సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాత్కాలిక సర్దుబాటు ప్రకారం, 2023–24 నీటి సంవత్సరంలోనూ 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయం తీసుకుంది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు బట్వాడా చేస్తామని స్పష్టం చేసింది. గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్న 66:34 నిష్పత్తిని ఇకపై అంగీకరించబోమని, రెండు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.
అయితే దీనిపై తుది నిర్ణయం కోసం కేంద్ర జలశక్తి శాఖకు సిఫారసు చేయాలని నిర్ణయించింది. ‘ఏపీ, తెలంగాణలకు కృష్ణా జలాల పంపకాలు జరగలేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా 2015, జూన్ 19న కేంద్ర జల్‌శక్తి శాఖ రెండు రాష్ట్రాలకు 66:34 నిష్పత్తిలో తాత్కాలిక సర్దుబాటు మాత్రమే చేసింది. దీనినే 2023–24లో సైతం కొనసాగించాలి..’అంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది.
కేఆర్‌ఎంబీ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ అధ్యక్షతన బోర్డు 17వ సర్వ సభ్య సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వాడీవేడిగా జరిగింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ సి.మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
పాలమూరుపై మళ్లీ ఏపీ అభ్యంతరం
నీటి కేటాయింపులు లేకున్నా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీచేసిన జీవోను రద్దు చేయాలని బోర్డును ఏపీ అధికారులు డిమాండ్ చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టు, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున సమావేశంలో చర్చించడం సరికాదని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. సాగర్ జలవిస్తరణ ప్రాంతంలో సుంకిశాల ఇన్‌టేక్‌వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే సాగర్‌లో నీటిమట్టం తగ్గిపోవడంతో హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని.. దానికి కేటాయించిన 16.5 టీఎంసీలను మాత్రమే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ద్వారా వాడుకుంటామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. 16.5 టీఎంసీలే వాడుకునే పక్షంలో ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. ఆ ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని ఏపీ అధికారులు డిమాండ్ చేశారు.
ఆర్డీఎస్‌పై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో అధ్యయనం
రాజోలిబండ డైవర్షన్‌స్కీం (ఆర్డీఎస్) చివరి ఆయకట్టు భూములకు నీళ్లందించడానికి వీలుగా దాన్ని ఆధునీకరించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. కాగా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)తో అధ్యయనం చేయించి.. ఆ నివేదిక ఆధారంగా ఆధునికీకరణపై నిర్ణయం తీసుకుందామని గత సమావేశంలో బోర్డు తీర్మానించిన అంశాన్ని ఏపీ అధికారులు గుర్తుచేయగా, అందుకు బోర్డు చైర్మన్ అంగీకరించారు. ఆర్డీఎస్ కుడి కాలువను ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిందని తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు.
మళ్లీ ఆర్‌ఎంసీ పునరుద్ధరణ..
శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగుల వద్ద నీటి నిల్వ లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శ్రీశైలం జలాశయంలో ఏపీకి 34 టీఎంసీల వాటా మాత్రమే ఉందని, దీనికి కట్టుబడితేనే జల విద్యుదుత్పత్తిపై చర్చకు అంగీకరిస్తామని తెలంగాణ అధికారులు బదులిచ్చారు.
జలవిద్యుదుత్పత్తి కోసమే శ్రీశైలం జలాశయం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదాల పరిష్కారానికి గతంలో ఏర్పాటుచేసిన రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ)ని మళ్లీ పునరుద్ధరించాలని బోర్డు చైర్మన్ నిర్ణయించారు. బోర్డు సభ్యులు అజయ్‌కుమార్‌గుప్తా అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్ సీలు, జెన్‌కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్‌ఎంసీని పునరుద్ధరించారు. నెలలోగా రూల్ కర్వ్స్, జల విద్యుదుత్పత్తి నిబంధనలు, వరద జలాల మళ్లింపుపై నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని ఆదేశించారు.
50 శాతం వాటా ఇవ్వాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి. 2015లో కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు 2015–16 నీటి సంవత్సరానికి మాత్రమే. పాత పద్ధతిలో పంపిణీ చేస్తే అంగీకరించం. తదుపరి నిర్ణయం కోసం మా అభ్యంతరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని కృష్ణా బోర్డు హామీనిచి్చంది. తద్వారా ఈ విషయంలో ఒక అడుగు ముందుకుపడింది. – రజత్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ
ట్రిబ్యునలే నిర్ణయం తీసుకోవాలి
నిర్ణయం తీసుకునే అధికారం కృష్ణా బోర్డుకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. కేవలం ట్రిబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీచేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ 2015లో తాత్కాలిక సర్దుబాటు చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు తాత్కాలిక సర్దుబాటు కొనసాగించక తప్పదు. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment