
పట్టిసీమను పక్కన పెట్టినా వాటా దక్కాల్సిందే!
- పట్టిసీమను పక్కన పెట్టినా.. 56 టీఎంసీలు దక్కాల్సిందే!
- రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నీటి పారుదల శాఖ
- ఏపీది అడ్డగోలు వాదన.. బోర్డుది నిలకడలేని నిర్ణయం
- గతేడాది అధిక వినియోగం, పోతిరెడ్డిపాడుపై ఫిర్యాదును పట్టించుకోలేదని వివరణ
- ఈ అంశాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల అంశంలో ‘పట్టిసీమ’ కింద ఆంధ్రప్రదేశ్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్న కృష్ణా బోర్డు నిర్ణయంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పట్టిసీమ సహా 2014–15లో ఏపీ చేసిన అధిక వినియోగం, పోతిరెడ్డిపాడు నుంచి లెక్కలో చూపిన దానికన్నా అధికంగా తరలించుకున్నారన్న తెలంగాణ ఫిర్యాదులపై ఎలాంటి స్పందనా తెలియజేయని బోర్డు.. ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని భావిస్తోంది. బోర్డు చెప్పినట్లే పట్టిసీమ విని యోగాన్ని పక్కన పెట్టినా తెలంగాణకు గరిష్టంగా 56 టీఎంసీల మేర దక్కుతాయని స్పష్టం చేస్తోంది. కానీ తెలంగాణకు 43 టీఎంసీలు మాత్రమే దక్కుతాయనడం రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని పేర్కొంటోంది.
నివేదిక సిద్ధం
పట్టిసీమ లెక్కలను పరిగణనలోకి తీసుకోలే మని బోర్డు పేర్కొన్న నేపథ్యంలో... దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖ నుంచి వివరణ కోరింది. దీంతో బోర్డు నిర్ణయం వెనుక కారణాలు, తెలంగాణ లేవనెత్తిన అం శాలు, ప్రస్తుత నిర్ణయంతో జరిగే నష్టం తదితరాలపై నీటి పారుదల శాఖ అధికారులు అప్పటికప్పుడు పది పేజీల నివేదికను రూపొందించి మంత్రి హరీశ్‌రావు, శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోíషీలకు అందిం చారు. ఈ నివేదిక ప్రకారం... 2014–15లో ఏపీ తనకు దక్కాల్సిన వాటా కంటే 45 టీఎం సీలు అదనంగా వాడుకుంది. పోతిరెడ్డిపాడు ద్వారా 23 టీఎంసీల మేర వినియోగిం చుకున్నా 11.76 టీఎంసీల వాడకాన్ని మాత్రమే చూపింది. ఈ లెక్కలను సరిచేసి తెలంగాణకు న్యాయమైన వాటా వచ్చేలా చూడాలని కోరినా బోర్డు స్పందించలేదు.
ఇక ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ చేసిన వినియోగం విషయంలోనూ తేడాలున్నాయి. అక్కడ వాస్తవ వినియోగం 124 టీఎంసీల మేర ఉన్నా.. ఏపీ 104 టీఎంసీలే చూపుతోంది. అంటే ఈ ఏడాది కృష్ణాలో మొత్తంగా 342.22 టీఎంసీల మేర వినియోగం జరిగితే.. ఏపీ 242.43 టీఎంసీలు, తెలంగాణ 99.79 టీఎంసీలు వినియోగించి నట్లవుతుంది. నిజానికి మొత్తం లభ్యత నీటిలో ఏపీకి 216.24 టీఎంసీలే దక్కాల్సి ఉన్నా అదనంగా 26 టీఎంసీలు వాడుకుంది. తెలంగాణ అంతే మొత్తంలో తక్కువ నీటిని వాడింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం లభ్యతగా ఉన్న 130 టీఎంసీల్లో.. తెలంగాణకు 74, ఏపీకి 56 టీఎంసీలు దక్కుతాయి. ఇందులో పట్టిసీమ కింద ఏపీ చేసిన వినియోగాన్ని పక్కనపెట్టినా తెలంగాణకు 56 టీఎంసీలు దక్కాలని అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.