ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న జనం
కొరివిపల్లి(శింగనమల): మండలంలోని ఉల్లికల్లు ఇసుక రీచు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 20 ట్రాక్టర్లను కొరివిపల్లి గ్రామస్తులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం గ్రామం లో ఉద్రిక్తత నెలకొంది. ఉల్లికల్లు ఇసుక రీచులో 65 వేల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి భూగర్భజల, మైనింగ్ అధికారులు గుర్తించి నా అనుమతి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు సమాచారహక్కు చట్టం ద్వారా తెలుసుకున్నారు. అనుమతి లేకున్నా కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకోగా ట్రాక్టర్ల యజమానులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇసుక రవాణాకు అడ్డుపడుతున్నారంటూ పోలీసులు ముగ్గురు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొరివిపల్లి గ్రామస్తులంతా శింగనమల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎస్‌ఐతో తమ బాధను చెప్పుకున్నారు. సమస్యకు ఎలాగొలా పరిష్కారం చూపించాలన్నారు.