50 శాతం వాటా ఇవ్వాలంటూ తెలంగాణ డిమాండ్
అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ అధికారులు
ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని వెల్లడి
దాని ఆధారంగానే ఏపీకి 66 శాతం నీటిని కేంద్రం కేటాయించిందని స్పష్టీకరణ.. అదే పద్ధతి ప్రకారం నీటిని పంపిణీ చేయాలని డిమాండ్
సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా పాత వాటాల ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు వెల్లడించింది.
తెలంగాణలో కృష్ణా బేసిన్ 71 శాతం ఉందని, ఆ లెక్కన 71 శాతం వాటా తమకు రావాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ 50 శాతం వాటాను కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్‌సీ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని.. ఆ ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తుచేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ 66 : 34 వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని పునరుద్ఘాటించారు.
దీంతో.. ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ పాత వాటాల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. నీటి అవసరాలు ఏవైనా ఉంటే త్రిసభ్య కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు 19వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది.
ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ సర్కారు తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్‌సీ అనిల్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టెలీమీటర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు..
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి 76 శాతం నీటిని వాడుకుందని.. పెన్నా బేసిన్‌కు నీటిని తరలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌తోపాటు పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించే 11 చోట్ల టెలీమీటర్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి 833 టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. వరద సమయంలో ఏ రాష్ట్రం మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని ఆది నుంచి తాము కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే టెలీమీటరు ఏర్పాటుచేశారని.. దాని దిగువన టెలీమీటర్లు ఏర్పాటుచేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం చెబుతామని బోర్డు ఛైర్మన్‌కు చెప్పారు.
శ్రీశైలం ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు..
ఇక కృష్ణా నదికి 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ దెబ్బతిందని.. తక్షణమే మరమ్మతు చేయకపోతే ఆ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదమని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్‌పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించామని.. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫ్లంజ్‌పూల్‌కు మరమ్మతులు చేస్తామని ఏపీ ఈఎన్‌సీ చెప్పారు. ఆలోగా శ్రీశైలం ప్రాజెక్టులో అత్యవసర మరమ్మతులను వచ్చే సీజన్‌లోగా పూర్తిచేస్తామన్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి సీఐఎస్‌ఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని, నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు.
రెండునెలలు చూస్తామని.. సాగర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కాకపోతే అప్పుడు సీఐఎస్‌ఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్‌సీ చేసిన ప్రతిపాదనకు జైన్ సానుకూలంగా స్పందించారు.
50 శాతం వాటా అసంబద్ధం..
కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తెలంగాణ అధికారులు కోరడం అసంబద్ధం. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలను 2015లో కేంద్రం కేటాయించింది.
ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు చెబుతారు? ఇదే అంశాన్ని కృష్ణా బోర్డుకు చెప్పాం. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ 66 : 34 నిష్పత్తిలోనే నీటిని పంపిణీ చేయాలని కోరగా బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. – ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ, ఏపీ జలవనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment