ఆకేరు వాగులో ఇసుక మాఫియూ తిష్ట
నెల్లికుదురు : ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దందాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను మాయం చేయడం, తిరిగి అక్కడే మళ్లీ ఇసుక డంపు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇక్కడి ప్రభుత్వ సిబ్బంది జాయింట్ కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుకును మళ్లీ వ్యాపారులకే అప్పగిస్తున్నారు. నెల్లికుదురు మండల పరిధిలో ఆకేరు వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. వాగులో తోడిన ఇసుకను తహాసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో డంప్ చేస్తున్నారు.
ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తహసీల్దార్ తోట వెంకటనాగరాజు ఈ నెల 15న రెవెన్యూ సిబ్బందితో వెళ్లి అక్రమంగా డంపు చేసిన 300 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన 300 ట్రాక్టర్ల ఇసుక మరుసటి రోజే ఇక్కడి నుంచి మాయమైంది. ఇందుకు స్థానిక వీఆర్వో బాధ్యుడిగా పేర్కొంటూ తహసీల్దార్ కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఇసుక డంపు మాయం చేసినట్లు అనుమానిస్తున్న నలుగురిపై నవంబర్ 18న కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై బెల్లం చేరాలు స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగి పది రోజులు గడవక ముందే శనివారం గతంలో డంపు ఉన్న ప్రదేశంలోనే మళ్లీ ఇసుక నిల్వ చేశారు. రెవెన్యూ అధికారులు వెళ్లి టిప్పర్, జేసీబీని సీజ్ చేశారు.
జేసీ ఆదేశాలు బేఖాతర్..
ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణాపై వరుసగా ఫిర్యాదులు అందడంతో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు ఇటీవల నెల్లికుదురులో పర్యటించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాగాలు ఈ ఆదేశాలతో తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. దీంతో ఇసుక వ్యాపారులు ఏకంగా తహాసీల్దార్ కార్యాలయానికి సమీపంలోనే ఇసుక డంప్ ఏర్పాటు చేసి దందాను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయడం, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు తాత్సారం చేస్తున్నాయి. స్థాని క ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే ఇసుక రవాణా విషయంలో ఏమీ పట్టనట్లుగా ఉండాల్సి వస్తోందని ఇక్కడి రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. జేసీ ఆదేశాలు, ప్రజాప్రతినిధి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.
ఇసుక రవాణా చేస్తే చర్యలు
ఇటీవల సీజ్ చేసిన అక్రమ ఇసుక డంపుపైనే మళ్లీ ఇసుక డంపు చేసి తరలిస్తున్నారని వీఆర్వో నారాయణ శనివారం ఇచ్చిన సమాచారంతో ఎస్సై చేరాలుతో కలిసి వెళ్లాం. ఇసుక టిప్పర్‌ను, లోడ్ చేస్తున్న జేసీబీని శనివారం స్వాధీనం చేసుకున్నాం. డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించాం. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తాం.
- వెంకటనాగరాజు, తహసీల్దార్, నెల్లికుదురు