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు జలాలను తరలించే ప్రక్రియ చేపట్టారు. ఆగస్టు 7 నాటికి శ్రీశైలంలో నీటి మట్టం 870.9 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలింపు మొదలైంది. అదే రోజు కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 10న శ్రీశైలం గేట్లు ఎత్తేశారు. కనీస మట్టం చేరగానే సాగర్ ఆయకట్టుకు విడుదల.. నాగార్జునసాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ఈనెల 8 నాటికి 513.3 అడుగులకు చేరుకోవడంతో కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్‌లో నీటి మట్టం కనీస స్థాయికి చేరుకున్న వెంటనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈనెల 13న సాగర్ 26 గేట్లు ఎత్తేసి దిగువకు వరదను విడుదల చేశారు. అప్పటికి సాగర్‌లో 260.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీపై భారం పడకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా సాగర్ పూర్తి స్థాయిలో నిండకుండానే దిగువకు వరదను విడుదల చేశారు. ఆ తర్వాత వస్తున్న వరదతో సాగర్‌లో ఖాళీని భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని నియంత్రించారు. పులిచింతల ముంపు గ్రామాలను కూడా ముందే ఖాళీ చేయించి ప్రాజెక్టులో గరిష్టంగా 36 టీఎంసీలు నిల్వ చేశారు. -
పాత వాటాలే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాలను పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయిం చాయి. ప్రస్తుత వాటర్ ఇయర్లో ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34:66 నిష్పత్తిన పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. ఇరు రాష్ట్రాల తక్షణ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎవరి అవసరాన్నిబట్టి వారు నీటి వినియోగం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు తగ్గాక విని యోగ లెక్కలు చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశ మైంది. ఇరు రాష్ట్రాల వాటా నిర్ణయం, నీటి పంపిణీ, కృష్ణా బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించడం, 2019–20 సంవత్సరానికి నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ, బోర్డుల వర్కింగ్ మ్యాన్యువల్ తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించారు. కృష్ణా బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ నరసింహారావు, నర్సింహ, డీసీఈ నరహరిబాబు, ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, ఇతర అంతర్రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. ఏపీ జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఈ భేటీకి హాజరు కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో రాలేకపోయారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు గతంలో మాదిరే 34:66 నిష్పత్తిన ప్రాజెక్టుల్లోకి వచ్చే లభ్యత నీటిని వినియోగించుకోవాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించగా ఇందుకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. ఇదే సందర్భంగా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్‌కు ఆమోదం తెలపాలని, బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ఇంజనీర్లు కోరారు. అయితే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని తెలంగాణ తోసిపుచ్చింది. దీనిపై ఏపీ మరోమారు స్పందిస్తూ సాగర్ కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని కోరింది. తమ యాజమాయిషీలేని కారణంగా ఏటా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని దృష్టికి తెచ్చింది. దీనికి తెలంగాణ అంగీకరించలేదు. ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలు సీఎంల స్థాయిలో, అపెక్స్ కౌన్సిల్లో జరగాల్సిన నిర్ణయాలని, వాటిపై బోర్డు భేటీలో నిర్ణయం చేయలేమని తేల్చిచెప్పింది. దీనిపై మళ్లీ బోర్డు భేటీలో చర్చిద్దామని చైర్మన్ స్పష్టం చేశారు. ఇక ఎగువ కర్ణాటక ప్రాంతంలో గేజ్ స్టేషన్ల వద్ద నమోదవుతున్న కృష్ణా వరద ప్రవాహాలకు, జూరాలకు చేరిన అనంతరం నమోదవుతున్న కృష్ణా ప్రవాహాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని ఏపీ బోర్డు దృష్టికి తెచ్చింది. 2016–17లో ఈ తేడా 70 టీఎంసీలు, 2017–18లో 52 టీఎంసీలు, గతేడాది 51 టీఎంసీల మేర ఉందని తెలిపింది. దీనిపై ఓ కమిటీ వేసి తేల్చుదామని బోర్డు అభిప్రాయపడింది. అవసరాన్నిబట్టి వాడకం.. ఆగస్టు నుంచి నవంబర్ వరకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నుంచి 103 టీఎంసీలు కావాలని బోర్డును తెలంగాణ కోరగా సాగర్ కింది ఆయకట్టుకు 50 టీఎంసీలు, ఏఎంఆర్ఎస్ఎల్బీసీకి 20, హైదరాబాద్ తాగునీటికి 4, మిషన్ భగీరథకు మరో 4, కల్వకుర్తికి 25 టీఎంసీల కేటాయింపులు చేయాలని కోరింది. ఏపీ తన తక్షణ తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు కింద 23 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 10, హంద్రీనీవాకు 5 టీఎంసీల నీటి కేటాయింపులు కోరింది. దీనిపై బోర్డు సమావేశం అనంతరం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమై ఎవరి అవసరం మేరకు వారు వాడుకోవాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోకి స్థిరంగా వరద వస్తున్నందున ఎవరి అవసరాలకు వారు నీటిని వాడుకొని ప్రవాహాలు తగ్గాక వాటాల మేరకు వాడకం జరిగిందా? లేదా చూసుకుందామనే నిర్ణయానికి వచ్చాయి. బోర్డు తరలింపు అక్కర్లేదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న ప్రతిపాదనను ఏపీ మరోమారు ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని, దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఏపీ ఇంజనీర్లు తెలిపారు. అయితే దీనికి తెలంగాణ అభ్యంతరం తెలిసింది. కృష్ణా బేసిన్‌లోని ఎక్కువ ప్రాజెక్టులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సహా పలు కార్యాలయాలు హైదరాబాద్ నుంచే నడుస్తున్నాయని బోర్డు దృష్టికి తెచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చాకే అమరావతి ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. అయితే దీనిపై బోర్డు చైర్మన్ స్పందిస్తూ చట్టప్రకారం తాము నడుచుకోవాల్సి ఉందని, దీనిపై కేంద్రా జలశక్తిశాఖకు నివేదించి వారి సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. గోదావరి బోర్డు ఆర్కే జైన్ నేతృత్వంలో గోదావరి బోర్డు సమావేశం జరిగినా సమావేశం కేవలం నిధుల కూర్పు, ఇంజనీర్ల నియామకం వంటి అంశాలపైనే చర్చించింది. కొత్త ప్రాజెక్టులు, వర్కింగ్ మ్యాన్యువల్ వంటి అంశాలపై తర్వాత చర్చిద్దామని నిర్ణయించింది. -
గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా-గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని రైతాంగం, ప్రజలు సాగునీరు, తాగునీటికి ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు తాగునీటి, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో 480 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా ఇరు రాష్ట్రాలకు పారించాలని భావిస్తున్నామని, ఇరు రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి ప్రయత్నానికి నాంది పలుకబోతున్నారని, దీనిని అందరూ స్వాగతించాలని కోరారు. మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ.. ఈ ద్వైపాక్షిక ప్రాజెక్టు విషయంలో ఒప్పందాలు ఉంటాయని, రైతాంగానికి, తాగునీరు భవిష్యత్తులో ఇబ్బంది పడకూదని ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నారని అన్నారు. గతంలో మీరు పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకున్నారు కాబట్టి భవిష్యత్తులోనూ గొడవలు ఉంటాయని, తెలంగాణ ప్రజలు మనకు శాశ్వత శత్రువులనే నెగటివ్ దృక్పథంతో దీనిని చూడవద్దని టీడీపీ నేతలను మంత్రి అనిల్‌కుమార్ కోరారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల డిజైన్ ద్వారా ఏపీలో సాగునీటి, తాగునీటి కొరతను నివారించడానికి ఈ చర్చను చేపట్టామని, ఈ విషయంలో అందరి సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. -
కృష్ణమ్మ కపట నాటకం!
కృష్ణాజలాలను టీడీపీ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోంది. తమ స్వార్థ రాజకీయాల కోసం నీటిని తరలించకుండా కపటనాటకాలాడుతోంది. 12 టీఎంసీల నీటిని జిల్లాలోని 147 చెరువులకు మళ్లించాల్సి ఉంది. కానీ 400 ఎంసీఎఫ్టీలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కేవలం కాలువలో నీటినిపారిం చి గొప్పలు చెప్పుకుంటున్నారు. సాగు, తాగునీటి అవసరాలు తీరకున్నా అన్నీ చేశామంటూ నేతలు జబ్బలు చరుచుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై పడమటి మండలాల రైతులు నిట్టూర్పులు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల తాయిలంగా కృష్ణమ్మను వాడుకోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చిత్తూరు, బి.కొత్తకోట: కృష్ణా జలాలను టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడగా వాడుకుంటోంది. జిల్లాకు జలాలను రప్పించి కరువును పారదోలినట్టుగా ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు పొలం తడపలేదు. ఉపకాలువలో కృష్ణమ్మ నిండుగా పారకున్నా అట్టహాసంగా ప్రచారం చేసుకోవడం తప్ప ఒక్క రైతుకూ ప్రయోజనం కలగలేదు. హంద్రీ–నీవా ప్రాజెక్టు 40 టీఎంసీల కృష్ణా జలాల్లో చిత్తూరుకు 12 టీఎంసీల వాటా దక్కాలి. అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి కృష్ణమ్మను రప్పించి వాటా నీటిని సద్వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిం చింది. ఎన్నికలు దగ్గరపడడంతో ఆర్భాటం గా నీటిని జిల్లాకు రప్పించే ప్రయత్నంచేసిచేతులు దులుపుకుంది. అనంతపురం జిల్లా చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయగా జనవరి 21న పెద్దతిప్పసముద్రం మండలం గడ్డంవారిపల్లెలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువలోకి కృష్ణాజలాలు చేరాయి. అప్పటి నుంచి మెల్లగా కృష్ణమ్మ పారుతూనే ఉంది. పొలాలకు మాత్రం సాగునీరు అందలేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం జిల్లాలోకి కృష్ణా జలాలు ప్రవేశించి ఆదివారం నాటికి 63 రోజులైంది. జలాల రాకను పురస్కరిం చుకుని జనవరి 22న ప్రభుత్వం పెద్దతిప్పసముద్రంలో బహిరంగ సభ నిర్వహించి సాగు, తాగునీరు అందిస్తామని ప్రకటించింది. మంత్రులు దేవినేని ఉమా, అమరనాథరెడ్డి తిప్పరాయ చెరువుకు అధికారికంగా కృష్ణా జలాలు మళ్లించారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 63రోజులు గడచినా రామకుప్పం మండలానికి నీరు పారలేదు. పెద్దతిప్పసముద్రం నుంచి రామకుప్పం వరకు 190 కిలోమీటర్ల కాలువ ఉంది. ఇప్పటివరకు 170 కిలోమీటర్లు కృష్ణమ్మ ప్రవహించింది. కుప్పం కాలువకు చెందిన 42వ కిలోమీటరు మండల కేంద్రం వీ.కోటకు 4 కిలోమీటర్ల దూరంలోని కృష్ణాపురానికి నీరు చేరింది. మిగిలిన కుప్పం కాలువ పరిధిలోని రామకుప్పం వరకు నీటిని తరలిం చాలంటే మరో 20 కిలోమీటర్లు ప్రవహించాలి. జిల్లాలోని కాలువకు ఇప్పటివరకు చేరింది కేవలం 358 ఎంసీఎఫ్‌టీలే. కనీసం అర టీఎంసీ కూడా లేదు. ఇదిలావుంటే ప్రస్తుతం పారుతున్న నీటి ప్రవాహం తగ్గించేశారు. 100క్యూసెస్కుల నీటి ప్రవాహం ఉండగా అది సరిపోవడం లేదు. 200 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తేకాని ప్రయోజనం ఉండదు. అయినప్పటికి వచ్చేనెల 11 వరకు నీటిని ఏదోలా ప్రవహింపజేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చర్యతో 12 టీఎంసీల వాటా నీటిని రప్పించకుండా సీఎం చంద్రబాబు సొంత జిల్లాకే ద్రోహం చేస్తున్నారు. చెరువులకు కృష్ణమ్మను తరలిస్తా అధికారంలోకి రాగానే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తా. రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తా. నియోజకవర్గంలో రైతులు తీవ్రమైన కరువుతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ కష్టాలను పారదోలేలా రైతులకు చేయూత అందిస్తా. – 2017 డిసెంబర్ 30న తంబళ్లపల్లె సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఉండుంటే సాగునీరు అందేది నాకు రెండెకరాలు పొలం ఉంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు హంద్రీ–నీవా కాలువ నుంచి ఉప కాలువలు తీయించి చెరువులను నింపి సాగు, తాగునీరు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇది నాలాంటి రైతులకు ఎందరికో ఆత్మస్థైర్యంగా ఉండేది. అదే కాలువలో ఇప్పుడు చంద్రబాబు నీళ్లు పారించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎకరానికి కూడా సాగు నీరు ఇచ్చింది లేదు. హంద్రీ–నీవాను రాజకీయ ప్రచారానికి తెచ్చారు. అదే రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే హంద్రీ–నీవా ద్వారా చెరువులు నింపి పొలాలను సస్యశ్యామలం చేసి ఉండేవారు. –జి. రెడ్డెప్పరెడ్డి, కనసానివారిపల్లె, కురబలకోట మండలం నీళ్లున్నా వాడుకోలేని దౌర్భాగ్యం హంద్రీనీవా జలాలున్నా వాడుకోలేని దౌర్భాగ్యం. ఇది కరువు గడ్డ. ఏటా కరువు పలకరిస్తూనే ఉంది. సాగు, తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. హంద్రీ–నీవా నుంచి కాలువలు తీసి చెరువులు నింపితే భూగర్భజలాలు పెరుగుతాయి. అలా చేయకుండా ప్రభుత్వం సాంకేతిక సాకులు చెబు తోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా బోర్లు ఎండిపోయి రైతులు దిక్కులు చూస్తున్నారు. –ఎస్.కృష్ణారెడ్డి, గౌనివారిపల్లె, కురబలకోట మండలం -
సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ అండ!
సాక్షి, హైదరాబాద్: నీటి లభ్యత పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నీరందని ఆయకట్టుకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించేందుకు కసరత్తు చేస్తోంది. సాగర్ కింద ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు ఖరీఫ్‌లో ఏటా సెప్టెంబర్, అక్టోబర్ వరకు నీటిసరఫరా జరగకపోవడం, రబీలో అయితే నీటిలభ్యతే లేకపోవడంతో ఈ ఆయకట్టును గోదావరినీటితో పునీతం చేసేలా సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ ఆగస్టు నాటికే సీతారామలో మెజార్టీ పనులు పూర్తి చేసి సాగర్ కింద నీరిచ్చేలా కాల్వలు, పంప్‌హౌస్‌ల పనులు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో పెరిగిన వేగం.. దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరందించడంతోపాటు దారి పొడవునా చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టు తొలి ఫలితాలు ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సాగర్‌కు ఆగస్టు, సెప్టెం బర్ వరకు నీరు రాకపోవడం, ఈ తర్వాత నీటి విడుదల జరిగినా ఖమ్మం పరిధిలోని ఖరీఫ్ పంటలు చివరిదశకు చేరుతుండటంతో మేలు జరగని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా దుమ్ముగూడెం నుంచి 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాలను మొదట పూర్తి చేసి సాగర్ ఎడమ కాల్వ కింద పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రూ.972 కోట్లతో చేపట్టిన కాల్వపనుల్లో రూ.783 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 7.19 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో ఇప్పటికే 4 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మిగతా పనులు వేగంగా జరుగుతున్నా, రెవెన్యూ, పోడుభూముల పట్టాల అంశం కొంత అడ్డంకిగా మారింది. సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేయాలి. ఒక్కో పంప్‌హౌస్‌లో 6 మోటార్లు అమర్చాల్సి ఉండగా, మూడేసి పంపులను సిద్ధం చేసేలా లక్ష్యాలు విధించారు. ఇందులో మొదటి పంప్‌హౌస్‌ను జూన్, జూలై నాటికి, రెండో పంప్‌హౌస్‌ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్‌హౌస్‌ను అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేసేలా ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్‌లోనే నీళ్లందించేలా ఈ పనులు జరగాలని సూచించారు. దీనికోసం 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, చెరువులు నింపాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాలకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తదితరులు ప్రాజెక్టు పరిధిలో పర్యటించి వచ్చారు. అటవీ, పోడు భూముల అంశానికి సంబంధించి ఉన్న చిన్న, చిన్న అడ్డంకులను వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. -
మనకు 29 టీఎంసీలు.. ఏపీకి 17.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు పంచింది. లభ్యత జలాల్లో తెలం గాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలను కేటాయించింది. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత, అవసరాలు, కేటాయింపులపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లోని జల సౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈ నరహరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ప్రాజెక్టుల్లో లభ్యత జలాలపై చర్చించారు. శ్రీశైలంలో ప్రస్తుతం కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 827.40 అడుగుల్లో 46.98 టీఎంసీల నీరు ఉందని, ఇందులో 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకునేపక్షంలో 18 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టారు. ఇక సాగర్‌లో ప్రస్తుతం 524.2 అడుగుల మట్టంలో 157 టీఎంసీల నీరుండగా కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు కనిష్టంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని తేల్చారు. మొత్తంగా 51.71 టీఎంసీలు ఉండగా వాటిని పంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు సమ్మతి తెలపడంతో తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు వీలైనంత ఎక్కువ కాల్వ నిర్వహించేలా చూడాలని సూచించింది. ఇక ఏపీ అవసరాల కోసం ఎడమ కాల్వ కింద చేసిన కేటాయింపులను కేవలం తెలంగాణలోని పాలేరు రిజర్వాయర్ కింద అవసరాలకు విడుదల చేసిన సమయంలోనే వాడుకోవాలని తెలిపింది. ఇరు రాష్ట్రాలకు నీరు ఇలా... తెలంగాణకు కేటాయించిన నీటిలో ఆగస్టు వరకు కల్వకుర్తి కింద మిషన్ భగీరథ అవసరాలకు 3.50 టీఎంసీలను బోర్డు కేటాయించింది. అలాగే సాగర్ కింద ఆగస్టు వరకు మిషన్ భగీరథకు 5 టీఎంసీలు, హైదరాబాద్ తాగనీటికి 8.50 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద చెరువులు నింపేందుకు 3 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద రబీ పంటలకు 9 టీఎంసీలను కేటాయించింది. ఇక ఏపీకి శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 3 టీఎంసీలు, సాగర్ నుంచి కుడి కాల్వకు 8 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3 టీఎంసీలు, కేడీఎస్‌కు 3.50 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. -
‘ఏపీ వాటాకు మించి వినియోగిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఆంధ్రప్రదేశ్ తనకు రావాల్సిన వాటాకు మించి వినియోగిస్తోందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. బోర్డు ఆదేశాలు లేకుండా పెద్ద ఎత్తున నీటిని వినియోగించరాదని ఏపీకి సూచించాలని కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బోర్డు తెలంగాణకు 82.5 టీఎంసీలు, ఏపీకి 35 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించిందని చెప్పారు. అయితే అందుకు భిన్నంగా ఏపీ ఏకంగా 146 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుందని తెలిపారు. నిర్దిష్ట వాటాల ప్రకారం చూసినా, ఏపీకి గరిష్టంగా లభ్యత జలాల్లో 123.18 టీఎంసీలే దక్కుతాయని, అయితే 22.84 టీఎంసీలను ఏపీ అధికంగా వినియోగించిందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో వినియోగార్హమైన నీరు 163 టీఎంసీలు మాత్రమే ఉందని, ఈ నీటిని వచ్చే ఏడాది జూలై వరకు వీటిని వినియోగించాల్సి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో భారీగా నీటి వినియోగం చేయకుండా ఏపీకి సూచించాలని ఆయన బోర్డును కోరారు. -
ఏపీకి 217.8, తెలంగాణకు 112.2 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో లభ్యత నీటిని బోర్డు శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతమున్న 330 టీఎంసీలలో... ఏపీకి 217.8 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 112.2 టీఎంసీలు (34 శాతం) కేటాయించింది. సుదీర్ఘంగా భేటీ ఇరు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించింది. నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ, రాష్ట్ర స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, సాగర్ సీఈ సునీల్, బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు తమ నీటి అవసరాలను బోర్డు ముందుంచాయి. తెలంగాణ 138.5 టీఎంసీలు ఇవ్వాలని కోరగా.. ఏపీ 270 టీఎంసీలు కేటాయించాలని విన్నవించింది. చిన్న నీటి వనరులపై రగడ భేటీ సందర్భంగా చిన్న నీటి వనరుల అంశాన్ని ఏపీ మరోసారి లేవనెత్తింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు చిన్ననీటి వనరుల కోసం 89.11 టీఎంసీల కేటాయింపు ఉందని.. దాన్ని పరిగణనలోకి తీసుకుని 70:30 నిష్పత్తిన నీటిని పంపిణీ చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చిన్న నీటి వనరుల కింద 13 టీఎంసీలకు మించి వినియోగం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి బోర్డు కల్పించుకుని.. ఇరు రాష్ట్రాల అధికారులను సముదాయించింది. ఈ ఏడాది తెలంగాణ చెబుతున్న వినియోగ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ.. 66:34 నిష్పత్తిన నీటిని పంచుతామని స్పష్టం చేసింది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక చిన్ననీటి వనరుల లెక్కల వాస్తవ వినియోగాన్ని తేల్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) సహాయాన్ని తీసుకోవాలని భేటీలో నిర్ణయించారు. పట్టిసీమపై నిపుణుల కమిటీ గోదావరి నుంచి నీటిని మళ్లిస్తూ ఏపీ చేపట్టిన పట్టిసీమ అంశాన్ని తెలంగాణ మరోమారు ప్రస్తావించింది. గతేడాది పట్టిసీమ కింద 53 టీఎంసీల వినియోగం జరిగిందని, ఈసారి అదే రీతిన వినియోగం జరుగుతోందని బోర్డు దృష్టికి తెచ్చింది. పట్టిసీమతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాపై తేల్చాలని పట్టుబట్టింది. అయితే ఈ అంశంపై తేల్చే అధికారం బోర్డుకు లేదని, కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 మాత్రమే తేల్చగలదని చైర్మన్ శ్రీవాత్సవ స్పష్టం చేశారు. అయితే అప్పటివరకు తాత్కాలికంగా ఈ అంశాన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక శ్రీశైలం కింద ఏపీ నీటి వినియోగానికి, చెబుతున్న లెక్కలకు పొంతన లేదని.. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటికి, సాగర్‌కు చేరుతున్న జలాలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. సాధారణంగా నీటి నష్టాలు 7 నుంచి 10 శాతం మాత్రమే ఉంటాయని.. కానీ ఇక్కడ 30 నుంచి 40 శాతంగా కనబడుతున్నాయని పేర్కొంది. దీనిపై బోర్డు స్పందిస్తూ.. నీటి నష్టాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, దీనిపై ఇరు రాష్ట్రాలు, బోర్డు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వర్కింగ్ మాన్యువల్‌పై భిన్నాభిప్రాయాలు కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. తాము సూచిస్తున్న పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది వర్కింగ్ మాన్యువల్ రూపొందించాలని తెలంగాణ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టుల నియంత్రణ వద్దని.. పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక టెలిమెట్రీ ఏర్పాటు మొదటి విడత ఇప్పటికే అమల్లో ఉందని.. రెండో విడత పరికరాల ఏర్పాటు త్వరితగతిన ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మాకు పక్షపాతమేం లేదు.. కృష్ణా బోర్డు భేటీ అనంతరం బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాలకు కృష్ణా నీటి కేటాయింపులపై చర్చలు జరిపామని, 66 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్, 34 శాతం నీటిని తెలంగాణ వినియోగించుకుంటాయని చెప్పారు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలో అవకతవకలు, ట్యాంపరింగ్ జరగలేదని.. అది అవగాహనా రాహిత్యమని పేర్కొన్నారు. తాము పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నామనడం సరికాదని.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నీటి లభ్యతను బట్టి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. -
తెలంగాణకు 9, ఏపీకి 16
-
పట్టిసీమను పక్కన పెట్టినా వాటా దక్కాల్సిందే!
- పట్టిసీమను పక్కన పెట్టినా.. 56 టీఎంసీలు దక్కాల్సిందే! - రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నీటి పారుదల శాఖ - ఏపీది అడ్డగోలు వాదన.. బోర్డుది నిలకడలేని నిర్ణయం - గతేడాది అధిక వినియోగం, పోతిరెడ్డిపాడుపై ఫిర్యాదును పట్టించుకోలేదని వివరణ - ఈ అంశాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల అంశంలో ‘పట్టిసీమ’ కింద ఆంధ్రప్రదేశ్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్న కృష్ణా బోర్డు నిర్ణయంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పట్టిసీమ సహా 2014–15లో ఏపీ చేసిన అధిక వినియోగం, పోతిరెడ్డిపాడు నుంచి లెక్కలో చూపిన దానికన్నా అధికంగా తరలించుకున్నారన్న తెలంగాణ ఫిర్యాదులపై ఎలాంటి స్పందనా తెలియజేయని బోర్డు.. ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని భావిస్తోంది. బోర్డు చెప్పినట్లే పట్టిసీమ విని యోగాన్ని పక్కన పెట్టినా తెలంగాణకు గరిష్టంగా 56 టీఎంసీల మేర దక్కుతాయని స్పష్టం చేస్తోంది. కానీ తెలంగాణకు 43 టీఎంసీలు మాత్రమే దక్కుతాయనడం రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని పేర్కొంటోంది. నివేదిక సిద్ధం పట్టిసీమ లెక్కలను పరిగణనలోకి తీసుకోలే మని బోర్డు పేర్కొన్న నేపథ్యంలో... దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖ నుంచి వివరణ కోరింది. దీంతో బోర్డు నిర్ణయం వెనుక కారణాలు, తెలంగాణ లేవనెత్తిన అం శాలు, ప్రస్తుత నిర్ణయంతో జరిగే నష్టం తదితరాలపై నీటి పారుదల శాఖ అధికారులు అప్పటికప్పుడు పది పేజీల నివేదికను రూపొందించి మంత్రి హరీశ్‌రావు, శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోíషీలకు అందిం చారు. ఈ నివేదిక ప్రకారం... 2014–15లో ఏపీ తనకు దక్కాల్సిన వాటా కంటే 45 టీఎం సీలు అదనంగా వాడుకుంది. పోతిరెడ్డిపాడు ద్వారా 23 టీఎంసీల మేర వినియోగిం చుకున్నా 11.76 టీఎంసీల వాడకాన్ని మాత్రమే చూపింది. ఈ లెక్కలను సరిచేసి తెలంగాణకు న్యాయమైన వాటా వచ్చేలా చూడాలని కోరినా బోర్డు స్పందించలేదు. ఇక ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ చేసిన వినియోగం విషయంలోనూ తేడాలున్నాయి. అక్కడ వాస్తవ వినియోగం 124 టీఎంసీల మేర ఉన్నా.. ఏపీ 104 టీఎంసీలే చూపుతోంది. అంటే ఈ ఏడాది కృష్ణాలో మొత్తంగా 342.22 టీఎంసీల మేర వినియోగం జరిగితే.. ఏపీ 242.43 టీఎంసీలు, తెలంగాణ 99.79 టీఎంసీలు వినియోగించి నట్లవుతుంది. నిజానికి మొత్తం లభ్యత నీటిలో ఏపీకి 216.24 టీఎంసీలే దక్కాల్సి ఉన్నా అదనంగా 26 టీఎంసీలు వాడుకుంది. తెలంగాణ అంతే మొత్తంలో తక్కువ నీటిని వాడింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం లభ్యతగా ఉన్న 130 టీఎంసీల్లో.. తెలంగాణకు 74, ఏపీకి 56 టీఎంసీలు దక్కుతాయి. ఇందులో పట్టిసీమ కింద ఏపీ చేసిన వినియోగాన్ని పక్కనపెట్టినా తెలంగాణకు 56 టీఎంసీలు దక్కాలని అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. -
‘కృష్ణా’పై ఏం తేలుస్తుందో?
జలాల వివాదంపై 19న బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన విచారణను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? లేదా నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలా? అన్న అంశం ఈ నెల 19న తేలనుంది. దీనిపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ ఆఫీస్ హెడ్ హెచ్.ఎం.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అడ్వకేట్లకు సమాచారం అందించారు. ఇప్పటికే ఈ అంశంమై ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా బేసిన్లో లభ్యతగా ఉన్న మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు మళ్లీ కేటాయించాలని వాదించింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా చూడరాదని, నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నందున కేటాయింపుల్లోనూ అవన్నీ భాగస్వాములు అవుతాయని స్పష్టంచేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలని ట్రిబ్యునల్‌కు ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న ఉదయం 11 గంటలకు ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. -
ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ ఒప్పంద కార్యక్రమానికి జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో పాటు టీ.సర్కార్ తరపున హరీశ్ రావు హాజరు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. అలాగే కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీశ్ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి వెంట అధికార బృందం కూడా ఢిల్లీ వెళ్లింది. -
'కృష్ణా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం'
హైదరాబాద్ : కృష్ణా వాటర్ బోర్డు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... కృష్ణా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా చట్టానికి లోబడే పని చేయాలన్నారు. ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై తాము అభ్యంతరాలు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. తమ ప్రాజెక్ట్‌లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. ఇరు రాష్ట్రాలు సఖ్యంగా ఉంటేనే అభివృద్ధి అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. -
'తాగునీటికి మొదటి ప్రాధాన్యం'
హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీరు అడుగండడంతో ఖరీఫ్ సీజన్‌కు నీరు ఇవ్వలేమని కృష్ణా వాటర్ బోర్డు వర్కింగ్ గ్రూపు తెలియజేసింది. సోమవారం కృష్ణా వాటర్ బోర్డు గ్రూపు సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా ప్రాజెక్టుల కింద సాగునీరు ఇవ్వలేమని బోర్డు తెలియజేసింది. తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నటు తెలిపింది. శ్రీశైలంలోని నీటిని ఎలా వాడుకోవాలన్ని విషయంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కృష్ణా వాటర్ బోర్డు కోరింది. -
కృష్ణా బోర్డుకు లేఖరాసిన ఏపీ నీటిపారుదల శాఖ
హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా వాటర్ బోర్డుకు లేఖ రాశారు. రాష్ట్రంలో పంటలు కీలక దశలో ఉన్నాయని, వెంటనే నీటిని విడుదల చేయకపోతే అపారనష్టం సంభవిస్తుందని అధికారులు లేఖలో పేర్కొన్నారు. -
జగడం జటిలం !
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతున్న జల వివాదాలు * చేతులెత్తేస్తున్న కృష్ణా, గోదావరి జలాల బోర్డులు * సాగర్ నీటి వాడకంపై ఎవరి లెక్కలు వారివే * రబీలో జలాల వినియోగంపై చర్చలకు ముందుకు రాని ఏపీ.. ఎడమ, కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు సిద్ధమైన తెలంగాణ * గోదావరిలో వీడని ‘సీలేరు’ ముడి * ఎగువ, దిగువ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి లెక్కలు వెల్లడించని ఆంధ్రప్రదేశ్ * విద్యుత్ వాటాలపై సీఈఏ నివేదిక ఇచ్చినా ఆమోదం తెలపని కేంద్రం.. నివేదిక అందిన తర్వాతే బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం * ఈనెల 31న గోదావరి బోర్డు చైర్మన్ పదవీ విరమణ * కృష్ణా బోర్డు చైర్మన్ కు తాత్కాలిక బాధ్యతలు? సాక్షి, హైదరాబాద్: నీళ్లు నిప్పవుతున్నాయి.. వాటాలు కొట్లాటకు దారితీస్తున్నాయి.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముదురుపాకాన పడుతున్నాయి! ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బోర్డులు చేతులెత్తేస్తున్నాయి. నీటి వినియోగం, అవసరాలపై ఇరు రాష్ట్రాలు ఎవరి లెక్కలు వారు చెపుతుంటే తాము చేసేదేమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు కృష్ణా జలాల పంపిణీ సమస్యలతో బోర్డు సతమతం అవుతుంటే... మరోవైపు గోదావరిలో సీలేరు విద్యుదుత్పత్తి అంశం కేంద్ర వైఖరితో మరింత జటిలం అవుతోంది. నాగార్జునసాగర్ నీటి వినియోగం లెక్కలపై ఆంధ్రప్రదేశ్ చర్చలకు రాకపోవడం, నీటిని వాడుకునేందుకు తెలంగాణ పూనుకోవడం కృష్ణా బోర్డులో కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుండగా... సీలేరు అంశం గోదావరి బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాగర్‌లో తేలని లెక్క.. నాగార్జునసాగర్‌లో నీటిని ప్రస్తుత రబీ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు. నీటి లెక్కలపై ఎవరికి వారే తమ వాదనలకు కట్టుబడి ఉన్నారు. నీటి లెక్కలు ఓ కొలిక్కి రాకపోవడంతో నీటి పారుదల శాఖ అధికారుల మధ్య సమావేశం జరగడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సమావేశం శనివారం మరోసారి వాయిదా పడింది. సాగర్ రబీ లెక్కలపై ఆంధ్రప్రదేశ్ చర్చలకు రాకపోవడంతో సాగర్ ఎడమ, కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రెండు కాల్వల కింద ఇప్పటికే రోజుకు వినియోగించుకుంటున్న 18,800 క్యూసెక్కుల నీటిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఖరీఫ్ అవసరాలకు 12.71 టీఎంసీలు పూర్తయ్యాక, ఎడమ కాల్వ కింద రబీ అవసరాలకు 77.90 టీఎంసీల నీటిని సాగర్ నుంచే వాడుకుంటామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 553.8 అడుగుల మేర ఉండగా నీటి లభ్యత 218.23 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగుల వరకు లెక్కిస్తే వ్యవసాయ అవసరాలకు వాడుకోవాల్సిన నీరు కేవలం 93.791 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నీరు తెలంగాణ అవసరాలను మాత్రమే తీర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. కుడి కాల్వ కింద నీటితో ఏపీ సైతం రబీకి నీటిని వాడుకునేందుకు ప్రయత్నిస్తే వివాదం మరీ జటిలమయ్యే ప్రమాదం ఉంది. ఎటూ తేలని ‘సీలేరు’ గోదావరి నదీ జలాల వినియోగంతో ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తి వాటాల వివాదాన్ని ఎలా పరిష్కారించాలో తెలియక గోదావరి నదీ యాజమాన్య బోర్డు సతమతమవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఉత్పత్తి చేసిన విద్యుత్ వివరాలను ఇటు ఆంధ్రప్రదేశ్ సమర్పించకపోవడం, అటు విద్యుత్ వాటాలను తేల్చేందుకు ఏర్పాటైన కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) కమిటీ తన నివేదిక సమర్పించినా దానిని కేంద్ర విద్యుత్ శాఖ ఆమోదించకపోవడం బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా ఉన్న 740 మెగావాట్ల విద్యుదుత్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటిరవకు ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కూడా తెలంగాణకు ఏపీ ఇవ్వలేదు. ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ వివరాలను షెడ్యూలింగ్ చేయకపోవడం, సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ)కి సమాచారం ఇవ్వకపోవడంతో తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదు. దీంతో మరోమారు బోర్డును సంప్రదించింది. దీంతో సీలేరు విద్యుత్ వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఎస్ఆర్ఎల్డీసీని బోర్డు కోరింది. దీనిపై కసరత్తు చేసిన నీరజా మాథుర్ కమిటీ ఈ నెల రెండో వారంలోనే నివేదికను కేంద్రానికి సమర్పించినా... దాన్ని విద్యుత్ శాఖ ఆమోదించలేదు. అక్కడ నివేదికకు ఆమోదం దక్కి, బోర్డును చేరితేనే సీలేరుపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. లేదంటే బోర్డు సమావేశం... ఈనెల 31తో పదవీ విరమణ చేయనున్న చైర్మన్ ఎంఎస్ అగర్వాల్‌కు వీడ్కోలు కార్యక్రమంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరురాష్ట్రాలు గోదావరి బోర్డు బాధ్యతలు, సిబ్బంది, నిధుల కేటాయింపులతో పాటు సీలేరు అంశాన్ని సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేర్చాయి. వీటితోపాటే తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలాన్ని తమ రాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ను ఏపీ తన ఎజెండాలో చేర్చింది. గోదావరి బోర్డు పగ్గాలు కృష్ణా బోర్డు చైర్మన్‌కే? ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్న గోదావరి బోర్డు చైర్మన్ స్థానంలో కొత్తగా ఎవరిని నియమిస్తారన్నది కేంద్ర జల సంఘం ఇంకా తేల్చలేదు. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్కే తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కృష్ణా వివాదాలను తేల్చకుండా చేతులెత్తేసిన చైర్మన్... గోదావరి వివాదాలను సైతం నెత్తిన పెట్టుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న.