బరి తెగిస్తున్న ఇసుకాసురులు
రేవు వద్ద గాడి తవ్వించిన అధికారులు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ స్వాధీనం
పెనుగంచిప్రోలు : ఇసుక అక్రమ రవాణాదారులు బరితెగిస్తున్నారు. ఇటీవల స్థానిక మునేరు నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టుకొని జరిమానా విధించారు. తాజాగా శుక్రవారం తెల్లవారు జామున టీడీపీకి చెందిన వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు గ్రామానికి చెందిన యలమర్తి నరేంద్రకు సంబంధించిన లారీలో ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునేరు లోని రేగులగడ్డ రేవు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎస్‌ఐ కె.సతీష్‌కు సమాచారం రావటంతో తన సిబ్బందితో శుక్రవారం తెల్లవారు జామున ఘటనాస్థలానికి వెళ్లి దాడి చేసి లారీని, ఇసుక ఎత్తుతున్న కూలీలను స్టేషన్‌కు తరలించారు. అనంతరం తహశీల్దార్ కె.నాగేశ్వరరావుకు లారీని అప్పగించారు.
ఇసుక డంపింగ్ స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్, ఎస్‌ఐ
మునేరు అవతల లారీకి ఇసుక ఎత్తేందుకు డంపింగ్ చేసిన స్థలాన్ని తహశీల్దార్, ఎస్‌ఐ, ఆర్‌ఐ రామకృష్ణ పరిశీలించారు. రేగులగడ్డ రేవు నుంచి ఇసుక రవాణా చేయకుండా దారిలో పెద్ద గాడి తీయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పిన పెద్ద ప్రమాదం
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీ రేవు వద్ద 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనటంతో స్తంభం రెండు ముక్కలైంది. అయితే రవాణాదారులు ముక్కలైన స్తంభాన్ని జాగ్రత్తగా పైకి లేపి ట్రాక్టర్ ట్రక్కుకు తాడుతో కట్టారు. స్తంభం ఢీకొన్న సమయంలో వైర్లు లారీకి తగిలితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఘటనా స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. హై వోల్టోజీ గల స్తంభాన్ని కట్టిన తీరుపై వారే ఆశ్చర్యపోయారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రవాణా మాత్రం ఆగటం లేదు. ఇప్పటికైనా ఇసుకాసురులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.