Mining officials
-
ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ అధికారులకు సూచించారు. ఏపీఎండీసీ(ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ) పనితీరుపై మంగళవారం విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. బెరైటీస్, బొగ్గు, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, బాల్ క్లే, సిలికా శాండ్, గ్రానైట్ తదితర ఖనిజాలకు సంబంధించిన ఆపరేషన్స్‌పై అధికారులతో ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. ఖనిజ ఆధారిత పరిశ్రమలకు తోడ్పాటును అందించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కీలకమైన ఖనిజాల వెలికితీతలో ఏపీఎండీసీ చక్కటి ప్రగతి కనబరుస్తోందని, ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు గనులను దక్కించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని అభినందించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఏపీఎండీసీ రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల మైనింగ్‌లో ఇంకా చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మైనింగ్ కార్యక్రమాలను, లక్ష్యాలను సాధించేలా నిర్వహించాలని సూచించారు. ప్రైవేటు రంగంలోని మైనింగ్ సంస్థలకు దీటుగా ఏపీఎండీసీ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల వారీగా చేపట్టిన కార్యక్రమాలను ఏపీఎండీసీ ఎండీ వీజీ వెంకటరెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ సలహాదారు డీఎల్ఆర్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఆగని ఇసుక దందా
ఇసుక లారీలను వెనక్కి పంపిన రైతులు మంత్రి హరీష్‌రావు హామీ హుళక్కేనా..? చిన్నమడూరు(దేవరుప్పుల) : ఓ వైపు కరవు తాండవిస్తుంటే ఫిల్టర్ బెడ్ ఏరియాలో ఇసుక తరలించేందుకు ఇసుకాసురులు చేస్తున్న ప్రయత్నాలను ఎదురిస్తూ అన్నదాతలు లారీలను తరిమికొట్టిన సంఘటన గురువారం చిన్నమడూరులో చోటుచేసుకుంది. మండలంలోని చౌడురు వాగు నడిబొడ్డు వాగులో ఇసుక తరలించేందుకు ఇసుక మాఫీయా రైతుల పట్టాదారులు మేటల పేరిట అనుమతులు పొందారు. ఈ విషయమై మూడు నెలల కిందట మైనింగ్ అధికారులు పరీశీలనకు రాగా రైతులు అడ్డుకున్నారు. ఇసుక తరలింపుపై పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే దయాకర్‌రావుకు మొర పెట్టుకోగా మండలంలో ఇసుక తరలింపుకు మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని బాహాటంగా చెప్పారు. ఈ విషయమై ఇటీవల దేవరుప్పులకు వచ్చిన మంత్రి హరీష్‌రావుకు పలువురు వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతులు ఇసుక తరలిస్తే ఎడారిగా మారుతుందని వాపోయారు. నిండు సభలో స్పందించిన మంత్రి, కలెక్టర్ కరుణతో మాట్లాడి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ కొత్తవాటికి ఉత్తర్వులు జారీ చేయకుండా ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇసుకాసురులు సెక్రటరీ స్థాయిలో జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా వాగులో ఇసుకను తరలించాలని ప్రయత్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలో గురువారం ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చిన లారీలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. వాగులో ఇసుక తరలింపు అనుమతులు రద్దు చేయకుంటే రైతుల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి సింగారపు రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు జోగేష్, భాషిపాక సోమయ్య, రచ్చ కృష్ణమూర్తి, ఇస్తారీ, యాదయ్య, అక్కనపెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న జనం
కొరివిపల్లి(శింగనమల): మండలంలోని ఉల్లికల్లు ఇసుక రీచు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 20 ట్రాక్టర్లను కొరివిపల్లి గ్రామస్తులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం గ్రామం లో ఉద్రిక్తత నెలకొంది. ఉల్లికల్లు ఇసుక రీచులో 65 వేల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి భూగర్భజల, మైనింగ్ అధికారులు గుర్తించి నా అనుమతి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు సమాచారహక్కు చట్టం ద్వారా తెలుసుకున్నారు. అనుమతి లేకున్నా కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకోగా ట్రాక్టర్ల యజమానులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇసుక రవాణాకు అడ్డుపడుతున్నారంటూ పోలీసులు ముగ్గురు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొరివిపల్లి గ్రామస్తులంతా శింగనమల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎస్ఐతో తమ బాధను చెప్పుకున్నారు. సమస్యకు ఎలాగొలా పరిష్కారం చూపించాలన్నారు. -
ఇసుక మట్టి... కొల్లగొట్టి...
అల్లిమడుగులో అక్రమ తవ్వకాలు వాణిజ్య అవసరాలకు ఇసుక మట్టి తరలింపు ఖజానాకు భారీగా గండి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బిట్రగుంట : అధికారులు, అక్రమార్కులు ఒక్కటై సహజవనరుల దోపిడీలో పోటీపడుతున్నారు. స్థానిక సంస్థల నోట్లో ‘మట్టి’ కొట్టి అందినంత దోచుకుంటున్నారు. అనుమతులు లేకుండా, ఒక్కపైసా సీనరేజీ చెల్లించకుండా గ్రావెల్, ఇసుకమట్టిని వేల క్యూబిక్ మీటర్లలో వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. ఇందుకు అల్లిమడుగు పంచాయతీ వేదికగా మారింది. ఇక్కడి నుంచి సుమారు రెండు నెలల కాలంలో రెండు లక్షల యూనిట్ల మేర ఇసుక మట్టి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించారు. అంతేకాకుండా పెన్నా ఇసుకలో కల్తీ కోసం ఇక్కడ లభించే తువ్వ ఇసుకనే వాడుతున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా భారీయంత్రాలు వినియోగించి ఇసుక మట్టి తరలిస్తున్నా.., పంచాయతీకి ఒక్క పైసా సీనరేజీ చెల్లించకపోయినా గనులశాఖ అధికారులు మాత్రం ఇటువైపు చూడకపోవడం గమనార్హం. అక్రమార్కులకు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం ఉండటంతో రెచ్చిపోతున్నారు. తవ్వకాలు అడ్డుకునే వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడట్లేదు. తవ్వకాలు జరిగేది ఇలా.. అల్లిమడుగు పంచాయతీలో విస్తారంగా ఇసుకమట్టి దిబ్బలు ఉన్నాయి. వాణిజ్య అవసరాలకు సరిపడా గ్రావెల్ లభించకపోవడం, గ్రావెల్ తరలింపు ఖరీదుగా మారడంతో లేఅవుట్లు మెరక చేయడం, రహదారుల నిర్మాణం, ఇతర వాణిజ్య అవసరాలకు ఇక్కడ లభించే ఇసుక మట్టినే విని యోగిస్తున్నారు. రెండునెలల నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇక్కడ లభించే ఇసుక మట్టిని భారీగా తరలిస్తున్నారు. రోజుకు 400 నుంచి 500 ట్రిప్పర్లు వంతున ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తున్నారు. ప్రస్తుతం తరలించిన మట్టిని గనులశాఖ, విజిలెన్స్ అధికారులు కొలతలు తీసి జరిమానాలు విధించినా సుమారు రూ.40 లక్షల మేర అపరాధరుసుం వసూలవుతుంది. కలెక్టర్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం అల్లిమడుగులో అక్రమ తవ్వకాలపై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో స్థానిక రెవెన్యూ అధికారులు, అక్రమార్కులు కొత్త నాటకానికి తెరదీశారు. పగలు తవ్వకాలు నిలిపేసి రాత్రులు మాత్రమే మట్టి తరలిస్తున్నారు. చివరకు గనులశాఖ, విజిలెన్స్ విభాగాలు రంగంలోకి దిగితే ఇబ్బందులు తప్పవ నే ఉద్దేశంతో ఏకంగా కలెక్టర్‌నే పక్కదోవ పట్టించేలా పావులు కదిపారు. దళితుల భూములు చదును చేసుకుంటుంటే రెవె న్యూ అధికారులు అడ్డుకుంటున్నారనే కట్టుకథ తో కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. ఇందుకు ఓ తహశీల్దార్ పథక రచన చేయగా, అందుకు అనుగుణంగా అక్రమార్కులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తే జరుగుతున్న దోపిడీ ఇట్టే అర్థమవుతుందని స్థానిక సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు. తవ్వకాలను ఉపేక్షించం: జయప్రకాష్, తహశీల్దార్ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే మూడు వాహనాలు సీజ్ చేసి గనుల శాఖకు అప్పగించాం.అయినప్పటికీ రాత్రులు తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారమందింది. అక్రమ తవ్వకాలను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు తలారులను కాపాలాగా ఉంచడంతో పాటు పోలీసులకు, గనులశాఖకు కూడా ఫిర్యాదు చేస్తున్నాం. -
మళ్లీ ఇసుక దందాలు
గుంటుపల్లి రీచ్‌కు అక్రమ అనుమతి గని ఆత్కూరు క్వారీ సీజ్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ ఇసుక దందాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు లక్షల్లో ముడుపులు ముట్టచెప్పి.. అక్రమంగా అనుమతులు పొంది.. యథేచ్ఛగా తెల్ల బంగారాన్ని దోచుకుంటున్నారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఇసుక రేవులో బోట్స్‌మన్ సొసైటీకి దొడ్డిదారిలో అక్రమ అనుమతి మంజూరైంది. నేరుగా మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి మంజూరుకావటం చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా అనుమతులు పొందిన గుంటుపల్లి రీచ్‌లో నెలరోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు కంచికచర్ల మండలం గనిఆత్కూరు ఇసుక రీచ్‌లో కూడా అక్రమ త వ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ మైనింగ్ అధికారులు శుక్రవారం దాడులు చేసి క్వారీని సీజ్ చేశారు. గుంటుపల్లి రీచ్‌లో ఇలా... గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీకి 2008లో లీజును తీసుకున్నారు. అప్పట్లో లీజు కాలాన్ని అధికారులు పొడిగించారు. లీజుకాలాన్ని పొడిగించటం నిబంధనలకు విరుద్ధమని గొల్లపూడి బోట్ వర్కర్స్ సొసైటీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు లీజును పొడిగించవద్దని ఆధికారులను ఆదేశించింది. ఈ విధంగా పలుమార్లు కోర్టుల్లో కేసులు నడవటంతో అధికారులు ఈ కార్వీ వేలం పాటలను నిలుపుదల చేశారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 11న హైకోర్టు గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ లీజును పొడి గించవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బోట్స్‌మన్ సొసైటీ వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని మళ్లీ లీజు పొడిగింపు ఉత్తర్వులను పొందినట్లు తెలిసింది. దాంతో గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ తవ్వకాలు గత నెల రోజులుగా ఊపందుకున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు రావటంతో జిల్లాలో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సొసైటీ అధ్యక్షుడిని చేతిలో పెట్టుకుని కొందరు బినామీ వ్యక్తులు ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు తాజాగా ఫిర్యాదులు వస్తున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి రావటంతో ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారులు నోరు మెదపటం లేదు. గని ఆత్కూరులో.. గని ఆత్కూరు క్వారీలో బినామీ వ్యక్తులు దందా చేసి అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ఏడున్నర ఎకరాల మేరకు లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. మీటరు లోతు తవ్వాల్సిన పాటదారుడు నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల లోతు తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొనడంతో మైనింగ్ అధికారులు తనిఖీలు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గని ఆత్కూరు క్వారీ నిలిపివేత గని ఆత్కూరు (కంచికచర్ల రూరల్) : మండలంలోని గని ఆత్కూరు ఇసుక క్వారీ శుక్రవారం నిలిచిపోయింది. ఈ మేరకు నందిగామ మైనింగ్ ఏడీ సీ మోహనరావు మాట్లాడుతూ గని ఆత్కూరు క్వారీలో అవకతవకలు జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందని, జేసీ ఆదేశాల మేరకు క్వారీలో తవ్వకాలు నిలుపుదల చేశామని చెప్పారు. శనివారం సర్వేయర్ , మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులను తీసుకెళ్లి సక్రమంగా కొలతలు నిర్వహించి తగిన సమాచారాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. -
మైనింగ్ అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, గుంటూరు : అక్రమక్వారీలతో అడ్డగోలుగా కాసులవేటసాగిస్తున్నవారిపై విజిలెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాము కేసులు నమోదు చేస్తున్నా అడ్డదారిలో మైనింగ్ అధికారులనుంచి అనుమతులు పొందడం నిత్యకృత్యంగా మారింది. అయితే ఇటీవల పేరేచర్ల పరిసర ప్రాంతాల్లోని కైలాసగిరి రిజర్వుఫారెస్ట్ ఏరియాలోనూ యథేచ్ఛగా నిర్వహిస్తున్న రెండు క్వారీలను విజిలెన్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వాటికి అటవీశాఖ, మైనింగ్‌శాఖ సంయుక్తంగా అనుమతులు మంజూరు చేశారని తెలిసి అవాక్కయ్యారు. వాస్తవానికి అటవీభూముల్లో క్వారీలకు అనుమతులు ఇవ్వాలంటే చాలా నిబంధనలున్నాయి. బయట ఎక్కడా దొరకని ఖనిజం ఏదైనా అటవీప్రాంతంలో ఉంటే, అది ఉపయోగకరమైనదనుకుంటే మైనింగ్, అటవీశాఖాధికారులు సంయుక్తంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలి. అలా మంజూరు చేసిన మైనింగ్‌కు అటవీశాఖ ఇచ్చిన భూమికంటే బయట రెట్టింపు భూమిని ప్రభుత్వానికి సదరు క్వారీ నిర్వాహకులు ఇవ్వాలి. అయితే బయట దొరికే మెటల్, గ్రావెల్ వంటి వాటిని తవ్వుకోవడానికి కూడా మైనింగ్, అటవీ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు అనుమతులు పొందేది కొంత భాగానికైతే క్వారీ నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు అర్ధరాత్రి వేళ తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్రస్థాయిలో గండి కొడుతున్నారు. విజిలెన్స్ సీరియస్ అక్రమక్వారీలను నిరోధించాల్సిన మైనింగ్‌శాఖాధికారులు మౌనం వహిస్తుండటంతో విజిలెన్స్ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. అక్రమార్కుల పనిపట్టేందుకు నిర్ణయించారు. ఇటీవల పేరేచర్లలో రెండు క్వారీలను సీజ్‌చేసి విజిలెన్స్‌లోని మైనింగ్, అటవీ శాఖ అధికారులతో విచారణ చేపట్టారు. విచారణలో క్వారీ యజమానులు పొందిన పర్మిట్లకు, తవ్వకాలకు ఎక్కడా సంబంధం లేనట్లు ప్రాధమికంగా గుర్తించారు. విచారణలో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడితే సహించం- విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అక్రమక్వారియింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అటవీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీయింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందని, ఈ అనుమతులపై పునః పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అక్రమ క్వారీయింగ్జరిపే వారి వివరాలను తమకు తెలియజేస్తే వెంటనే స్పందించి వాటిని అరికడతామని, సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.