అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు | caught smuggling sand lorry | Sakshi
Sakshi News home page

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు

Published Thu, Feb 19 2015 3:14 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

caught smuggling sand lorry

• అధికారులు పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన మహిళలు
• అదనంగా తరలిస్తున్న ఏడు ఇసుక లారీలు పట్టివేత
• ఆలస్యంగా వచ్చిన రెవెన్యూ అధికారులు
• ర్యాంపు వద్ద ఉద్రిక్తత

 
నిడదవోలు : మండలంలోని పందలపర్రు ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన డ్వాక్రా మిహళలు, గ్రామస్తులు బుధవారం ర్యాంపు వద్ద లారీలను తనిఖీలు చేసి అడ్డుకున్నారు. పందలపర్రు ఇసుక ర్యాంపులో ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడు లారీలను గుర్తించి రెవె న్యూ అధికారులకు అప్పగించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్ధేశించిన స్థలంలో కాకుండా ఇతర సరిహద్దుల్లో ఇసుక తవ్వుతున్నట్లు గుర్తించారు.

కొంతకాలంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఆరోపిస్తూ గ్రామస్తులు రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే వారు కూడా పట్టించుకోకపోవడంతో పందలపర్రు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు ర్యాంపు వద్దకు చేరుకుని లారీలను తనిఖీలు చేశారు. సొంతంగా వీడియో కెమేరాను పెట్టుకుని అదనంగా ఇసుకను తరలిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. రెండు యూనిట్లకు డీడీలు తీసుకుని అదనంగా ఇసుక రవాణా చేస్తున్న ఎనిమిది లారీలను పట్టుకున్నారు.

విషయం తెలుసుకుంటున్న ఆర్‌ఐ సావిత్రి రాం్యపు వద్దకు వచ్చి విచారించారు. ఇదిలా ఉండగా ర్యాంపు వద్ద డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు, పలువురు టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. అదనంగా ఇసుక తరలిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని ఇసుక లారీలను ఎందుకు ఆపుతున్నారంటూ మహిళలు, గ్రామస్తులతో గొడవకు దిగారు. ర్యాంపు వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

విషయం తెలుసుకున్న సమిశ్రగూడెం ఎస్సై పవన్‌కుమార్ ర్యాంపు వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. డ్వాక్రా మహిళలు పట్టుకున్న లారీలను పరిశీలించేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వేయింగ్ మిషన్ దగ్గరకు వెళ్లారు. డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు పట్టుకున్న ఏడు లారీలు, ఒక ట్రాక్టర్‌ను ఆర్‌ఐ సావిత్రి గోపవరంలో ఉన్న వేయింగ్ మిషన్ వద్ద కాటా పెట్టించారు. 18 యూనిట్ల ఇసుక అదనంగా ఉంది. లారీలను, ట్రాక్టర్‌ను సమిశ్రగూడెం పోలీసుల అధీనంలో ఉంచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement