సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను చెరిసగం పంచడంతో పాటు షరతులకు అంగీకరిస్తే ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా బుధవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిందని, ఆ జలాలను రాష్ట్రాలకు పంచడానికి వీలుగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–2)కు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసింది.
811 టీఎంసీలను చెరిసగం అంటే 405.5 టీఎంసీల చొప్పున రెండు రాష్ట్రాలకు కేటాయించాలని స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్లో కనీస నీటిమట్టాన్ని 830 అడుగులుగా పరిగణనలోకి తీసుకోవాలని, పోతిరెడ్డిపాడు నుంచి ఎస్‌ఆర్బీసీ ద్వా రా మొత్తం 34 (ఎస్‌ఆర్బీసీ కాల్వకు 19 టీఎంసీలు, మద్రాస్ తాగునీటికి 15 టీఎంసీలు) టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని, కృష్ణా జలాలను బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు మాత్రమే కేటాయించాలని, బేసిన్ వెలుపలికి తరలించకుండా నియంత్రించాలని కోరింది.
ఒక నీటి సంవత్సరంలో వాడుకోని మిగులు కోటాను వచ్చే సంవత్సరానికి బదిలీ (క్యారీ ఓవర్) చేసేందుకు అనుమతించాలని, వాడుకోని నీటిని ఖాతాలో లెక్కించకుండా చూడాలని, తాగునీటి వినియోగాన్ని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 20 శాతంగా మాత్రమే లెక్కించాలని స్పష్టం చేసింది.
అలా ప్రకటిస్తే అభ్యంతరం లేదు
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చేలోగా పై షరతులకు కట్టుబడి ఉంటామని, అమలు చేస్తామని ప్రకటిస్తే... శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరాలేవీ లేవని ప్రభుత్వం పేర్కొంది. జనవరి 17వ తేదీన నాగార్జునసాగర్‌పై జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్లను అప్పగించడానికి తెలంగాణ అంగీకారం తెలిపినట్టుగా సమావేశపు మినట్స్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది.
ఆ సమావేశంలో నాగార్జునసాగర్ వద్ద నవంబర్ 28కి ముందు పరిస్థితిని పునరుద్ధరించాలని మాత్రమే కోరడం జరిగిందని తెలిపింది. తక్షణమే మినట్స్‌ను సవరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈనెల 27వ తేదీన లేఖ రాశారు. కాగా కేంద్రానికి ఇదివరకే తమ అభిప్రాయాన్ని నివేదించడం జరిగిందని బుధవారం కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
1న భేటీలో తేల్చి చెప్పండి
శ్రీశైలం, నాగార్జునసాగర్ అప్పగింత లాంఛనాలపై చర్చించడానికి వీలుగా ఫిబ్రవరి 1వ తేదీన కేఆర్‌ఎంబీ నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని, లేఖ ద్వారా నివేదించిన అంశాలన్నీ సమావేశంలో తేల్చేసి, తదుపరి చర్చకు ఆస్కారం లేకుండా బయటికి రావాలంటూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment