అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని తేల్చిన కేంద్ర జలశక్తి శాఖ
మళ్లీ కృష్ణా బోర్డు ముందుకు తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపిణీ అంశం
అనుమతుల్లేని ప్రాజెక్టులకు నీటి విడుదలపై జనవరి 21న బోర్డు భేటీలో జరగనున్న చర్చ
ఎజెండాలో ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను వేర్వేరుగా చేర్చిన బోర్డు
సాక్షి, హైదరాబాద్: నీటి పంపకాల జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పడంతో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు అంశం మళ్లీ కృష్ణా బోర్డు ముందుకొచ్చిoది. దీంతో తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించడానికి జనవరి 21న కృష్ణా బోర్డు భేటీ కానుంది.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో జరిపిన కేటాయింపులు 2021–22 వరకు కొనసాగాయి.
ఆ తర్వాతి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆ కేటాయింపులను వ్యతిరేకిస్తోంది. 50:50 నిష్పత్తిలో తాత్కాలికంగా నీటి పంపిణీ జరపాలని కోరుతోంది. అయితే ఏపీ మాత్రం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.
ఎజెండాలో తెలంగాణ ప్రతిపాదనలివీ..
» నాగార్జునసాగర్ నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యాన్ని అప్పగించాలి. ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యూలేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా 2023 నవంబర్ 28న ఏపీ అదీనంలోకి సగం డ్యామ్‌ను తీసుకోవడం సరికాదు.
» తెలంగాణ వాడుకోకపోవడంతో సాగర్‌లో మిగిలిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి.
» సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణను తెలంగాణకే అప్పగించాలి. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుకోకుండా సహకరించాలి.
» ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఏపీ చేపట్టరాదు.
» ఏపీ నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
» కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం తాగునీటికి తీసుకున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించాలి.
» రాయలసీమ ఎత్తిపోతలు సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్‌లో ఏపీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు, ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి.
» శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగు గంగ, హెచ్‌ఎన్‌ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా నిలువరించాలి.
» ఏపీ పరిధిలో శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కు అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి.
ఏపీ ప్రతిపాదించిన అంశాలు..
» శ్రీశైలం, సాగర్, ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే వరకు సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలి.
» నీటి కేటాయింపుల్లేకుండా తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి.
» పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను మాకు అందించాలి.
» పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించడానికి బదులుగా సాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకొనే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. వాటిలో మిగిలిన ఉన్న 45 టీఎంసీలను తెలంగాణ పాలమూరు–రంగారెడ్డికి కేటాయించింది. ఆ జలాలపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు.
» కల్వకుర్తి లిఫ్టు ద్వారా అదనంగా 15 టీఎంసీల తరలింపు పనులకు గెజిట్ నోటిఫికేషన్‌లో అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదు.
» అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిన అచ్చంపేట, నారాయణపేట – కొడంగల్ లిఫ్టు పనులను అడ్డుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment