ఇసుక రవాణాలో కొత్త ఎత్తులు
- ట్రాక్టర్‌కు బదులు ఐషర్ వాహనాల్లో తరలింపు
- ఒకే రశీదుతో పలు ట్రిప్పులు
- అనేక ఉపాయాలతో అక్రమాలకు పాల్పడుతున్న వైనం
ప్రొద్దుటూరు : ఎర్రచందనం లాగే ఇసుక అక్రమ రవాణాలో కూడా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల కంట పడకుండా ఉండేందుకు గాను పలు రకాలుగా తీసుకెళ్తున్నారు. ఇందుకోసం వాహనాలను మార్చుతున్నారు. సాధారణంగా ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్తుండగా ప్రొద్దుటూరులో ప్రత్యేకంగా ఐషర్ వాహనాలను కొనుగోలు చేసి పైన వాటికి పట్ట కప్పి ఇసుకను తీసుకెళుతూ పట్టుబడ్డారు. వాహనంపై పట్టలు కప్పడంతో ఏదైనా శుభ కార్యానికి వెళుతున్నారేమోనని అనుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఒకే రశీదుతో పలుమార్లు ఇసుక రవాణా చేస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న ఇసుకను గృహ, మరుగుదొడ్ల నిర్మాణాలకు తీసుకెళ్లేందుకు ఆర్డీఓ అనుమతి తీసుకుంటున్నారు.
చలానా చెల్లించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇసుక తీసుకెళ్లడంతోపాటు అదే రశీదు చూపి పలు మార్లు పెన్నా నదిలో నుంచి రవాణా చేస్తున్నారు. ఒక ట్రిప్పునకు బదులు మూడు, నాలుగు దొంగ టిప్పులు తోలుకుంటున్నారు. ఇటీవల బైపాస్ రోడ్డులో వెళ్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. ఉదయాన్నే ట్రాక్టర్ లోడ్ చేసుకున్నావు కదా ఇంకా ఎందుకు అన్‌లోడ్ చేయలేదని వీఆర్‌ఓ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. టైర్లు పంచర్ అయ్యాయని, అందుకే ఆలస్యమైందని చెప్పడం గమనార్హం.
పేరుకుపోతున్న నిల్వలు: స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో ఇసుక నిల్వలు వృథాగా ఉన్నాయి. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకుని ఇక్కడ నిల్వ చేస్తున్నారు. నిత్యం వాహనాలు పట్టుబడటం, ఇసుకను ఇక్కడ అన్‌లోడ్ చేయడం జరుగుతోంది. దీంతో కార్యాలయం ప్రాంగణమంతా ఇసుక నిల్వలు రాశులుగా ఉన్నాయి. ఎక్కువ రోజులు అవుతుండటంతో ఇసుక నిల్వలు మట్టిదిబ్బలుగా మారుతున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిళ్లుతోంది. అదే విధంగా కార్యాలయానికి వచ్చే వెళ్లే వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే అధికారులు నిబంధనల ప్రకారం ఇసుకను అమ్మితే సమస్య పరిష్కారం అవుతుంది.