అధికారులు ప్రాజెక్టు గేట్లుఎత్తడంతో పెరిగిన వరద
కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
కేతేపల్లి: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇద్దరు పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమారం గ్రామానికి చెందిన పశువుల కాపరులు సురుగు బాలస్వామి, బయ్య గంగయ్య రోజుమాదిరిగానే ఆదివారం పశువులను మేపేందుకు గ్రామ శివారులో ఉన్న మూసీ వాగు ప్రాంతంలోకి తీసుకెళ్లారు.
కాగా, హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువన ఉన్న ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా ప్రాజెక్టు మూడు క్రస్టు గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ ప్రాజెక్టు దిగువనున్న భీమారం వద్ద మూసీ వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బాలయ్య, గంగయ్య వెంటనే తేరుకుని పశువులతో సహా వాగు మధ్యలో ఉన్న పెద్ద రాతిబండపైకి చేరుకున్నారు.
అదే సమయంలో వాగు వద్ద ట్రాక్టర్‌లోకి ఇసుక ఎత్తుతున్న కూలీలు వరద ఉధృతి పెరగటం గమనించి వెంటనే దూరంగా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రాక్టర్ మాత్రం వాగులోని నీటిలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కేతేపల్లి ఎస్‌ఐ శివతేజ, తహసీల్దార్ ఎన్. మధుసూదన్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి గేట్లు మూసివేయించారు.
ఒక వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే ప«శువులు నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. పోలీసులు జేసీబీని వాగులోకి దింపి పశువుల కాపరులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదు. సూర్యాపేట ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని తాళ్లు, సేఫ్టీ జాకెట్ల సహాయంతో వాగులోకి వెళ్లి పశువుల కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment