Illegal quarrying
-
విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీకే వీధి మండలం సిగినాపల్లి క్వారీని నెలరోజుల కిందట పోలీసులు మూసివేయించారు. దీంతో అంతర రాష్ట్ర రంగురాళ్ల వ్యాపారుల ముఠాలు వేరే క్వారీలపై దృష్టి సారించాయి. జి.మాడుగుల మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ కూటికొండలు, ఇదే క్వారీకి సమీపంలోని చింతపల్లి సరిహద్దు నిట్టాపుట్టు అటవీ ప్రాంతంలోను, అడ్డతీగల మండలం తపస్వీకొండ అటవీ ప్రాంతంలోను రంగురాళ్ల క్వారీలు వెలుగు చూశాయి. ఆయా క్వారీల వద్ద వ్యాపారులు మకాం వేసి, గిరిజనులను ప్రోత్సహిస్తుండడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. విశాఖ, రాజమహేంద్రవరాల్లో విక్రయాలు కొంతమంది వ్యాపారులు పాడేరు, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో మకాం వేసి, రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని నేరుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాటిని జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద వ్యాపారులు తరలిస్తున్నారు. జి.మాడుగుల మండలం కూటికొండలు, అడ్డతీగల మండలం తపస్వికొండపై గల క్వారీల్లో విలువైన క్యాట్ ఐ రకం(పిల్లికన్ను రంగు) రంగురాళ్లు లభ్యమవుతున్నాయని తెలిసింది. కూటికొండలు రంగురాళ్ల క్వారీ వద్దకు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, రావికమతం, జి.మాడుగుల మండలాలకు చెందిన వ్యాపారులు రోజూ వెళుతూ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరిపిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ డబ్బు ఆశతో గిరిజనులు లోతుగా తవ్వుతున్నారు. తపస్వికొండపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానిక వ్యాపారులే అక్కడ రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తూ అక్కడ సేకరించిన వాటిని రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి తరలిస్తు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు. రంగురాళ్ల తవ్వకాలను నిరోధిస్తాం జి.కె.వీధి మండలంలో సిగినాపల్లి వద్ద రంగురాళ్ల క్వారీని పూర్తిగా మూసివేశాం. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశాం. కూటికొండలు, తపస్వికొండల వద్ద తనిఖీలు నిర్వహించి వెంటనే ఆయా క్వారీలను కూడా మూసివేస్తాం. రంగురాళ్ల తవ్వకాలు, వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగురాళ్ల వ్యాపారుల ముఠాల సంచారంపై దృష్టి పెడతాం. కొండలపై తవ్వకాలు జరిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. తవ్వకాలను ఎవరైనా ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. – సతీష్‌కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
సుద్దపల్లిలో 2014–19 మధ్యే భారీగా అక్రమ క్వారీయింగ్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామం పరిధిలో 2014–19 మధ్య కాలంలోనే భారీగా అక్రమ క్వారీయింగ్ జరిగిందని డైరెక్టర్ ఆఫ్ మైనింగ్, జియాలజీ (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. సుద్దపల్లిలో అక్రమ గ్రావెల్ క్వారీయింగ్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గురువారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన కీలక అంశాలను వెంకటరెడ్డి వివరించారు. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి, ఇతర గ్రామాల పరిధిలో రహదారులు, నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన గ్రావెల్ నిల్వలు ఉన్నాయి. 2014–19 మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో ఒక్క సుద్దుపల్లిలోనే ప్రమాదకరమైన 19 గోతులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు ఎండిపోయాయి. సుద్దపల్లిలో 2014–19 మధ్య 3 వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు ఒక్క క్వారీకి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కానీ ఇష్టారాజ్యంగా క్వారీయింగ్ జరగ్గా, ఇద్దరికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. కేవలం 16,399 క్యూబిక్ మీటర్లకు రూ.33,28,769 జరిమానా విధించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు, అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం విజిలెన్స్ స్క్వాడ్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆకస్మిక దాడులతో మాఫియాకు ముక్కుతాడు వేస్తోంది. 2019–22 మధ్య సుద్దపల్లిలో కేవలం 4 క్వారీల ద్వారా 31,515 క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు జారీ అయ్యాయి. అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. మొత్తం 56,834 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమ క్వారీయింగ్‌కు బాధ్యులైన వారికి భారీగా రూ.2,06,63,127 జరిమానా విధించారు. అప్పుడు.. ఇప్పుడు చేబ్రోలు మండలంలో 2014–19 మధ్య 3,46,716 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 14 క్వారీలకు ప్రభుత్వానికి రూ.1,21,05,272 ఆదాయం వచ్చింది. 1,38,200 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కోసం 4 లీజులకు రూ.42,05,070 వచ్చింది. ఆ ఐదేళ్ళలో అక్రమ తరలింపుపై 661 కేసులు పెట్టి రూ.1,08,24,898 జరిమానా విధించారు. అక్రమ క్వారీయింగ్‌పై 12 కేసులు పెట్టి రూ.5,39,17,924 జరిమానా వసూలు చేశారు. 2019–22 కాలంలో 4,00,684 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 48 తాత్కాలిక అనుమతులు ఇవ్వగా రూ.1,62,27,994 ఆదాయం వచ్చింది. అలాగే 42,198 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 4 లీజులకు అనుమతి ఇవ్వగా రూ.30,28,860 ఆదాయం వచ్చింది. 2019–22 మధ్య అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న వారిపై 665 కేసులు నమోదు చేసి రూ.1,02,37,112 జరిమానా విధించాం. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై 23 కేసులు నమోదు చేసి రూ.8,13,05,703 జరిమానాగా వసూలు చేశాం. -
అక్రమ క్వారీలపై మైనింగ్‌శాఖ దాడులు
పలమనేరు: కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు బుధవారం రూ.50లక్షల విలువైన 164 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఒక కంప్రెషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుడుపల్లె పోలీసులకు అప్పగించారు. భూగర్భగనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు మైనింగ్ ఏడీ వేణుగోపాల్ తెలిపారు. -
అక్రమ ‘ఘనుల’పై కొరడా
సాక్షి, విశాఖపట్నం/పద్మనాభం: అక్రమ తవ్వకాలతో మైనింగ్ డాన్ అని పేరొందిన శ్రీనివాస్ చౌదరికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే అనకాపల్లి మండలం సీతానగరంలో ఆయనకు చెందిన నాలుగు కంపెనీలకు అక్రమ తవ్వకాలపై రూ.33 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకే చెందిన మరికొన్ని కంపెనీలు పద్మనాభం మండలం కృష్ణాపురంలో అక్రమ మైనింగ్ చేసినందుకు భారీగా జరిమానా విధించారు. రోడ్డు మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేసినట్లు సర్వే చేసి మైనింగ్ శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సహాయ సంచాలకుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి బృందం గుర్తించింది. ఆ ఉల్లంఘనలకు గాను వీవీఆర్ క్రషర్స్, పి.రత్నలత పేరు మీద ఉన్న రెండు క్వారీలతో పాటు సంజనా గ్రానైట్ క్వారీలో అక్రమ మైనింగ్ నేరానికి గాను మొత్తం రూ.80.94 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అన్నీ అక్రమాలే... సంజనా గ్రానైట్ పేరుతో 4.48 హెక్టార్లను శ్రీనివాస్ చౌదరి పరిమితికి మించి తవ్వించేశారు. అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పి.రత్నలత పేరుతో లీజుకు తీసుకున్న 2.43 హెక్టార్ల క్వారీలోనూ, మరోచోట 6.50 హెక్టార్లలో తీసుకున్న క్వారీలోనూ అనుమతి ఇచ్చిన దానికన్నా అధికంగా రోడ్డు మెటల్, గ్రావెల్ తవ్వేశారు. పర్మిట్లను దుర్వినియోగం చేసి భారీ మొత్తంలో కాసులు వెనకేసుకున్నారు. అలాగే వీవీఆర్ క్రషర్స్ పేరుతో మరోచోట 17.50 హెక్టార్లు లీజుకు తీసుకున్న శ్రీనివాస్ చౌదరి అదే తరహాలో దోపిడీ కొనసాగించారు. గత మూడు రోజులుగా ఈటీఎస్ సర్వే నిర్వహించిన ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆ అక్రమాలను నిగ్గు తేల్చింది. దోపిడీ విలువ రూ.కోట్లలో... శ్రీనివాస్ చౌదరికి చెందిన కంపెనీలు పద్మనాభం మండలంలో కొనసాగించిన మైనింగ్ దోపిడీ విలువ రూ.కోట్లలోనే ఉందని అధికారులు గుర్తించారు. రోడ్డు మెటల్ 11,23,178 క్యూబిక్ మీటర్లు, గ్రావెల్ మరో 5,99,688 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించారు. ఈ ఉల్లంఘనలకు సాధారణ సీనరేజి కింద రూ.12,80,71,980 మొత్తంతో పాటు మరో రూ.64,03,59,900 అపరాధ రుసుం విధించారు. అలాగే డీఎంఎ‹ఫ్ కింద రూ.4,09,83,033 చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.80.94 కోట్ల జరిమానా విధిస్తూ ఆయా కంపెనీల యాజమాన్యానికి నోటీసులు పంపారు. జిల్లాలో మైనింగ్ అక్రమాలపై ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
కొండను అక్రమంగా తవ్వుతున్నారు
-
అక్రమ మైనింగ్‌కు ఖాకీ కవచం
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు/ఏఎన్‌యూ/ తాడేపల్లి రూరల్/ పిడుగురాళ్ల: మైనింగ్ అక్రమాలపై పరిశీలనకు ఏర్పాటైన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సోమవారం పల్నాడులో పర్యటించకుండా టీడీపీ సర్కారు పోలీసుల ద్వారా అడ్డుకుంది. పల్నాడుతోపాటు గుంటూరు జిల్లావ్యాప్తంగా అష్టదిగ్బంధం చేయడం ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలందరికీ నోటీసులు జారీ చేయడంతోపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పల్నాడులో 144 సెక్షన్ విధించి అక్రమ క్వారీయింగ్ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నిజ నిర్థారణ కమిటీ పర్యటించకుండా అడ్డుకున్నారు. మైనింగ్ అక్రమాల పరిశీలనకు బయల్దేరిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్గేట్ వద్దే అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేత కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను నరసరావుపేటలో ఇంటి వద్దే అడ్డుకున్నారు. నడికూడిలో రైలు దిగిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి ఆయన స్వగ్రామానికి తరలించారు. ఊరూరా పోలీసులు పల్నాడులో పలు చోట్ల విపక్ష పార్టీ నేతలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్భందించారు. అక్రమ క్వారీయింగ్ జరుగుతున్న పిడుగురాళ్ళ, మాచవరం, దాచేపల్లి మండలాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించి బైండోవర్ చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను జల్లెడ పట్టారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఏ నలుగురు కలిసి ఉన్నా కేసులు నమోదు చేస్తామంటూ మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ చర్యలను తీవ్రంగా నిరసించిన వైఎస్సార్సీపీ నేతలు పది రోజుల్లోగా క్వారీలను సందర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాసు ఇంటికి భారీగా చేరుకున్న శ్రేణులు పోలీసులు తెల్లవారుజామునే గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్లను ముట్టడించి గృహ నిర్భంధం చేయడంతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారి ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు 144 సెక్షన్ విధించి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నప్పటికీ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయకుండా కాసు మహేష్‌రెడ్డి ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని కాసుకు మద్దతుగా నిలిచారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల కంటపడకుండా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ పోలీసుల కంటపడకుండా నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీతో మాట్లాడి కాసు మహేష్‌రెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసానుపల్లి, నడికూడి, కోనంకిలో జరిగిన మైనింగ్ అక్రమాలను వివరించారు. గంట గడువు కోరి స్పందించని పోలీసులు అనంతరం దాచేపల్లికి బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి ఇంటి గేటు బయట పెద్దఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాచేపల్లి వెళ్లేందుకు తననైనా అనుమతించాలని కాసు మహేష్‌రెడ్డి కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామని గంట సమయం ఇవ్వాలని పోలీసులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. అయితే ఆ తరువాత కూడా పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో పది రోజుల్లోగా మైనింగ్ ప్రాంతాలను పరిశీలించేందుకు అనుమతించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు. సంతకానికి బొత్స ససేమిరా తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, పార్టీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు కాకుండా దుగ్గిరాల స్టేషన్‌కు తరలించారు. బొత్సను అడ్డుకోవడానికి నిరసనగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ధర్నాకు దిగారు. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి, పెదకూరపాడు సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కావటి మనోహర్‌నాయుడు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి ధర్నాలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు వర్షంలోనే స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు ఉదయం 11.20 గంటల నుంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా 3 గంటల పాటు స్టేషన్ వరండాలోనే బొత్సను నిర్భంధించారు. సంతకం చేస్తే వదిలిపెడతామన్న పోలీసుల ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మేమేమైనా దొంగలమా? రౌడీలమా? దోపిడీ చేసేవాళ్లని వదిలేసి మమ్మల్ని సంతకాలు చేయమనడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. రాత్రి అయినా సరే ఇక్కడే పడుకుంటానని, సీఎంకు చెప్పినా డీజీపీకి చెప్పినా భయపడబోనని, సంతకం చేసేది లేదని బొత్స స్పష్టం చేయడంతో చివరకు ఆయన్ను పంపించారు. మీడియాపై పోలీసుల చిందులు బొత్సను పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించనట్లు తెలియడంతో ఈ వార్త కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను లోపలకు రావద్దని, ఫొటోలు తీయవద్దని పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. అప్పటికే చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలంటూ మీడియా సిబ్బంది వద్ద కెమెరాలు లాక్కోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మాచర్లలో పిన్నెల్లి, గామాలపాడులో జంగా గృహ నిర్భంధం వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మాచర్లలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పీఆర్కే ఇంటి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని ఆయన స్వగ్రామమైన గామాలపాడులో పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఈ విషయం తెలియడంతో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఆయన్ను నడికూడిలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు రైలు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం టీజీవీని కారంపూడి మండలం గాదెవారిపల్లెలోని ఆయన స్వగృహానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచారు. పోలీసుల తీరు పట్ల కృష్ణారెడ్డి మండిపడ్డారు. -
రేపు అక్రమ క్వారీంగ్ కేసు వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ
-
గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం
గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో టీడీపీ నేతలు మరోసారి బరి తెగించారు. గ్రామంలోని చెరువులో టీడీపీ నేతలు అక్రమంగా క్వారీయింగ్‌కు పాల్పడ్డారు. గమనించిన స్థానిక రైతులు బుధవారం వారిని అడ్డుకోవడానికి యత్నించగా రైతులపై నేతలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన రైతులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. -
పాండవుల కొండను కొల్లగొట్టేస్తున్నారు!
► మడ్డువలసలో అక్రమ క్వారీ నిర్వహణ ► అనుమతుల్లేకున్నా..అడ్డుగోలుగాతవ్వకాలు ► రవాణాకు రంగం సిద్ధం చేస్తున్న వైనం ► పొరుగు జిల్లా మంత్రి పేరుతో దందా మడ్డువలస..ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే గొర్లె శ్రీరాములునాయుడు (మడ్డువలస) ప్రాజెక్టు. పక్కనే పంచ పాండవుల కొండ. ఈ రెండింటికి ముప్పు వాటిల్లేలా కొంతమంది బరితెగించారు. పాండవుల కొండపై అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ తవ్వకాలు చేపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ తతంగమంతా పొరుగు జిల్లాకు చెందిన మంత్రి అనుచరుల అండదండలతో సాగిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కనీసం దృష్టిసారించలేదనే విమర్శలు వస్తున్నారుు. వంగర: అక్రమ మైనింగ్‌పై కొంతమంది కన్నేశారు. కోట్ల రూపాయల విలువైన కొండలను పిండి చేసేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో, ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్‌ను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అక్రమ డిజైన్‌కు పచ్చరంగు పులుముకుంది. వంగర మండల పరిధి మడ్డువలస ప్రాజెక్టును ఆనుకొని ఉన్న పాండవుల పంచ కొండపై అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. వాస్తవంగా ఇది పటువర్థనం బౌండరీకి చెందిన కొండ అరుునా మడ్డువలసకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటు వైపు ఎవరూ వెళ్లరూ.. అక్కడ ఏమి జరిగినా గోప్యమే. అందరి కళ్లు కప్పి ప్రారంభించిన ఈ గ్రానైట్ తవ్వకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ ప్రాంతంలో 35 ఏళ్ల క్రితం నుంచి ఎంటర్ప్రైజ స్ అండ్ ఎంటర్ పైజింగ్ కంపెనీ పేరుతో గ్రానైట్ క్వారీ నడుస్తుంది. ఆ క్వారీని అనుసరించినదే కొత్తగా తవ్వకం చేపడుతున్న క్వారీ అని జనాన్ని అక్కడ బినామీ దారులు నమ్మించారు. సరేలే అనుమతి ఉన్న కొండ కదా అని జనం అంతా నమ్మి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అరుుతే ఇటీవల కొం త మంది దళారులు వంగర తహశీల్దార్ కార్యాలయానికి రావడాన్ని గమనించిన ‘సాక్షి’ ఆరా తీయగా అసలు రంగు బయటపడింది. అక్కడకు వెళ్లి చూడగా అనుమతులు లేని గ్రానైట్ కొండని, చేస్తున్నది అక్రమని తేలింది. అక్రమంగా తవ్వకం ! మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టును అనుసరించి గ్రానైట్ కొండ ఉంది. దీన్ని పేలుడు పదార్థాలను వినియోగించి రారుుని కొల్లగొడుతున్నారు. పెద్ద పేలుళ్లు సంభవిస్తే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత నెల రోజులుగా నడుస్తున్న చీకటి పనుల్లో వందల సంఖ్యలో గ్యాంగ్‌సైజ్ బ్లాకులు కట్ చేశారు. వీటిపై కొనుగోలుదారుల పేరుతో ముద్రలు కూడా వేశారు. ఎవరికీ తెలియకుం డా వీటిని విక్రరుుంచేందుకు, పొరుగు క్వారీ పేరుతో గ్యాంగ్బ్లాకులు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఎరుుర్కంపర్షన్, రూప్కటింగ్ మిషన్, పొక్లరుునర్ వంటి భారీ యంత్రాలను కూడా గ్రానైట్ తవ్వకాలకు వినియోగిస్తున్నారు. రారుుని పేల్చేందుకు ప్రత్యేక పరికరాలను వాడుతున్నారు. కొండపైకి వెళ్లేందుకు పక్కా రహదారిని కూడా అక్రమార్కులు నిర్మించేశారు. పొరుగు జిల్లా మంత్రి అండదండలతో... పొరుగు జిల్లా అరుున విజయనగరానికి చెందిన ఓ మంత్రి అండదండలతో టీడీపీకి చెందిన ఈ ప్రాంత నాయకులు అక్రమ గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నారుు. విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులతో ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు చేతులు కలిపి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోరుునా ఇష్టారాజ్యంగా....గుట్టు చప్పుడు లేకుండా తవ్వకాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేసేశారు. అరుుతే ఇటీవల ఈ ప్రాంతంలో ఉన్న ఎంటర్‌ప్రైజస్ అండ్ ఎంటర్ప్రైజింగ్ కంపెనీ పేరుతో నడుస్తున్న గ్రానైట్ క్వారీని తనిఖీ చేసేందుకు వెళ్లిన అధికారుల దృష్టిలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు పడినట్టు భోగట్టా. ప్రతిష్టాత్మకం పాండవుల కొండ .. పాండవుల కొండకు ఎంతోపేరుంది. కొండ వెనుక భాగంలో ప్రతిష్టాత్మక పాండవుల పంచ ఉంది. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు కొండపై ఆనవాళ్లున్నారుు. ఇక్కడ ఉన్న ఓ గుహలో పాండవులు నివాసం ఉన్నట్లు పూర్వీకులు చెబుతుండేవారని ఈ ప్రాంతీయులు కథలుకథలుగా చెబుతుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న కొండపై అక్రమ గ్రానైట్ తవ్వకాలు చేయడంపై ఈ ప్రాంతీయుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరికీ లీజుకు ఇవ్వలేదు పటువర్థనం గ్రామం పరిధిలో ఈ కొండ బౌండరీ ఉంది. 341 సర్వే నంబరులో ఐదెకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతం ఉంది. అరుుతే ఈ కొండ ప్రాంతం ఏ ఒక్కరికీ లీజుకు ఇవ్వలేదని వీఆర్ఓ పి.సుధాకర్ నివేదిక ఇచ్చారని తహశీల్దార్ పందిరి అప్పారావు ‘సాక్షి’కి తెలిపారు. మైనింగ్ ఏడీ ఏమన్నారంటే.. మైనింగ్‌శాఖ ఏడీ ప్రసాదరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఇటీవల క్వారీని తనిఖీ చేసి నిర్వహకులకు నోటీలు అందజేశామన్నారు. -
టీ తాగుతుంటే.. కాల్చి చంపేశారు!
బిహార్‌లో ప్రముఖ ప్రాంతీయ దినపత్రికకు చెందిన పాత్రికేయుడు ఒకరిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అక్రమ స్టోన్ చిప్ యూనిట్లపై కథనాలు రాయడంతో ఆగ్రహించిన వర్గాలే ఆయనను చంపించి ఉంటాయని భావిస్తున్నారు. ధర్మేంద్ర సింగ్ (35) రోడ్డు పక్కన టీస్టాల్లో టీ తాగుతూ ఉండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై సమీపం నుంచి కాల్పులు జరిపారని సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ అలోక్ రంజన్ తెలిపారు. పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి పొట్ట భాగంలో కాల్చడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం వారణాసికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ధర్మేంద్ర సింగ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. రోహతస్ జిల్లాలో చాలా రోజుల నుంచి అక్రమ క్వారీయింగ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలోని సివాన్ ప్రాంతంలో రాజ్దేవ్ రంజన్ అనే మరో పాత్రికేయుడిని గత మే నెలలో కాల్చి చంపారు. -
అధికారుల తనిఖీలు: 1జేసీబీ, 2టిప్పర్లు సీజ్
గుంటూరు: చారిత్రక చెరువులోంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రాజావారి చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్(ఎర్రమట్టి) తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని.. 1జేసీబీ, 2టిప్పర్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. -
కేసుల క్వారీ..ఒత్తిళ్ల స్వారీ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తప్పు చేసినవారు ఎంతటివారైనా చర్యలు తప్పవు.. చివరికి మా పార్టీ నేతలైనా సరే.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్న డైలాగులకు.. జిల్లా జరుగుతున్న తంతుకు ఎక్కడా పొంతన లేదు. ప్రభుత్వ రాయల్టీకి ఎగనామం పెడుతూ.. జనావాసాలకు సమీపంలో బ్లాస్టింగులతో అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన వ్యక్తి టీడీపీ నేత అని తేలడంతో అతన్ని ఆ రొంపి నుంచి తప్పించేందుకు ఆ పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదట కేసే లేకుండా చూడాలనుకున్న పత్రికల్లో వార్తలు రావడంతో దాన్ని పెట్టీ కేసుగా మార్చడంతోపాటు క్వారీలోని పనివారిని ‘బుక్’ చేసి.. తమవాడిని తప్పించాలని అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పరిదిలో గ్రామాలను అనుకొని ఉన్న కొండల్లో అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న సదరు నేతపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో వెనక్కు తగ్గాల్సి వస్తోంది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైనింగ్, రెవెన్యూ అధికారుల సహాయంతో ఇటీవల సింగుపురం ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. లీజు పత్రాలు లేకుండానే టీడీపీ నేత మరో 10 మందితో కలిసి క్వారీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 137 జిలెటిన్ స్టిక్స్, 44 డిటొనేటర్లు, 5 కట్టల ఫ్యూజ్‌వైర్లు సీజ్ చేసి సంబంధిత నివేదికను రూరల్ పోలీసులకు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు అందజేశారు. టీడీపీ నేతపై కేసు నమోదైనట్లు తెలియడంతో అది వీగిపోయేలా చిన్న చిన్న సెక్షన్లు నమోదు చేయించాలని, యజమానిని కాకుండా పనివారినే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. పోలీసులూ అదే చేశారు. యజమాని పరారీలో ఉన్నట్టు చూపించి, అక్కడ పనిచేసేవారిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు మాత్రం తాము తనిఖీలకు వెళ్లినప్పుడు అక్కడున్నవారినే విచారించినప్పటికీ..పేలుళ్లకు సంబంధించి సామగ్రిని స్వాధీనం చేసుకున్న తరువాత..యజమాని మాత్రం టీడీపీ నేతేనని కనుగొన్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు నివేదిక అందజేశామంటున్నారు. కంప్రెషర్ ఎవరి పేరిట ఉందో... విజిలెన్స్ అధికారులు కొన్నాళ్లుగా రెక్కీ నిర్వహించి అక్రమ క్వారీయింగ్ చేస్తున్న వ్యక్తిని గుర్తించి తనిఖీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో ఎవరికి వారు తమకేమీ తెలియదని, కేసు విచారణ దశలో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. వాస్తవానికి తనిఖీల సమయంలో అక్కడ సీజ్ చేసిన వస్తుసామగ్రి ఎవరి పేరిట ఉంది, ప్రభుత్వం ఆ స్థలం ఎవరికి లీజుకు ఇచ్చింది అన్న విషయాల్ని అక్కడి కార్మికులను అడిగినా చెప్పేస్తారు. విజిలెన్స్ నివేదిక అధారంగా, అక్రమ క్వారీకి పాల్పడిన వ్యక్తుల నుంచి వన్ ప్లస్ ఫైవ్ చొప్పున సీనరేజీ కట్టించడంలోనూ అధికారులు వెనుకంజ వేస్తున్నారంటే ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కనీసం సీజ్ చేసిన కంప్రెషర్ ఎవరి పేరిట ఉందో.. విజిలెన్స్ అధికారులిచ్చే ‘అక్నాలెడ్జ్మెంట్’ నివేదికలో ఏముందో తెలుసకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు. వాస్తవానికి సింగుపురం పరిసర ప్రాంతాల్లో చాలమంది అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదో అర్థం కావడం లేదు. టీడీపీ నేత చాన్నాళ్ల నుంచి అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతుంటే విజిలెన్స్ విభాగం దాడులు చేసింది తప్ప ఇతర విభాగాలు కనీసం అక్కడకు వెళ్లలేదు. అయితే ఇవన్నీ చిన్నచిన్నవేనని, ఎప్పటికప్పుడు ఇలాంటి వారిని పట్టుకుంటున్నామని మైనింగ్ అధికారులు సమర్థించుకుంటున్నారు. అరెస్టుకు సంబంధించి సీఐ తాతారావును వివరణ కోరగా తప్పుచేసినవారిని వదిలేది లేదని, ఈ కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ ముమ్మరం చేశామని, ఫిర్యాదు ఇచ్చిన ప్రభుత్వ విభాగాల సిబ్బందితో పాటు చాలా మంది నుంచి ఇప్పటికే వివరాలు సేకరించామన్నారు. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడిన వ్యక్తిని తొందర్లోనే అరెస్టు చేస్తామన్నారు. -
ఇసుక మాఫియాకు అడ్డేది..?
రెంజల్ : మండలంలోని కందకుర్తి గ్రామంలో అక్రమ ఇసుక వివాదం రోజురోజుకు ముదురుతోంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. బోధన్ మండలం హంగర్గా గ్రామ శివారు మంజీరా నది నుంచి ప్రతిరోజు రాత్రింబవళ్లు యంత్రాలు, డోజర్లతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. సుమారు 40 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అటుపక్క దారి లేకపోవడంతో ఇసుక స్మగ్లర్లు కందకుర్తి శివారులో ఇసుకను నిల్వ చేస్తున్నారు. అయితే సన్న, చిన్నకారు రైతులకు చెందిన పంట భూముల్లో ఇసుక నిల్వ చేయడంతో గ్రామంలో వివాదమవుతోంది. దీనికి తోడు గ్రామం నుంచి అక్రమ క్వారీ వరకు రోడ్డుకు ఇరువైపులగల పిల్ల కాల్వలను పూడ్చివేయడంతో దిగువ భాగంలోని రైతులు సాగు నీరందక ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం పొడి దుక్కులు దున్నుకుని విత్తనాలను విత్తుకునేందుకు పంటలు సిద్ధం చేసి పెట్టుకున్న భూముల్లో ఇసుకను నిల్వ చేయడంతో స్మగ్లర్లు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుం టున్నాయి. ఇసుకను నిల్వ చేయడంవల్ల సో యా పంటను ఎలా విత్తుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. తమలో తాము తన్నుక సస్తే అధికారులు మాత్రం తమాషా చూస్తున్నారని విమర్శిస్తున్నారు. మంజీరా నది నుంచి నెల రో జులుగా ఇసుకను తవ్వుతున్నా అధికార యం త్రాంగం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన వివాదం బోధన్ సబ్ కలెక్టర్ వరకు వెళ్ళింది. గ్రామానికి చెందిన రైతు పొలం నుంచి దారి ఏర్పాటు చేసుకుని ఇసుక ట్రాక్టర్లు నడపడంతో ఈ వివాదం తలెత్తింది. అందుకు బాధ్యులైన 20 మందిని సబ్ కలెక్టర్ పిలిచి విచారణ చేశారు. ఎటు చూసినా ఇసుక నిల్వలే.. కందకుర్తి గ్రామంతోపాటు శివారులో ఎటు చూ సినా అక్రమంగా తోడేసిన ఇసుక నిల్వలే కనిపిస్తున్నాయి. మంజీరా నది నుంచి 24 గంటలు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. సుమా రు 40 ట్రాక్టర్లతో ఇసుకను నిల్వ చేస్తున్నారు. ఇ క్కడి నుంచి జిల్లాతోపాటు పక్క జిల్లాలకు టి ప్పర్ల ద్వారా ఇసుక తరలిపోతోంది. స్మగ్లర్లకు అ డ్డువస్తే దాడులకు కూడా వెనకాడటంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మైనింగ్ అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, గుంటూరు : అక్రమక్వారీలతో అడ్డగోలుగా కాసులవేటసాగిస్తున్నవారిపై విజిలెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాము కేసులు నమోదు చేస్తున్నా అడ్డదారిలో మైనింగ్ అధికారులనుంచి అనుమతులు పొందడం నిత్యకృత్యంగా మారింది. అయితే ఇటీవల పేరేచర్ల పరిసర ప్రాంతాల్లోని కైలాసగిరి రిజర్వుఫారెస్ట్ ఏరియాలోనూ యథేచ్ఛగా నిర్వహిస్తున్న రెండు క్వారీలను విజిలెన్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వాటికి అటవీశాఖ, మైనింగ్‌శాఖ సంయుక్తంగా అనుమతులు మంజూరు చేశారని తెలిసి అవాక్కయ్యారు. వాస్తవానికి అటవీభూముల్లో క్వారీలకు అనుమతులు ఇవ్వాలంటే చాలా నిబంధనలున్నాయి. బయట ఎక్కడా దొరకని ఖనిజం ఏదైనా అటవీప్రాంతంలో ఉంటే, అది ఉపయోగకరమైనదనుకుంటే మైనింగ్, అటవీశాఖాధికారులు సంయుక్తంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలి. అలా మంజూరు చేసిన మైనింగ్‌కు అటవీశాఖ ఇచ్చిన భూమికంటే బయట రెట్టింపు భూమిని ప్రభుత్వానికి సదరు క్వారీ నిర్వాహకులు ఇవ్వాలి. అయితే బయట దొరికే మెటల్, గ్రావెల్ వంటి వాటిని తవ్వుకోవడానికి కూడా మైనింగ్, అటవీ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు అనుమతులు పొందేది కొంత భాగానికైతే క్వారీ నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు అర్ధరాత్రి వేళ తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్రస్థాయిలో గండి కొడుతున్నారు. విజిలెన్స్ సీరియస్ అక్రమక్వారీలను నిరోధించాల్సిన మైనింగ్‌శాఖాధికారులు మౌనం వహిస్తుండటంతో విజిలెన్స్ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. అక్రమార్కుల పనిపట్టేందుకు నిర్ణయించారు. ఇటీవల పేరేచర్లలో రెండు క్వారీలను సీజ్‌చేసి విజిలెన్స్‌లోని మైనింగ్, అటవీ శాఖ అధికారులతో విచారణ చేపట్టారు. విచారణలో క్వారీ యజమానులు పొందిన పర్మిట్లకు, తవ్వకాలకు ఎక్కడా సంబంధం లేనట్లు ప్రాధమికంగా గుర్తించారు. విచారణలో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడితే సహించం- విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అక్రమక్వారియింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అటవీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీయింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందని, ఈ అనుమతులపై పునః పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అక్రమ క్వారీయింగ్జరిపే వారి వివరాలను తమకు తెలియజేస్తే వెంటనే స్పందించి వాటిని అరికడతామని, సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.