
సాక్షి, హైదరాబాద్: కేఆర్‌ఎంబీ భేటీకి ఏపీ గైర్హాజరు కావడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎంబీపై కనీసం గౌరవం లేదా అంటూ తెలంగాణ ప్రశ్నించింది. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకొని.. ఇప్పుడు రాకపోవడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే, ఇవాళ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరు కాలేదు. దీంతో రేపు(గురువారం) మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. ఏపీ నుంచి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా స్పందిస్తూ.. ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదంటూ మండిపడ్డారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కేటాయింపులపై కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఏపీ అధికారులు హాజరుకాకపోవడంతో రేపు మరోమారు భేటీ కావాలని కేఆర్‌ఎంబీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment