అల్లిమడుగులో అక్రమ తవ్వకాలు
వాణిజ్య అవసరాలకు ఇసుక మట్టి తరలింపు
ఖజానాకు భారీగా గండి
కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
బిట్రగుంట : అధికారులు, అక్రమార్కులు ఒక్కటై సహజవనరుల దోపిడీలో పోటీపడుతున్నారు. స్థానిక సంస్థల నోట్లో ‘మట్టి’ కొట్టి అందినంత దోచుకుంటున్నారు. అనుమతులు లేకుండా, ఒక్కపైసా సీనరేజీ చెల్లించకుండా గ్రావెల్, ఇసుకమట్టిని వేల క్యూబిక్ మీటర్లలో వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. ఇందుకు అల్లిమడుగు పంచాయతీ వేదికగా మారింది. ఇక్కడి నుంచి సుమారు రెండు నెలల కాలంలో రెండు లక్షల యూనిట్ల మేర ఇసుక మట్టి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించారు.
అంతేకాకుండా పెన్నా ఇసుకలో కల్తీ కోసం ఇక్కడ లభించే తువ్వ ఇసుకనే వాడుతున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా భారీయంత్రాలు వినియోగించి ఇసుక మట్టి తరలిస్తున్నా.., పంచాయతీకి ఒక్క పైసా సీనరేజీ చెల్లించకపోయినా గనులశాఖ అధికారులు మాత్రం ఇటువైపు చూడకపోవడం గమనార్హం. అక్రమార్కులకు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం ఉండటంతో రెచ్చిపోతున్నారు. తవ్వకాలు అడ్డుకునే వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడట్లేదు.
తవ్వకాలు జరిగేది ఇలా..
అల్లిమడుగు పంచాయతీలో విస్తారంగా ఇసుకమట్టి దిబ్బలు ఉన్నాయి. వాణిజ్య అవసరాలకు సరిపడా గ్రావెల్ లభించకపోవడం, గ్రావెల్ తరలింపు ఖరీదుగా మారడంతో లేఅవుట్‌లు మెరక చేయడం, రహదారుల నిర్మాణం, ఇతర వాణిజ్య అవసరాలకు ఇక్కడ లభించే ఇసుక మట్టినే విని యోగిస్తున్నారు.
రెండునెలల నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇక్కడ లభించే ఇసుక మట్టిని భారీగా తరలిస్తున్నారు. రోజుకు 400 నుంచి 500 ట్రిప్పర్లు వంతున ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తున్నారు. ప్రస్తుతం తరలించిన మట్టిని గనులశాఖ, విజిలెన్స్ అధికారులు కొలతలు తీసి జరిమానాలు విధించినా సుమారు రూ.40 లక్షల మేర అపరాధరుసుం వసూలవుతుంది.
కలెక్టర్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం
అల్లిమడుగులో అక్రమ తవ్వకాలపై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో స్థానిక రెవెన్యూ అధికారులు, అక్రమార్కులు కొత్త నాటకానికి తెరదీశారు. పగలు తవ్వకాలు నిలిపేసి రాత్రులు మాత్రమే మట్టి తరలిస్తున్నారు. చివరకు గనులశాఖ, విజిలెన్స్ విభాగాలు రంగంలోకి దిగితే ఇబ్బందులు తప్పవ నే ఉద్దేశంతో ఏకంగా కలెక్టర్‌నే పక్కదోవ పట్టించేలా పావులు కదిపారు. దళితుల భూములు చదును చేసుకుంటుంటే రెవె న్యూ అధికారులు అడ్డుకుంటున్నారనే కట్టుకథ తో కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
ఇందుకు ఓ తహశీల్దార్ పథక రచన చేయగా, అందుకు అనుగుణంగా అక్రమార్కులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తే జరుగుతున్న దోపిడీ ఇట్టే అర్థమవుతుందని స్థానిక సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు.
తవ్వకాలను ఉపేక్షించం: జయప్రకాష్, తహశీల్దార్
అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే మూడు వాహనాలు సీజ్ చేసి గనుల శాఖకు అప్పగించాం.అయినప్పటికీ రాత్రులు తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారమందింది. అక్రమ తవ్వకాలను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు తలారులను కాపాలాగా ఉంచడంతో పాటు పోలీసులకు, గనులశాఖకు కూడా ఫిర్యాదు చేస్తున్నాం.
ఇసుక మట్టి... కొల్లగొట్టి...
Published Thu, May 7 2015 4:50 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement