పద్మనాభం మండలంలో అక్రమ తవ్వకాలు జరిగిన క్వారీ
సాక్షి, విశాఖపట్నం/పద్మనాభం: అక్రమ తవ్వకాలతో మైనింగ్ డాన్ అని పేరొందిన శ్రీనివాస్ చౌదరికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే అనకాపల్లి మండలం సీతానగరంలో ఆయనకు చెందిన నాలుగు కంపెనీలకు అక్రమ తవ్వకాలపై రూ.33 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకే చెందిన మరికొన్ని కంపెనీలు పద్మనాభం మండలం కృష్ణాపురంలో అక్రమ మైనింగ్ చేసినందుకు భారీగా జరిమానా విధించారు. రోడ్డు మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేసినట్లు సర్వే చేసి మైనింగ్ శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సహాయ సంచాలకుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి బృందం గుర్తించింది. ఆ ఉల్లంఘనలకు గాను వీవీఆర్ క్రషర్స్, పి.రత్నలత పేరు మీద ఉన్న రెండు క్వారీలతో పాటు సంజనా గ్రానైట్ క్వారీలో అక్రమ మైనింగ్ నేరానికి గాను మొత్తం రూ.80.94 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.
అన్నీ అక్రమాలే...
సంజనా గ్రానైట్ పేరుతో 4.48 హెక్టార్లను శ్రీనివాస్ చౌదరి పరిమితికి మించి తవ్వించేశారు. అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పి.రత్నలత పేరుతో లీజుకు తీసుకున్న 2.43 హెక్టార్ల క్వారీలోనూ, మరోచోట 6.50 హెక్టార్లలో తీసుకున్న క్వారీలోనూ అనుమతి ఇచ్చిన దానికన్నా అధికంగా రోడ్డు మెటల్, గ్రావెల్ తవ్వేశారు. పర్మిట్లను దుర్వినియోగం చేసి భారీ మొత్తంలో కాసులు వెనకేసుకున్నారు. అలాగే వీవీఆర్ క్రషర్స్ పేరుతో మరోచోట 17.50 హెక్టార్లు లీజుకు తీసుకున్న శ్రీనివాస్ చౌదరి అదే తరహాలో దోపిడీ కొనసాగించారు. గత మూడు రోజులుగా ఈటీఎస్ సర్వే నిర్వహించిన ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆ అక్రమాలను నిగ్గు తేల్చింది.
దోపిడీ విలువ రూ.కోట్లలో...
శ్రీనివాస్ చౌదరికి చెందిన కంపెనీలు పద్మనాభం మండలంలో కొనసాగించిన మైనింగ్ దోపిడీ విలువ రూ.కోట్లలోనే ఉందని అధికారులు గుర్తించారు. రోడ్డు మెటల్ 11,23,178 క్యూబిక్ మీటర్లు, గ్రావెల్ మరో 5,99,688 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించారు. ఈ ఉల్లంఘనలకు సాధారణ సీనరేజి కింద రూ.12,80,71,980 మొత్తంతో పాటు మరో రూ.64,03,59,900 అపరాధ రుసుం విధించారు. అలాగే డీఎంఎ‹ఫ్ కింద రూ.4,09,83,033 చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.80.94 కోట్ల జరిమానా విధిస్తూ ఆయా కంపెనీల యాజమాన్యానికి నోటీసులు పంపారు. జిల్లాలో మైనింగ్ అక్రమాలపై ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment