కంటతడి ఆరలేదు.. | Rakasitanda farmers who lost everything due to Akeru floods | Sakshi
Sakshi News home page

కంటతడి ఆరలేదు..

Published Mon, Jan 20 2025 6:10 AM | Last Updated on Mon, Jan 20 2025 6:10 AM

Rakasitanda farmers who lost everything due to Akeru floods

రాకాసితండాలోని పొలంలో మేటవేసిన రాళ్లు, ఇసుక దిబ్బలు సాగు కోసం పొలంలో గుంటతీసి రాళ్లు వేసిన దృశ్యం

ఆకేరు వరదతో సర్వం కోల్పోయిన రాకాసితండా రైతులు 

ఇప్పటికీ సాగు యోగ్యంలోకి రాని భూములు 

అన్నదాతల దైన్యంపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆగస్టు 31, 2024.. ఆకేరు వాగు నడిరాత్రి వేళ రైతు కంట వరద పారించింది. బువ్వపెట్టే భూమిని బీడుపెట్టింది. నాడు ఆకేరు సృష్టించిన విలయంతో పచ్చని పొలాల్లో ఇసుక, రాళ్లురప్పలు మేటవేశాయి. ఇళ్లు నేలకూలాయి. గొడ్డూగోదా, సామగ్రి.. సర్వం కొట్టుకుపోయాయి. ఎటుచూసినా ఐదారు మీటర్ల మేర పేరుకుపోయిన రాళ్లదిబ్బలు.. ఎకరాకు రూ.2 లక్షలు వెచ్చించి వీటిని తొలగిస్తే తప్ప సాగులోకి వచ్చే పరిస్థితి లేని భూములు.. ఏటా రెండు పంటలు పండించి.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక చేష్టలుడిగి కూలీలుగా మారిపోయిన రైతన్న.. నాడు అతలాకుతలమైన వీరి జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలోని పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన..

ఆరు నెలలుగా అదే దైన్యం.. 
పోతుగంటి సహదేవ్‌ రెక్కలు ముక్కలు చేసుకుని 90 బస్తాల ధాన్యాన్ని నిల్వ చేశాడు. రేపోమాపో మిల్లుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నంతలోనే వరద ముంచెత్తింది. 40 బస్తాలు నీళ్లపాలయ్యాయి. తడిసిన 50 బస్తాల ధాన్యా న్ని కొని ఆదుకుంటామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. 6 నెలలుగా ఆ ధాన్యం అలాగే పడి ఉంది.

సాయం చేస్తేనే సాగు
పోతుగంటి బ్ర హ్మం ఐదెకరాల ఆసామి. 2.20 ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో మిర్చి, ఎకరంలో పత్తి వేశాడు. పంటపండి చేతికొస్తుందనుకున్న దశలో ఆకేరు వరదతో పొలమంతా ఇసుక మేటలు వేసింది. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున ఐదెకరాలకు ఇచ్చనా రూ.50 వేలకు తోడు మరో లక్ష వెచ్చించి పొలాన్ని బాగు చేసుకున్నాడు. మిగతా భూమి పరిస్థితేమిటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.

చి‘వరి’కిలా మిగిలా..
పోతుగంటి వెంకన్న నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. వరద దెబ్బకు పంట మొత్తం రాళ్లురప్పల పాలైంది. రూ.2 లక్షలు ఖర్చుచేసి 200 ట్రిప్పుల మట్టి తోలించి పొలాన్ని సాగు యోగ్యం చేసుకుని ప్రస్తుతం వరి సాగుచేస్తున్న ఆయన.. బావులు పూడుకుపోవడంతో ఏటిలోని నీటిని మోటార్ల ద్వారా తరలిస్తూ తలకుమించిన భారాన్ని మోస్తున్నానని 
వాపోతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement