సాక్షి, హైదరాబాద్: కేసీ కాల్వకు కృష్ణా నదీజలాల్లో వాటా లేదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం కేసీ కాల్వకు తుంగభద్ర జలాశయం, తుంగభద్ర నది నుంచి మాత్రమే నిర్దేశిత పరిమాణంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కేసీ కాల్వకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తోపాటు మల్యాల వద్ద ఉన్న హంద్రి–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి వద్ద ఉన్న కేసీ కాల్వ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తోందని ఆరోపించింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కాల్వకు మళ్లించకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ఈ నెల 15న కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. లేఖలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
►కేసీ కాల్వ ప్రాజెక్టు ఆధునీకరణను కారణంగా చూపి ఆ ప్రాజెక్టుకు కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయించిన 39.9 టీఎంసీల్లో 8 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులకు కేటాయించింది. కేసీ కాల్వకు 31.9 టీఎంసీల కోటా మాత్రమే మిగిలి ఉంది. ఇదే దామాషాలో తుంగభద్ర డ్యాం నుంచి కేసీ కాల్వలకు విడుదల చేయాల్సిన 10 టీఎంసీలను సైతం 8 టీఎంసీలకు తగ్గించి మిగిలిన 2 టీఎంసీలను కృష్ణాలో విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దిగువ పేర్కొన్న అంశాలపై అధ్యయనం జరిపి కేసీ కాల్వకు 31.9 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని సూచించింది.
►కేసీ కాల్వకు తుంగభద్ర నదీ ప్రవాహంలో ఉన్న కోటా నుంచి కొంతభాగాన్ని తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్‌ఎల్‌సీ)కు ఏపీ కేటాయించింది. ఆ మేరకు కేసీ కాల్వ కోటాను తగ్గించాలి. ఈ ఏడాది కేసీ కాల్వ కోటా నుంచి 4 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం ఎల్‌ఎల్‌సీకి మళ్లించింది.
►గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆనకట్ట నుంచి సుంకేశుల జలాశయం వరకు తుంగభద్ర నదిపై 12 పంప్‌హౌస్‌లను నిర్మించి 5.373 టీఎంసీలను అనధికారంగా మళ్లించుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను తక్షణమే నిలుపుదల చేయించాలి.
►శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించుకునే అన్ని పాయింట్ల వద్ద రియల్ టైం సెన్సర్లను ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment