అక్రమ మైనింగ్‌కు ఖాకీ కవచం | Police Restrictions on YSR Congress Party leaders | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌కు ఖాకీ కవచం

Published Tue, Aug 14 2018 3:06 AM | Last Updated on Tue, Oct 30 2018 3:56 PM

Police Restrictions on YSR Congress Party leaders - Sakshi

అధికార పార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి నివాసం నుంచి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు/ఏఎన్‌యూ/ తాడేపల్లి రూరల్‌/ పిడుగురాళ్ల: మైనింగ్‌ అక్రమాలపై పరిశీలనకు ఏర్పాటైన వైఎస్సార్‌ సీపీ నిజనిర్ధారణ కమిటీ సోమవారం పల్నాడులో పర్యటించకుండా టీడీపీ సర్కారు పోలీసుల ద్వారా అడ్డుకుంది. పల్నాడుతోపాటు గుంటూరు జిల్లావ్యాప్తంగా అష్టదిగ్బంధం చేయడం ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతలందరికీ నోటీసులు జారీ చేయడంతోపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పల్నాడులో 144 సెక్షన్‌ విధించి అక్రమ క్వారీయింగ్‌ ప్రాంతంలో వైఎస్సార్‌ సీపీ నిజ నిర్థారణ కమిటీ పర్యటించకుండా అడ్డుకున్నారు. మైనింగ్‌ అక్రమాల పరిశీలనకు బయల్దేరిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్‌గేట్‌ వద్దే అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేత కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను నరసరావుపేటలో ఇంటి వద్దే అడ్డుకున్నారు. నడికూడిలో రైలు దిగిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి ఆయన స్వగ్రామానికి తరలించారు. 

ఊరూరా పోలీసులు
పల్నాడులో పలు చోట్ల విపక్ష పార్టీ నేతలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్భందించారు. అక్రమ క్వారీయింగ్‌ జరుగుతున్న పిడుగురాళ్ళ, మాచవరం, దాచేపల్లి మండలాల్లో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలను హౌస్‌ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించి బైండోవర్‌ చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను జల్లెడ పట్టారు. 144 సెక్షన్‌ అమలులో ఉందని, ఏ నలుగురు కలిసి ఉన్నా కేసులు నమోదు చేస్తామంటూ మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ చర్యలను తీవ్రంగా నిరసించిన వైఎస్సార్‌సీపీ నేతలు పది రోజుల్లోగా క్వారీలను సందర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

కాసు ఇంటికి భారీగా చేరుకున్న శ్రేణులు
పోలీసులు తెల్లవారుజామునే గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్లను ముట్టడించి గృహ నిర్భంధం చేయడంతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారి ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు 144 సెక్షన్‌ విధించి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నప్పటికీ వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయకుండా కాసు మహేష్‌రెడ్డి ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నాయకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని కాసుకు మద్దతుగా నిలిచారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. 

పోలీసుల కంటపడకుండా.. 
శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ పోలీసుల కంటపడకుండా నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీతో మాట్లాడి కాసు మహేష్‌రెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసానుపల్లి, నడికూడి, కోనంకిలో జరిగిన మైనింగ్‌ అక్రమాలను వివరించారు. 

గంట గడువు కోరి స్పందించని పోలీసులు
అనంతరం దాచేపల్లికి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలను నరసరావుపేటలోని కాసు మహేష్‌రెడ్డి ఇంటి గేటు బయట పెద్దఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాచేపల్లి వెళ్లేందుకు తననైనా అనుమతించాలని కాసు మహేష్‌రెడ్డి కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామని గంట సమయం ఇవ్వాలని పోలీసులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. అయితే ఆ తరువాత కూడా పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో పది రోజుల్లోగా మైనింగ్‌ ప్రాంతాలను పరిశీలించేందుకు అనుమతించకుంటే  న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రకటించారు.

సంతకానికి బొత్స ససేమిరా 
తాడేపల్లిరూరల్‌: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళుతున్న వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, పార్టీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు కాకుండా దుగ్గిరాల స్టేషన్‌కు తరలించారు. బొత్సను అడ్డుకోవడానికి నిరసనగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ధర్నాకు దిగారు. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి, పెదకూరపాడు సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కావటి మనోహర్‌నాయుడు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి ధర్నాలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు వర్షంలోనే స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.

పోలీసులు ఉదయం 11.20 గంటల నుంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా 3 గంటల పాటు స్టేషన్‌ వరండాలోనే బొత్సను నిర్భంధించారు. సంతకం చేస్తే వదిలిపెడతామన్న పోలీసుల ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మేమేమైనా దొంగలమా? రౌడీలమా? దోపిడీ చేసేవాళ్లని వదిలేసి మమ్మల్ని సంతకాలు చేయమనడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. రాత్రి అయినా సరే ఇక్కడే పడుకుంటానని, సీఎంకు చెప్పినా డీజీపీకి చెప్పినా భయపడబోనని, సంతకం చేసేది లేదని బొత్స స్పష్టం చేయడంతో చివరకు ఆయన్ను పంపించారు. 

మీడియాపై పోలీసుల చిందులు 
బొత్సను పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించనట్లు తెలియడంతో ఈ వార్త కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను లోపలకు రావద్దని, ఫొటోలు తీయవద్దని పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. అప్పటికే చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలంటూ మీడియా సిబ్బంది వద్ద కెమెరాలు లాక్కోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. 

మాచర్లలో పిన్నెల్లి, గామాలపాడులో జంగా గృహ నిర్భంధం
వైఎస్సార్‌ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, వైఎస్సార్‌సీపీ యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మాచర్లలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దీన్ని  నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పీఆర్కే ఇంటి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని ఆయన స్వగ్రామమైన గామాలపాడులో పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఈ విషయం తెలియడంతో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఆయన్ను నడికూడిలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు రైలు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం టీజీవీని కారంపూడి మండలం గాదెవారిపల్లెలోని ఆయన స్వగృహానికి  తరలించి గృహ నిర్భంధంలో ఉంచారు. పోలీసుల తీరు పట్ల కృష్ణారెడ్డి మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement