సెక్షన్–89, ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ–1956 సెక్షన్ 3 రెండూ భిన్నమైనవి
రెండు అంశాలపై ఒకేసారి వాదనలు వినడానికి వీల్లేదు
కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన మీద ఏపీ అభ్యంతరం
కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం నివేదన
సెక్షన్–3పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారమే వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సెక్షన్–89 ప్రకారం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ)–1956లో సెక్షన్–3 ప్రకారం 2023 అక్టోబరు 6న కేంద్రం జారీ చేసిన అదనపు నిబంధనల ప్రకారం వాదనలు వినాలన్న తెలంగాణ వాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
కేంద్ర అదనపు నియమ, నిబంధనలు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టులో 2023 అక్టోబర్ 31న రిట్ పిటిషన్ దాఖలు చేశామని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) –2కు ఏపీ తెలిపింది. ఆ పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు.. కేడబ్ల్యూడీటీ –2 ఎదుట వాదనలు విన్పించాలని 2023 నవంబర్ 7న చెప్పిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ–1956 సెక్షన్–3 ప్రకారం వాదనలు వినడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
కృష్ణా జలాల పంపిణీపై విభజన చట్టంలో సెక్షన్–89, ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం ఒకేసారి వాదనలు వినాలని ఈనెల 2న కేడబ్ల్యూడీటీ–2లో తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
తెలంగాణ తప్పుగా అర్ధం చేసుకుంది
విభజన చట్టంలో సెక్షన్–89, కేంద్రం ఆ తర్వాత జారీ చేసిన అదనపు నియమ, నిబంధనలు రెండు భిన్నమైవని, తెలంగాణ సర్కారు వాటిని తప్పుగా అర్థం చేసుకుందని ఏపీ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. ఐఎస్‌డబ్ల్యూఆర్‌డీఏ–1956లో సెక్షన్ 5(23), 12లోని అధికారాలను వినియోగించుకుని పునర్విభజన చట్టంలో సెక్షన్–89లోని ఏ, బీ నిబంధనల కింద తదుపరి నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2ను 2014 మే 15న కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించిందని గుర్తు చేసింది.
సెక్షన్–89 ఏ నిబంధన ప్రకారం ప్రాజెక్టులవారీగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకపోతే, త్వరగా చేయాలని పేర్కొంది. ఆ సెక్షన్‌లో బి నిబంధన ప్రకారం నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా నీటి విడుదలకు ఆపరేషన్ ప్రొటోకాల్ (నిర్వహణ నియమావళి)ని రూపొందించాలని నిర్దేశించిందని గుర్తు చేసింది.
రాష్ట్ర విభజనకు ముందు ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ అవార్డులు ఉంటే.. వాటికి రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని సెక్షన్–89లో కేంద్రం స్పష్టం చేసిందని తెలిపింది. దీనికి సంబంధించి సాక్ష్యాల సేకరణ, వాదనలు ప్రారంభమయ్యాయని గుర్తు చేసింది.
సెక్షన్–89 ప్రకారమే..
కేంద్రం జారీ చేసిన అదనపు నియమ, నిబంధనల ప్రకారం విచారణకు 2024 ఆగస్టు 28న ట్రిబ్యునల్ రూపొందించిన జాబితాలో పేర్కొన్న అంశాలు సెక్షన్–89లో విభజన చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నమైనవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సెక్షన్–3పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున, తొలుత సెక్షన్–89 ప్రకారమే వాదనలు వినాలని కేడబ్ల్యూడీటీ–2ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment