కృష్ణా జలాలపై మళ్లీ పంచాయతీ
పాతవే కొనసాగించాలంటున్న ఏపీ
సగం వాటా కోసం తెలంగాణ పట్టు
నేడు కృష్ణా బోర్డు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాల్లో వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తమకు సగ భాగం కేటాయించాలని తెలంగాణ సర్కార్ పట్టుబడుతుండగా.. బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల (ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు) ప్రకారమే పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చి పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్‌జైన్ నివేదించారు. అయితే నీటి వాటాలు తేల్చే అంశంపై అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోబోదని.. రెండు రాష్ట్రాలతో మీరే సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించింది. దీంతో నీటి వాటాలే ప్రధాన అజెండాగా మంగళవారం హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో నిర్వహిస్తున్న బోర్డు 19వ సర్వ సభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు, తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్, బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తదితరులు పాల్గొననున్నారు. ఇరు ప్రభుత్వాలు సూచించిన అంశాలతోపాటు మొత్తం 30 అంశాలతో కృష్ణా బోర్డు సమావేశం అజెండాను రూపొందించింది.
అజెండాలో కృష్ణా బోర్డు ప్రతిపాదించిన అంశాలు..
⇒ కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌కు తరలింపు
⇒బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు
⇒ రెండు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టులకు అనుమతులపై గెజిట్‌లో కేంద్రం విధించిన గడువు ముగియడంతో వాటికి నీటి విడుదలపై చర్చ
⇒ రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు
ఏపీ ప్రతిపాదించిన ప్రధానాంశాలు..
⇒ శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం అప్పగించే వరకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలి.
⇒ నీటి కేటాయింపులు లేకుండా తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇన్‌టెక్ వెల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి.
⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఏపీకి ఇవ్వాలి.
⇒ పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి మళ్లించడానికి బదులుగా సాగర్ ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కలి్పంచింది. ఆ 45 టీఎంసీలను తెలంగాణ సర్కార్ పాలమూరు–
రంగారెడ్డికి కేటాయించడానికి ఎలాంటి హక్కులు లేవు.
⇒ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా అదనంగా 15 టీఎంసీల తరలింపు పనులకు గెజిట్ నోటిఫికేషన్‌లో అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదు.
⇒ నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తగినంత నీటి సరఫరా జరగడం లేదు.
⇒ అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిన అచ్చంపేట, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులను అడ్డుకోవాలి.
తెలంగాణ ప్రతిపాదించిన ప్రధానాంశాలు..:
⇒ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యాన్ని తెలంగాణకే అప్పగించాలి. డ్యామ్‌ల భద్రత చట్టం 2021 ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ స్పిల్ వే, కుడి, ఎడమ కాలువ రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా.. 2023 నవంబర్ 28న ఏపీ తన ఆ«దీనంలోకి సగం స్పిల్ వేను తీసుకోవడం సరికాదు.
⇒ తెలంగాణ వాడుకోకపోవడంతో నాగార్జునసాగర్‌లో మిగిలిపోయిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి.
⇒ సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణను తెలంగాణకే అప్పగించాలి.
⇒ ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణకు ఏపీ అడ్డుకోకుండా సహకరించాలి.
⇒ ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి.
⇒ ఏపీ నీటి వినియోగాన్ని కచి్చతంగా లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బ్యారేజ్ వద్ద టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
⇒ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం హైదరాబాద్ తాగునీటికి తీసుకున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించాలి.
⇒ రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్‌లో ఏపీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు, ఎస్‌ఆర్‌ఎంసీ కాలువ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి.
⇒ శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, తెలుగు గంగ, హంద్రీ–నీవా, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా నిలువరించాలి.
⇒ ఏపీ పరిధిలో శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి.
ఏ నిర్ణయం తీసుకుంటుందో?
కృష్ణా నదిలో 75% లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించింది. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా 2014 మే 28న కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా 2015–16 నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 512.06, తెలంగాణకు 298.94 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర జల్ శక్తి తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యతగా ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్ 66%, తెలంగాణ 34% వాడుకునేలా 2017–18 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
2018–19, 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో బోర్డు సర్వ సభ్య సమావేశాల్లో రెండు రాష్ట్రాలతో చర్చించి అదే పద్ధతి ప్రకారం కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. కానీ 2023–24కి సంబంధించి నీటి పంపకాలపై 2023 మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు సభ్య సమావేశంలో తమకు 50% వాటా కావాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తోసిపుచ్చారు. దీంతో కృష్ణా జలాల లభ్యత, అవసరాలపై ఎప్పటికప్పుడు చర్చించి కేటాయింపులు చేసే బాధ్యతను కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీకి అప్పగించింది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాత పద్ధతి ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66% ఏపీకి, తెలంగాణకు 34% పంపిణీ చేస్తూ కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment