Akeru canal
-
కంటతడి ఆరలేదు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆగస్టు 31, 2024.. ఆకేరు వాగు నడిరాత్రి వేళ రైతు కంట వరద పారించింది. బువ్వపెట్టే భూమిని బీడుపెట్టింది. నాడు ఆకేరు సృష్టించిన విలయంతో పచ్చని పొలాల్లో ఇసుక, రాళ్లురప్పలు మేటవేశాయి. ఇళ్లు నేలకూలాయి. గొడ్డూగోదా, సామగ్రి.. సర్వం కొట్టుకుపోయాయి. ఎటుచూసినా ఐదారు మీటర్ల మేర పేరుకుపోయిన రాళ్లదిబ్బలు.. ఎకరాకు రూ.2 లక్షలు వెచ్చించి వీటిని తొలగిస్తే తప్ప సాగులోకి వచ్చే పరిస్థితి లేని భూములు.. ఏటా రెండు పంటలు పండించి.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక చేష్టలుడిగి కూలీలుగా మారిపోయిన రైతన్న.. నాడు అతలాకుతలమైన వీరి జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలోని పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన..ఆరు నెలలుగా అదే దైన్యం.. పోతుగంటి సహదేవ్ రెక్కలు ముక్కలు చేసుకుని 90 బస్తాల ధాన్యాన్ని నిల్వ చేశాడు. రేపోమాపో మిల్లుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నంతలోనే వరద ముంచెత్తింది. 40 బస్తాలు నీళ్లపాలయ్యాయి. తడిసిన 50 బస్తాల ధాన్యా న్ని కొని ఆదుకుంటామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. 6 నెలలుగా ఆ ధాన్యం అలాగే పడి ఉంది.సాయం చేస్తేనే సాగుపోతుగంటి బ్ర హ్మం ఐదెకరాల ఆసామి. 2.20 ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో మిర్చి, ఎకరంలో పత్తి వేశాడు. పంటపండి చేతికొస్తుందనుకున్న దశలో ఆకేరు వరదతో పొలమంతా ఇసుక మేటలు వేసింది. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున ఐదెకరాలకు ఇచ్చనా రూ.50 వేలకు తోడు మరో లక్ష వెచ్చించి పొలాన్ని బాగు చేసుకున్నాడు. మిగతా భూమి పరిస్థితేమిటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.చి‘వరి’కిలా మిగిలా..పోతుగంటి వెంకన్న నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. వరద దెబ్బకు పంట మొత్తం రాళ్లురప్పల పాలైంది. రూ.2 లక్షలు ఖర్చుచేసి 200 ట్రిప్పుల మట్టి తోలించి పొలాన్ని సాగు యోగ్యం చేసుకుని ప్రస్తుతం వరి సాగుచేస్తున్న ఆయన.. బావులు పూడుకుపోవడంతో ఏటిలోని నీటిని మోటార్ల ద్వారా తరలిస్తూ తలకుమించిన భారాన్ని మోస్తున్నానని వాపోతున్నాడు. -
రాకాసి తండాకు అండగా ఉంటాం: కిషన్‌రెడ్డి
తిరుమలాయపాలెం: ఆకేరు వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సర్వం కోల్పోవడంతో ఇక్కడ ఉండలేమంటున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాడైన భూములు మళ్లీ సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆకేరు వరదతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో జరిగిన నష్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్వయంగా తండాను చూసి రావాల్సిందిగా ప్రధాని తనకు చెప్పారని వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి రాకాసి తండాను సందర్శించారు. ముంపునకు గురైన పంటపొలాలు, కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. తండా వాసులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. అక్వెడక్ట్‌తోనే గ్రామం నాశనం! ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వెడక్ట్‌తోనే తమ గ్రామం సర్వనాశనమైందని, పచ్చని పంటపొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేశాయని స్థానికులు తెలిపారు. ఇక్కడ తాము ఉండే పరిస్థితి లేనందున మరోచోట స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఆదుకోవాలని వేడుకున్నారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన తమకు దిక్కెవరంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమకూర్చిన గ్యాస్ స్టౌలు, రగ్గులను కిషన్‌రెడ్డి వారికి అందజేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలి: మంత్రి పొంగులేటి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాలు జలమయమైనందున జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. రాకాసి తండాలో జరిగిన నష్టాన్ని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రమంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాల్సిందిగా ఇప్పటికే కిషన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం నివేదిక పంపలేదు: కిషన్‌రెడ్డి ఖమ్మం వన్‌టౌన్: వరదలతో వాటిల్లిన నష్టంపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నివేదిక పంపలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. 16వ డివిజన్ ధంసలాపురంలో వరద బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమయంలో ఓ జర్నలిస్టు ఏపీ ప్రభుత్వం నివేదిక పంపిందా అని అడగ్గా.. పంపలేదని జవాబిచ్చారు. గతంలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధులనే ప్రస్తుతం వాడుకుంటోందని చెప్పారు. -
ఆకేరు వాగులో ఇసుక మాఫియూ తిష్ట
నెల్లికుదురు : ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దందాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను మాయం చేయడం, తిరిగి అక్కడే మళ్లీ ఇసుక డంపు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇక్కడి ప్రభుత్వ సిబ్బంది జాయింట్ కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుకును మళ్లీ వ్యాపారులకే అప్పగిస్తున్నారు. నెల్లికుదురు మండల పరిధిలో ఆకేరు వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. వాగులో తోడిన ఇసుకను తహాసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో డంప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తహసీల్దార్ తోట వెంకటనాగరాజు ఈ నెల 15న రెవెన్యూ సిబ్బందితో వెళ్లి అక్రమంగా డంపు చేసిన 300 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన 300 ట్రాక్టర్ల ఇసుక మరుసటి రోజే ఇక్కడి నుంచి మాయమైంది. ఇందుకు స్థానిక వీఆర్వో బాధ్యుడిగా పేర్కొంటూ తహసీల్దార్ కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఇసుక డంపు మాయం చేసినట్లు అనుమానిస్తున్న నలుగురిపై నవంబర్ 18న కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై బెల్లం చేరాలు స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగి పది రోజులు గడవక ముందే శనివారం గతంలో డంపు ఉన్న ప్రదేశంలోనే మళ్లీ ఇసుక నిల్వ చేశారు. రెవెన్యూ అధికారులు వెళ్లి టిప్పర్, జేసీబీని సీజ్ చేశారు. జేసీ ఆదేశాలు బేఖాతర్.. ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణాపై వరుసగా ఫిర్యాదులు అందడంతో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు ఇటీవల నెల్లికుదురులో పర్యటించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాగాలు ఈ ఆదేశాలతో తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. దీంతో ఇసుక వ్యాపారులు ఏకంగా తహాసీల్దార్ కార్యాలయానికి సమీపంలోనే ఇసుక డంప్ ఏర్పాటు చేసి దందాను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయడం, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు తాత్సారం చేస్తున్నాయి. స్థాని క ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే ఇసుక రవాణా విషయంలో ఏమీ పట్టనట్లుగా ఉండాల్సి వస్తోందని ఇక్కడి రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. జేసీ ఆదేశాలు, ప్రజాప్రతినిధి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. ఇసుక రవాణా చేస్తే చర్యలు ఇటీవల సీజ్ చేసిన అక్రమ ఇసుక డంపుపైనే మళ్లీ ఇసుక డంపు చేసి తరలిస్తున్నారని వీఆర్వో నారాయణ శనివారం ఇచ్చిన సమాచారంతో ఎస్సై చేరాలుతో కలిసి వెళ్లాం. ఇసుక టిప్పర్‌ను, లోడ్ చేస్తున్న జేసీబీని శనివారం స్వాధీనం చేసుకున్నాం. డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించాం. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తాం. - వెంకటనాగరాజు, తహసీల్దార్, నెల్లికుదురు