సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. తాత్కాలిక కోటా ప్రకారం కృష్ణా జలాల్లో ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం వాటాలున్నాయి. అయితే ఈ వాటాలకు మించి కృష్ణా జలాలను వాడుకున్నట్టు రెండు రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి. ఇకపై కృష్ణా జలాలను తరలించుకోకుండా ఏపీని నిలువరించాలని తెలంగాణ, తెలంగాణను నిలువరించాలని ఏపీ డిమాండ్ చేశాయి.
కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే అధ్యక్షతన సమావేశమయ్యింది. ఏపీ ఈ భేటీకి గైర్హాజరైనప్పటికీ తెలంగాణపై ఆరోపణలు చేస్తూ లేఖను పంపింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ సమావేశానికి హాజరై ఏపీ కోటాకి మించి జలాలను వాడుకున్నట్టు ఆరోపించారు.
మా మిగిలిన నీళ్లను పరిరక్షించండి: తెలంగాణ
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 నాటికి 971.29 టీఎంసీల కృష్ణా జలాలు రాగా, ఏపీ 619.047 టీఎంసీలు (74.45 శాతం), తెలంగాణ 212.885 టీఎంసీలు (25.55) వాడినట్టు మురళీధర్ చెప్పారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఏపీ ఇప్పటికే 38.723 టీఎంసీలను అదనంగా వినియోగించిందంటూ.. తెలంగాణకు మిగిలిన ఉన్న 108.901 టీఎంసీల వాటాను పరిరక్షించాలని కోరారు. ఇకపై శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించుకోకుండా ఏపీని అడ్డుకోవాలని చెప్పారు.
నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా కృష్ణా డెల్టాకు రోజుకు టీఎంసీ నీటిని ఏపీ తరలిస్తోందని, దీనిని తక్షణమే నిలుపుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. వరద జలాల వినియోగాన్ని విస్మరించినా, ఏపీ కోటాకు మించి నీళ్లను వాడిందని తెలంగాణ ఈఎన్‌సీ వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి నాగార్జునసాగర్ అవసరాలను తీర్చడానికి మాత్రమే తాము జలవిద్యుత్ ఉత్పత్తి చేశామని, ఆ నీరంతా సాగర్‌లోకి చేరిందని వాదించారు. ఈ మేరకు ఆయన ఇటీవల కృష్ణాబోర్డుకు లేఖ కూడా రాశారు.
ఆ నీటిని మా కోటాలో లెక్కించొద్దు: ఏపీ
ఏపీ లేఖలో లేవనెత్తిన అంశాలను రాయిపురే సమావేశంలో వివరించారు. ‘జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ నీటిని వృథా చేసింది. వరదల సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిన తర్వాత సముద్రంలోకి నీరు వెళ్తున్నప్పుడు తరలించే నీటిని మా కోటాలో లెక్కించరాదు. ఈ సమావేశాన్ని వాయిదా వేసి మళ్లీ ఏప్రిల్ తొలివారంలో నిర్వహించండి..’అని ఏపీ కోరినట్లు తెలిపారు. అయితే సమావేశం జరిగినట్టు పరిగణించి తాము లేవనెత్తిన అంశాలను రికార్డు చేయాలని మురళీధర్ కోరారు.
201 టీఎంసీలు సముద్రం పాలు
గత ఫిబ్రవరి 28 నాటికి 972.46 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, తాత్కాలిక కోటాల ప్రకారం అందులో తమకు 641.82 టీఎంసీలు, తెలంగాణకు 330.64 టీఎంసీల వాటా ఉందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. అందులో ఏపీ 442.52 టీఎంసీలు (52.2శాతం), తెలంగాణ 404.2 టీఎంసీలు (47.8 శాతం) వాడినట్టు పేర్కొన్నారు. వాటా ప్రకారం ఏపీకి 199.31 టీఎంసీలు మిగిలి ఉండాల్సి ఉండగా, 125.75 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ కోటాకు మించి 82.08 టీఎంసీలను వాడినట్టు ఆరోపించారు. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఆయన తాజాగా లేఖ రాశారు. ఉమ్మడి జలాశయాల్లో ఏపీకి ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉన్నాయన్నారు. వరదలు లేని సమయంలో ఇండెంట్ లేకుండా విద్యుదుత్పత్తి ద్వారా 201 టీఎంసీలను తెలంగాణ సముద్రంలో వృథాగా కలిపిందని, ఈ నీళ్లను సైతం ఆ రాష్ట్రం కోటాలో లెక్కించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment