ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి స్థిరంగా వరద
నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు దిగువకు
జూరాల నుంచి 1.04 లక్షల క్యూసెక్కులు దిగువకు..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.
ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్‌కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్‌కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్‌కో జల విద్యుత్‌కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.
తుంగభద్రలో...
కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్‌లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.
మూసీ ప్రాజెక్టుకు జలకళ
కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment