తెలంగాణకు 131 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 27 టీఎంసీలు.. | Krishna Board Superintending Engineers Letters To ENCs Of AP And Telangana Irrigation Departments, See Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 131 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 27 టీఎంసీలు..

Published Wed, Feb 19 2025 4:34 AM | Last Updated on Wed, Feb 19 2025 9:57 AM

Krishna Board Superintending Engineers letter to ENCs of AP and Telangana Irrigation Departments

వాడుకోగా మిగిలిన కృష్ణా జలాల వాటాలివే.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టీకరణ

మిగులు నీటి వినియోగంపై ప్రణాళికలు సమర్పించాలని రెండు రాష్ట్రాలకు లేఖ

ఫిబ్రవరి –జూలై మధ్య 116 టీఎంసీలు విడుదల చేయాలని కోరిన తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలు మిగిలి ఉన్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తేల్చింది. వచ్చే జూన్, జూలై నాటికి ఏర్పడే తాగు, సాగునీటి అవసరాలను వాటా జలాలతో తీర్చుకోవడంపై ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ జి.వరలక్ష్మీ ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలకు లేఖ రాశారు.

ఏపీ 639.652 టీఎంసీలు వాడుకుంది..
ప్రస్తుత ఏడాది సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు జరపాలని గత జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించిన విషయాన్ని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1010.134 టీఎంసీల జలా లు లభ్యతలోకి రాగా.. తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటాలుంటాయని పేర్కొంది. 

ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది.

పోతిరెడ్డిపాడు నుంచి 207 టీఎంసీలు తరలించిన ఏపీ
గతేడాది నవంబర్‌ 25న 15.86 టీఎంసీలు, గత జనవరి 31న మరో 18 టీఎంసీలు కలిపి మొత్తం 33.86 టీఎంసీలను నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు విడుదల చేయాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది. దీనికి తోడు నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ, హంద్రీ నీవా, ముచ్చుమరి ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలించిందని పేర్కొంది. 

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఈ ఏడాది ఏపీ రికార్డు స్థాయిలో 207.88 టీఎంసీ జలాలను తరలించుకుంది. హంద్రీ నీవా, ముచ్చుమర్రి, తదితర ప్రాజెక్టులు కలిపి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ మొత్తం 236.63 టీఎంసీలను తరలించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు కేవలం 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోగలిగింది. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వలు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు కలిపి మరో 324.2 టీఎంసీలను ఏపీ వాడుకుంది. 

116 టీఎంసీల కోసం తెలంగాణ ఇండెంట్‌
2025 ఫిబ్రవరి –జూలై మధ్యకాలంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీలకు 116 టీఎంసీల విడుదల కోసం తెలంగాణ ఇండెంట్‌ పెట్టిందని కృష్ణా బోర్డు తెలిపింది.

మిగిలింది 97.47 టీఎంసీలే 
నాగార్జునసాగర్‌ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్‌) 510 అడుగులకి పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకి పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాడుకున్న జలాలతో పాటు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని జలాల వినియోగంపై ప్రణాళికలు సమర్పించాలని కోరింది.

ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న కృష్ణా జలాల వివరాలను కృష్ణా బోర్డు లేఖలో పొందుపరిచింది. 

పాత పంపకాలే కొనసాగుతాయి
కృష్ణా జలాల్లో ఏపీకి 66% తెలంగాణకు 34% కేటాయింపులో మార్పు ఉండదు
గత నెలలో తీసుకున్న నిర్ణయానికి ఉభయ రాష్ట్రాల అంగీకారం
తాజాగా సమావేశం మినిట్స్‌ పంపిన కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్‌: ఉభయ రాష్ట్రాల్లో అను మతులున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగ ణనలోకి తీసుకుని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్ప త్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు కొన సాగుతాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేదా అపెక్స్‌ కౌన్సిల్‌ ఎలాంటి అనుమతులివ్వనందున ఈ తాత్కాలిక సర్దుబాటులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు గతంలో అంగీకరించిన 66:34 నిష్పత్తిలోనే ప్రస్తుత సంవత్సరంలో సైతం కృష్ణా జలాల కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే 66:34 నిష్ప త్తికి విరుద్ధంగా రాష్ట్రాలకు ఏమైనా అవసరా లు ఏర్పడి నిర్దిష్ట కేటాయింపులు కోరితే ఆ మేరకు నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. 

గత నెల 21న జరిగిన కృష్ణా బోర్డు సమా వేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. తాజాగా రెండు రాష్ట్రాలకు పంపిన సమావేశం మిని ట్స్‌లో వీటిని బోర్డు పొందుపరిచింది. 

మూడో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు ఏపీ నో
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించేందుకు మొత్తం 27 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, తొలి విడత కింద 18 స్టేషన్లను ఏర్పాటు చేశారు. రెండో దశ కింద 9 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడో దశ కింద మరో 11 టెలిమెట్రీ కేంద్రాలను తెలంగాణ ప్రతిపాదించింది. 

తెలు గుగంగ, గాలేరీ–నగరి, బనకచర్ల హెడ్‌రెగ్యు లేటరీ, క్రాస్‌ డిస్ట్రిబ్యూటరీ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి నీళ్లను తరలించుకుంటున్నందున అక్కడ ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించలేదు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద  సీఆర్‌పీఎఫ్‌ బలగాల మోహరింపును ఉపసంహరించాలని రెండు రాష్ట్రాలు కోరగా, శాంతియుత పరిస్థితులు నెలకొనే వరకు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement