మైనింగ్ అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, గుంటూరు : అక్రమక్వారీలతో అడ్డగోలుగా కాసులవేటసాగిస్తున్నవారిపై విజిలెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాము కేసులు నమోదు చేస్తున్నా అడ్డదారిలో మైనింగ్ అధికారులనుంచి అనుమతులు పొందడం నిత్యకృత్యంగా మారింది. అయితే ఇటీవల పేరేచర్ల పరిసర ప్రాంతాల్లోని కైలాసగిరి రిజర్వుఫారెస్ట్ ఏరియాలోనూ యథేచ్ఛగా నిర్వహిస్తున్న రెండు క్వారీలను విజిలెన్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వాటికి అటవీశాఖ, మైనింగ్‌శాఖ సంయుక్తంగా అనుమతులు మంజూరు చేశారని తెలిసి అవాక్కయ్యారు. వాస్తవానికి అటవీభూముల్లో క్వారీలకు అనుమతులు ఇవ్వాలంటే చాలా నిబంధనలున్నాయి.
బయట ఎక్కడా దొరకని ఖనిజం ఏదైనా అటవీప్రాంతంలో ఉంటే, అది ఉపయోగకరమైనదనుకుంటే మైనింగ్, అటవీశాఖాధికారులు సంయుక్తంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలి. అలా మంజూరు చేసిన మైనింగ్‌కు అటవీశాఖ ఇచ్చిన భూమికంటే బయట రెట్టింపు భూమిని ప్రభుత్వానికి సదరు క్వారీ నిర్వాహకులు ఇవ్వాలి. అయితే బయట దొరికే మెటల్, గ్రావెల్ వంటి వాటిని తవ్వుకోవడానికి కూడా మైనింగ్, అటవీ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు అనుమతులు పొందేది కొంత భాగానికైతే క్వారీ నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు అర్ధరాత్రి వేళ తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్రస్థాయిలో గండి కొడుతున్నారు.
విజిలెన్స్ సీరియస్
అక్రమక్వారీలను నిరోధించాల్సిన మైనింగ్‌శాఖాధికారులు మౌనం వహిస్తుండటంతో విజిలెన్స్ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. అక్రమార్కుల పనిపట్టేందుకు నిర్ణయించారు. ఇటీవల పేరేచర్లలో రెండు క్వారీలను సీజ్‌చేసి విజిలెన్స్‌లోని మైనింగ్, అటవీ శాఖ అధికారులతో విచారణ చేపట్టారు. విచారణలో క్వారీ యజమానులు పొందిన పర్మిట్లకు, తవ్వకాలకు ఎక్కడా సంబంధం లేనట్లు ప్రాధమికంగా గుర్తించారు. విచారణలో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.
అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడితే సహించం- విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి
జిల్లాలో అనేక ప్రాంతాల్లో అక్రమక్వారియింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అటవీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీయింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందని, ఈ అనుమతులపై పునః పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అక్రమ క్వారీయింగ్‌జరిపే వారి వివరాలను తమకు తెలియజేస్తే వెంటనే స్పందించి వాటిని అరికడతామని, సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.